ఆంధ్రప్రదేశ్: నంద్యాల అమ్మాయి దౌలత్, పాకిస్తానీ అబ్బాయి గుల్జార్... రాంగ్ కాల్‌తో మొదలైన లవ్ స్టోరీ

గుల్జార్-దౌలత్ ప్రేమకథ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుల్జార్-దౌలత్ ప్రేమకథ
    • రచయిత, నియాజ్ ఫరూకీ
    • హోదా, బీబీసీ ఉర్దూ

గుల్జార్, దౌలత్‌ల ప్రేమ కథ బాలీవుడ్‌ సినిమా కంటే తక్కువేం కాదు. ఒక్క రాంగ్ కాల్ వీరిద్దర్ని కలిపింది.

సీమా హైదర్-సచిన్ మీనా, అంజూ-నస్రుల్లాల ప్రేమకథలు ఇటు భారత్‌లోనూ, అటు పాకిస్తాన్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో సరిహద్దులు దాటిన మరో లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రేమ కథలోని ఒకరు పాకిస్తాన్‌కు చెందిన గుల్జార్ ఖాన్ కాగా, మహిళ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన దౌలత్ బీ.

ఈ ఇద్దరు ప్రస్తుతం నంద్యాలలోని గడివేముల గ్రామంలో తమ ఐదుగురి పిల్లతో సంతోషంగా తమ వివాహ జీవితాన్ని గడుపుతున్నారు.

2011లో గుల్జార్ ఖాన్ భారత్‌కు వచ్చారు. కానీ, ఎనిమిదేళ్ల తర్వాత పౌరసత్వం విషయంలో రెండుసార్లు జైలు పాలయ్యారు.

గత నెలలోనే తెలంగాణ హైకోర్టు గుల్జార్ తరలింపు విషయంలో పెండింగ్‌లో ఉన్న నిర్ణయాన్ని ప్రకటించే వరకు, ఆయన్ని విడుదల చేయాలని చెప్పింది.

‘ఫోన్‌లో మాట్లాడినప్పుడు గుల్జార్ మంచి వ్యక్తిలాగా అనిపించాడు’

గుల్జార్ ఖాన్, దౌలత్ బీ ప్రేమ కథ 2009లో ప్రారంభమైంది.

పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన సియాల్కోట్‌ నగరానికి చెందిన వ్యక్తి గుల్జార్ ఖాన్. సౌదీ అరేబియాలో పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ ఉండేవారు.

అంతకు కొన్ని నెలల క్రితం సెలవులపై భారత్‌కు వెళ్లిన తన స్నేహితునికి ఫోన్ చేసేందుకు గుల్జార్ ప్రయత్నించారు.

గుల్జార్‌కి ఆయన స్నేహితుని నెంబర్ కలవలేదు. తప్పుగా నెంబర్‌ను రాసుకున్నానేమోనని భావించి, అలాంటి నెంబర్లకే కాల్ చేయడం ప్రారంభించారు.

ఈ సమయంలోనే, స్థానిక పాఠశాలలో పనిచేసే దౌలత్ బీ నెంబర్‌కి గుల్జార్‌ కాల్ వెళ్లింది. దౌలత్ బీకి ఫోన్ చేసిన గుల్జార్, తన పేరు గుల్జార్ ఖాన్ అని, తన స్నేహితుని కోసం కాల్ చేసినట్లు చెప్పారు.

తాను పంజాబ్‌కి చెందిన వ్యక్తినని గుల్జార్ పరిచయం చేసుకున్నారు.

అలా వారిద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్త ప్రేమగా చిగురించింది.

మూడేళ్ల పాటు ఫోన్‌లోనే సంభాషణలు కొనసాగించిన తర్వాత, ఒక రోజు గుల్జార్‌, దౌలత్ బీని పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

కానీ, ఆ మాట విని దౌలత్ బీ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

‘‘ఎందుకంటే, భర్త ఉన్నాడని, నలుగురు పిల్లలున్నారని చెబుతూ వచ్చాను. కానీ, భర్తతో, పిల్లలతో ఆయన మాట్లాడతానని చెప్పారు’’ అని దౌలత్ చెప్పారు.

కానీ, అసలు విషయం ఏంటంటే, దౌలత్ బీ భర్త కొంత కాలం క్రితమే చనిపోయారు. ఈ విషయాన్ని దౌలత్ బీ, గుల్జార్‌కి చెప్పలేదు.

గుల్జార్‌తో మాట్లాడేటప్పుడు, తన మంచి వ్యక్తిలాగా అనిపించారని దౌలత్ చెప్పారు.

మాట్లాడుతున్నా కొద్ది ఆయనలో మంచి సాంగత్యాన్ని చూశానన్నారు.

‘‘నన్ను సమాజం అవహేళన చేస్తుందని నేను గుల్జార్‌కి చెప్పాను. దీని బదులు నేను చనిపోవడం మంచిది అని చెప్పాను. నాకోసం చనిపోకు. నేనెలాగో అక్కడికి వస్తాను అని గుల్జార్ చెప్పారు’’ అని దౌలత్ బీ తెలిపారు.

