హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై పోరు: ఇక్కడ ఎలా విజయం సాధించిందంటే...

- రచయిత, వాల్డీ కారెల్సే
- హోదా, బీబీసీ ఆఫ్రికా, నమీబియా
భారత్‌లో హెచ్‌ఐవీ కేసులు అత్యధికంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆఫ్రికాలోని నమీబియాలో హెచ్‌ఐవీపై పోరులో కీలకమైన ఒక కార్యక్రమం గురించి తెలుసుకుందాం.
హెచ్ఐవీ వ్యాప్తి నియంత్రణలో బాగా విజయవంతమైన దేశాల్లో నమీబియా ఒకటి. హెచ్ఐవీ బాధితుల వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమం ఈ విజయానికి ఎంతగానో దోహదం చేసింది.
ఆ కార్యక్రమం ఎలా సాగుతుందంటే..
నమీబియా ఉత్తర ప్రాంతంలోని హార్వే డేవిస్ ఇంటికి ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వచ్చారు. ఇంటి గేటు వద్దకు వెళ్లి వారికి డేవిస్ సాదరంగా స్వాగతం పలికారు. ''మా ఇంటికి అతిథులు వచ్చి చాన్నాళ్లైంది'' అంటూ వారిని ఆహ్వానించారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న తన భార్య రుత్ నసిడేంగోను పిలిచారు. తమ ఇద్దరు కవల పిల్లలతో ఆమె బయటకు వచ్చారు.
డేవిస్‌కు 79 సంవత్సరాలు. నసిడేంగోకు 40 ఏళ్లు. నసిడేంగోకు పదేళ్ల క్రితమే హెచ్‌ఐవీ సోకింది. డేవిస్‌కు హెచ్‌ఐవీ పరీక్ష చేసేందుకు ఈ ఆరోగ్య కార్యకర్తలు మూడు కిలోమీటర్లకు పైగా దూరం నడిచి వచ్చారు.

ఆరోగ్య కార్యకర్తలు లియోన్‌టిన్ లిపింగే, మారియా జోహన్నెస్ నమీబియాలో ఒషానా ప్రాంతంలోని ఒషకాటి పట్టణంలో ఉన్న తమ కేంద్రం నుంచి వచ్చారు.
ఒక చిన్న ప్లాస్టిక్ టేబుల్, ఐస్ ప్యాక్‌లున్న కూలర్ బ్యాగ్, హెచ్ఐవీ పరీక్షలే వీరి ఆయుధాలు. వీరు ఫీల్డ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీరి పైస్థాయిలో ట్రూప్ కమాండర్, ఆయనపైన డివిజన్ కమాండర్ ఉంటారు.
'టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎపిడెమిక్(టీసీఈ)' అనే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థ 'డెవలప్‌మెంట్ ఎయిడ్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్(డాప్ నమీబియా)' నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు సుమారు 1.82 లక్షల మంది జనాభాకు సేవలందిస్తున్నారు.
ఈ ప్రాంతంలో 14 ఏళ్లుగా టీసీఈ ఆరోగ్య కార్యకర్తలు సేవలందిస్తున్నారు.
హెచ్‌ఐవీ బాధితుల జీవిత భాగస్వాములకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించడం ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ఎంతగానో ఉపకరిస్తుందని ఆరోగ్య కార్యకర్త లిపింగే చెప్పారు.
హెచ్‌ఐవీ నిర్ధరణ అయిన వారి వివరాలన్నీ ఒషకాటి పట్టణంలో క్రోడీకరిస్తారు. వారి లైంగిక భాగస్వాముల వద్దకు వెళ్లి వారికీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు.
పరీక్ష ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. డేవిస్‌కు హెచ్‌ఐవీ సోకలేదని పరీక్షలో నిర్ధరణ అయింది. అయినప్పటికీ, ఆస్పత్రికి వెళ్లాలని ఆరోగ్య కార్యకర్తలు ఆయనకు సూచించారు. భార్యకు హెచ్‌ఐవీ ఉన్నందున, ఈ వైరస్ ఆయనకు సోకే ముప్పును 90 శాతం మేర తగ్గించే మందులు తీసుకొనేందుకు ఈ సూచన చేశారు.
డేవిస్‌కు పరీక్ష అనంతరం ఆరోగ్య కార్యకర్తలు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలోని ఎవులులుకో టౌన్‌షిప్‌లో ఉండే లుకాస్ ఆంగులా ఇంటికి బయల్దేరారు.

