రిషి కపూర్: సీన్ ఓకే అయ్యేసరికి నా బుగ్గలు నల్లగా కమిలిపోయాయి.. కన్నీళ్లు ఆగలేదు

- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిషి కపూర్ పుట్టుకతోనే నటుడు. ఆయన నడక నేర్వకముందే, అద్దం ముందు నిలబడి నటించేవారని చాలామంది అంటుంటారు.
కపూర్ కుటుంబ సభ్యుల సమావేశాలలో తరచూ ఒక కథనం వినిపిస్తుంటుంది. ఆ రోజుల్లో ఓసారి రాజ్ కపూర్ విస్కీ తాగుతూ, "నువ్వు కూడా ఓ గుటక వేస్తావా?" అని తన కొడుకును అడిగారట, అప్పుడు వెంటనే రిషి కపూర్ అద్దం ముందుకు వెళ్లి తాగుబోతులా నటించడం ప్రారంభించారని అంటుంటారు.
నటుడిగా రిషి కపూర్ ప్రయాణం చిన్నతనంలోనే ప్రారంభమైంది. తన తాత పృథ్వీరాజ్ కపూర్ నటించిన ‘పఠాన్’లో మంచం మీద నిద్రిస్తూ కనిపించిన పిల్లోడు మీకు గుర్తుండే ఉంటుంది. అది మరెవరో కాదు రిషి కపూరే.

ఫొటో సోర్స్, Getty Images
‘మేరా నామ్ జోకర్’కు జాతీయ పురస్కారం
రాజ్ కపూర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేరా నామ్ జోకర్’లో ఆయన చిన్నప్పటి పాత్రలో రిషి కపూర్ నటించారు. అప్పుడు రిషి ముంబయిలోని క్యాంపియన్ స్కూలులో చదువుకుంటున్నారు.
టీచర్లకు చెప్పకుండానే స్కూలు నుంచి ఆయన సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు. అందుకు టీచర్లు ఒప్పుకోలేదు. ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించారు. రిషి మళ్లీ ఆ స్కూలులో ప్రవేశం పొందేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది.
సినిమా షూటింగుల కోసం పిల్లలను స్కూలు నుంచి తీసుకెళ్లడం కపూర్ కుటుంబంలో కొత్తేమీ కాదు. అంతకుముందు, రాజ్ కపూర్ తన సోదరుడు షమ్మీ కపూర్‌ను ‘శకుంతల’ చిత్రంలో నటించేందుకు పాఠశాల నుంచి తీసుకెళ్లారు.
‘మేరా నామ్ జోకర్’ సినిమాలో నటించిన రిషి కపూర్ ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
“ఆ అవార్డుతో నేను ముంబయికి వెళ్లగానే, మా నాన్న నన్ను మా తాతయ్య దగ్గరికి పంపించారు. ఆ అవార్డును మా తాతయ్య పట్టుకోగానే, ఆయన కళ్లలో ఆనంద భాష్పాలు నిండిపోయాయి. నా నుదుటిపై ముద్దుపెట్టి, ‘ఇవాళ రాజ్ నా రుణం తీర్చాడు’ అన్నారు” అని ‘ఖుల్లం ఖుల్లా’ పేరుతో రాసిన తన ఆత్మకథలో రిషి కపూర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బహుముఖ ప్రజ్ఞాశాలి
1970, 80ల నుంచి జెర్సీ ధరించి, గిటార్ వాయిస్తూ, పాట పాడుతూ, మరో చేతితో ఓ అందమైన అమ్మాయిని పట్టుకుని కనిపించే ఓ శృంగార పురుషుడు అన్న పేరుండేది చింటుకి (బాలీవుడ్‌లో రిషి కపూర్‌ను ఇలానే పిలిచేవారు). తన నటనా ప్రయాణం ఆఖరి దశలో ఆయన ఆ ఇమేజ్ నుంచి బయటపడ్డారు.
విభిన్న రకాల పాత్రలు చేయడం ప్రారంభించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. హమ్ తుమ్ (2004)లో అసంతృప్తితో ఉన్న భర్త, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012)లో కొంటె టీచర్, డి-డే (2013)లో డాన్, అగ్నిపథ్ (2013)లో ఇతరులపై ఆధారపడే వ్యక్తి, ది కపూర్ అండ్ సన్స్ (2016)లో తొమ్మిదేళ్ల కొంటె బాలుడిగా, వృద్ధుడిగా నటించి మెప్పించారు.
