అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం

అంబేడ్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ వందనం

ఫొటో సోర్స్, AMBEDKAR HOUSE

    • రచయిత, జాషువా చిత్తం, జాషువా నావెట్
    • హోదా, బీబీసీ న్యూస్

బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని ఒక ప్రశాంత ప్రాంతంలో.. భారతదేశ రాజ్యాంగ 'నిర్మాత'ల్లో ఒకరి జ్ఞాపకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

నగరంలోని సంపన్న ప్రైమ్‌రోజ్ హిల్ ప్రాంతం.. అనేక తరాలుగా డేనియెల్ క్రెగ్, కేట్ మాస్ వంటి సెలబ్రటీలకు ఆవాసంగా ఉంది.

కానీ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ప్రపంచం నలుమూలల నుంచీ వందలాది మంది సందర్శకులు ఒక ఇంటికి వరుసకట్టారు.

''డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ - భారత సామాజిక న్యాయ పోరాటయోధుడు 1921-22లో ఇక్కడ నివసించారు'' అని ఆ ఇంటి వెలుపల నీలి రంగులో ఉన్న ఒక బోర్డు ప్రకటిస్తోంది.

తలుపులు దాటుకుని ముందుకు అడుగులు వేస్తే.. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం పూలమాలల్లో కనిపిస్తుంది. లోపలి గదులు ఆయన స్మారకార్థం పునర్నిర్మించి ఉంటాయి. ఒక డైనింగ్ టేబుల్ మీద న్యాయపత్రాలు పరిచి ఉంటాయి. మంచం పక్కన టేబుల్ మీద పుస్తకాలతో పాటు అంబేడ్కర్ కళ్లద్దాలు పెట్టి ఉంటాయి.

అంబేడ్కర్ హౌస్

కానీ.. ఇక్కడొక సమస్య ఉంది. చుట్టుపక్కల నివసించే ఇద్దరు ఇరుగుపొరుగువారు ఈ మ్యూజియం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ మ్యూజియం ఉండకూడదని వారు వాదిస్తున్నట్లు స్థానిక కౌన్సిల్ చెప్తోంది.

ఈ ఇంటి భవిష్యత్తును వచ్చే నెలలో ఒక కౌన్సిల్ విచారణలో నిర్ణయిస్తారు. ఈ ఇంటిని మళ్లీ నివాస స్థలంగా మార్చేలా, సందర్శకులకు తలుపులు మూసివేశాలా తీర్పు రావచ్చు. అదే జరిగితే భారతదేశ సమాజం మీద నేటికీ ప్రభావం చూపిస్తున్న ఒక గొప్ప నాయకుడి జ్ఞాపకచిహ్నం చెరిగిపోయే అవకాశముంది.

అంబేడ్కర్ హౌస్‌గా ప్రసిద్ధి చెందిన ఈ భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో 36.5 లక్షల పౌండ్లకు (దాదాపు 30 కోట్ల రూపాయలు) కొనుగోలు చేసింది.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో దీనిని ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌కు అంకితం చేశారు. ఎవరైనా ఈ ఇంటిని ఉచితంగా సందర్శించవచ్చు.

అంబేడ్కర్ హౌస్

అప్పటి నుంచీ వందలాది మంది ఈ ఇంటిని సందర్శించటానికి వస్తున్నారు.

ఆ కాలంలో సందర్శకులు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వచ్చి వెళ్తుండేవారని ముగ్గురు పొరుగువారు బీబీసీతో చెప్పారు. అసలు ఈ ఇల్లు ఒక మ్యూజియంగా మారిందన్న విషయమే తమకు తెలియదని.. దీనికి ఎదురుగా రోడ్డుకు అవతలివైపు నివసించే స్థానికుడు ఒకరు చెప్పారు.

కానీ.. అంబేడ్కర్ హౌస్ నిర్మాణ ప్రణాళికను ఉల్లంఘించిందంటూ 2018 జనవరిలో కామ్డెన్ కౌన్సిల్‌కు ఫిర్యాదు అందింది. ఆ భవనానికి మ్యూజియంలా పనిచేయటానికి అనుమతులు లేవని కౌన్సిల్ గుర్తించింది.

ఆ భవనాన్ని మ్యూజియంగా నడపటానికి అనుమతి ఇవ్వాలని ఆ మరుసటి నెలలో దాని యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. అలా అనుమతిస్తే.. నివాస స్థలం నష్టపోవటంతో సమానమవుతుందంటూ కౌన్సిల్ తిరస్కరించింది.

అంబేడ్కర్ హౌస్

సందర్శకులు రాత్రీ పగలూ పెద్ద సంఖ్యలో వచ్చిపోతూ చేస్తున్న అల్లరి వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికంగా నివసించే ఇద్దరు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

అంబేడ్కర్ ఇంటిని మ్యూజియంగా నడపటానికి కౌన్సిల్ అనుమతి తిరస్కరించటం మీద మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. దీనిపై సెప్టెంబర్ 24వ తేదీన బహిరంగ విచారణ జరగనుంది.

