నాగాలాండ్: ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఖొనోమా ఆదివాసీలు

ఫొటో సోర్స్, SAYAN HAZRA
ప్రకృతిని పరిరక్షించేందుకు తరతరాలుగా కొనసాగుతున్న అడవి జంతువులను వేటాడే సంప్రదాయ వృత్తిని నాగాలాండ్‌లోని ఓ తెగకు చెందిన ప్రజలు వదిలేశారు. వేటను శాశ్వతంగా వదిలేసిన తర్వాత ఇక్కడి ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారో ఫొటోగ్రాఫర్ సయాన్ హజ్రా వివరిస్తున్నారు.
ఖొనోమా తెగకు చెందిన 76 ఏళ్ల చాయియేవి ఝిన్యి ఒకప్పుడు వేటగాడే. కానీ, 2001లో ఆ వృత్తిని మానేశారాయన.
తరతరాలుగా ఈ తెగవారికి జంతువులను, పక్షులను వేటాడటమే ప్రధాన జీవనాధారంగా కొనసాగింది. వేట అనేది ఇక్కడి గ్రామాల్లో సంప్రదాయ వృత్తిగా ఉండేది. అడవి జంతువులను, పక్షులను వేటాడుతుండేవారు.
అయితే, అత్యంత అరుదైన వన్యప్రాణులు కనుమరుగయ్యే ప్రమాదముందని గ్రహించిన కొందరు స్థానికులు ఇక్కడి ప్రజల్లో మార్పు తేవాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
వన్యప్రాణులను చంపుకుంటూపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, దాంతో భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వివరిస్తూ 1993లో ప్రచారం ప్రారంభించారు.
ఆ ఉద్యమం ఫలితంగా తొలుత దాదాపు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో వేటను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఆ వృత్తిని శాశ్వతంగా వదిలేస్తున్నట్టు ఖొనోమా తెగ ప్రజలు ప్రకటించారు.
దాంతో 1998లో ఈ ప్రాంతం 'ఖొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపన్ సాంచురీ' గా మారింది.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
ఏ జీవిని కూడా వేటాడేందుకు వీళ్లేదంటూ గ్రామ కౌన్సిల్ నిషేధం విధించింది. చెట్లను నరకడం, తగలబెట్టడంతో పాటు గ్రామం చుట్టుపక్కల ఉన్న అడవులకు, సహజన వనరులకు నష్టం కలిగించే ఎలాంటి పనులూ చేపట్టేది లేదంటూ నిర్ణయించింది.
వేటాడిన జంతువుల తలలను ఇళ్లల్లో పెట్టుకోవడం ఈ తెగలో సంప్రదాయం. అందుకే ఇప్పటికీ కొందరి నివాసాల్లో దశాబ్దాల కిందటి జంతువుల తలలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
వేట మానేసిన తర్వాత చాలామంది వేటగాళ్లు తమ వద్ద ఉన్న తుపాకులను కూడా వదిలేశారు.
అప్పట్లో వేటకోసం నాటు తుపాకులు, వలలు, వివిధ రకాల బోన్లు వాడేవారు. వాటిలో కొన్ని ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
ప్రస్తుతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది ఖొనోమా గ్రామం. విభిన్న రకాల పంటలు, ఔషధ మొక్కలు, వృక్షాలతో కళకళలాడుతోంది.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
ప్రకృతిని పరిరక్షించాలన్న చైతన్యం, ఇక్కడి వ్యవసాయంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ రైతులు పంటచేలకు రసాయన ఎరువులను, పురుగుమందులను వినియోగించరు.

ఫొటో సోర్స్, SAYAN HAZRA
"మా జీవితం, ఆచార సంప్రదాయాలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. అందుకే మేము దాన్ని పరిరక్షించాలని నిర్ణయించాం. పక్షులు, జంతువులు, పూలు అన్నింటినీ కాపాడతాం" అని ఖొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపన్ సాంచురీ చైర్మన్ ఖ్రిఖోటో మోర్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆ ఊళ్లో బతకాలంటే ఆపరేషన్ తప్పనిసరి
- సిరియా యుద్ధం: ఇడ్లిబ్‌లో ఆఖరి పోరాటం
- రూపాయి పతనం: సామాన్యుడు ఆర్బీఐ నుంచి ఏం ఆశించవచ్చు?
- చింతలవలస: డోలీలో గర్భిణి.. నడ్డిరోడ్డుపై ప్రసవం.. రాయితో బొడ్డుతాడు కోత
- ‘బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకు మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?’
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- #HerChoice: 'సారీ! ఓ 10 రోజులు నేను మీ భార్యను కాదు!'
- ‘‘భారత్ గురించి నాకు ఏమీ తెలియదు. నాగాలాండ్ దాటి మా ఇంట్లో వాళ్లు ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు’’
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