గుల్జార్ చేసింది చట్టవ్యతిరేకమే. అది ఆయన అర్థం చేసుకున్నారు. దాన్ని ఆయన అంగీకరించారు కూడా.

దౌలత్ కుటుంబం

గుల్జార్ భారత్‌కు ఎలా వచ్చారు?

‘‘తెలిసిన ఒక భారతీయ వ్యక్తి గుర్తింపు కార్డును తీసుకున్నాను. ఆ కార్డును తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కి వెళ్లాను. నేను భారతీయ పౌరుడిని. ఇది నా కార్డు. నేను పాస్ పోర్టు పోగొట్టుకున్నాను. నేను భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను’’ అని చెప్పినట్లు గుల్జార్ తెలిపారు.

ఆ సమయంలో సౌదీ పోలీసులు అతన్ని కొన్ని రోజుల పాటు జైలులో పెట్టారు. 12 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.

ఆ తర్వాత గుల్జార్‌కి ప్రొవిజనల్ పాస్‌పోర్టును జారీ చేసిన సౌదీ అరేబియాలోని భారత రాయబారి కార్యాలయం, 160 మంది వ్యక్తులతో పాటు అతన్ని కూడా ముంబైకి పంపింది.

అంతకుముందు కూడా ఆయన భారత్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపారు. విజిటింగ్ వీసాపై కొంతమంది భారతీయులు పాకిస్తాన్ రావడం గుల్జార్ చూశారు.

ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్ల సాయంతో, గుల్జార్ భారత్‌కు వచ్చినట్లు భారతీయ పోలీసులు తెలిపారు.

కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, గుల్జార్ వాడిన ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లు ఇక్బాల్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ అదిల్‌‌వి అని ప్రభుత్వం తెలిపింది.

వీటిని నిజమైన డాక్యుమెంట్లలాగా వాడి, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తీసుకుని 2011 జనవరి 10న భారత్‌కు వచ్చారని తెలిపింది.

అయితే, ఈ ఆరోపణలను గుల్జార్ ఖండించలేదు. తన తప్పును గుల్జార్ ఒప్పుకున్నారు.

దౌలత్ బీ, గుల్జార్ ఖాన్

‘నేను భారతీయుడిగానే ఆలోచించడం ప్రారంభించాను’

ముంబై విమానశ్రయంలో దిగిన తర్వాత, గుల్జార్ హైదరబాద్‌కి రైలులో వచ్చారు. దౌలత్ బీ నంద్యాల జిల్లా హైదరాబాద్‌కు దగ్గర్లో ఉంటోంది.

‘‘నా వద్ద 150 రియాల్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని నేను ముంబై విమానశ్రయంలో భారత కరెన్సీలాగా మార్చుకున్నాను. దౌలత్ బీ ఇంటికి చేరుకున్నప్పుడు, నా దగ్గర కేవలం రూ.500 మాత్రమే ఉన్నాయి’’ అని గుల్జార్ చెప్పారు.

భారత్‌కు వచ్చిన రెండు వారాలకు దౌలత్ బీని గుల్జార్ పెళ్లి చేసుకున్నారు.

అయితే, దౌలత్ బీ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుల్జార్‌ని పోలీసులు విచారించారు.

కానీ, ఆ తర్వాత ఆయనపై ఎలాంటి కేసులు రిజిస్టర్ కాకపోవడంతో గుల్జార్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

దౌలత్ బీకి గుల్జార్ ఒక దేవదూతగా అనిపించారు.

ఎందుకంటే అప్పటికే అమ్మనాన్న, భర్త, పెద్ద అన్న ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మానసిక అనారోగ్యంతో ఉన్న తమ్ముడు కూడా కనిపించకపోయాడు.

గుల్జార్‌లో తాను ఆదర్శవంతమైన భర్తను చూసినట్లు దౌలత్ బీ చెప్పారు.

ఆయన ప్రవర్తన, తన మొదటి భర్త పిల్లల్ని తన సొంత పిల్లల లాగా చూసుకునే విధానం తనకు నచ్చినట్లు తెలిపారు.

ఇక్కడ ఉంటూ గుల్జార్ కాస్త తెలుగును నేర్చుకున్నారు. ఇక్కడే పెయింటర్‌లాగా పనిచేస్తున్నారు.

తనకు తాను భారతీయుడిగా భావించడం ప్రారంభించారు గుల్జార్.

తెలంగాణ హైకోర్టు

ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబంతో తన అన్న టచ్‌లో లేరని రావల్పిండిలోని గుల్జార్ పెద్ద అక్క షీలా లాల్ బీబీసీకి చెప్పారు.

తన సోదరుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో కూడా తెలియదన్నారు.

గుల్జార్ ఇంకా సౌదీ అరేబియాలోనే ఉన్నాడని భావిస్తున్నామని షీలా లాల్ అన్నారు. అందుకే అక్కడే వెతుకుతున్నామన్నారు.

