ఇజాబెల్ డాస్ శాంటోస్: అంగోలాను 'దోచేసిన' ఆఫ్రికా అత్యంత సంపన్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆఫ్రికాలో అత్యంత సంపన్న మహిళ ఇజాబెల్ డాస్ శాంటోస్ తన దేశాన్ని దోచేసి మిలియన్ల సంపదను కూడబెట్టారని లీక్ అయిన కొన్ని పత్రాల ఆధారంగా బయటపడింది.
అంగోలాలో 38 ఏళ్ల పాటు అధ్యక్షుడుగా ఉన్న జోస్ ఎడ్వర్డ్ డాస్ శాంటోస్ కూతురు అనుమానాస్పద ఒప్పందాలు చేసుకున్నారు. ఆమెకు దేశంలోని అత్యంత విలువైన ఆస్తులు కొనడానికి అనుమతి ఉంది.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఇజాబెల్ అవాస్తవాలుగా కొట్టిపారేశారు. అంగోలా ప్రభుత్వ ప్రతీకార చర్యలుగా వర్ణించారు.
ఇజాబెల్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. సెంట్రల్ లండన్‌లో ఆమె పేరిట ఎన్నో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి.
ఇజాబెల్ దగ్గర రెండు బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉందని చెబుతున్నారు. అయితే అంత సంపదను ఆమె ఎలా సంపాదించారు. అది తెలుసుకోవాలంటే మనం అంగోలా గురించి తెలుసుకోవడం కూడా అవసరం.


ఆఫ్రికా దక్షిణ భాగంలో ఉన్న అంగోలాకు పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇక్కడ జాతీయ భాష పోర్చుగలీ. అంగోలాలో పోర్చుగీసు వలసరాజ్య పాలన కొనసాగడమే దీనికి కారణం.
కింబుడు భాషలో అంగోలా అంటే 'రాజు' అని అర్థం. ప్రస్తుత అంగోలా ఒకప్పుడు కాంగో సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అంగోలా సహజ వనరులతో నిండి ఉంటుంది. ఆ విషయం తెలీడంతో యూరప్ కళ్లు ఈ ప్రాంతంపై పడ్డాయి.
16వ శతాబ్దంలో పోర్చుగల్ లువాండాను తమ అధీనంలోకి తెచ్చుకుంది. లువాండా ప్రస్తుతం అంగోలా రాజధానిగా ఉంది.
అంగోలా స్వాతంత్ర్యోద్యమానికి, మిగతా ఆఫ్రికా దేశాల స్వతంత్ర ఉద్యమాలకూ సంబంధం ఉంది. ఆఫ్రికాలో స్వతంత్ర ఉద్యమం 60వ దశకం మొదట్లో ప్రారంభమైంది.
అంగోలా, మొజాంబిక్, గినీ బిసావూ లాంటి దేశాలు పోర్చుగల్ ఆక్రమణలో ఉండేవి. పోర్చుగల్ ప్రపంచంలోనే బలమైన దేశమని, దానిని ఎవరూ ఎదిరించలేరని అది స్థానికుల్లో ఒక భయం ఏర్పడేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి అంగోలా ఉద్యమానికి స్ఫూర్తి
1961 డిసెంబర్‌లో గోవాలో ప్రజలు పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినపుడు, దాని స్పందన అంగోలాలో కనిపించడం ఆసక్తికరమైన విషయం అని చాలా ఆఫ్రికా దేశాల్లో భారత రాయబారిగా పనిచేసిన దీపక్ వోరా చెప్పారు.
"భారతీయులు గోవాలో పోర్చుగీసువారిని ఓడించారని, వారి సైన్యం లొంగిపోయిందనే వార్త అంగోలాలో వ్యాపించింది. నేను దానిపై ఆధునిక అంగోలా జాతిపితగా గుర్తింపు పొందిన అగస్టినో నెటోతో మాట్లాడినపుడు ఆయన భారతీయులు పోర్చుగీసు వారిని ఎదిరించడం మాలో స్ఫూర్తి నింపింది" అని చెప్పారు.
