మళ్లీ పెళ్లి రివ్యూ: భార్య వల్ల మనశ్శాంతి లేని భర్త... భర్త వల్ల సుఖం లేని భార్య... వీరి కథ ఆకట్టుకుందా?
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
ఒక్కడు, వర్షం లాంటి సూపర్ హిట్లు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు, ''మళ్లీ పెళ్లి'' చిత్రానికి దర్శకుడు కావడం వల్ల ఆ సినిమాను చూడాలన్న కుతూహలాన్ని పెంచాయి.
ఇటీవల చనిపోయిన సీనియర్ నటుడు శరత్ బాబు నటించిన చివరి చిత్రం ఇది.
ప్రముఖ విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌ను ఈ సినిమాతో నరేష్, రీలాంచ్ చేశారు.
ఇద్దరు నటుల కథ
నరేంద్ర (నరేష్) ఓ బిజీ యాక్టర్. బోలెడంత డబ్బు ఉంటుంది. క్రేజ్, పాపులారిటీ ఉంటాయి. లేనిదల్లా... మనశ్శాంతి.
భార్య సౌమ్య వల్ల వైవాహిక జీవితం కుదుపుల మయం అవుతుంది. పైకి నవ్వుతున్నా.. లోలోపల ఎన్నో బాధలు మోస్తుంటాడు. తొలిసారి సెట్లో పార్వతి (పవిత్ర లోకేష్)ని చూడగానే ఓ స్వాంతన కలుగుతుంది. తనకు సోల్ మేట్ దొరికినట్టు అనిపిస్తుంది.
పార్వతి ఓ నటి. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలుంటారు. తాను కూడా నరేంద్ర కంపెనీని ఇష్టపడుతుంది. పార్వతి వైవాహిక జీవితం సంతోషంగా ఉందని గ్రహించిన నరేంద్ర.. ఆమెని ఏ రూపంలోనూ డిస్ట్రబ్ చేయకూడదనుకొంటాడు. పార్వతి కూడా నరేంద్రతో బంధం.. స్నేహం వరకే పరిమితం చేయాలనుకొంటుంది.
కానీ... వీరిద్దరి జీవితంలో కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఓరోజు.. పార్వతి నుంచి నరేంద్రకు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఏముంది? పార్వతి గురించి నరేంద్రకు తెలిసిన నిజాలేంటి? సౌమ్య వల్ల.. నరేంద్ర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, Twitter/H.E Dr Naresh VK actor
అద్దాల మేడలు...
``సెలబ్రెటీల జీవితాలు అద్దాల మేడలు. బయట నుంచి చూడ్డానికి బాగానే ఉంటాయి. కానీ ఓ చిన్న రాయి వేస్తే చాలు భళ్లుమంటాయి.`` అప్పుడెప్పుడో వచ్చిన దాసరి సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్ ఇది. సినీ తారల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం తమ హక్కు అని కొంతమంది భావిస్తుంటారు. ఈ సినిమాలో చూపించిన `టవర్ ఛానల్` అందుకు ఓ ఉదాహరణ. వాళ్లకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందనేది చూపించారు.
నరేంద్ర ఓ స్టార్ కావొచ్చు. కానీ తనకంటూ ఓ కుటుంబం, ఇష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. తనకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిందే. పార్వతి కథ కూడా అంతే!
ఈ ఇద్దరినీ రెండు పాత్రలుగానే చూస్తే.. వారిద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో ఏం కోల్పోయారో, ఒకరిపై ఒకరు ఎందుకు ఆసక్తి చూపించాల్సివచ్చిందో... `మళ్లీ పెళ్లి` కథ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు దర్శకుడు.
కథనంలో ఆసక్తిని రేకెత్తించడానికి ఈ కథని.. కొన్ని చాప్టర్లుగా విడగొట్టారు. వీరిద్దరి జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాల్ని ఒక్కో చాప్టర్‌లో చూపించుకొంటూ వచ్చారు.

