తెలుగు సినిమాకు కొత్త నక్కిలీసు గొలుసు – పలాస 1978

ఫొటో సోర్స్, Facebook/Palasa1978
- రచయిత, ల.లి.త.
- హోదా, బీబీసీ కోసం
సాహిత్యం అంటే ఏమిటో సినిమా అంటే ఏమిటో మన తెలుగు డైరెక్టర్ కరుణా కుమార్ కు తెలుసు. తెలుగు సినిమానేలను కష్టపడి దున్ని సహజత్వం, స్థానికతల పుష్టిని అందించి జీవం తొణికిసలాడే మనుషులతో ‘పలాస 1978’ సినిమాను పండించి అందించాడు.
ఇది పూర్తిగా డైరెక్టర్ సినిమా. పలాస కేవలం సినిమా కాదు, ఒక ప్రాంతపు సామాజిక రాజకీయ ప్రయాణం.
పద్యాల సుందర్రావు కొడుకులు పాటల రంగారావు, మోహన్రావు, వీళ్ల స్నేహితుడు దండాసి, మోహన్రావు మేనత్త కూతురు లక్ష్మి, ఆమె అన్న ముత్యాలు ఒకవైపు.
వీళ్లు ఎస్సీ కాలనీకి ప్రతినిధులు. పెద్దషావుకారు, తమ్ముడు చిన్నషావుకారు గురుమూర్తి, అతని కొడుకు తారకేసు మరోవైపు.
వీళ్లు పలాసలో జీడిపప్పు ఫాక్టరీల యజమానులు. బైరాగి, అతని కొడుకు వాసు షావుకార్ల దగ్గర పనిచేసే రౌడీలు. నేరమయ, రాజకీయ నేపథ్యంలో వీళ్లందరి ఘర్షణే కథకు సూత్రం.
1978 నుండి మొదలైన కథ నాటకీయమైన మలుపులతో 2018 దాకా సాగుతుంది. అందరూ వాళ్ల జీవితానుభవం, సమాజంలో అనుభవించే స్థానం, అంతస్తు, అంతరం, తెలివి... వీటిని బట్టి ప్రవర్తిస్తారు.
చదువులేనప్పటి లోకజ్ఞానమూ తెగింపూ, చదువుతో వచ్చిన ఆలోచనా మార్పూ... వీటికి లోబడే వుంటారు. నేల విడిచి సాము చెయ్యని మంచి సాహిత్యంలాగే మంచి సినిమా కూడా ఆ ‘గ్రే’ ఏరియాలోనే మనల్ని పరిభ్రమించేలా చేస్తుంది. ‘పలాస 1978’ అటువంటి సినిమా.

ఫొటో సోర్స్, Facebook/Palasa1978
ఎంత బాగా పాడినా పై కులాల వాళ్లతో పోటీ పడ్డప్పుడు చచ్చినా తనకు మొదటి బహుమతి రాదని మోహన్రావుకు అర్థమౌతుంది.
అతనికి చిన్నప్పటి నుండీ పెద్దషావుకారు దగ్గర పనిచేసే ఊరిరౌడీ బైరాగి అంటే హీరో వర్షిప్.
తన కులంవాడే అయినప్పటికీ “బైరాగి బలమే షావుకారు బలం” అన్నది అతని అవగాహన. అందువల్ల శారీరక బలంతో బైరాగిలా అవాలనుకుంటాడు.
బైరాగి ఎత్తిన పెద్ద బండరాయికి ఆవూళ్ళో బైరాగిరాయి అని పేరు. దాన్ని ఎత్తి బైరాగితో సమానుడని అనిపించుకోవాలని మోహన్రావుకి “గొప్ప సరదా”.
తీరా ఆ కోరిక తీరాక రాజకీయ నాయకుడు, రౌడీల ఈక్వేషన్లో వున్న మతలబు అర్థం అవుతుంది. “షావుకారికి కోపమొస్తేనే బైరాగి చేతిలోకి కత్తి మొలుస్తాద”ని అర్థమౌతుంది.
“బలమున్నోడికి కులముండదు” అనుకుంటే కుదరదని అన్నదమ్ములిద్దరికీ తెలుస్తుంది. బలంవల్ల వచ్చిన ధైర్యంతో రంగారావు రాజకీయ పదవులకోసం పోటీ పడబోతాడు. షావుకార్లు పడనిస్తారా? షావుకారు షావుకారే కంబారి కంబారే!