లక్ష్యసాధనలో ఎక్కడుంది?
లుకాస్‌కు గత నెల్లోనే హెచ్‌ఐవీ నిర్ధరణ అయ్యింది. పరీక్షకు ఆయన్ను ఒప్పించడానికి భార్య మటిల్డా ఇపాన్‌డులాకు పదేళ్లు పట్టింది.
''హెచ్‌ఐవీ పరీక్ష ప్రస్తావన తెస్తే చాలు ఇద్దరి మధ్య గొడవ అయ్యేది. పరీక్షకు అంగీకరించేవారే కాదు. ఆయన్ను ఒప్పించేందుకు మా పొరుగింటి వ్యక్తి సాయం కోరాను. అతికష్టమ్మీద లుకాస్‌ను పరీక్షకు ఒప్పించాం'' అని మటిల్డా చెప్పారు.
భార్య, తమ పొరుగింటి వ్యక్తి లుకాస్‌కు అండగా నిలుస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితుడికి తోడ్పాటు అందించే బృందంలో ఒక హెచ్‌ఐవీ బాధితుడు, మరో ఇద్దరు ఉంటారు. హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవడం, ఔషధాల వాడకంలో లుకాస్‌కు భార్య, పొరుగింటి వ్యక్తి తోడ్పాటు ఎంతో ఉంది.
నమీబియాలో హెచ్‌ఐవీ వ్యాప్తి నియంత్రణలో బాధితులకు కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు తదితరుల నుంచి లభించే మద్దతు కీలకంగా నిలుస్తోంది.
లుకాస్ ఇంటికి దగ్గర్లో ఒక పండ్ల చెట్టు కింద ఒసివాంబో భాషలో 12 మంది సంతోషంగా పాట పాడుతూ కనిపించారు. వీరంతా హెచ్‌ఐవీ బాధితులే. వీరందరూ 12 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకొంటుంటారు.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించి 2014లో యూఎన్‌ఎయిడ్స్ నిర్దేశించిన 90-90-90 లక్ష్యాల్లో రెండింటిని నమీబియా ఇప్పటికే అధిగమించిందని ఎయిడ్స్ నియంత్రణకు ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడి అత్యవసర ప్రణాళిక విభాగం తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ మూడు లక్ష్యాలను 2020లోగా అధిగమించాలని యూఎన్‌ఎయిడ్స్ నిర్దేశించింది.
ఆ లక్ష్యాలేమిటంటే- 1) హెచ్‌ఐవీ సోకిన వ్యక్తుల్లో కనీసం 90 శాతం మందికి తమకు ఈ వైరస్ సోకిందనే విషయం తెలిసి ఉండాలి. 2) హెచ్‌ఐవీ నిర్ధరణ అయినవారిలో కనీసం 90 శాతం మంది యాంటీరిట్రోవైరల్ చికిత్స(ఏఆర్‌టీ) పొందుతుండాలి. 3) నిర్ధరించలేని స్థాయిలో హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల్లో కనీసం 90 శాతం మంది అవసరమైన ఔషధాలు తీసుకొంటుండాలి. ఈ మూడు లక్ష్యాలకు సంబంధించి నమీబియా గణాంకాలు వరుసగా 86 శాతం, 96 శాతం, 91 శాతంగా ఉన్నాయి.
ప్రపంచంలోకెల్లా హెచ్‌ఐవీ కేసులు అత్యధికంగా ఉన్న దక్షిణాఫ్రికాలో ఈ గణాంకాలు వరుసగా 90 శాతం, 68 శాతం, 78 శాతంగా ఉన్నాయి.

ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అదీ సాధిస్తాం: నమీబియా మంత్రి
తమ లక్ష్య సాధనలో ఉదాశీనతకు తావు లేదని నమీబియా ఆరోగ్యశాఖ మంత్రి బెర్నార్డ్ హౌఫికూ చెప్పారు. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే తాము మొదటి లక్ష్యాన్ని కూడా అందుకుంటామన్నారు. తాము ప్రధానంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి నివారణపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని తెలిపారు. అందులోనూ ఇప్పటివరకు హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోని యువతీయువకులపై దృష్టి సారించాల్సి ఉందని వివరించారు.
ఒకప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యధిక హెచ్‌ఐవీ కేసులు నమీబియాలోనే ఉండేవి. గత 15 సంవత్సరాల్లో కొత్త కేసుల సంఖ్య సగానికి సగం తగ్గింది. 15-24 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆరోగ్యశాఖ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
యువతరంతో పోలిస్తే డేవిస్, లుకాస్ లాంటి ముందుతరంవారే పరీక్షలకు ఎక్కువగా ముందుకొస్తున్నట్లు కనిపిస్తోంది.
నమీబియాలో భవిష్యత్తులో ఎవరికి పరీక్ష చేసినా హెచ్‌ఐవీ సోకలేదని నిర్ధరణ అయ్యే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నానని ఆరోగ్య కార్యకర్త జోహన్నెస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏటీఎం.. ఎనీటైం మూత
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా, కాదా
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ భవనం: ఆకాశ హర్మ్యాలు ఇలా నిర్మిస్తారు
- అండమాన్ సెంటినలీస్ మిత్రుడు - ఆయన పేరు పండిట్
- కండోమ్ ప్రకటనలు: పెద్దలకు మాత్రమే!
- యూపీ: బులంద్‌షహర్‌లో గోవధ వదంతులు.. రాళ్లదాడిలో ఇన్స్పెక్టర్ మృతి
- ఈ శతాబ్ధంలో మహిళల్ని వెనక్కు లాగుతున్నవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