నటనలో రిషి కపూర్ బహుముఖ ప్రజ్ఞాశీలి. ‘ముల్క్’ చిత్రంలో ఆయన పోషించిన జాతీయవాద ముస్లిం పాత్ర దేశంలోని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
బాబీతో దేశవ్యాప్తంగా గుర్తింపు
‘బాబీ’ సినిమా రాజ్ కపూర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చింది. ఆ చిత్రంలో రాజ్ కపూర్ తన కుమారుడు రిషికి ఇచ్చిన గుర్తింపు, ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు అలాగే ఉండిపోయింది. కాలానుగుణంగా మారే అవసరాలను అర్థం చేసుకోవడంలో రాజ్ కపూర్‌కు ప్రత్యేకమైన నేర్పు ఉండేది.
పొడవాటి హ్యాండిల్స్, సైడ్ అద్దాలు ఉన్న బైకును పెద్ద సన్ గ్లాసులు పెట్టుకుని రిషి కపూర్ నడుపుతుంటారు. ఆ సైడ్ అద్దాలలో ఆయన ముఖం కనిపించాలి. రాజ్ కపూర్ తన కొడుక్కి ఇచ్చిన ఇమేజ్ అది. భారత్‌లో మారుతున్న విలువలకు, ఆధునికత, శక్తి సామర్థ్యాలకు ఆ బైకు ఒక చిహ్నంగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక సీన్‌కి తొమ్మిది రీటేకులు
ఈ సినిమాలో రిషి కపూర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టటానికి రాజ్ కపూర్ ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదు.
రిషి కపూర్ తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో.. ‘‘ప్రతి సీన్ కోసం కెమెరా ముందుకు వెళ్లే లోపు నాన్న నన్ను ఎంతగా రిహార్స్ చేయించేవాడో మీరు ఊహించలేరు. ఈ సినిమాలో నా తల్లి పాత్రను అచల సచ్‌దేవ్ పోషించారు. ఆమె నన్ను చాలా సార్లు చెంప దెబ్బ కొట్టే ఒక సీన్‌ని నేను మరచిపోలేను. సీన్ వాస్తవికంగా, శక్తిమంతంగా కనిపించటం కోసం చింటూని నిజంగా గట్టిగా కొట్టాలని ఆమెకు నాన్న చెప్పాడు. ఆ సీన్ కోసం ఆయన తొమ్మిది రీటేక్‌లు తీశారు. సీన్ ఓకే అయ్యేసరికి నా బుగ్గలు నల్లగా కమిలిపోయి, నా కళ్ల నుంచి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి’’ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ స్వీట్‌హార్ట్
బాబీ మూవీ 1973లో విడుదలైంది. దేశంలో తుఫాను సృష్టించింది. రిషి కపూర్ ఎక్కడికెళ్లినా ఒక రాక్‌స్టార్‌ను చుట్టుముట్టినట్టు జనం ఆయన్ను చుట్టుముట్టేవారు. ఆయనను ‘‘నేషనల్ స్వీట్‌హార్ట్’’ అనేవారు. ఆయన తర్వాత చేసిన చాలా సినిమాలకు ఈ ఇమేజ్ ఒక నమూనాగా మారింది. అయితే డింపుల్ కపాడియాతో రిషి జోడీ అక్కడితోనే ఆగిపోయింది. ఆమె రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకోవటం దీనికి కారణం.
చింటూ 1974లో తన తొలి సినిమా ‘జహ్రీలా ఇన్‌సాన్’లో నీతూ సింగ్‌తో కలిసి నటించారు. వీరి జంట దేశంలో చాలా పాపులర్ అయింది.
