శరత్‌బాబు: ఓ విజయవంతమైన నటుడి ఫెయిల్యూర్ స్టోరీ

ఫొటో సోర్స్, Diamond Babu/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
'నటుడన్నవాడు నీరులా ఉండాలి' అంటారు. ఏ పాత్రలో పోస్తే ఆ రూపం ధరించగలగాలని దానర్థం. ఈ సూత్రం అందరికీ తెలుసు. కానీ, కొంతమందే ఒంట బట్టించుకొంటారు. అలాంటి వాళ్లలో శరత్‌బాబు పేరు తప్పకుండా ఉంటుంది.
‘సాగర సంగమం’లో శరత్‌బాబును చూస్తే ఇలాంటి స్నేహితుడు మనక్కూడా ఉండుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
‘సితార’లో చొక్కా చిరుగును కోటు మాటున దాచేసుకునే ధనవంతుడి దీన గాథను చూస్తే జాలేస్తుంది.
‘సీతాకోకచిలుక’లో పరువు కోసం పాకులాడే శరత్‌బాబును చూస్తే భయం వేస్తుంది.
‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో గీచి గిచి మరీ జమా ఖర్చు వేసే తనయుడిని చూస్తే.. వీడేంట్రా బాబూ, ఇలా ఉన్నాడనిపిస్తుంది.
‘అభినందన’లో త్యాగమూర్తి పాత్రలో శరత్‌బాబు జీవించారనే చెప్పొచ్చు.
అక్కడ కనిపించేది శరత్‌బాబు కాదు, ఆయా పాత్రలు మాత్రమే. నటుడిగా శరత్‌బాబు గెలిచారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి?
శరత్‌బాబు రూపం హీరోలకు ఏమాత్రం తీసిపోదు. ఆయన సంభాషణలు పలికే తీరులో సరళత, పాత్రల్ని ఆకళింపు చేసుకొనే విధానం ఇవన్నీ మామూలు హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టే లక్షణాలే.
కానీ, శరత్‌బాబు ఎప్పుడూ 'హీరో' అంటూ గిరిగీసుకొని కూర్చోలేదు. తనకొచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే ప్రయత్నించారు. పాజిటివ్, నెగిటివ్, అన్నయ్య, మావయ్య.. ఇలా ఏ పాత్రనూ ఆయన చిన్నచూపు చూడలేదు. ప్రతీ పాత్రకూ తనదైన హుందాతనం జోడించారు. ఏ పాత్ర చేసినా ఒదిగిపోయారు.

ఫొటో సోర్స్, IDreams/YouTube
మేటి దర్శకుల సినిమాల్లో ముఖ్య పాత్రలు
'నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెబుతా' అన్నది ఒక ఇంగ్లిష్ మాట. అదే కోవలో 'నువ్వు పని చేసిన దర్శకులెవరో చెబితే, నీలో నటుడెంత పదునో నేను చెప్తా' అంటుంది పరిశ్రమ. ఎందుకంటే, దిగ్గజ దర్శకులెవరూ ఆషామాషీ నటుల్ని ఎంచుకోరు. తమ పాత్రల్లానే, పాత్రధారుల్లోనూ ‘నాణ్యత’ ఉండాలని కోరుకుంటారు.
బాలచందర్, కె.విశ్వనాథ్, వంశీ, బాపు, భారతీరాజా, జంథ్యాల వంటి మేటి దర్శకులందరి సినిమాల్లో నటించారు శరత్‌బాబు.
వీళ్లందరిదీ డిఫరెంట్ స్టైల్. ఒకొక్కరిదీ ఒక్కో స్కూల్. ఎవరి పాఠాలు వాళ్లవే. అవన్నీ నేర్చుకుని అందరి దగ్గరా మంచి మార్కులు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు.

