రిషికపూర్: ఆ అమ్మాయి ప్రేమలో పిచ్చివాడయ్యారు

రిషీ కపూర్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషీ కపూర్ కుటుంబం
    • రచయిత, పంకజ్ ప్రియదర్శి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుల్లో రిషికపూర్ ఒకరు. షోమ్యాన్‌ రాజ్‌కపూర్ తర్వాత కపూర్‌ల వంశంలో రిషి కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది.

నటనతోనే కాకుండా విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తోనూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాను విపరీతంగా మద్యం తాగుతానన్న విషయాన్ని ఏనాడు ఆయన దాచుకోలేదు.

నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పడంలో ముందుడే రిషికపూర్‌...ఆ కారణంగా తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేవారు.

ఆయన అర్ధరాత్రి చేసే ట్వీట్లు కొంచెం హాస్యాస్పదంగానూ ఉండేవి. వాటివల్ల ఆయన కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడ్డారు.

రాజ్ కపూర్

ఫొటో సోర్స్, KSENIYA RYABINKINA

తండ్రి వివాహేతర సంబంధాలపై

2017లో ఆయన రాసిన పుస్తకం "ఆయి ఖుల్లం ఖుల్లా"పై చాలా చర్చ జరిగింది. అందులో చాలా విషయాలను రిషికపూర్ ఓపెన్‌గా రాసుకొచ్చారు. ఆ విషయాలను ఓసారి చూద్దాం.

పెళ్లయిన తర్వాత కూడా తన తండ్రి రాజ్‌కపూర్ అనేకమంది మహిళలతో వివాహేతర సంబంధాలు నెరిపాడని రిషి తన పుస్తకంలో రాశారు.

నర్గీస్‌, వైజయంతిమాలాలతో రాజ్‌కపూర్ రిలేషన్స్‌ గురించి కూడా రిషి ప్రస్తావించారు. రాజ్‌కపూర్ తన సంబంధాలు వదులుకునేదాకా తనతల్లి కృష్ణకపూర్‌ వదిలిపెట్టలేదని, వారందరినీ వదులుకున్నాకే ఆమె తిరిగి వచ్చారని, అప్పట్లో తాను చాలా చిన్నవాడినని చెప్పుకొచ్చారు రిషి.

తన తండ్రి రాజ్‌కపూర్‌ తన తల్లిని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించారని వెల్లడించారు.

నీతూసింగ్‌తో ప్రేమకు ముందు..

రిషి కపూర్, నీతూసింగ్‌ల వివాహం బాలీవుడ్ ప్రముఖుల వివాహాలలో ఒకటి. తన పుస్తకంలో రిషి కపూర్ తాను ఓ పార్సీ అమ్మాయి ప్రేమలో పిచ్చివాడినయ్యానని ఒప్పుకున్నారు.

ఆ పార్సీ అమ్మాయి పేరు యాస్మిన్ మెహతా అని ఆయన పుస్తకంలో రాశారు. ఈ సంఘటన అతని మొదటి చిత్రం బాబీకి ముందు జరిగింది. బాబీ వచ్చినప్పుడు గాసిప్స్‌ రాసే ఫిల్మ్ మ్యాగజైన్లు రిషి కపూర్, డింపుల్ కపాడియాల మధ్య ఎపైర్‌ల గురించి రాశాయి.

ఆ సమయంలో స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కూడా దీనిపై ఒక కథనం రాసింది. అయితే డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నా ఆ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు.

ఈ కథనాలన్నీ తన ప్రేమాయణపై ప్రభావం చూపాయని రిషి రాసుకొచ్చారు. యాస్మిన్‌తో అతని బంధం చెడిపోయింది. యాస్మిన్‌ను ఒప్పించేందుకు తానెంతో ప్రయత్నించానని, కానీ విజయవంతం కాలేకపోయానని చెప్పుకొచ్చారు రిషి.

రిషీ కపూర్

రాజేష్ ఖన్నాకు కోపం ఎందుకు వచ్చింది?

యాస్మిన్ మెహతా, డింపుల్ కపాడియాలకు సంబంధించిన మరో కథను రిషి కపూర్ తన పుస్తకంలో పంచుకున్నారు. డేటింగ్‌లో ఉన్నప్పుడు యాస్మిన్ తనకు ఒక ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పారు రిషి.

బాబీ షూటింగ్ సమయంలో డింపుల్ ఆ ఉంగరాన్ని తీసుకున్నారు. ఇక రాజేశ్‌ఖన్నా డింపుల్‌కు ప్రపోజ్‌ చేసినప్పుడు ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని చూసిన ఖన్నా.. జుహూలో తన ఇంటికి దగ్గరలో ఉన్న సముద్రంలో విసిరేశారు.

అయితే తర్వాత రాజేశ్‌ఖన్నాను కలసి, తాను డింపుల్‌ను ప్రేమించడం లేదని చెప్పారట రిషి.

రిషికి క్రెడిట్‌ ఇవ్వని అమితాబ్‌

కపూర్ వంశానికి అమితాబ్ బచ్చన్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే అమితాబ్ గురించి రిషి కపూర్ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసేవారు.

మల్టీస్టారర్ యాక్షన్ చిత్రాలలో పనిచేయడం, అందులోనూ రెండో ప్రధాన పాత్ర చేయడం ఎంతకష్టమో తన పుస్తకంలో రాశారు.