తర్వాత ఈ జంట ఖేల్ ఖేల్ మే, రఫూచక్కర్, జిందా దిల్ సినిమాల్లో మళ్లీ కలిసి నటించారు. 1970వ దశకం యాక్షన్, హింసాత్మక సినిమాల దశాబ్దమైనా కూడా.. రిషి కపూర్ ‘లవర్ బాయ్’ ఇమేజ్ అలాగే కొనసాగింది. అది ‘యాంగ్రీ యంగ్ మాన్’ అమితాబ్ బచ్చన్ ఆధిపత్యం చలాయిస్తున్న కాలం. రిషి కపూర్‌కు జోడీగా కానీ, ఆయన సినిమాల్లో కానీ తెరంగేట్రం చేసిన చాలా మంది నటీమణులు కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకున్నారు.
కాజల్ కిరణ్ (హమ్ కిసీ సే కమ్ నహీ), షోమా ఆనంద్ (బారూద్), జయప్రద (సర్గం), నసీమ్ (కభీ కభీ), సంగీతా బిజ్‌లానీ (హతియార్), పాకిస్తానీ నటి జెబా భక్తియార్ (హెన్నా) – అందరూ రిషి కపూర్‌తో జోడీగా సినిమాల్లో అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
నీతూ సింగ్‌తో వివాహం
నీతూ సింగ్ తొలిసారి రిషి కపూర్‌ను కలిసినపుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు.
‘‘ఆ రోజుల్లో చింటూకి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. కొన్నిసార్లు ఆయన కోసం వాళ్లకి నేనే ఫోన్ చేస్తుండేదాన్ని. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు నన్ను మిస్ అవుతున్నానని అతడు మొదటిసారి నాతో చెప్పాడు. అది అర్థంలేని మాటని నేను అన్నాను. అప్పుడతడు తన వేళ్లు మడతపడి లేవని చెప్పటానికి తన షూస్ విప్పేసి చూపించాడు.
నాకు 18 ఏళ్ల వయసులో అతడు నాకొక తాళం చెవి ఆకారంలోని లాకెట్ బహుమతిగా ఇస్తూ నా మెడలో వేశాడు. అది తన హృదయానికి తాళం చెవి అని నాతో చెప్పాడు. (‘దీవార్’ సినిమాలో నీతూ సింగ్ ఆ తాళం చెవి తన మెడలో ధరించటం కనిపిస్తుంది)’’ అని ఆమె మధు జైన్‌తో ఇంటర్వ్యూలో వివరించారు.

రిషికి ‘బాబ్’ అని నిక్‌నేమ్ పెట్టిన నీతూ సింగ్
‘‘ఒకసారి తాజ్ హోటల్‌లో డిన్నర్ చేసిన తర్వాత.. ‘నీకు పెళ్లిచేసుకోవాలని లేదా?’ అని నన్ను అడిగాడు. నేను చేసుకోవాలనే ఉందన్నాను. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అని అడిగాను. ‘ఇంకెవరిని? నన్నే!’ అని రిషి బదులిచ్చాడు’’ అని నీతూ చెప్పారు.
చింటూని నీతూ సింగ్ ఎప్పుడూ ‘బాబ్’ అని పిలిచేవారు. ‘‘చింటూకి చాలా ఈర్ష్య ఉంది. నేను ఎవరికీ మరీ దగ్గర కాలేనని నాకు తెలుసు. ఎందుకంటే అతడు వెంటనే బాధపడతాడు. నేను నా కొడుకు రణ్‌బీర్‌కు దగ్గరగా ఉన్నా కూడా అతడికి నచ్చదు. ఒకప్పుడు రిషి చాలా ఎక్కువగా తాగేవాడు. మద్యం మత్తులో ఉన్నపుడు తన మనసులో ఏముంటే అది మాట్లాడేవాడు. ఆ రోజుల్లో తనకు నచ్చిన అమ్మాయి గురించి కూడా మాట్లాడేవాడు. తెల్లారాక ఆ అమ్మాయి గురించి నేను అతడిని అడిగితే.. ‘ఆ విషయం నీకెవరు చెప్పారు?’ అని అమాయకంగా ప్రశ్నించేవాడు. ఇలా చాలాసార్లు జరిగింది. దీంతో తాగిన తర్వాత తన రహస్యాలన్నీ నా ముందు బయట పెట్టేస్తానేమోనని మళ్లీ తాగేటపుడు ఆందోళనగా ఉండేవాడు’’ అని నీతూ తెలిపారు.