ఫొటో సోర్స్, YOUTUBE
పోలీస్ ఆఫీసర్ కావాలనుకొన్నారు
శరత్‌బాబు సినీ జీవితం చాలా వరకూ సాఫీగానే సాగింది. ఎక్కడా ఎగుడుదిగుడులు లేవు. కానీ, సినిమా అనేది ఆయన కల కాదు. అనుకోకుండా అందులోకి వెళ్ళారు.
చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనేవారు. కానీ, ఆయన దృష్టిలోపం పోలీస్ ఉద్యోగానికి దూరం చేసింది.
ఆయనకు చిన్నతనం నుంచే నాటకాలంటే మక్కువ ఉండేది. ఆముదాలవలసలో చదువుతున్నప్పుడు కొన్ని నాటకాలు వేశారు.
ప్రగతి ఆర్ట్స్ పేరిట నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి, అందులో కీలకమైన సభ్యుడయ్యారు.
శరత్‌బాబు అందగాడు. అందుకే చుట్టు పక్కల వాళ్లు 'సినిమాల్లో ట్రై చేయరాదూ' అంటూ ఓ ఉచిత సలహా పడేశారు.
కోరుకున్న ఉద్యోగం ఎలాగూ దక్కలేదు, కనీసం 'సినిమా' అయినా వరిస్తుందేమో అనుకుని ఇటువైపు అడుగులేశారు.
శరత్‌బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. సినిమాల్లోకి వచ్చాకే శరత్‌బాబుగా మారారు.
ఆయన తొలి సినిమా 'రామరాజ్యం' (1973).
ఈ సినిమా కోసం ఆడిషన్ నిర్వహిస్తే, ఏకంగా మూడు వేల అప్లికేషన్లు వచ్చాయి. వారందరినీ దాటుకొని హీరో ఛాన్స్ దక్కించుకున్నారు శరత్‌బాబు.
ఆ సినిమా సమయంలోనే ఎస్వీ రంగారావు(ఎస్వీఆర్)తో పరిచయం అయింది.
శరత్‌బాబును తొలిసారి చూసిన ఎస్వీఆర్, 'ఈ కుర్రాడు తెలుగు వాడా? యూరోపియన్ హీరోలా ఉన్నాడు' అంటూ కితాబిచ్చారు. అది శరత్ బాబు అందుకున్న తొలి కాంప్లిమెంట్.
తొలి సినిమాతో 'ఓకే' అనిపించుకొన్నాఆయనకు బోలెడన్ని అవకాశాలేం రాలేదు. ఒకటీ అరా పాత్రలతో సర్దుకుపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, YOUTUBE
కెరీర్‌ను మలుపు తిప్పిన పరిచయం
బాలచందర్‌తో పరిచయం శరత్‌బాబు కెరీర్ మొత్తాన్ని మార్చేసింది.
బాలచందర్ ఓ ఫంక్షన్‌లో శరత్‌బాబును చూసి, "చూడ్డానికి బాగున్నావ్. నీకు తమిళం వస్తే నా సినిమాలో ఛాన్స్ ఇస్తా" అన్నారు.
అప్పటికే శరత్ బాబు తమిళం నేర్చుకొన్నారు.
అలా 'నిళల్ నిజమాగిరదు' (1978) చిత్రంలో శరత్‌బాబుకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో కమల్ హాసన్‌తో కలిసి నటించారు. అప్పటి నుంచే కమల్ హాసన్, శరత్‌బాబు మంచి స్నేహితులైపోయారు.
సాగరసంగమంలో వీరిద్దరూ స్నేహితులుగానే నటించారు. ఆ రెండు పాత్రలూ అంత గొప్పగా పండడానికి కారణం నిజ జీవితంలో వాళ్ల మధ్య ఉన్న స్నేహమే.
పూర్ణోదయ సంస్థలో రూపొందించిన చిత్రాల్లో శరత్‌బాబుకు మంచి పాత్రలు దక్కాయి. సాగర సంగమం, సితార, ఆపద్బాంధవుడు వంటి చిత్రాల్లో సాత్విక పాత్రలు పోషించి మెచ్చుకోళ్లు అందుకొన్నారు.
శరత్‌బాబులో రెండో కోణం కూడా ఉంది. అది విలనిజం. 'నోము' (1974) చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించారు.
సీతాకోకచిలుక (1981)లో సరేసరి. సింహగర్జన (1978), అభిమానవతి (1975) చిత్రాల్లో నెగిటివ్ పాత్రలు దక్కాయి.
'మిమ్మల్ని విలన్ పాత్రల్లో చూడలేకపోతున్నాం. మీరు ఆ పాత్రలు చేయొద్దు' అని అభిమానులు చెప్పడంతో శరత్‌బాబు నెగెటివ్ పాత్రలను తగ్గించేశారు.

ఫొటో సోర్స్, UGC
పెళ్లి గురించి శరత్‌బాబు ఏమనేవారు?
రియల్ లైఫ్‌లో శరత్‌బాబుది ఫెయిల్యూర్ స్టోరీ. ఆయనకు వైవాహిక జీవితం అచ్చి రాలేదు.
తనకంటే వయసులో నాలుగేళ్లు పెద్ద అయిన నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. వీళ్ల సంసారం మొదట్లో బాగానే ఉండేది. రాను రాను కలతలు మొదలయ్యాయి. చివరికి విడిపోయారు.
ఆ తరవాత స్నేహలతను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా సమస్యలు వచ్చాయి. 'నా భర్త నన్ను వేధిస్తున్నారు' అంటూ స్నేహలత కోర్టుకెక్కారు. దాంతో, వీరి బంధం వీగిపోయింది.
శరత్‌బాబుకు సంతానం కలగలేదు. సోదరుల కుమార్తెలు, కుమారులను తన బిడ్డలుగా భావించేవారు. పెళ్లి ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆయన కదిలిపోయేవారు. "పెళ్లి అనేది నా జీవితంలో నేను మర్చిపోవాల్సిన చాప్టర్" అనేవారు.
వ్యక్తిగత జీవితంలో శరత్‌బాబు చాలా ఒంటరితనం అనుభవించేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు, వారసులు లేకపోవడం ఆయన్ను కుంగదీశాయి.
చివరి రోజుల్లో ఆస్తికి సంబంధించిన గొడవలూ తలెత్తాయి. తన ఆస్తిని అనుభవించడానికి వారసులు లేకపోవడంతో తోడబుట్టినవాళ్ల నుంచి సమస్యలు వచ్చాయి. చివరికి తన ఆస్తులను 13 సమాన భాగాలుగా తన అన్నచెళ్లెళ్ల బిడ్డలకు రాసిచ్చారని సన్నిహితులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, YOUTUBE
శరత్‌బాబు ఓ అందమైన జ్ఞాపకం
వివాదాల వైపుకు పోని నైజం, స్నేహ స్వభావం, ఇవన్నీ శరత్ బాబును ప్రత్యేకంగా నిలిపాయి.
ఆయన వ్యక్తిగత జీవితం ఎలాంటిదైనా, శరత్ బాబు అనగానే లెక్కలేనన్ని పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి.
తెలుగు తెరకు సంబంధించినంత వరకూ శరత్‌బాబు ఓ అందమైన జ్ఞాపకం.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో రహస్యంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.. ఇది ఏ స్థాయిలో ఉంది?
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?
- రక్తదానం: టాటూ వేసుకుంటే రక్తం ఇవ్వకూడదా? ఎవరు రక్తం ఇవ్వవచ్చు, ఎవరు ఇవ్వకూడదు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














