ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయం: ‘వీటిని వాడొచ్చు, వాడాక తినేసేయొచ్చు’

ఉక్రెయిన్ చేతి సంచులను చూపెడుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, 1+1 TV

    • రచయిత, బీబీసీ
    • హోదా, మానిటరింగ్

పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ కవర్ల నిషేధం గురించి మీరు వినే ఉంటారు. వీటికి బదులు ఇంకేదైనా కనుక్కుంటే బాగుంటుందని అనుకుని ఉంటారు కూడా.. కానీ ఉక్రెయిన్ శాస్త్రవేత్తలు ఆ పని చేసి చూపారు.

ఈ బ్యాగులు పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు. ఇవి మట్టిలో కలిసిపోవడానిక్కూడా ఎక్కువ కాలం పట్టదు.

అన్నిటికీ మించి.. ఈ బ్యాగులను మనం తినేసేయచ్చని ఉక్రెయిన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు!

ఉక్రెయిన్‌కు చెందిన డా.దిమిత్రో బిద్యుక్, ఆయన సహోద్యోగులు.. పిండి పదార్థాలు(స్టార్చ్), సహజమైన ప్రొటీన్లతో ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారని స్థానిక డిపో.సుమీ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

ఉక్రెయిన్ చేతి సంచులు

ఫొటో సోర్స్, 1+1 TV

కప్పులు

ఫొటో సోర్స్, 1+1 TV

సాధారణంగా ప్లాస్టిక్‌తో తయారు చేసే చేతి సంచులు, స్ట్రాలు, కప్పులను నీళ్లలో దొరికే రెండు రకాల పాచి(రెడ్ ఆల్జీ నుంచి తీసిన పిండి పదార్థం, సముద్రంలో దొరికే గడ్డి)తో తయారు చేశారు. ప్లాస్టిక్‌తో తయారుచేసిన వస్తువులు కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది మరి!

''ఈ కొత్త పదార్థంతో తయారు చేసిన కప్పులు, ఇతర వస్తువులు ప్లాస్టిక్‌లా కాకుండా, కేవలం 21రోజుల్లోగా మట్టిలో కలిసిపోతాయి. ఇది సానుకూలాంశం'' అని డా.బిద్యోక్ '1+1టీవీ'తో అన్నారు.

ఈ కప్పులను ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు, లేదా కప్ కేక్‌లను బేక్ చేయడానికి వాడుకోవచ్చు. ఏదిఏమైనా ఈ వస్తువులన్నీ మానవ వినియోగానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ వినూత్న బ్యాగులు తయారు చేసిన సుమీ బృందానికి ఈనెల కోపెన్‌హ్యాగెన్‌లో జరిగిన యూనివర్శిటీ స్టార్టప్ వరల్డ్‌కప్‌లో సస్టైనబులిటీ అవార్డు లభించింది.

ఈ ప్రాజెక్టుపై మరింత పరిశోధనలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం ఈ బృందం విదేశీ భాగస్వాములతో కూడా చర్చలు జరుపుతోంది.

కాగా, భారత్ సహా పలు దేశాల్లో బ్యాగులను వినియోగించిన తర్వాత పశువుల దాణాగా ఉపయోగించేలా కూడా తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)