ఈ అన్నదమ్ముల మధ్య స్పర్థ, అనురాగం దోబూచులాడి చివరకు అనురాగానిదే పైచేయి అవుతుంది. దీనికి కారణం “మీరు అన్నదమ్ముల్రా, బాగార్లు కాదు” అని బాధగా సుద్దులు చెప్పిన తండ్రి సుందర్రావు. దీనికి విరుద్ధంగా పెద్ద షావుకారు, అతని తమ్ముడి మధ్య నిరంతరంగా స్పర్థ రాజుకుంటూనే వుంటుంది.
దాని సెగ సుందర్రావు కుటుంబానికి కూడా తగులుతుంది. అన్నదమ్ములు భాగహార్లు అయితే వచ్చే బాధను మొదట గ్రహించినది పెద్దషావుకారు భార్య. ఈమె భారతంలో ద్రౌపదిలా పగ రాజెయ్యటంతోబాటు అన్నిచోట్లా తను విఫలమైనప్పుడు రక్తసంబంధాన్ని కలుపుకోవటం కూడా ముఖ్యమని తెలుసుకున్న తెలివిగల యిల్లాలు.

ఫొటో సోర్స్, Youtube/AdityaMusic
యువకులుగా వున్నప్పుడు రంగారావు, మోహన్రావు, దండాసి షావుకారు చెప్పినప్రకారం జీడిపప్పును రైల్లో అక్రమరవాణా చెయ్యటంలాంటి పనులు చేస్తుంటారు. “మనం గజ్జెకట్టి ఆడే కళాకారులం. రౌడీలంకాదు. షావుకార్ల వల్ల ఇలా అయాం” అని మొదట గ్రహించినవాడు రంగారావు.
తమలాంటి వాళ్లకు సమాజంలో ఎదుగుదల అంటే రాజకీయంగా ఎదగటమే అని అర్థం చేసుకుంటాడు. అది జరగదని తెలిశాక మోహన్రావు నిరాశగా “బురదలోకి దిగిపోనాం. కాళ్లు కడుక్కోడానికి నీళ్లు సరిపోవు” అంటాడు.
“నిలబడ్డోడికి తెలీకుండా ఆడి సెడ్డీ ఇప్పీసినోడే షావుకారు” – ఇదీ షావుకార్ల వ్యాపారబుద్ధి. ఇతర షావుకార్లకీ బట్టీల్లో పనిచేసేవాళ్లకీ మధ్య బాలన్స్ చేస్తుంటాడు పెద్ద షావుకారు.
ఇక్కడి షావుకార్లు కింగ్ మేకర్లుగా వుండటానికే ఇష్టపడతారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు. చిన్నషావుకారు గురుమూర్తీ, అతని కొడుకు తారకేసూ కూడా అంతే. “రెండుకోతుల మధ్య కొబ్బరికాయ పెట్టి అవిరెండూ కొట్టుకుంటున్నప్పుడు పచ్చడి సెయ్యటమెలాగో తెల్సినోడు తారకేసు.” అంటే వీళ్లకున్న కళ దోపిడీ వ్యాపారమే.
దానివెంట నేరం, ఆ తరువాత రాజకీయం. ఎలక్షన్లలో “కాళింగులకీ కాపోళ్ళకీ చాలా డబ్బులు ఖర్చుపెట్టి పెద్దోళ్ళని చేసేం. కానీ లాభవేటి?” అని విచారిస్తారు. ఈ కాలంలోనే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావటం, కులాల ఈక్వేషన్లు అటూయిటూ కావటం కూడా జరుగుతుంది.
చిచ్చులు పెట్టే తమ రాజకీయం దెబ్బతిన్న తరువాత ఐకమత్యం తెచ్చుకుని “రంగారావు మోహన్రావుని నమ్ముకుంటే “రెండుకత్తుల మీద బొంతేసి పడుకున్నట్టే కదా” అనుకుంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పదవుల రుచి తెలుసుకుంటారు షావుకార్లు.
ఇదంతా ఒక పాతికేళ్ల వ్యవధిలో వచ్చిన మార్పు. స్థానిక రాజకీయాలను దర్శకుడు నిశితంగా పరిశీలించినట్టు తెలుస్తుంది స్క్రీన్ప్లేలో.
వీళ్లందరి మధ్యలోకి “రాయికి రత్తం తీసే టైప్” ఎస్సై సెబాస్టియన్ వస్తాడు. చదువుతోబాటు వివక్ష స్వరూపం గురించి కూడా తెలుసుకున్నవాడు. ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఉపయోగించి కులాన్ని లెక్కజేయకుండా నేరస్తులను దండించగలనని అనుకుంటాడు.
