రష్యా: అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడు. వయసు 67 ఏళ్లు.
జీవితంలో ఇప్పటివరకూ ఆయన సాధించింది తక్కువేం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాన్ని రెండు దశాబ్దాలుగా శాసిస్తున్నారు.
పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారు.

ఏం చేశారు?
అసలు పుతిన్ ఏం చేయలేదనేది చర్చించుకుంటే సులభం.
యుద్ధాలు ప్రకటించారు. పెన్షన్ సంస్కరణలు తెచ్చారు. (ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాలను కలుపుకుని) రష్యా భూభాగాన్ని విస్తరించారు. ఆఖరికి క్యాలెండర్లపైనా కనిపించారు.
ఇప్పుడు దేశ అధికార పగ్గాలు తన చేతుల్లోనే కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగంలో సమూల మార్పులను ప్రతిపాదించారు. దేశానికి కొత్త ప్రధానిని నియమించారు.
ఎందుకు?
ఈ మార్పులతో వ్యవస్థ మరింత ప్రజాస్వామికంగా మారుతుందని పుతిన్ అంటున్నారు.
అధ్యక్ష అధికారాలను పరిమితం చేస్తూ, ప్రభుత్వానికి మంత్రుల నియామకం వంటి మరిన్ని అధికారాలను కట్టబెట్టాలని ఆయన భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం పుతిన్ నాలుగో దఫా అధ్యక్ష పదవిలో ఉన్నారు.
ఈ విడత ముగిసిన తర్వాత ఆయన కుర్చీ నుంచి తప్పుకోవాల్సిందే.
రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి వరుసగా రెండు సార్లకు మించి చేపట్టకూడదు.
పుతిన్ 2000 నుంచి 2008 వరకూ వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్నారు.
ఆ తర్వాత నాలుగేళ్లు దిమిత్రి మెద్వెదెవ్‌ను అధ్యక్షుడిగా చేసి, ఆ సమయంలో పుతిన్ ప్రధాని పదవిలో ఉన్నారు.
ఆ తర్వాత మళ్లీ 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టారు. 2018లో నాలుగో దఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అయితే, రష్యా ‘జాతి పిత’ పాత్రను చాలించేందుకు పుతిన్‌కు ఇంకా మనసొప్పడం లేదు.
తన పాలనాధికారాన్ని కొనసాగేంచుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అదెలా..
ఇదివరకటి నాయకుల్లా పుతిన్.. పదవీకాలాన్ని పొడగించుకోవడం (నిజం చెప్పాలంటే, ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుకున్నారు), అడ్డుగా ఉన్న రాజ్యాంగ పరిమితులను తీసేయడం (ఇలా చేసే అవకాశాలున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు), లొసుగులను వాడుకోవడం (దీన్నీ వదల్లేదు) లాంటి మార్గాలను ఆశ్రయించడం లేదు.
ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలియని స్టేట్ కౌన్సిల్ అనే పాలక మండలిని తెరపైకి తెచ్చారు.
స్టేట్ కౌన్సిల్ పేరు గొప్పగా ఉన్నా, ఇంతవరకూ దీని పాత్ర పెద్దగా ఏమీ ఉండేది కాదు.
ఇక మీదట ఆ పరిస్థితిని మార్చాలని పుతిన్ అనుకుంటున్నారు. రాజ్యాంగంలో దీనికి ఉన్నత స్థానం కల్పించాలనుకుంటున్నారు.
ఈ కౌన్సిల్‌కు పుతిన్ అధిపతిగా ఉన్నారు.
ఇంతకుముందు కజఖ్‌స్తాన్‌లో నుర్సుల్తాన్ నజర్బయేవ్ ఇలాంటి పనే చేసి.. అధ్యక్ష పదవి నుంచి దిగాక, ఆ ‘దేశ నాయకుడి’గా కొనసాగారు.

ఫొటో సోర్స్, Getty Images
కథలో తదుపరి మలుపు ఎప్పుడు?
అధ్యక్ష అధికారాలను అనుభవించేందుకు పుతిన్‌కు ఇంకా 2024 వరకూ సమయం ఉంది. ఆ తర్వాత ఆ పదవిలోకి ఎవరు వస్తారన్నది ఇప్పుడే ఊహించడం కష్టం.
కొత్తగా ప్రధాని పదవి చేపట్టిన మిఖాయిల్ మిషుస్తిన్ మాత్రం పోటీలో ఉండకపోవచ్చు.
ఎందుకంటే, 1825 నుంచి రష్యాలోని బట్టతల ఉన్నవాళ్లు, జట్టున్నవాళ్లు ఒకరితర్వాత ఒకరు మారి మారి దేశ నాయకులు అవడం సంప్రదాయంగా ఉంది. పాపం మిఖాయిల్‌ది కూడా బట్టతలే కాబట్టి, ఆయనకు అధ్యక్ష యోగం లేదని అనుకోవచ్చు.
మిఖాయిల్ గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. రష్యా ప్రధాని పదవి చేపట్టేదాకా, ఆయన గురించి ఇంగ్లీష్‌లో వికీపీడియా పేజీనే లేదు. దీన్ని బట్టి ఆయన ఎంత ప్రముఖుడో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు
- పుతిన్‌ను ఓ ప్రశ్న అడిగింది... ఈ జర్నలిస్టు ఉద్యోగం పోయింది
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- రష్యా సైన్యంలోకి హస్కీ డాగ్స్: ‘సైనిక వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకూ ఇవి వెళ్లగలవు’
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- నాటో అంటే ఏమిటి.. దానికి ఇంకా ప్రాధాన్యం ఉందా
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








