డిస్కో రాజా సినిమా రివ్యూ : రవితేజ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఫలించిందా..

ఫొటో సోర్స్, SRT Entertainments
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
'రాజా ది గ్రేట్' తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ‘మాస్ మహారాజా’ రవితేజ.. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి వినూత్నమైన ప్రయోగాలతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'డిస్కో రాజా'.
టీజర్లు కొత్తగా ఉండటం, రవితేజ స్టైలిష్ లుక్‌తో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
ఆ అంచనాలను ఈ సినిమా అందుకోగలిగిందో, లేదో ఇప్పుడు చూద్దాం.


కథ:
ట్రెక్కింగ్ కోసం లద్దాఖ్ వెళ్లిన ఒక యువ బృందానికి, అనుకోకుండా మంచులో కూరుకుపోయిన ఒక మృతదేహం దొరుకుతుంది. వారి గైడ్ ఆ మృతదేహాన్ని అనధికారికంగా ఒక శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తాడు.
ఆ శాస్త్రవేత్తల బృందం భారత ప్రభుత్వం కళ్ళుకప్పి చనిపోయిన మనిషిని తిరిగి బతికించే ప్రయోగాన్ని మొదలుపెడుతుంది. ఏవేవో ప్రయోగాలు చేసి, చివరికి ఆ మృతదేహానికి ప్రాణం పోస్తుంది.
ప్రాణం పోసుకున్న ఆ వ్యక్తికి తానెవరో, ఎలా చనిపోయాడో.. ఏమీ గుర్తుకురాదు.
అతడికి గతం ఎలా గుర్తుకొస్తుంది? అతన్ని ఎవరు, ఎందుకు చంపేస్తారు? తనని చంపిన వాళ్ల మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు?.. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఫొటో సోర్స్, SRT Entertainments
కథనం - విశ్లేషణ:
35ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయడం, ఆ మనిషి బతికి ప్రత్యర్ధుల మీద ప్రతీకారం తీర్చుకోవడం లాంటి అంశాలు ఎనభై, తొంభై దశకాల్లో వచ్చిన ఆత్మలతో అల్లుకున్న సినిమా కథలను గుర్తుకు తెస్తాయి.
అయితే, ఈ కథలో డైరెక్టర్ సైంటిఫిక్ అంశాలు కొన్నింటిని జోడించారు. అయినా కూడా అది తర్కానికి అందకుండా గాల్లో చక్కర్లు కొడుతుంటుంది.
మూడున్నర దశాబ్దాల తర్వాత హఠాత్తుగా ఈ ప్రపంచంలోకి వచ్చిన వ్యక్తి ప్రవర్తనను చాలా ఆసక్తికరంగా చూపించే వెసులుబాటు ఉన్నా, దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు.
ప్రేక్షకులను మెప్పించడానికి చాలా అవకాశాలు ఉన్నా, కథను ఆసక్తికరంగా మలచడంలో, కథనం పరంగా విఫలమయ్యారు.
సినిమా ఆరంభమైన తీరు చూస్తే ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ చూడబోతున్న అనుభూతికి లోనవుతాం.
రవితేజ రెగ్యులర్ మూస కథలతో విసిగిపోయి, ఆయనని కొత్త కథతో, విభిన్నమైన పాత్రలో చూద్దామని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు అసంతృప్తి మిగులుతుంది.

ఫొటో సోర్స్, SRT Entertainments
దారి తప్పిన దర్శకత్వం:
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకుల నుంచి విభిన్నమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వీఐ ఆనంద్. ఆయన నుంచి సైన్స్ ఫిక్షన్ జానర్లో సినిమా అనగానే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
'ఒక్క క్షణం'చూశాక ఆనంద్ ఆలోచనలు చాలా వినూత్నంగా..ఎగ్జైటింగ్‌గా ఉంటాయని అర్థమైంది. కానీ, ఆ ఐడియాలజీని సినిమాగా మలచడంలో ఆయన తడబాటు ఉన్నట్లు.. 'డిస్కో రాజా'చూస్తే తెలిసిపోతుంది.
మాస్ రాజా అకౌంట్లో మరో మూస కథ:
డిస్కోరాజా అనే దొంగగా, తన వాళ్ల కోసం ప్రాణాలు పెట్టే వాసు అనే సాధారణ కుర్రాడిగా భిన్న పార్శ్వాలున్న పాత్రలో రవితేజ శాయశక్తులా మెప్పించడానికి ప్రయత్నించారు.
డిస్కో రాజాగా ఫ్లాష్ బ్యాక్‌లో మాస్ మహారాజా ఎనర్జిటిక్ నటనకు ఆయన అభిమానులు ఫిదా అయిపోతారు. డిస్కోరాజా పాత్రకు రవితేజ లుక్ కూడా బాగా కుదిరింది.
అయితే, రవితేజ నటనకు తగినట్లుగా సందర్భాలు పడలేదు. ఒక వ్యక్తి డాన్‌గా ఎస్టాబ్లిష్ అయ్యే క్రమాన్ని ఎలివేట్ చేసే సీన్ ఒక్కటి కూడా లేదు.

ఫొటో సోర్స్, SRT Entertainments
నటనకు నోచుకోని నటీమణులు:
సినిమా మొత్తంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. కానీ, రెండు మూడు సీన్లలో పాయల్ రాజ్‌పుత్ గురించి తప్ప.. నభా నటేష్, తన్య హోప్‌ల గురించి అసలు చెప్పడానికేమీ లేదు.
విలన్ పాత్రలో బాబీ సింహా ఆకట్టుకుంటారు. అయితే తమిళంలో అతను చేసే పాత్రలతో పోలిస్తే బాబీ స్థాయికి తగ్గ క్యారెక్టర్ కాదు.
సినిమాలో ఏ కాస్తైనా హాస్యం పడిందంటే అది వెన్నెల కిషోర్ వల్లే. సునీల్ ఏదో కొత్తగా ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.
సత్యం రాజేష్ ఆకట్టుకోలేదు. నరేష్ కూడా తన పాత్రకు సూటవ్వలేదు.సైంటిస్టుగా నటించిన శిశిర్ శర్మ ఫర్వాలేదనిపిస్తారు.
తమన్ సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమా మొత్తంగా 'రంపంపం' అంటూ సాగే నేపథ్య సంగీతం చాలా బాగుంది. 'నువ్ నాతో ఏమన్నావో' పాట కూడా చాలా బాగుంది.
కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం సినిమాకు మరో ఆకర్షణ. 80ల నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్‌ను చూపించడంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సన్నివేశాల్లో ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
రామ్ తాళ్లూరి ఏమాత్రం రాజీపడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు వీఐ ఆనంద్‌కి అన్ని వనరులూ బాగా సమకూరినప్పటికీ ఉపయోగించుకోలేకపోయారు.
(గమనిక: ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్‌కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- 'ఆ తెగలో వృద్ధ మహిళలను నరికి చంపేస్తారు. పురుషులకు మరో రకమైన శిక్ష ఉంటుంది'
- చలికి గడ్డ కట్టుకుని చనిపోయిన పసిబిడ్డ
- ITలో ఈ ఆరు కోర్సులతోనే మంచి అవకాశాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- India Vs New Zealand: శ్రేయస్ దూకుడు.. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









