‘నా క్లిటోరిస్ నాకు కావాల్సిందే’ అంటూ యోని రీకన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ చేయించుకున్న యువతి కథ

- రచయిత, బుష్రా మొహమద్
- హోదా, బీబీసీ న్యూస్
స్త్రీ జననేంద్రియంలో క్లిటోరిస్ అనే భాగాన్ని తొలగించడానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు శంసా శరావే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోమాలీల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు.
ఈ ప్రక్రియను ఖత్నా(సున్తీ)గా వ్యవహరిస్తారు. దీనిని ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా వ్యవహరిస్తున్నారు.
ఆరేళ్ల వయస్సులో తన యోని భాగానికి ఏం చేశారో వివరించడానికి ఆమె ఒక వీడియోలో, రేజర్ బ్లేడ్‌తో గులాబీ రేకులను కత్తిరించి, ఆ తర్వాత పువ్వులో మిగిలిన వాటిని కుట్టేయడాన్ని చూపారు.
ఈ పోస్ట్ టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది.
16 నెలల కిందట దీనిని పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 1 కోటి 20 లక్షల మంది వీక్షించారు.
ఎఫ్‌జీఎంలో యోని భాగాన్ని (యోని పెదవులు, క్లిటోరిస్ సహా) కత్తిరిస్తారు.
యోని ద్వారం ఒక చిన్న రంధ్రంగా మారిపోవడం వల్ల నొప్పితో కూడిన పీరియడ్స్, మూత్రవిసర్జనలో ఇబ్బంది, సెక్స్‌లో బాధ కలిగినా, సోమాలీలు ఎవరూ దాని గురించి బయటకు మాట్లాడరు.
ఈ రకమైన ఎఫ్‌జీఎంను ఇన్ఫిబ్యులేషన్ లేదా ‘టైప్ త్రీ’ అని పిలుస్తారు. దీన్ని సోమాలియాలో చాలామంది అమ్మాయిలకు చేస్తారు. బాహ్య జననేంద్రియాలను కత్తిరించడం, కన్యత్వానికి హామీ ఇస్తుందని వాళ్లు నమ్ముతారు.


ఫొటో సోర్స్, Getty Images
నైతికతపై ముద్ర
సోమాలీ సమాజంలో ఎఫ్‌జీఎమ్ చేయించుకోని స్త్రీల నైతికతపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. వాళ్లకు సెక్స్ వాంఛలు ఎక్కువగా ఉంటాయని, అది కుటుంబ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందని భావిస్తారు.
2001లో సోమాలియా అంతర్యుద్ధం కారణంగా కుటుంబంతో సహా యూకే పారిపోయి వచ్చిన ఈ 31 ఏళ్ల టిక్‌టాకర్, ఈ కట్టుబాటును విమర్శిస్తూ అనేక వీడియోలు చేస్తున్నారు.
18 ఏళ్ల వయసులో తాను సోమాలియాకు వెళ్లినప్పుడు తనను బలవంతంగా వివాహం చేసుకుని, అత్యాచారం చేసిన విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేశారు.
అక్కడి నుంచి తప్పించుకుని యూకేకు రావడానికి ఆమెకు ఆరు నెలలు పట్టింది.
అయితే, సోమాలియాలోని సంప్రదాయవాదులకు నచ్చని విషయం ఏమిటంటే, ఆమె తన జననేంద్రియాలను తిరిగి పొందాలనుకుంటున్నానని చెప్పడం.
జననేంద్రియాలను తిరిగి పొందడం సాధ్యమనే విషయం జర్మన్ పౌరురాలు హాజా బిల్కిసును కలిసిన తర్వాతనే శంసాకు తెలిసింది.
బిల్కిసుకు కూడా చిన్నప్పుడు ఆమె స్వదేశమైన సియెర్రాలియోన్‌లో ఎఫ్‌జీఎం చేశారు.
శంసా రోజా పువ్వు వీడియోకు ప్రతిస్పందించిన బిల్కిసు, జర్మనీలోని ఆచెన్‌లోని లూయిసెన్ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ డాన్ మోన్ ఓడేతో తను క్లిటోరిస్ పునర్నిర్మాణ ఆపరేషన్ చేయించుకున్నట్లు వివరించారు.

