వాతావరణ మార్పు: రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు గత దశాబ్దంలోనే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గడిచిన దశాబ్దంలో రికార్డుల్లో ఎన్నడూ లేనంత అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మూడు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు తేల్చాయి.
1850 తర్వాత కాలంలో రెండో అత్యధిక సగటు ఉష్ణోగ్రత గత ఏడాదే నమోదైందని అమెరికా పరిశోధన సంస్థలు ఎన్ఓఏఏ, నాసా, బ్రిటన్ వాతావరణ విభాగం లెక్కగట్టాయి.
గత 170 ఏళ్లను గమనిస్తే, గడిచిన ఐదేళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణ జరగకముందు స్థాయులతో పోల్చితే ఉష్ణోగ్రతలు ఒక సెంటీగ్రేడ్ పెరిగాయి.
2020లోనూ ఇదే ధోరణి కొనసాగొచ్చని బ్రిటన్ వాతావరణ విభాగం అంచనా వేసింది.
ఇప్పటికైతే రికార్డుల్లో 2016 అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా ఉంది. ఎల్ నినో ప్రభావంతో ఆ ఏడాది పాదరసం పరుగులు పెట్టింది.

అయితే, ఇవేవి ఆశ్చర్యపరిచే విషయాలు కావు.
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్‌ఓ) ఇదివరకే ఈ పరిణామం గురించి హెచ్చరించింది.
1850-1900 మధ్య ఉష్ణోగ్రతలతో పోల్చితే 2019లో నమోదైన ఉష్ణోగ్రతలు 1.05 సెంటీగ్రేడ్లు ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది.
గత ఏడాది జూన్, జులైల్లో యూరప్‌ను రెండు పెద్ద వడగాడ్పులు సతమతం చేశాయి. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో 46 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, బ్రిటన్‌ల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆస్ట్రేలియాలోనూ వేసవి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగి కొత్త రికార్డు నమోదైంది.

కఠినమైన సవాళ్లు తప్పవు
- రోజుర్ హరాబిన్, పర్యావరణ విశ్లేషకుడు
ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న ఉద్గారాలను కట్టడి చేసే విషయంలో రాజకీయ చర్యలు కొరవడుతున్నాయి.
గత డిసెంబర్‌లో జరిగిన ఐరాస వాతావరణ మార్పు వార్షిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చివరిదాకా ప్రయత్నించింది.
వాతావరణ మార్పుల కట్టడి విషయంలో ప్రపంచాన్ని బ్రిటన్ ముందుండి నడిపించాలని కోరుకుంటున్నట్లు దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
కానీ, ఆయన ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
విమాన ప్రయాణాలపై విధించే 13 పౌండ్ల (రూ.1200) పన్నును ఎత్తేసే విషయాన్ని పరిశీలిస్తామని బోరిస్ అంటున్నారు. ఉద్యోగాలకు ప్రమాదం రాకుండా, అనుసంధానత మెరుగ్గా ఉండటానికి ఈ చర్య తీసుకుంటామని చెబుతున్నారు.
క్లైమేట్ ఛేంజ్ కమిటీ అధికారికంగా ఆయనకు ఇచ్చిన సలహా మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విమాన టికెట్ల ధరలు తగ్గకూడదని, మరింత పెరగాలని ఆ కమిటీ అభిప్రాయపడింది. అప్పుడే పర్యావరణానికి మేలని చెప్పింది.
రాబోయే దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. వాతావరణ మార్పులు రాజకీయపరమైన సవాళ్లూ విసురుతాయి.

గత 12 నెలల ఉష్ణోగ్రతలకు సంబంధించి మూడు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికలకు అదనంగా కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్, జపాన్ వాతావరణ సంస్థ ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని ప్రపంచ వాతావరణ సంస్థ విశ్లేషించింది.
పారిశ్రామికీకరణకు ముందునాళ్లతో పోల్చినప్పుడు 2019లో ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉన్నట్లు లెక్కగట్టింది.
1980 తర్వాత నుంచి ప్రతి దశాబ్దమూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని బ్రిటన్ వాతావరణ విభాగానికి చెందిన హాడ్లీ సెంటర్‌లోని పరిశోధకుడు డాక్టర్ కోలిన్ మోరిస్ అన్నారు.

మానవ చర్యల వల్ల వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు పెరగడమే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు రికార్డు స్థాయి అత్యధికానికి చేరుకున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలకు, ఉష్ణోగ్రతలకు కచ్చితమైన సంబంధం ఉంది’’ అని బ్రిటన్‌లోని రాయల్ మెటలర్జికల్ సొసైటీ ప్రొఫెసర్ లిజ్ బెంట్లీ అన్నారు.
‘‘గత దశాబ్దంలో మనం అత్యధిక ఉష్ణోగ్రతలను చూశాం. రాబోయే రోజుల్లో మరింతగా చూస్తాం. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువైన కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి’’ అని చెప్పారు.
‘‘మానవ చర్యల వల్లే భూమి వేడెక్కుతుందని మనకు తెలుసు. వాతావరణ మార్పులను కచ్చితత్వంతో గుర్తించడం చాలా ముఖ్యం. 19వ శతాబ్దం ఆఖరి రోజులతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు ఒక సెంటీగ్రేడ్ పెరిగాయని మేం విశ్వాసంతో ఉన్నాం. భిన్న పద్ధతుల్లో జరిగిన అధ్యయనాలన్నీ ఇలాంటి ఫలితాలనే ఇచ్చాయి’’ అని సమాచార సేకరణలో భాగమైన ఈస్ట్ ఆంగిలాస్ క్లైమెట్ రీసెర్చ్ యూనిట్ ప్రొఫెసర్ టిమ్ ఓస్బర్న్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని నాసా, ఎన్ఓఏఏ, బ్రిటన్ వాతావరణ విభాగం ఇచ్చిన సమాచారం భూ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలకు సంబంధించింది.
అయితే, సముద్ర లోతుల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయుల్లోనే నమోదవుతున్నాయి.
2019లో సముద్రాల్లోకి వెళ్లిన ఉష్ణం, గత దశాబ్దంలోనే అత్యధికమని తాజాగా ఓ నివేదిక తేల్చింది.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి
- కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
- అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








