అంబేడ్కర్‌పై ట్వీట్: చిక్కుల్లో క్రికెటర్ హార్దిక్ పాండ్యా,

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, నారాయణ్ బారేఠ్
- హోదా, బీబీసీ కోసం
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఓ ట్వీట్ విషయంలో చిక్కుల్లో పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారని పేర్కొంటూ హార్దిక్ పాండ్యాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జోధ్‌పూర్ న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ట్వీట్ తనది కాదని.. తన పేరిట నకిలీ ఖతా ద్వారా ఎవరో చేశారని పాండ్యా వివరణ ఇచ్చారు.
ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద ఈ కేసును నమోదు చేయాలని కోర్టు సూచించింది.
జోధ్‌పూర్‌కు చెందిన కేడీఆర్ మేఘ్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ అంబేడ్కర్‌ను పాండ్యా అవమానించినట్టుగా ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.
గత సంవత్సరం డిసెంబర్ 26న పాండ్యా ఒక ట్వీట్ చేస్తూ "అంబేడ్కర్ ఎవరు?" అని ప్రశ్నించినట్టు పిటిషన్‌దారు పేర్కొన్నారు.
రిజర్వేషన్ల విషయంలో డాక్టర్ అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా చేసిన ఈ ట్వీట్‌లో పాండ్యా అభ్యంతరకమైన వ్యాఖ్య చేశారని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పందించిన పాండ్యా
అయితే, ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా స్పందించారు. తన పేరిట నకిలీ ఖాతా ద్వారా ఈ ట్వీట్ చేశారని అన్నారు.
తాను అంబేడ్కర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
తనకు అంబేడ్కర్ అంటే ఎంతో గౌరవం ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, HARDIK PANDYA
అంతకు ముందు క్రికెటర్ పాండ్యా అంబేడ్కర్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడమే గాకుండా సముదాయాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినట్టు పిటిషన్‌దారు మేఘ్వాల్ ఆరోపించారు.
ఇందుకోసం ఫేక్ అకౌంట్‌ను ఉపయోగించుకుంటే అది మరింత తీవ్రమైన విషయమనీ, దానికి గాను పాండ్యాపై తగిన చర్యలు తీసుకోవాలని మేఘ్వాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మేఘ్వాల్ బీబీసీతో మాట్లాడుతూ, "సోషల్ మీడియా ద్వారా నాకు ఈ ట్వీట్ విషయం తెలిసింది. ఆ తర్వాత నేను ఇక్కడి లూణీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దీనిపై చర్య తీసుకోవాలని అధికారులను కోరాను. కానీ పోలీసులు నా విజ్ఞప్తిని తోసిపుచ్చారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Narayan Bareth
లూణీ పోలీసు స్టేషన్‌కు ఇన్‌చార్జిగా ఉన్న రాజేంద్ర సింగ్‌పై కూడా మేఘ్వాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ కేసుకు సంబంధించి హార్దిక్ పాండ్యా వాదనేమిటో తెలియరాలేదు.
పాండ్యా చేసిన వ్యాఖ్యతో తాను చాలా బాధ పడ్డాననీ, ఈ వ్యాఖ్య దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరమని మేఘ్వాల్ అన్నారు.
ఐపీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని కోర్టు జోధ్‌పూర్‌లోని లూణీ పోలీసులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








