సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ ప్లేబాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది

డియాగో తాబేలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తన వంశం అంతరించిపోకుండా కాపాడుకున్న తాబేలుగా డియాగోకు పేరొచ్చింది

ఈక్వెడార్‌లోని గలాపాగోస్ ద్వీపాల్లో ఉండే డియాగో అనే ఈ భారీ తాబేలు కామోద్దీపనలు తమ జాతి అంతరించిపోకుండా కాపాడాయి.

గలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటా క్రూజ్ ద్వీపంలోని పార్కులో తాబేళ్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 14 మగ తాబేళ్లలో డియాగో ఒకటి.

1960ల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంమైది. ఇప్పటి వరకూ రెండు వేలకు పైగా భారీ తాబేళ్లు ఇక్కడ పుట్టి, పెరిగాయి.

దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి డియాగో సెక్స్ కోరికలేనని కార్యక్రమ నిర్వాహకులు అంటున్నారు.

వందేళ్ల వయసున్న ఈ తాబేలు సుమారు 800 తాబేళ్లకు తండ్రి అయ్యింది.

line
News image
line
వీడియో క్యాప్షన్, వీడియో: సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ ప్లేబాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది

ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసింది, డియాగో తిరిగి తన ఎస్పన్నోల ద్వీపానికి వెళుతోందని గలాపాగోస్‌ నేషనల్ పార్క్స్ (పీఎన్‌జీ) సర్వీస్ తెలిపింది.

అక్కడ ఉన్న 1800 తాబేళ్ల జనాభాతో డియాగో కలుస్తుంది. ఈ జనాభాలో కనీసం 40 శాతానికి జన్మనిచ్చిన తండ్రి డియాగోయేనని పార్కు సిబ్బంది నమ్ముతున్నారు.

''ఎస్పన్నోలాకు తిరిగొస్తున్న తాబేళ్ల వంశంలో అత్యధిక తాబేళ్లు జన్మించడానికి కారణమైంది డియాగోనే'' అని పార్క్ డైరెక్టర్ జార్జ్ కరియాన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

''ఈ తాబేలును తిరిగి తన సొంత ప్రాంతానికి, సహజ వాతావరణానికి తీసువస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

80 ఏళ్ల కిందట ఒక శాస్త్రీయ యాత్రలో భాగంగా డియాగోను గలాపాగోస్‌ నుంచి తీసుకెళ్లారని పార్కు సిబ్బంది భావిస్తున్నారు.

ఎస్పన్నోల ద్వీపంలో 50 ఏళ్ల కిందట రెండు మగ తాబేళ్లు, 12 ఆడ తాబేళ్లు మాత్రమే ఉండేవి.

ఈ జాతి తాబేళ్లను కాపాడేందుకు డియాగోను, చెలొనొయిడిస్ హూడెన్సిస్ అనే మరొక తాబేలును కాలిఫోర్నియాలోని శాన్ డియాగో జూకు తీసుకెళ్లారు.

గలాపగోస్‌‌లో ఈ ఏడాది పుట్టిన తాబేలు పిల్లల్లో ఒకదాని బరువు చూస్తున్న పార్కు సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఎస్పన్నోల ద్వీపంలో ఇప్పుడు 1800 తాబేళ్లున్నాయి

ఇప్పుడు డియాగో తన సొంత ద్వీపానికి విజయవంతంగా తిరిగి వెళుతోంది. అందుకే, దీనిని ఇతర తాబేళ్లతో కలవకుండా వేరుగా ఉంచుతున్నారు.

గాలాపాగోస్‌ 21 ద్వీపాల్లో ఎస్పన్నోల ఒకటి. మిగతా 20 ద్వీపాల కంటే కూడా పురాతనమైనది.

ఈక్వెడార్‌కు పశ్చిమాన ఉన్న గలాపాగోస్‌ ద్వీపాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతం హోదా పొందాయి. ఇక్కడి మొక్కలు, వన్యప్రాణులకి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉష్ణమండల బల్లులు, తాబేళ్ల వంటి చాలా దేశీయ జాతుల్ని గాలాపాగోస్‌ ద్వీపాల్లో కనుగొన్నారు.

ఇక్కడి జీవవైవిధ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)