“కత్తిపట్టిన ప్రతోడూ దిక్కులేని సావు సవ్వాల” అని తనమీదకు పిస్టల్ గురిపెట్టిన సెబాస్టియన్ను “నాకు (నన్ను) తయారుచేసింది ఆళ్ళే కదా ఆళ్ళనెవరు కాలుస్తారు?” అని ప్రశ్నించి ఆలోచనలో పడేస్తాడు మోహన్రావు.

ఫొటో సోర్స్, facebook/palasa1978
రాజకీయాధికారంతో కూడిన కులం ముందు నిజాయితీ తలవంచక తప్పదని క్రమంగా తెలుసుకుంటాడు సెబాస్టియన్. హింస, ప్రతిహింస, రాజకీయం, పోలీసువ్యవస్థలకున్న అనేకానేక పరిమితులను దళితవాద కోణం నుండి అర్థం చేసుకుందికి ప్రయత్నించిన మోహన్రావు, సెబాస్టియన్ ల చర్యలు సినిమాను చివరకు హింసాత్మకంగానే ముగిస్తాయి.
“మన గొంతుక, మన మనిషి, మన భూమి వుండాల. బొగ్గుసేసీసి బట్టీలు కడతామంటే ఒప్పుకోము” అంటూ ఆ పనులు చేసేవాళ్ళను కులంతో సంబంధం లేకుండా అంతం చేయబూనుతాడు మోహన్రావు.
ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకున్న కల్పితగాథ అని చెప్పుకున్నారు.
కానీ పలాస, అంబుసోలి అనే భౌగోళిక ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనల్లో కులకోణంతోబాటు ఇంకేమేమి పనిచేశాయో అక్కడివాళ్లకే బాగా తెలుస్తుంది.
జీడిపప్పు ఫాక్టరీలో పనిచేసేవాళ్ళ అవస్తలనూ అనారోగ్యాన్నీ ఈ సినిమా చూపించదు. కార్మికుల్లో సంఘటనో అసంఘటనో కనబడుతూ వుండి, లాభాలకూ దోపిడీకి ఘర్షణకూ అనారోగ్యానికీ ఎక్కువ ఆస్కారమున్న చోటది.
కానీ ఈ సినిమా అక్కడి నేరాన్నీ వివక్షనూ మాత్రమే చూపిస్తుంది. నిజానికి పవర్ పాలిటిక్స్ లో పేదకార్మికులందరూ పావులై వుండటం సహజాతిసహజం.
ఒక ప్రాంతపు నేపథ్యంలో ఆ ప్రాంతం పేరును అలాగే వాడుకుని కథ చెప్పేటప్పుడు అక్కడి ముఖ్యసమస్యలను వదిలేస్తే వచ్చే చిక్కు ఇది. ఇటువంటి ప్రాథమికమైన తప్పులను మంచి ప్రాంతీయ సినిమాలు, మంచి హిందీ సినిమాలు ఎప్పుడో దాటేశాయి.
ఊరిపేర్లు పెట్టి సినిమాలు తియ్యాలంటే కథలు అక్కడి రాజకీయాలకు, పరిస్థితులకు పాక్షికంగా కాకుండా పూర్తిగా కట్టుబడివుండేలా చూసుకోవటం ముఖ్యం.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేసిన హెచ్చరికతో(?) పెద్దషావుకారు 2018 లో షావుకార్లందరినీ కూడేస్తాడు. అంబుసోలిని రౌడీ వాసు సహాయంతో ఖాళీచేయించి అక్కడికి ఫాక్టరీలను తరలిద్దామని చూస్తాడు.
ఇక్కడ దర్శకుడు ఈ కాలపు ప్రజా ఉద్యమాలను బొత్తిగా చిన్నచూపు చూశాడు. పక్కనేవున్న సోంపేటలో ప్రజావుద్యమం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా ఆగిపోయిందో మనందరికీ తెలుసు.

ఫొటో సోర్స్, Youtube/AdityaMusic
ఈ సినిమాలో కూడా మహాభారతం లాగానే ఎక్కువమంది హీరోలూ ఎక్కువమంది విలన్లే తప్ప ప్రజలు లేరు. ఉద్యమాలు లేవు. అంబేద్కర్ ను చదువుకుని వచ్చిన మోహన్రావు చివరకు తన నేలమీది వాస్తవాలని గ్రహించాక తానిప్పుడు వ్యక్తిగత కక్షతో కాకుండా సమాజక్షేమం కోసం దుర్మార్గులను చంపుతానంటాడు.