ఫొటో సోర్స్, SUJIT JAISWAL
రిషి కపూర్ పిసినారితనం
తన బాబాయ్ శశి కపూర్ తరహాలోనే రిషి కపూర్ ఎన్నడూ ఆదివారాలు పనిచేయలేదు. ఆదివారం ఎప్పుడూ కుటుంబంతోనే గడిపేవాడు. కానీ శశ కపూర్ లాగా కాకుండా.. రిషి చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచేవాడు. వారితో చాలా తక్కువగా మాట్లాడేవాడు. చింటూ చిన్నప్పుడు తన తండ్రితో మాట్లాడే సాహసం చేసేవాడు కాదు.
రిషి కపూర్ కొంచెం పిసినారి అనే విషయం బాగా తెలిసిందే. ఎవరికైనా కానుకలు ఇవ్వటం ఆయనకు ఇష్టముండదు. తన కొడుకు రణ్‌బీర్ 16వ పుట్టిన రోజు నాడు.. తనకు కారు కొనిపించాలని అతడు తన తల్లిని అడిగాడు. ‘నీకు సొంత కారు పెట్టుకునేంత వయసు లేదు’ అని చింటూ అతడితో చెప్పాడు. తన పిల్లల్ని పాడు చేయటం ఆయనకు ఇష్టంలేదు. రిథిమ, రణబీర్‌లు సంపాదించటం మొదలుపెట్టే వరకూ వారు ఎప్పుడూ విమానంలో ఎకానమీ తరగతిలోనే ప్రయాణించారు.
రిషి కపూర్ పిసినారితనం గురించి నీతూ సింగ్ ఒకసారి ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పారు.
‘‘ఆహారం కోసం డబ్బు ఖర్చుపెట్టటానికి చింటూకి అభ్యంతరం లేదు. మేం ఒకసారి న్యూయార్క్‌లో ఉన్నపుడు నన్ను ఖరీదైన రెస్టారెంట్లకు తీసుకుపోయేవాడు. ఒక్క భోజనం కోసం వందలాది డాలర్లు ఖర్చు పెట్టేవాడు. కానీ చాలా మామూలు వాటి కోసం ఖర్చు పెట్టటానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఒకసారి న్యూయార్క్‌లో మా అపార్ట్‌మెంట్‌కి తిరిగి వస్తున్నపుడు.. పొద్దున్నే అవసరం కోసం ఒక పాల సీసా కొనాలని నేను అనుకున్నాను. అప్పుడు అర్థరాత్రి కావస్తోంది. చింటూ చాలా దూరంలో ఉన్న షాపుకు వెళ్లి పాల సీసా తెచ్చాడు. ఎందుకంటే అక్కడ 30 సెంట్లు తక్కువ ధరకు అమ్ముతారు’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, STRDEL
‘కపూర్ కుటుంబంలో అత్యుత్తమ నటుడు’
రిషి కపూర్ తను పోషించిన పాత్రలకు ఎప్పుడూ న్యాయం చేసేవాడు. అందుకే లతా మంగేష్కర్ ఒకసారి.. ‘కపూర్ కుటుంబంలో అత్యంత సమర్థత గల నటుడు రిషి కపూర్’ అని చెప్పారు. ఆయన నటనలో ప్రత్యేకత.. కష్టపడాల్సి రాకపోవటం, సులభంగా నటించటం. ఈ రోజుల్లో ఒక ‘రొమాంటిక్ హీరో’ అంటే అందంగా కనిపించటమే కాదు.. సన్నగా కూడా ఉండాలి. రిషి కపూర్ ఎప్పుడూ కొంచెం ఎక్కువ బరువే ఉండేవారు. కానీ యువతను ఆకట్టుకోవటంలో అది ఆయనకు ఎప్పుడూ అవరోధం కాలేదు.
రిషి కపూర్ 70లలో తన కెరీర్ ఆరంభంలో అందుకున్న ప్రశంసలు, అభినందనలను.. క్యారెక్టర్ నటుడిగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- దీపికా పడుకోణే: బాలీవుడ్‌కి ఒక రాజకీయ గళం దొరికిందా?
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- గోసా ఎక్కడికి వెళ్ళినా... తేనెటీగలు ఆయనను వదిలిపెట్టవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