శస్త్రచికిత్స ఎలా చేస్తారు?
ఈ శస్త్రచికిత్సలో క్లిటోరిస్, లాబియాల పునర్నిర్మాణం ఉంటుంది. శంసా విషయంలో ఆమె పిరుదుల నుంచి తీసుకున్న కణజాలంతో ఈ శస్త్రచికిత్స చేశారు. దీనిలో నొప్పిని తగ్గించడానికి, ఆ స్త్రీ లైంగిక జీవితాన్ని పునరుద్ధరించడానికి తిత్తులు (సిస్ట్‌లు), స్కార్ టిష్యూను తొలగించడం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో, యోని ముందు భాగాన్ని సాధారణ స్థితికి, అంటే పెద్దగా చేస్తారు.
ఎఫ్‌జీఎమ్‌కు విరుగుడుగా శస్త్రచికిత్స చేసుకోవాలనుకున్న తన సంకల్పం కారణంగా గత ఏడాది బీబీసీ 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న శంసా, తన జర్మనీ ప్రయాణాన్ని, తాను ఎలా కోలుకున్నారో ఆ వివరాలను పంచుకోవాలని, తద్వారా తనలాంటి ఇతర మహిళలు ఇలాంటి అవకాశాల గురించి తెలుసుకునేందుకు వీలవుతుందని భావించారు.
రెండో వివాహం సైతం విఫలం కావడంతో శంసా ఇప్పుడు తన 10 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా ఉంటున్నారు. అయినా సరే ఆమె సోమాలి సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.
జర్మనీలో శస్త్రచికిత్స కోసం నిధులను సేకరించాలని నిర్ణయించుకున్న శంసా, ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా, దాదాపు 27 లక్షల రూపాయలను సేకరించి, డిసెంబర్‌లో సర్జరీ చేయించుకున్నారు. దీనికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది.
మూడు వారాల పాటు జర్మనీలో ఉండి, తిరిగి వచ్చాక, టీచింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆమె, కోలుకోవడానికి కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది.
ఆమె ఆసుపత్రికి ఇంకా సుమారు 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
4రకాల ఎఫ్‌జీఎమ్‌లు
తీవ్రతను బట్టి నాలుగు రకాల ఎఫ్‌జీఎంలు ఉన్నాయి:
1. క్లైటోరిడెక్టమీ: సున్నితమైన క్లిటోరిస్ పాక్షికంగా లేదా మొత్తం తొలగింపు
2. ఎక్సిషన్: క్లిటోరిస్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడంతోపాటు యోని చుట్టూ ఉన్న లోపలి చర్మపు మడతల (లాబియా మినోరా) తొలగింపు
3. ఇన్ఫిబ్యులేషన్: యోని చుట్టూ ఉన్న బాహ్య చర్మం మడతలను కత్తిరించి, రీపొజిషనింగ్ చేయడం (లేబియా మినోరా, లాబియా మజోరా). తరచుగా చిన్న ఖాళీని మాత్రం వదిలి గ్యాప్‌ను కుట్టేస్తారు.
4. క్లిటోరిస్ లేదా జననేంద్రియ ప్రాంతాన్ని కుట్టేయడం, కుట్లు వేయడం, కోత పెట్టడం, కాటరైజ్ చేయడం వంటి ఇతర హానికరమైన విధానాలు దీని కిందికి వస్తాయి.
గత రెండు దశాబ్దాలలో, ఎఫ్‌జీఎంని సరిచేసే వైద్య పద్ధతులు డెవలప్ అయ్యాయి.
2004లో ఫ్రెంచ్ సర్జన్ డాక్టర్ పియర్ ఫోల్డెస్ దీనిని ప్రారంభించారు.
క్లైటోరల్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్‌లలో పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది.
అయితే, ఎఫ్‌జీఎం చేయించుకున్న బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్న ఆఫ్రికా విషయానికి వస్తే కెన్యా, ఈజిప్టులలో మాత్రమే శస్త్రచికిత్స సదుపాయాలు ఉన్నాయి.

