ఉత్తరప్రదేశ్: ముస్లిం జంటపై మూకదాడి, హత్య... అసలేం జరిగింది?

ముస్లిం జంటపై దాడి

ఫొటో సోర్స్, NEERAJ SHRIVASTAV

ఫొటో క్యాప్షన్, అబ్బాస్, కమరుల్నిసా
    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌ సీతాపుర్ జిల్లాలోని రాజేపుర్ గ్రామంలో ఒక ముస్లిం జంట శుక్రవారం మూకదాడిలో హత్యకు గురైంది.

రెండు కుటుంబాల మధ్య ఘర్షణే అబ్బాస్, కమరుల్నిసాల హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి వయసు 50కిపైనే ఉంటుంది.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్బాస్, కమరుల్నిసాల కుమార్తె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి పొరుగున ఉండే శైలేంద్ర జైస్వాల్ కుటుంబం తన తల్లిదండ్రులను ఇనుప రాడ్డులు, కర్రలతో కొట్టి హత్యచేసినట్లు ఆమె చెప్పారు.

ముస్లింలపై మూకదాడి

ఫొటో సోర్స్, NEERAJ SHRIVASTAV

ఫొటో క్యాప్షన్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఏమిటో సీతాపుర్ ఎస్పీ చక్రేశ్ మిశ్ర మీడియాతో మాట్లాడారు.

మైనర్ కుమార్తె ఫిర్యాదు

తల్లిదండ్రులపై మూక దాడి జరగడంతో ఇద్దరు చెల్లెళ్లను పట్టుకొని మైనార్టీ తీరని పెద్ద కూతురు ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు.

ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తీవ్రంగా ఏడుస్తూ ఆమె కనిపించారు.

‘‘ఇంట్లో ఫ్యాన్ పాడైంది. దాన్ని మరమ్మతుకు ఇచ్చేందుకు అమ్మానాన్న హరగావ్‌ వెళ్లారు. అప్పుడే తిరిగివచ్చి ఇంటి బయట కూర్చున్న వారిపై దాడి చేశారు’’ అని ఆమె చెప్పారు.

‘‘కాలియా (శైలేంద్ర జైస్వాల్), రామ్‌పాల్, పల్లూ.. మా అమ్మానాన్నలపై దాడి చేశారు’’ అని ఆమె వివరించారు.

‘‘మాకు పాత గొడవలు ఉన్నాయి. శుక్రవారం మొదట వారు మాతో గొడవపడ్డారు. ఆ గొడవ పెద్దది కావడంతో పార, ఇనుపరాడ్లు, కర్రలతో మా అమ్మనాన్నలను కొట్టారు. మాపై కూడా దాడి చేయడానికి వచ్చారు. మేం వెంటనే పరుగు తీశాం’’ అని ఆమె చెప్పారు.

అబ్బాస్

ఫొటో సోర్స్, NEERAJ SHRIVASTAV

కేసు నమోదు..

అబ్బాస్ కుమార్తె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ‘‘రామ్‌పాల్ జైస్వాల్, అతడి కొడుకు శైలేంద్ర, రామ్‌పాల్ భార్య రమాపతి, రామ్‌పాల్ అల్లుడు పల్లూ, అమర్‌నాథ్‌లు సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో పార, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. పాత గొడవలే దీనికి కారణం’’ అని పేర్కొన్నారు.

‘‘దాడి జరుగుతున్నప్పుడే ఎవరైనా వచ్చి అడ్డుకోవాలని అబ్బాస్ కుమార్తె చాలా మందిని కోరారు. కానీ, ఎవరూ కాపాడేందుకు రాలేదు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెల్లెళ్లతోపాటు ఆమె అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటన స్థలంలో అబ్బాస్, కమరుల్నిసాల మృతదేహాలు లభ్యమయ్యాయి’’ అని ఎఫ్ఐఆర్‌లో వివరించారు.

కమరుల్నిసా

ఫొటో సోర్స్, NEERAJ SHRIVASTAV

గొడవ ఏమిటి?

అసలు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఏమిటో సీతాపుర్ ఎస్పీ చక్రేశ్ మిశ్ర మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా కాలం నుంచీ ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఉంది. ఇప్పుడు మరణించిన ఈ జంట కుమారుడు షౌకత్ ప్రధాన నిందితుడి కుమార్తెతో పరారయ్యాడు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఆ అబ్బాయిని జైలులో పెట్టారు’’ అని చెప్పారు.

‘‘మూడు రోజుల క్రితమే ఆ అబ్బాయి జైలు నుంచి వచ్చాడు. దీంతో మళ్లీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది’’ అని ఆయన వివరించారు.

ప్రస్తుతం అబ్బాస్, కమరుల్నిసాల హత్యలో నిందితులైన ఐదుగురిలో ప్రధాన నిందితుడైన శైలేంద్ర జైస్వాల్‌తోపాటు అమర్‌నాథ్, పల్లూలను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ చక్రేశ్ మిశ్రా చెప్పారు.

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

షౌకత్ ఏం చేశాడు?

ఈ కేసుపై మరిన్ని వివరాలను సీతాపుర్ అడిషనల్ ఎస్పీ నరేంద్ర ప్రతాప్ మీడియాకు వెల్లడించారు. ‘‘అబ్బాస్ కుమారుడైన షౌకత్ జైస్వాల్ ప్రధాన నిందితుడి కుమార్తెతో పరారయ్యాడు. ఆమె ఒక మైనర్. దీంతో షౌకత్‌పై కేసు నమోదు చేశారు. జైలుకు కూడా తరలించారు. ఆ అమ్మాయి మైనారిటీ తీరిన తరువాత వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె ఈ మధ్యనే పుట్టింటికి వచ్చింది. తాజాగా ఆమె మళ్లీ షౌకత్‌తో వెళ్లిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మరింత పెరిగింది’’ అని చెప్పారు.

‘‘రెండోసారి ఆమె వెళ్లిపోయినప్పుడు, ఆమె కుటుంబ సభ్యులు షౌకత్ ఇంటికి వెళ్లారు. ఒకరితో మరొకరు వాగ్వాదానికి దిగారు. అది పెద్దదై కొట్లాట జరిగింది. ఈ దాడిలో అబ్బాస్, అతడి భార్య మరణించారు’’ అని వివరించారు.

‘‘ఇది పూర్తిగా రెండు కుటుంబాల మధ్య గొడవ. దీన్ని రెండు వర్గాల గొడవగా చెప్పకూడదు’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం గ్రామంలో శాంతి, భద్రతలు అదుపులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఘటనా స్థలం పరిసరాల్లో పెద్దయెత్తున పోలీసులను మోహరించాం’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, గతేడాది జరిగిన దారుణాలను మళ్లీ జరగనివ్వబోమంటున్న స్థానికులు

పోలీసుల భద్రతలో షౌకత్

తన తల్లిదండ్రులను మూకదాడిలో హత్య చేశారని షౌకత్‌కు తెలియడంతో జైస్వాల్ కుమార్తెతోపాటు ఆయన పొరుగునున్న లఖింపుర్‌ఖీరీ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వీరిద్దరూ అబ్బాస్, కమరుల్నిసాల అంత్యక్రియలకు హాజరయ్యారు.

ప్రస్తుతం వీరు పోలీసుల రక్షణలో ఉన్నారు.

ఈ ఘటనకు ముందుగా తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, హత్యాయత్నం చేశారని పోలీసులకు జైస్వాల్ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

‘‘ప్రస్తుతం ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మా అదుపులోనే ఉన్నారు. వారికి భద్రత కల్పిస్తున్నాం’’ అని నరేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)