అంబేడ్కర్ లండన్ ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ

శారదా తాంబే

డా. బి.ఆర్. అంబేడ్కర్‌కు ఆధునిక భారతీయ చరిత్రలో ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఖ్యాతి భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో ఎందరికో ఆయన స్ఫూర్తినిస్తుంటారు. లండన్‌లో చదువుకొనే సమయంలో అంబేడ్కర్ నివాసమున్న ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసింది. ఆ ఇంటిని ప్రతి సంవత్సరం వందలాది మంది సందర్శిస్తారు. ఆ ఇంటితో ప్రత్యేక అనుబంధం ఉన్న ఒక బౌద్ధ మతస్థురాలిని కలిసి బీబీసీ ప్రతినిధి శైలీ భట్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

‘‘కులం ఆధారంగా సమాజం మా పట్ల వివక్ష చూపింది. మమ్మల్ని బయటే నిలబడాలని చెప్పేవారు. కానీ అంబేడ్కర్ మాకు బౌద్ధాన్ని పరిచయం చేసిన తర్వాత మాకు పక్షుల్లా విహరించే స్వేచ్ఛ లభించినట్టయ్యింది’’ అంటున్నారు 65 ఏళ్ల శారదా తాంబే.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఈమె లండన్‌లో ఉంటారు. ప్రతిరోజూ అంబేడ్కర్ స్మారక భవనానికి వెళ్తారు.

‘‘మాకు గౌరవం లభించిందంటే అది ఆయన వల్లనే. ప్రతీదీ ఆయన వల్లనే సాధ్యమైంది. ఈ ప్రపంచంలో ఆయనకన్నా ఎక్కువ విలువైంది మరేదీ లేదనేది నా నమ్మకం. ఆయన కోసమే నేను ఇక్కడకు వస్తాను. ఇక్కడ నుంచి నాలుగు బస్టాపుల దూరంలో నేను ఉంటున్నాను. ఒకవేళ నేను దూరంగా ఉన్నా కూడా వారానికో, నెలకో ఒకసారి సెలవు తీసుకుని మరీ వచ్చేస్తాను. ఇప్పుడు ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు నాకు అవకాశం దొరికింది. ఒకవేళ తలుపులు మూసి ఉంటే, ఒక కొవ్వొత్తి వెలిగించి తిరిగి వచ్చేస్తాను’’ అని ఆమె చెప్పారు.

శారదా తాంబే

2002లో శారద లండన్‌ వచ్చారు.

ఆమె ఇళ్లల్లో పనిమనిషిగా పని చేస్తూ జీవిస్తున్నారు. ముంబయిలో ఉన్న తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు ఉన్న మార్గం ఇదొక్కటేనని ఆమె చెప్పారు.

‘‘మా దగ్గర డబ్బు లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. ఇక్కడకు రావడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నా పిల్లలకు చెప్పాను - మనకు డబ్బు కావాలి కాబట్టి నేను వెళ్లాల్సిందే అని. ఎవ్వరి ముందైనా సరే ఒక్కదాన్ని వెళ్లడానికి జంకలేదు. నాకున్న ఒకేఒక్క సమస్య ఇంగ్లిష్. కానీ కొద్దిగా మాట్లాడుతూ పనిని వెతుకొని నెట్టుకొస్తున్నాను’’ అని ఆమె వెల్లడించారు.

అంబేడ్కర్ నివసించిన ఇల్లు

ఈ సమాజంలో అమ్మాయిలు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్ముతున్నారు శారద.

‘‘ఆడపిల్లలు బాగా చదువుకుని ముందుకు రావాలని డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పుడూ చెబుతుండేవారు. అమ్మాయిలు కచ్చితంగా అలానే చేయాలి. మహిళలంతా బాబా సాహెబ్ గురించి తెలుసుకోవాలి. చదువుకునే రోజుల్లో ఆయన తన ఇంట్లో విద్యుత్ లేక వీధి దీపాల కింద కూర్చుని చదువుకునేవారు. ఇప్పుడు అంతటా విద్యుత్ కాంతులు ఉన్నాయి. అందుకే అందరూ ఆ వెలుతురును అందుకొని బాగా చదువుకుని బాబా సాహెబ్ కలలుగన్నట్లుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి’’ అని ఆమె ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)