ఆ రోజుల్లో యాక్షన్ సినిమాలు మల్టీస్టారర్‌గా ఉండేవి. చాలామంది నటులు ఇంకొక హీరోతో కలిసి పని చేయాల్సి వచ్చేది. సినిమా హిట్టయితే లీడ్ స్టార్ క్రెడిట్ తీసుకుంటారు.

ఈ సమస్య తన ఒక్కడిదే కాదని రిషి కపూర్ రాశారు. శశికపూర్, వినోద్ ఖన్నా, శత్రుఘన్‌ సిన్హాలాంటి మరికొందరు నటులు కూడా తనలాగా ఇబ్బంది పడ్డారని రిషికపూర్ రాశారు.

మేము చిన్నస్టార్లు అయినప్పటికీ తక్కువ కాదు. కానీ అమితాబ్‌బచ్చన్‌ దీన్ని ఎప్పుడూ అంగీకరించలేదు.

ఏ ఇంటర్వ్యూలోనూ, ఏ పుస్తకంలోనూ చెప్పలేదు. తనతో కలిసి పనిచేసే నటులకు అమితాబ్ బచ్చన్ తగినంత క్రెడిట్ ఇవ్వరని తన పుస్తకంలో చెప్పారు రిషి కపూర్.

రిషి, నీతూ

ఫొటో సోర్స్, SUJIT JAISWAL

నీతూపై కోపం

రిషికపూర్ స్టార్‌డమ్‌నే కాదు వైఫల్యాలను కూడా చూశారు. బాబీ హిట్ అయిన సమయంలో రిషికపూర్ స్టార్‌ అయ్యారు.

తరువాత చాలా సినిమాలు చేశారు. అభిమానులకు ఆయన సినిమాపై చాలా అంచనాలు ఉండేవి. కానీ కొన్నిసార్లు ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యేవి.

ఆ సమయంలోనే నీతూ సింగ్‌తో పెళ్లి జరిగింది. అప్పుడు అసహనం, అశాంతి, నిరాశలో కూరుకుపోయిన రిషి.. ఈ వైఫల్యాలకు నీతూ సింగ్‌ను నిందించడం ప్రారంభించారు.

కొన్నాళ్లకు నీతూ గర్భవతి అయ్యారు. ఆ సమయంలో రిషికపూర్‌ తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారు.

అయితే కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతోతో డిప్రెషన్ నుంచి బైటపడ్డానని పుస్తకంలో రాసుకొచ్చారు రిషి. అయితే నీతూ సింగ్‌ ఈ పరిస్థితులను ఎలా భరించారోనన్న భావన ఆయనలో ఉంది.

అమితాబ్‌తో

ఫొటో సోర్స్, STRDEL

అవార్డు కొనుక్కున్నారు

రిషికపూర్, తనకు, అమితాబ్‌కు మధ్య సంబంధాలను గురించి రాస్తూ, తాను ఒకదశలో అమితాబ్‌ను చిరాకు పెట్టానని వివరించారు.

జంజీర్‌ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అమితాబ్‌ ఆశించారు. కానీ, బాబీ సినిమాకుగాను రిషి కపూర్‌కు ఈ అవార్డు వచ్చింది.

తాను ఈ అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నానని రిషికపూర్‌ తన పుస్తకంలో రాశారు. ఒకవ్యక్తి వచ్చి సార్‌...రూ.30 వేలు ఇవ్వండి, అవార్డు మీకు ఇప్పిస్తానని అన్నాడట.

తాను ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు ఇచ్చానని రిషికపూర్ తన పుస్తకంలో రాశారు.

జావేద్ అక్తర్

ఫొటో సోర్స్, Getty Images

జావేద్ అక్తర్‌ నిందలు

సలీం-జావేద్ జంట అంటే రిషికి ఎప్పుడూ నచ్చేది కాదు. ఒకదశలో తన తదుపరి ప్రాజెక్టు బాబీ కంటే గొప్ప హిట్‌ అవుతుందని జావేద్ అక్తర్‌ సవాల్ చేశారు.

అయితే ఆ తర్వాత సలీం-జావేద్‌లతో కలిసి రిషి అనేక సినిమాలు చేసినా.. అందులో మరపురాని సినిమాలు ఏవీ లేవు.

ఓ టీవీ ఇంటర్వ్యూలో జావేద్ చెప్పిన మాటలను తాను ఎన్నటికీ క్షమించనని రిషి తన పుస్తకంలో రాశారు. గీతరచయిత శైలేంద్ర మరణానికి రాజ్‌కపూరే కారణమని జావేద్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

రణబీర్ కపూర్, రిషి కపూర్

ఫొటో సోర్స్, Getty Images

రణ్‌బీర్ కపూర్‌తో అనుబంధం

రణ్‌బీర్ తనతో చాలా అరుదుగా ఓపెన్‌ అవుతారని రిషికపూర్ తన పుస్తకంలో అంగీకరించారు.

రణ్‌బీర్ తల్లి నీతూసింగ్‌తో ఎక్కువగా మాట్లడతారట. రణ్‌బీర్ కెరీర్‌లో విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని రిషి రాసుకొచ్చారు.

రణ్‌బీర్‌ ప్రారంభ చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ...బర్ఫీ చిత్రంతో రణ్‌బీర్‌ పనితీరులో మార్పువచ్చినట్లు అన్నారు.

''తరువాత ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నా పిల్లలు ఏం చేస్తారో తెలియదు. భవిష్యత్తులో మాతో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు.

వారు ఆర్కె బ్యానర్‌ను ఎలా సజీవంగా ఉంచుతారో, తన వారసత్వాన్ని ఎలా నిలబెడతారో చూడాలి''అని పుస్తకంలో రాశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)