"అప్పట్లో పోర్చుగల్‌లో సాలజార్ ప్రభుత్వం ఉండేది. అది సైనిక నియంతృత్వ పాలన. వారు ఆందోళనకారులను క్రూరంగా అణచివేశారు. అంగోలాలో స్వతంత్ర పోరాటం హింసాత్మకం అవడంతో, పోర్చుగీసువారు ఆ దేశం వదిలి పారిపోవడం మంచిదని భావించారు" అని దీపక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అంగోలాకు 1975లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం లభించింది. అందులో అగస్టినో నెటో 'పాపులర్ మూవ్‌మెంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ అంగోలా'(పీఎంఎల్ఏ) కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీఎంఎల్ఏ నేత అగస్టినో దేశాధ్యక్షుడు అయ్యారు. ఆయన సోషలిజం, మార్క్సిజం పట్ల మొగ్గు చూపేవారు.
"దాంతో, చాలా పశ్చిమ దేశాలకు అన్ని సహజ వనరులు ఉన్న దేశంలో తాము చొరబడలేమని అనిపించింది. ఆ తర్వాత అవన్నీ బలం కూడగట్టుకున్నాయి. అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాలు అగస్టినోను వ్యతిరేకించాయి. అంగోలాలో ప్రధాన నగరాల బయట ప్రాంతాలు తిరుగుబాటుదారుల అధీనంలో ఉండేవి. నెటోకు సోవియట్ యూనియన్ అండ ఉండేది. అక్కడ క్యూబా కూడా చురుకుగా ఉండేది. దాంతో కోల్డ్ వార్‌లో అంగోలా ఒక యుద్ధక్షేత్రంగా మారింది" అని దీపక్ వోరా చెప్పారు.
80వ దశకంలో జరిగిన కొన్ని పెద్ద ఘటనలు అంగోలాపై తీవ్ర ప్రభావం చూపించాయి. అంగోలా అత్యంత సన్నిహితంగా ఉన్న సోవియట్ యూనియన్ ముక్కలైపోయింది. అగస్టినో నెటో కూడా క్యాన్సర్‌తో మాస్కోలో మరణించారు.
నెటో మృతి తర్వాత జోస్ ఎడ్వర్డ్ శాంటోస్ అధ్యక్షుడు అయ్యారు. ఎందుకంటే ఆయన పార్టీలో నంబర్ టూ స్థానంలో ఉండేవారు. ఆయన ఒక ప్రముఖ గెరిల్లా కమాండర్. జోస్ 38 ఏళ్లపాటు దేశాధ్యక్షుడుగా ఉన్నారు. అప్పుడు, దేశంలో తిరుగుబాటుదారులతో అంతర్యుద్ధం కొనసాగింది. 2002లో తిరుగుబాటు నేత జోనస్ సావింబీ మృతితో యుద్ధవిరమణ అమలైంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది?
అంగోలాలో 2 శాతం మంది మాత్రమే విలాసాల్లో జీవిస్తున్నారు. మిగతా 98 మంది జనాభా పరిస్థితి దారుణంగా ఉంటుంది.
2.9 కోట్ల జనాభా ఉన్న అంగోలాలో 30 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. వీరు రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారు.
అంగోలా ఆఫ్రికాలో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే రెండో దేశం. ఆ దేశంలో భారీ వజ్రాల నిల్వలు కూడా ఉన్నాయి. స్థానిక తిరుగుబాటుదారులు వజ్రాల డబ్బుతోనే తమ పోరాటం కొనసాగించేవారు. కాంగో, రువాండా లాంటి ఎన్నో ఆఫ్రికా దేశాల్లో కూడా వజ్రాలతో అందే నిధులతోనే తిరుగుబాటు చేయడం కనిపిస్తుంది. వజ్రాలు అమ్మిన డబ్బుతో వారు ఆయుధాలు కొనుగోలు చేసేవారు.
బీబీసీ పనోరమాకు లీక్ అయిన 7 లక్షల పత్రాల ద్వారా ఇజాబెల్ చమురు, వజ్రాల పరిశ్రమల ద్వారా మిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారనే విషయం తెలిసింది.
ఇజాబెల్ అవినీతి సంపాదన గురించి 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్'(ఐసీఐజే) దర్యాప్తు చేసింది.