తమ సోదరుల్లో ఒకర్ని సౌదీ అరేబియాకు పంపించి వెతికించామని, కానీ గుల్జార్ దొరకకపోవడంతో వెనుతిరిగినట్లు తెలిపారు.

కానీ, ఒకరోజు అకస్మాత్తుగా గుల్జార్ పాకిస్తాన్‌లోని తన అమ్మకి, కుటుంబానికి ఫోన్ చేశారు. ‘‘నేను భారత్‌కు వచ్చాను’’ అని చెప్పారు.

తను మాత్రమే కాకుండా, తన భార్య, పిల్లలతో కూడా ఫోన్‌లో మాట్లాడించారు.

తన కొత్త ఫ్యామిలీతో పాకిస్తాన్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.

2019లో పాకిస్తాన్‌కి వెళ్లాలనే ఉద్దేశ్యతో తన భార్య, పిల్లలతో కలిసి గుల్జార్ దిల్లీ బయలుదేరారు.

కానీ అప్పటికే రైల్వే స్టేషన్‌లో తన కోసం తెలంగాణ పోలీసులు వేచిచూస్తున్నారన్న విషయం గుల్జార్‌కి తెలియదు.

వారు రైల్వే స్టేషన్‌కి వచ్చిన వెంటనే, గుల్జార్‌ని అరెస్ట్ చేశారు.

ఈ కేసును విచారించిన పోలీసులు మాట్లాడేందుకు నిరాకరించినట్లు వెబ్‌సైట్ ‘ది వీక్’ ప్రచురించింది.

కస్టడీలో ఉన్న గుల్జార్‌ని ఆయన దేశంపై పలు ప్రశ్నలు వేశారు. తాను పాకిస్తానీ పౌరుడినేని గుల్జార్ ఒప్పుకున్నారు.

‘‘నేను ప్రతీది వారికి నిజాయితీగా సమాధానం చెప్పాను. వారు నమ్మలేదు. ఒకవేళ నేనేదైనా తప్పుచేస్తే, నేను ఇక్కడి నుంచి పారిపోయే వాడిని కదా. నాకు నేనుగా వచ్చి మీ ముందే నిల్చున్నాను’’ అని తెలిపానని గుల్జార్ చెప్పారు.

భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద, ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు నకిలీ పొందారన్న విషయంలో విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద గుల్జార్‌పై కేసు నమోదు చేశారు.

‘‘నాకెలాంటి కోపం, పగ లేదు. నేను తప్పు చేశాను. దానికి నేను శిక్ష అనుభవించాను’’ అని గుల్జార్ అన్నారు.

తన భర్త పాకిస్తాన్‌కి చెందిన వాడని దౌలత్ బీకి పోలీసులు చెప్పారు.

‘‘నువ్వు పంజాబ్‌కు చెందినవాడివి కావా అని ఆయనతో నేను గొడవపడ్డాను. అప్పుడు పోలీసులు పాకిస్తాన్‌లో కూడా ఒక పంజాబ్ ఉందని చెప్పారు. ఆయన అక్కడి వారని తెలిపారు’’ అని దౌలత్ బీ చెప్పారు.

ప్రేమ(ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

గుల్జార్ పాకిస్తాన్ పంజాబ్‌లోని సియాల్కోట్ జిల్లాకు చెందిన కోలువాల్‌ గ్రామానికి చెందిన క్రిస్టియన్ చెందిన వ్యక్తి.

ఆయన ముస్లిం కాదని అప్పుడు దౌలత్ బీకి తెలిసింది.

తన ఇంటి పేరు ఖాన్ ఉండేసరికి, తాను ముస్లిం అని అనుకున్నట్లు దౌలత్ అన్నారు.

తన అసలు పేరు గుల్జార్ మసీహ్ అన్న నిజాన్ని గుల్జార్ దాచిపెట్టారు.

భారత్‌లో గుల్జార్‌పై కేసు నమోదైన తర్వాత తాము పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించామని, ఈ విషయాన్ని విచారిస్తామని ప్రభుత్వం తెలిపిందని షీలా, బీబీసీకి తెలిపారు.

విచారణ కోసం పోలీసులు ఆయన ఇంటికి కూడా వెళ్లారు.

దౌలత్ బీ కూడా తిరిగి ఇంటికొచ్చి, ఆయన్ని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు గ్రామస్తుల నుంచి రూ.1.5 లక్షలు సేకరించారు.

ఆ తర్వాత గుల్జార్‌కి బెయిల్ వచ్చింది. కానీ, 2022 ఫిబ్రవరిలో మళ్లీ అరెస్ట్ అయ్యారు. మళ్లీ దౌలత్ ఆయన బెయిల్ కోసం రూ.80 వేలు కట్టారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత గుల్జార్ తనని మళ్లీ అరెస్ట్‌ చేయడంపై హైకోర్ట్‌లో సవాలు చేశారు.

ఒకవేళ ఇప్పుడు తనని పాకిస్తాన్ పంపాలనుకుంటే, తనతో పాటు భార్య, పిల్లల్ని కూడా తీసుకెళ్లేందుకు అనుమతించాలని గుల్జార్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)