ఈ కేసు మీద వ్యాఖ్యానించటానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది.

బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయం బీబీసీకి పంపించిన ఒక ప్రకటనలో.. ''ఈ ఇంటికి భారతీయుల్లోని ఒక భారీ వర్గంలో ఓ ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది'' అని పేర్కొంది. ఈ ఇంటిని స్మారకంగా మార్చటం కోసం కామ్డెన్ కౌన్సిల్‌కు ప్రణాళిక దరఖాస్తు సమర్పించామని చెప్పింది.

అంబేడ్కర్ హౌస్

డాక్టర్ అంబేడ్కర్ మహారాష్ట్ర నివాసి. ఆయన 1956లో చనిపోయారు. న్యాయకోవిదుడు. పౌర హక్కుల ఉద్యమకారుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగ రచనా బాధ్యతను నిర్వర్తించారు. దేశానికి తొలి న్యాయశాఖా మంత్రిగా కూడా పనిచేశారు.

భారత కులవ్యవస్థలో 'అంటరానివారు'గా పరిగణించిన దళితుల్లో అంబేడ్కర్ జన్మించారు. శతాబ్దాల పాటు సామాజిక, ఆర్థిక వివక్షను ఎదుర్కొన్న ఆ వర్గం నుంచి అత్యంత ముఖ్యమైన, గౌరవమర్యాదలు అందుకున్న రాజకీయ నాయకుడయ్యారు.

మహిళల హక్కుల కోసం, కుల వివక్ష అంతం కోసం, అణగారిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటం కోసం ఆయన పోరాడారు. భారతదేశపు అత్యంత గొప్ప నాయకుల్లో ఆయనను ఒకరిగా పరిగణిస్తారు.

రాజకీయ ప్రస్థానానికి ముందు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ అధ్యయనం చేస్తూ 1921-22 కాలంలో డాక్టర్ అంబేడ్కర్ ప్రైమ్‌రోజ్ హిల్‌లో నివసించారు.

అంబేడ్కర్ హౌస్

అందుకే.. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అంబేడ్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ (ఏబీఓ) సూచన మేరకు.. మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది.

ఈ ఇల్లు అమ్మకానికి వచ్చినపుడు దీనిని కొనుగోలు చేసేలా మహారాష్ట్రను స్థానిక నివాసి, బ్రిటన్ సివిల్ సర్వెంట్ సంతోష్ దాస్ ఒప్పించారు.

ఆ సమయంలో ఈ ఇల్లు అవసాన దశలో ఉందని ఆమె బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. దానిని పునరుద్ధరించటం వల్ల ఆ ఇంటికి, అక్కడి పరిసరాలకు కొత్త జీవం లభించిందన్నారు.

''ఇంటి పరిసరాలకు మేం మేలు చేశాం'' అని ఎఫ్‌ఏబీఓ అధ్యక్షురాలైన సంతోష్ దాస్ పేర్కొన్నారు.

అంబేడ్కర్ హౌస్

ఈ ఇంటిని లాంఛనంగా మ్యూజియంగా మార్చటానికి అనుమతులు పొందే విషయమై చర్చలు జరిగాయని.. కానీ అందుకోసం ఎంత సమయం పడుతుందనే విషయాన్ని నిర్వాహకులు తక్కువగా అంచనా వేశారని ఆమె చెప్పారు.

''ప్రజలు వచ్చి సందర్శించటానికి వీలుగా ఇది ఒక చక్కటి స్మారకంగా ఉండాలని మేం కోరుకున్నాం. కొందరు దీనిని ఒక పుణ్యక్షేత్రంగా కూడా పరిగణిస్తారు'' అని తెలిపారు.

అంబేడ్కర్ హౌస్‌ను ప్రతివారం సుమారు 50 మంది సందర్శిస్తారని అంచనా. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహికులు కూడా వీరిలో ఉన్నారు.

ఈ ఇంటిని చూడటానికి తాము ఇండియా నుంచి వచ్చామని.. ఒక కుటుంబం ఈ భవనం వెలుపల బీబీసీతో మాట్లాడుతూ చెప్పింది. లండన్ పర్యటనలో తాము చూడాలనుకున్న ప్రాంతాల జాబితాలో అంబేడ్కర్ హౌస్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.

అంబేడ్కర్ హౌస్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ అంబేడ్కర్‌తో ఆయన రెండో భార్య మాయి అంబేడ్కర్ (కుడి), ఉద్యమకారుడు రావ్ బహదూర్ సి.కె.బోలే (ఎడమ)

ఈ ఇల్లు మ్యూజియంగా మారుతుందని ఎఫ్‌ఏబీఓ కమిటీ సభ్యుడు గౌతమ్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ''ప్రముఖులు మాకు మద్దతు ఇస్తున్నారు'' అని చెప్పారు.

ఈ మ్యూజియానికి మద్దతు తెలుపుతూ ఆక్స్‌ఫర్డ్ మాజీ బిషప్ అయిన లార్డ్ రిచర్డ్ హ్యారిస్ స్థానిక కౌన్సిల్‌కు లేఖ రాశారు. కానీ.. ఈ ఇంటి పొరుగువారు కొందరికి దీనిపై అంత ఆసక్తి లేదు.