అంగోలా ప్రభుత్వ చమురు కంపెనీ సోనాంగోల్ ద్వారా ఇజాబెల్ భారీగా డబ్బు సంపాదించారు. ఆమె తండ్రి 2016లో ఈ చమురు కంపెనీ బాధ్యతలను ఆమెకు అప్పగించారు.
"ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కార్పొరేషన్లు తమ అధీనంలోకి తీసుకోవడం లాంటి ఘటనలు ఆఫ్రికాలో జరుగుతుంటాయి. ఆఫ్రికా దౌర్భాగ్యం అదే. ఇజాబెల్ శాంటోస్ కూడా అదే చేశారు. ఆమె చాలా సంపన్నురాలు. ఆమె, ఆమె భర్త కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారు. ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకున్నారు" అని దీపక్ వోరా చెప్పారు.

దేశంలో ఒకే పార్టీ వ్యవస్థ
అంగోలాలో ఒకే పార్టీ వ్యవస్థ ఉంది. స్వాతంత్ర్యం తర్వాత పీఎంఎల్ఏ అధికారంలోకి వచ్చినపుడు, అది వామపక్షవాదం వైపు మొగ్గు చూపింది. దాంతో రష్యా, చైనా దానికి దగ్గరయ్యాయి. పీఎంఎల్ఏను వ్యతిరేకించే పార్టీలు తర్వాత దానిలోనే కలిసిపోతూ వచ్చాయి. దీపక్ వోరా దానిని 'దోపిడిదొంగల కూటమి' అంటారు.
"పీఎంఎల్ఏ అధికార పార్టీ. కానీ, ప్రజలకు విపక్షంగా కనిపించేలా అదే ఒక పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఆ దేశంలో పార్లమెంటు ఉంది. కానీ అధికారాలన్నీ అధ్యక్షుడి దగ్గరే ఉంటాయి" అని దీపక్ చెప్పారు.
2017 సెప్టెంబర్‌లో జోస్ ఎడ్వర్డ్ డాస్ శాంటోస్ తన పదవి నుంచి తప్పుకున్న తర్వాత జోవావో లారెంక్సూ అధ్యక్షుడు అయ్యారు. కొత్త ప్రభుత్వం ఇజాబెల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చింది. అంగోలాలో ఆమె ఆస్తులను జప్తు చేసింది.
చమురు, వజ్రాలు కాకుండా అంగోలా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంలో కూడా ఉంది. అంగోలాలో సారవంతమైన భూమి ఉంది. ఆ దేశంలో నీటి కొరత కూడా లేదు. కానీ ఇక్కడ వ్యవసాయ పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు.
"అక్కడ చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చమురు, వజ్రాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో కూడా చైనావే ఎక్కువ" అని అంగోలాలో మూడు సార్లు పర్యటించిన దిల్లీ విశ్వవిద్యాలయం ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"నేను అక్కడ చైనా కూలీలను కూడా చూశాను. అంగోలాలో నిరుద్యోగం, అవినీతి చాలా ఎక్కువ. అది కాకుండా అక్కడ ప్రజా సౌకర్యాలు, సామాజిక భద్రత కనిపించవు. కొత్త అధ్యక్షుడు లారెంక్సూ తనకు ప్రజాస్వామ్యం, బహుళపార్టీల వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు. అంగోలా ఆర్థికవ్యవస్థ ఓపెన్‌గా ఉంటుంది. బయటివారు ఇక్కడకు వచ్చి పనిచేస్తారు" అన్నారు.
అంగోలాలో పేదరికం తీవ్రంగా ఉండడానికి అక్కడి అవినీతే కారణం. ఎందుకంటే, నిధులతో దేశంలో పెట్టుబడులు పెట్టడం లేదు. ఆ డబ్బును దేశం బయటికి తీసుకెళ్లారు అని దీపక్ చెప్పారు.
