మహాత్మా గాంధీపై బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత? : అభిప్రాయం

మహాత్మా గాంధీ, అంబేడ్కర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉర్విష్ కొఠారి
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్

డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 1955 ఫిబ్రవరి 26వ తేదీన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, దానిలో ఆయన గాంధీజీపై వెలిబుచ్చిన అభిప్రాయాలు తరచుగా చర్చలకు, ఆయనపై ఆరోపణలకు వీలు కల్పిస్తుంటాయి. (ఈ విషయంలో మనం ఇంటర్నెట్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి).

డాక్టర్ అంబేడ్కర్‌కు సంబంధించి ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఉండడం వల్ల, చారిత్రాత్మకంగా కూడా అది చాలా అరుదైనది. ఆ ఇంటర్వ్యూలో అంబేడ్కర్ గాంధీజీపై పలు ఆరోపణలు చేశారు. గాంధీజీని ఇష్టపడని వాళ్ల చెవులకు అది సంగీతంలా వినిపించవచ్చు కానీ నిజానికి గాంధీ-అంబేడ్కర్ మధ్య సంబంధం గురించి తెలిసిన వారిని అది పెద్దగా ఆశ్చర్యపరచదు.

రామచంద్ర గుహ ఇటీవల రాసిన గాంధీజీ జీవిత చరిత్ర(గాంధీ: ద ఇయర్స్ దట్ చేంజ్డ్ ద వాల్డ్)లో ఈ ఇంటర్వ్యూ గురించి, ''ఆయన (డాక్టర్ అంబేడ్కర్) 1930, 1940లలో గాంధీజీ రాసిన రచనలను వివాదాస్పదమైనవంటూ తోసిపుచ్చారు'' (పేజీ నెం.908) అని ఒక్క వాక్యంలో ముగించారు.

63 ఏళ్ల క్రితం గాంధీజీపై డాక్టర్ అంబేడ్కర్ చేసిన విమర్శల్లో ఆయన అభిప్రాయాలు, చారిత్రక వాదాలు, విశ్లేషణ ఉన్నాయి. సుదీర్ఘమైన ఆరు దశాబ్దాల అనంతరం విమర్శనాత్మకమైన, పరుషమైన ఆ ఇంటర్వ్యూను తిరిగి చదవడం చాలా అవసరం.

డాక్టర్ అంబేడ్కర్ ప్రకారం, 'భారతదేశ చరిత్రలో గాంధీ ఒక ఘటన మాత్రమే. ఆయన ఎన్నడూ యుగప్రవక్త కారు. కాంగ్రెస్ పలు వేడుకల ద్వారా ఆయనకు 'కృత్రిమ శ్వాస' కల్పించకపోయి ఉంటే గాంధీని ప్రజలు ఎన్నడో మరచిపోయేవారు.'

వీడియో క్యాప్షన్, వీడియో: ‘గాంధీకి మహాత్మ అనే పేరు పొందే అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబడ్కేర్

గాంధీజీపై అంబేడ్కర్ మాటల్లో మార్దవం

సుమారు ఏడు దశాబ్దాల తర్వాత గాంధీ యుగప్రవక్తా, కాదా అన్న ప్రశ్నకు అందరికీ ఆమోదయోగ్యమయ్యే సమాధానం రాబట్టడం కష్టం. కానీ ఆ 'కృత్రిమ శ్వాస'ను తీసేసాక కూడా గాంధీ ఇంకా సజీవంగానే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఉంటారని చెప్పవచ్చు. (మనం ఒక చారిత్రక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఆయన భావజాలం గురించి కాదు.)

డాక్టర్ అంబేడ్కర్ తాను గాంధీని ఎప్పుడూ ఒక 'ప్రత్యర్థి'గానే కలిశానని అన్నారు. అందువల్ల తనకే 'ఇతరులకన్నా గాంధీజీ గురించి ఎక్కువ తెలుసు' అని చెప్పారు. ఇతరులు ఆయనను ఒక మహాత్మునిగా చూస్తే, అంబేడ్కర్ ఆయనను ఒక సాధారణ మానవుని రూపంలో చూశారు.

అంబేడ్కర్ దృష్టి నుంచి చూసినప్పుడు ఈ ప్రకటన నిజమే కావచ్చు కానీ.. దీనిని బట్టి ఆయన గాంధీని కేవలం ఒక కోణం నుంచి మాత్రమే చూశారని, ఆయనకు గాంధీజీపై అంత మంచి అభిప్రాయం లేదని తెలుస్తుంది.

అయితే ఆయన మాటల్లో గాంధీజీపై మార్దవం అనేకసార్లు కనిపించేది.

ఉదాహరణకు 1954, సెప్టెంబర్ 6న డాక్టర్ అంబేడ్కర్, 'గాంధీ నిధి' పేరుతో ఉప్పుపై పన్నును విధించాలని, దానిని దళితుల సంక్షేమం కోసం ఉపయోగించాలని సూచించారు.

డాక్టర్ అంబేడ్కర్, ''నా మనస్సులో గాంధీజీ అంటే ప్రేమ ఉంది. ఏది ఏమైనా కానీ, గాంధీజీని వెనుకబడిన ప్రజలు తమ ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించారు. అందుకే ఆయన స్వర్గం నుంచి కూడా ఆశీర్వాదాలు అందిస్తారు'' (గుజరాతీ ప్రచురణ, పేజీ నెం.540) అన్నారు.

గాంధీ

ఫొటో సోర్స్, BBC

ద్వంద్వ వైఖరి నిజమేనా?