ఫొటో సోర్స్, Twitter/H.E Dr Naresh VK actor
ఆ పరిపక్వత ఏది?
యుక్త వయసు ప్రేమలు ఒకలా ఉంటాయి. ఆ వయసులో ప్రేమంటే ఏంటో తెలీదు. ఆకర్షణే ప్రేమ అనుకొంటారు. ఆ వయసుని బట్టి ప్రేమలో పరిపక్వత కనిపిస్తుంటుంది. అరవై ఏళ్ల ప్రేమ కథలు.. మరోలా మొదలవుతాయి. నిజానికి ఆ వయసులో ప్రేమని చూసే కోణం వేరుగా ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి ప్రేమ చూపించడానికి ఆస్కారం ఉంది. కానీ దర్శకుడు దాన్ని వాడుకోలేదనిపిస్తుంది.
పార్వతిని తొలిసారి చూడగానే నరేంద్ర ప్రేమించేస్తాడు. వెంటనే... ఇంటర్నెట్‌లో పార్వతి ఫొటోలన్నీ తిరగేస్తూ.. ఓ రకమైన ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. నరేంద్రని చూస్తే.. పదహారేళ్ల పిల్లాడిలా కనిపిస్తాడు. ఆ వయసుకి తగ్గట్టుగా ఆ సన్నివేశాన్ని రాసుకొంటే బాగుండేది. కానీ.. దర్శకుడు నరేంద్ర-పార్వతీల మధ్య యూత్ ఫుల్ లవ్ స్టోరీని నడిపించాలనుకొన్నాడు.
వయసుకి తగ్గ పాత్రలేనా?
జయసుధ-నరేష్ ఈ చిత్రంలో తల్లీ కొడుకులుగా నటించారు. సినిమా పరంగా.. ఎవరు ఎలాంటి పాత్ర అయినా పోషించొచ్చు. తప్పు లేదు. కానీ వీరిద్దరి వయసు ఇంచుమించు సమానం. తెరపై కూడా వయసు దాచుకొనే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. అలాంటప్పుడు నరేష్, జయసుధని `మమ్మీ` అని పిలిస్తే... ఆయా పాత్రలకు కనెక్ట్ అవ్వడం ప్రేక్షకుడికి ఎంత మాత్రం సౌకర్యవంతంగా ఉండదు.
పాత్రధారుల ఎంపికలో ఇలాంటి చిన్నచిన్న లోటుపాట్లు.. పెద్ద పెద్ద ప్రతికూలతలను తీసుకొస్తాయి. ఓ భార్య వల్ల మనశ్శాంతి దూరమైన భర్త, తన భర్త వల్ల ఎలాంటి సుఖం పొందలేని భార్య... కథలే ఈ సినిమా. ఈ రెండు పాత్రల్ని తెరపై చూస్తే సానుభూతి కలగాలి. `అయ్యో.. వీళ్లకు ఇలా జరిగిందేమిటి?` అనిపించాలి.
కానీ ఆ సానుభూతి ఏమాత్రం ప్లే అవ్వలేదు.
నరేష్-పవిత్రల గురించి మీడియాలో వచ్చిన కథలకు, కథనాలకు తమ వర్షెన్ చూపించాలన్న ప్రయత్నం ఈ సినిమాలో కనిపించింది.

ఫొటో సోర్స్, Twitter/VijayaKrishna Movies
ఒదిగిపోయే నటుడు
నరేష్‌లోని నటుడి గురించి ఈరోజు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు. నరేంద్ర పాత్రనీ అంతే ఈజ్‌తో చేశారు. అరవై ఏళ్లలో ప్రేమలో పడేటప్పుడు ఉండే చిలిపిదనం, భయం, బిడియం... ఆ పాత్రలో కనిపించాయి.
పవిత్ర లోకేష్ పాత్రలోని సంఘర్షణని బాగా చూపించారు. తన భర్త తనని ఏ కోణంలో చూస్తున్నాడన్న నిజం తెలుసుకోగానే పవిత్ర పలికించిన హావభావాలు ఆమెలోని నటిని ఆవిష్కరిస్తాయి. సౌమ్య పాత్ర ఈ కథలో మరింత కీలకం. ఆ పాత్రలో శాడిజం, విలనిజం రెండూ ఉన్నాయి. ఆ రెండూ ఈ నటి చూపులతోనే ప్రదర్శించగలిగారు. కృష్ణను పోలిన పాత్రలో శరత్ బాబు కనిపించారు. ఆయన పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పారు. అదే లోటు.

ఫొటో సోర్స్, Twitter/VijayaKrishna Movies
జరగని కసరత్తు...
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. ఎం.ఎస్.రాజు. కథ విషయంలో ఆయన పెద్దగా కసరత్తులేం చేసినట్లుగా కనిపించలేదు. స్క్రీన్ ప్లేలో వెరైటీ కోసం చాప్టర్లుగా డివైడ్ చేసుకొన్నారు కానీ, ఆ అవసరం లేదు. ఏ చాప్టర్ లో ఏం జరిగిందన్న విషయం సినిమా చూశాక ప్రేక్షకుడికి గుర్తుకే రాదు. కొన్ని చాప్టర్లు బోరింగ్‌గా సాగాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.
సోల్ మేట్ దొరికారన్న భరోసా కలిగితే.. వారిద్దరూ కలిసి బతకడానికి పెళ్లే అవసరం లేదు, ఏ సంప్రదాయం వాళ్లని అడ్డుకోదు.. అనే పాయింట్‌ను ఈ సినిమాతో బలంగా చెప్పడానికి ప్రయత్నించారు.
(నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్-కే- చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటి- - BBC News తెలుగు
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదాలు... నిలువునా చీలిన ప్రతిపక్షాలు - BBC News తెలుగు
- ఆంధ్రప్రదేశ్- ఆత్రేయపురంలో నోరూరించే మామిడి తాండ్రను ఎలా చేస్తారో చూడండి..-
- మహిళా రెజ్లర్లు- '#MeToo' నిరసనతో ఒలింపిక్ కలలు చెదిరిపోతాయా-
- సెంగోల్- పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