"ఇజాబెల్ దగ్గర 4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉందని భావిస్తున్నారు. డొల్ల, విదేశీ కంపెనీల ద్వారానే అంత డబ్బును ఆమె దేశం బయటకు తీసుకెళ్లగలిగారు. అది అంగోలాలో అందరికీ తెలుసు. ఎవరైనా అది గట్టిగా చెబితే వారిని శిక్షిస్తారు. నేను ఆకలిచావులు చూశాను. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను చూశాను. ఆస్పత్రుల్లో మందులు లేకపోయినా, వాటి బిల్లులు ఉంటాయి. ఇజాబెల్, ఆమె సోదరుడు నేరుగా పెద్ద పెద్ద అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చేవారు. లేదంటే వారిని జైల్లో పడేసేవారు" అని దీపక్ వోరా చెప్పారు.
"ఆఫ్రికాలో ఒక ట్రెండ్ ఉంది. ప్రతి ఒక్కరూ తాము అధికారంలోకి వచ్చే సమయం కోసం వేచిచూస్తారు. పదవిలోకి రాగానే డబ్బు పోగేసుకోవడం ప్రారంభిస్తారు. జోస్ ఎడ్వర్డ్ కూడా డాస్ శాంటోస్ మనిషే. ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు. అతను కూడా అలాగే చేస్తారని చెప్పుకుంటున్నారు" అంటారు వోరా.

ఫొటో సోర్స్, Getty Images
అంగోలా పరిస్థితి మెరుగుపడేదెలా?
చమురు, వజ్రాల నిక్షేపాలు ఉన్నప్పటికీ అంగోలా చాలా వెనుకబడింది. అక్కడ సంస్కరణలు ఎలా సాధ్యం?
"అంగోలా క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నంతవరకూ అది అభివృద్ధి చెందడం కష్టం. దానికోసం, వారు ఫ్రీ ట్రేడ్ జోన్లు ఏర్పాటు చేయాలి. దాంతో అక్కడ నిపుణులైన యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని ప్రొఫెసర్ సురేష్ కుమార్ చెప్పారు.
అంగోలాకు చాలా సామర్థ్యం ఉంది. అక్కడ ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. కానీ పాలన సరిగా లేకపోవడంతో అది నాశనం అవుతోంది అంటారు దీపక్.
"ఆఫ్రికా దేశాల్లో ప్రతి నేతా తన తర్వాత వచ్చే నేతలు ఆ దేశాలను అభివృద్ధి చేస్తారులే అనుకుంటారు. కానీ తర్వాత వచ్చే నేతలు కూడా సంపాదన మీదే దృష్టి పెడుతుంటారు" అంటారు వోరా.
"అంగోలా వ్యవసాయ రంగం చాలా వెనుకబడింది. ప్రభుత్వం, కంపెనీలు అక్కడి చమురు, వజ్రాల మీదే దృష్టి పెడుతున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు వస్తే, అంగోలాకు ఆహార ఉత్పత్తుల దిగుమతులు తగ్గుతాయి. ఒక పరిశ్రమ నిలబడుతుంది. దానివల్ల సమతుల ఆర్థికవ్యవస్థ ఏర్పడుతుంది" అంటారు సురేష్.
అంగోలా ప్రతిభ ఉన్న దేశం. ఆర్థికాభివృద్ధికి ఎన్నో వనరులు ఉన్నాయి. ఈ దేశానికి రాజకీయ, ఆర్థిక రంగంలో మార్పులు అవసరం. బహుళపార్టీల రాజకీయ వ్యవస్థతోపాటు, అది ఇతర దేశాల కోసం తమ ఆర్థికవ్యవస్థను తెరవాలి. తన ఆర్థికవ్యవస్థను ప్రపంచంతో కలిపి నడవడం వల్ల లాభం ఉంటుంది.
అంగోలాలో అన్ని సంస్కరణలు ఎలా తీసుకురావాలి అనేది కొత్త అధ్యక్షుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆఫ్రికాలోని అత్యంత సంపన్న మహిళకు వ్యతిరేకంగా ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇజాబెల్‌ను తిరిగి దేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.
అటు పోర్చుగల్ బ్యాంక్ 'యూరోబిక్' కూడా ఇజాబెల్‌తో అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకున్నట్టు ప్రకటించింది. ఈ బ్యాంకులో ఇజాబెల్‌కు పరోక్షంగా 42.5 శాతం వాటా ఉండేది.
ఇవి కూడా చదవండి:
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- వాతావరణ మార్పు: రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు గత దశాబ్దంలోనే..
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