ఈ ఇంటర్వ్యూలో డాక్టర్ అంబేడ్కర్ 'గాంధీజీ ఎప్పుడూ ద్వంద్వ వైఖరి కనబరిచేవార'ని చాలా తేలికగా అనేశారు.

గాంధీజీ ఆంగ్ల పత్రికలలో తనను తాను 'కులవ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకిగా చూపించుకునేవార'ని, అదే గుజరాతీ పత్రికలలో మాత్రం ఆయన 'కులవ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించేవారు' అని డాక్టర్ అంబేడ్కర్ అన్నారు. గాంధీజీలోని ఆ ద్వంద్వ వైఖరిని బయటపెట్టడానికి గుజరాతీ, ఆంగ్ల పత్రికలలోని రచనలను బట్టి ఎవరైనా ఆయన జీవితచరిత్రను రాయాలని సూచించారు.

ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా జరిగింది. గాంధీజీకి సంబంధించిన అన్ని రచనలూ 'మహాత్మా గాంధీ సమగ్ర రచనలు' పేరిట 100 సంపుటాలలో అసలైనవి కానీ, అనువాద రూపంలో కానీ లభిస్తున్నాయి.

ఎవరైనా ఆయన గుజరాతీలో రాసిన వ్యాసాల ఆంగ్లానువాదాన్ని సులభంగా పొందవచ్చు. గాంధీజీ వారసత్వ పోర్టల్‌లో (gandhiheritageportal.org) 'హరిజన్' (ఇంగ్లీష్), 'హరిజన్ సేవక్', (హిందీ), 'హరిజన్ బంధు' (గుజరాతీ)లకు సంబంధించిన అన్ని సంపుటాలూ ఉన్నాయి. ఎవరైనా గాంధీజీ ఇంగ్లీష్, గుజరాతీ వ్యాసాలను పరిశీలిస్తే, ఆయనపై ఉన్న తప్పుడు అభిప్రాయం తొలగిపోతుంది.

గాంధీజీ ఇంగ్లీష్ రచనలను చదివితే ఆయన వర్ణాశ్రమాన్ని, కులవ్యవస్థను సమర్థించాడని, గుజరాతీ రచనల్లో అంటరానితనాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించారని స్పష్టం అవుతుంది.

డాక్టర్ అంబేడ్కర్.. అంటరానితనం నిర్మూలనతోపాటు సమానావకాశాలు, గౌరవంగా జీవించే హక్కు ఉండాలని నొక్కి చెప్పి, గాంధీజీ వాటిని వ్యతిరేకించారని అన్నారు.

'అంటరానివాళ్లను కాంగ్రెస్‌లోకి లాక్కోవడమే' గాంధీ పని అని అంబేడ్కర్ అంటారు. అంబేడ్కర్ ప్రకారం గాంధీజీ మరో అజెండా - 'అంటరానివారు తన స్వరాజ్య ఉద్యమాన్ని వ్యతిరేకించకుండా చూసుకోవడం'.

అంబేడ్కర్

1915లో దళిత కుటుంబానికి ఆశ్రయం

గాంధీజీ ఒక తీవ్రమైన సంస్కర్త కాదు. ఆయన డాక్టర్ జ్యోతిరావు పూలే లేదా డాక్టర్ అంబేడ్కర్‌లా కులవ్యవస్థపై ప్రత్యక్ష పోరాటం చేయలేదు.

అయినా కాంగ్రెస్ లేదా జాతీయ రాజకీయాల్లో చేరడానికి ముందే ఆయన 1915లో తన ఆశ్రమంలో ఒక దళిత కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. దాని వల్ల కొత్తగా ఏర్పడిన ఆ ఆశ్రమానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అది మూతపడే ప్రమాదం కూడా తలెత్తింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.

బ్రిటిష్ పాలకులు కేవలం గాంధీ ఉద్యమం వల్లే కాకుండా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా భారతదేశానికి స్వతంత్ర్యం ఇచ్చేందుకు అంగీకరించారని డాక్టర్ అంబేడ్కర్ సరిగ్గానే అన్నారు. ప్రత్యేక నియోజకవర్గాలు, పూనా ఒడంబడికపై గాంధీజీ, డాక్టర్ అంబేడ్కర్‌ల మధ్య ప్రధానమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి.

ఆయన వాదన నిజమే. ముంబై ప్రావిన్స్‌లో రిజర్వ్డ్ సీట్లలో డాక్టర్ అంబేడ్కర్ పార్టీ మద్దతు ఇచ్చిన 17 మంది అభ్యర్థులలో 15 మంది గెలుపొందారు. (ధనంజయ్ కీర్, గుజరాతీ అనువాదం, పేజీ నెం.349) కానీ వివిధ ప్రావిన్స్‌లలోని మొత్తం 151 రిజర్వ్డ్ సీట్లలో కాంగ్రెస్ సగానికి పైగా సీట్లను గెల్చుకుంది. (151లో 78 సీట్లు)

డాక్టర్ అంబేడ్కర్ ఈ ఇంటర్వ్యూను తన రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఇచ్చారు. దానిలో వాస్తవాలతో పాటు అనేక ఆరోపణలు, కాఠిన్యం, నైరాశ్యం ఉన్నాయి. అవి చాలా మానవ సహజమైన భావాలు. కానీ నేటి పరిస్థితులలో వాటిని ఉపయోగించుకుని గాంధీపై విమర్శలు కురిపించాలనుకోవడం సరైనది అనిపించుకోదు.

(ఈ కథనంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)