కొందరు వ్యక్తులు వాళ్లు క్రియేట్ చేసే భయం మాత్రమే మనుష్యులను ఎక్కువకాలం పడి ఉండేట్టు చేయదు. ఇంకేదో ఉండాలి. కానీ ఈ సినిమా వ్యక్తుల చుట్టూనే భయం చుట్టూనే మొత్తం తిరుగుతుంది.
నేర రాజకీయాల చుట్టూ కథ నడిపితేనే కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశ్యం కనిపిస్తుందీ సినిమా చూస్తే. మోహన్రావులో అధ్యయనంతో వచ్చిన మార్పుని కేవలం పది నిముషాల వ్యవధిలో చూపించటంతో కథను హడావుడిగా ముగించినట్టుంది. చాలామంచి సినిమాలుకూడా ప్రేక్షకులను కూర్చోబెట్టటం కోసం రక్తాలు కార్చే నేర ప్రపంచపు థ్రిల్లర్ జానర్ లోనే ఒదగవలసి వస్తోంది. ఇది హాలీవుడ్ అంటించిన జాడ్యం. ప్రపంచ సినిమాలతో సహా అన్ని సినిమాలకూ కూడా ఇప్పుడిది తప్పని సమస్య అయిపోయింది.
అలాగే ఫలానా ఫలానా దినుసులు కలిపితే కమర్షియల్గా సక్సెస్ అవుతుందేమో అన్న ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సినిమాల నుంచి ‘ఇన్స్పైర్’ అయిన దృశ్యాలున్నాయి. మచ్చుకు బైరాగి రాయి మోసుకుంటూ వచ్చే 'బాహుబలి' దృశ్యం. రాయి ఎత్తడం వరకూ సింబాలిక్గా అవసరమే కావచ్చు గానీ దాన్ని మోసుకుంటూ వచ్చి దాంతోనే బైరాగిని చంపడం అనేది మరీ ఎక్కువైన వ్యవహారం. ఇక అసురన్ సినిమా ప్రభావం సరేసరి. డైలాగ్ డెలివరీ మీద ఎవరూ శ్రద్ధ పెట్టినట్టు అనిపించలేదు. సాగతీతలు ఎక్కువయ్యాయి. సహజత్వం లోపించింది. డయలెక్ట్ గురించి కాదు, డైలాగ్ డెలివరీ గురించి.
ఇదంతా అలావుంచితే, తక్కువ బడ్జెట్ తో సినిమా, అందులోనూ పిరియడ్ సినిమా తియ్యటం అనేది అంత సులభమైన విషయం కాదు కాబట్టి కరుణకుమార్ ప్రయత్నాన్ని అభినందించాలి. “నక్కిలీసు గొలుసు” లాంటి సంగీతాన్ని సినిమా మూడ్ కు తగ్గట్టుగా అలంకరించిన రఘు కుంచే టాలెంట్ చక్కగా బయటకు వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా వుంది. పద్యాల సుందర్రావు చేత ఒక్క పద్యాన్ని కూడా పూర్తిగా పాడించకపోవటం అసంతృప్తిగా అనిపించింది.
పద్యం నుండి పాటతో గజ్జెకట్టి చేసే డాన్సుకూ అక్కడినుండి రికార్డింగ్ డాన్సులకూ పయనించిన పలాస కల్చర్ ను పట్టుకునే ప్రయత్నమైతే జరిగింది. అప్పట్లో ప్రేమికులు కలుసుకోవటం కోసం దొడ్డికి పోతున్నామని సాకు చెప్పి చెంబులు పట్టుకుని బైటకుపోవటం ఇప్పుడు చూస్తే గమ్మత్తుగా కనిపిస్తుంది. కాలం చెంబునుంచి జూమ్ దాకా చాలా దూరమే ప్రయాణించింది. పలాస ఇపుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి:
- గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- ఆ అందమైన అలవాటు వేణుమాధవ్‌కు ఉండేది: ఎల్బీ శ్రీరాం
- కరోనావైరస్: లాక్డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్ లాక్డౌన్: కర్ఫ్యూ పాస్ చూపించమన్నందుకు కత్తులతో దాడి... తెగిపడిన ఒక పోలీసు అధికారి చేయి
- కరోనావైరస్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయి-ధారావిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేదెలా?
- కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