''ఇది నివాస స్థలంగా ఉండాలి కానీ మ్యూజియంగా కాదు'' అని పేరు వెల్లడించటానికి ఇష్టపడని స్థానిక నివాసి ఒకరు బీబీసీతో పేర్కొన్నారు.

అంబేడ్కర్ హౌస్‌ను అనుమతులు లేకుండానే పునరుద్ధరించారని.. ఇప్పుడు ఇక్కడికి గుంపులుగా జనం వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కామ్డెన్ కౌన్సిల్ స్థానికులతో సంప్రదింపులు జరిపినపుడు.. ''సందర్శకులు గుంపులు గుంపులుగా వచ్చి ఫొటోలు తీసుకుంటూ అల్లరి చేస్తున్నారు'' అని ఒక స్థానికుడు ఫిర్యాదుచేశారు.

అంబేడ్కర్ హౌస్

అయితే.. ఈ అభ్యంతరాలు ఆశ్చర్యకరంగా, విచారకరంగా ఉన్నాయని కింగ్ హెన్రీ రోడ్‌లో నివసించే బోనీ డాబ్సన్ బీబీసీతో వ్యాఖ్యానించారు. ఆమె కెనడియన్ జానపద గాయకురాలు. ఆమె వయసు ప్రస్తుతం 78 ఏళ్లు. తాను 1969 నుంచి ప్రైమ్‌రోజ్ హిల్‌లో నివసిస్తున్నానని, తన పొరుగువారి గురించి తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డానని చెప్పారు.

''నాకు తెలిసినంతవరకూ.. ఈ ఇల్లు ఇప్పుడు ఒక చిన్నపాటి మ్యూజియం అయినందువల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు'' అని ఆమె పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ హౌస్‌ను సందర్శించటానికి పర్యటకులు రావటం మంచి విషయమేనన్నారు. అయితే.. కోచ్‌ల కొద్దీ సందర్శకులు గుంపులు గుంపులుగా వస్తున్నారన్న వాదనతో విభేదించారు. ''నా రోడ్డు మీదుగా కోచ్‌లు వచ్చివెళ్లడం నేను చూడలేదు'' అని వ్యాఖ్యానించారు.

అయితే.. అంబేడ్కర్ హౌస్ గురించి స్థానిక నివాసులు ఏమనుకుంటున్నారనే దానితో నిమిత్తం లేదు. ఆ ఇంటి భవిష్యత్తు మీద తుది నిర్ణయం కామ్డెన్ కౌన్సిల్ ప్రణాళిక విభాగం చేతుల్లో ఉంటుంది.

ఒకవేళ అంబేడ్కర్ హౌస్ తన అప్పీలులో ఓడిపోతే.. దాని యజమానులు ఇంటిని మళ్లీ చట్టబద్ధంగా నివాస వినియోగానికి మార్చాల్సి ఉంటుంది'' అని కౌన్సిల్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

అంబేడ్కర్ హౌస్

అంబేడ్కర్ హౌస్‌ను మ్యూజియంగా మార్చటానికి అనుమతివ్వాలన్న దరఖాస్తు విషయంలో.. ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చటానికి సైద్ధాంతికంగా అనుమతివ్వవచ్చునని కౌన్సిల్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే.. నివాస ప్రాంతం కోల్పోవటమనేది విధానాన్ని ఉల్లంఘిస్తోందని.. అందువల్ల ఆ దరఖాస్తును తిరస్కరించారని వివరించింది.

దీనిని మ్యూజియంగా మార్చటం వల్ల ఒనగూరే ''సాంస్కృతిక ప్రయోజనాలకు బదులుగా కోల్పోయే నివాస ప్రాంతాన్ని భర్తీ చేయటానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించలేమని చెప్పటానికి ఏమీ లేదు'' అని కూడా కౌన్సిల్ ఆ నివేదికలో వ్యాఖ్యానించింది.

అంబేడ్కర్ హౌస్‌కు చాలా మంది పొరుగువారు మద్దతు ఇస్తున్నారని చక్రవర్తి ఉద్ఘాటిస్తున్నారు.

''వందేళ్ల కిందట అంబేడ్కర్ ఇక్కడ నివసించినప్పటి జ్ఞాపకాలు వారి బంధువులు కొందరికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓ విశిష్టమైన ఏర్పాటు జరుగుతుండటం పట్ల వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ భవనం లోపల ఒక గోడ మీద డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ఒక మాట ముద్రించి ఉంది: ''ప్రజాస్వామ్యం అంటే వాస్తవానికి మన పొరుగువారి పట్ల ఉండే గౌరవమర్యాదల వైఖరి.''

అంబేడ్కర్ హౌస్ పట్ల ఈ కౌన్సిల్‌కు గల గౌరవమర్యాదల వైఖరి ఇంకా తేలాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: బీఆర్ అంబేడ్కర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)