సంక్లిష్టమైన చికిత్స
"ప్రతి సర్జన్ ఈ శస్త్రచికిత్స చేయలేరు. ఇది సంక్లిష్టమైనది, ప్రతి రోగి భిన్నంగా ఉంటారు.” అని కెన్యాకు చెందిన డాక్టర్ అదాన్ అబ్దుల్లాహి చెప్పారు.
కానీ ఎఫ్‌జీఎం బాధితులైన ప్రతి స్త్రీ దీని వల్ల ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు. సెక్స్ సమయంలో నొప్పి వంటి ఇతర సమస్యలను తగ్గించడం లేదా పూర్తిగా లేకుండా చేయవచ్చని ఆయన చెప్పారు.
శస్త్రచికిత్స అనంతరం తాను సంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తోందని బిల్కిసు తెలిపారు. ‘‘ఆపరేషన్ చేయించుకోవడం నిజంగా ఒక శక్తిమంతమైన నిర్ణయం. అది మనం ఎదురు తిరిగి పోరాడే మార్గం." అన్నారామె.
కానీ దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఎవరికి వారు కాస్త రీసర్చ్ చేయాలని ఆమె సూచించారు.
"ఇది కేవలం క్లిటోరిస్‌ను పునర్నిర్మించడం మాత్రమే కాదు. ఎఫ్‌జీఎం జరిగిన చాలామంది స్త్రీలలో మందంగా ఉండే స్కార్ టిష్యూలు ఉంటాయి. అందువల్ల యోని భాగం మరింత సాగేలా చేయడానికి ఏం చేయాలన్న దానిపై మీరు మీ వైద్యునితో చర్చించాలి." అన్నారామె.
తన శరీరంపై తనకు నియంత్రణ ఉండాలని, ఏదో ఒకరోజు ‘సాధారణ లైంగిక అనుభవం’ పొందాలని అనుకున్న బిల్కిసు, గత మూడేళ్లలో మూడు ఆపరేషన్లు చేయించుకున్నారు.
ఆపరేషన్ అవసరం లేకుండానే..
ఈజిప్టులోని డాక్టర్ రెహామ్ అవ్వద్ వంటి కొందరు వైద్యులు ఆపరేషన్ అవసరం లేని విధానాలలో దీనికి చికిత్స చేస్తున్నారు.
రిస్టోరో క్లినిక్ సహవ్యవస్థాపకురాలైన డాక్టర్ రెహామ్, క్లిటోరిస్ రీకన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ ఉపశమనాన్ని కలిగించినా, దీనిలో కోత ఎంత తీవ్రంగా ఉంటుందని, అత్యంత అధునాతన శస్త్రచికిత్సా పద్ధతులు కూడా లైంగిక పనితీరును పునరుద్ధరించలేవని అన్నారు.
"అందరికీ శస్త్రచికిత్సే సమాధానం అని నేను అనుకోను" అని ఆమె బీబీసీతో అన్నారు.
2020లో ప్రారంభమైన ఆమె క్లినిక్‌లో దాదాపు సగం కేసులలో ఇప్పుడు కణజాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించే ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ల వంటి ఆపరేషన్ అవసరం లేని మార్గాలను ఉపయోగిస్తున్నారు.

‘నా శరీరం నాది కాదు అనిపించింది’
"మొదటిసారి నేను నా క్లిటోరిస్‌ను చూసుకున్నప్పుడు అవాక్కయ్యాను. అది నాకు సంబంధించినది కాదు అనిపించింది." అని బిల్కిసు చెప్పారు.
అయితే దీనికి కొంచెం అలవాటు పడాలని, సరైన పీరియడ్స్ బ్లీడ్స్ వంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలని శంసా అంగీకరించారు.
శంసా పూర్తిగా కోలుకోవడానికి మరో ఆరు నెలలు పడుతుంది.
చెకప్ కోసం జర్మనీకి తిరిగి వెళ్ళే స్థోమత ఆమెకు లేదు. దీంతో ఆమె ఆందోళన చెందుతున్నారు.
"ఒక సంపూర్ణ మహిళను అనిపిస్తోంది. నేనిప్పుడు సంతోషంగా ఉన్న స్త్రీని." అని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు కొంతమంది సోమాలీల నుంచి వ్యతిరేకత ఎదురైనా, తన కుటుంబంలోని కొందరు అండగా నిలబడడం ఆమెకు ఊరట కలిగించే విషయం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














