భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’

ఫొటో సోర్స్, SNH
- రచయిత, స్టీవెన్ మెకంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో గాలం, వల, ఉచ్చు లాంటి చేపలవేట సామగ్రి ఏటా దాదాపు ఆరున్నర లక్షల టన్నులు పోగుపడుతోందని అంచనా. సముద్రంలో, తీరంలో ఇవి శరీరానికి చుట్టుకొని ఎన్నో ప్రాణులు చనిపోతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న ఈ ఫిషింగ్ గేర్‌ను పర్యావరణ సంరక్షకులు 'ఘోస్ట్ గేర్' అని పిలుస్తారు.
ఈ సామగ్రి చేపల బోట్లు, ఫిషింగ్ గ్రౌండ్ల నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడమో లేదా తుపాన్ల లాంటి అత్యవసర పరిస్థితుల్లో దీనిని పడేయడమో జరుగుతుంటుంది.
సముద్ర జీవులను పట్టుకోవడానికి వీలుగా ఈ సామగ్రిని తయారుచేస్తారని, సముద్రంలో కోల్పోయిన, లేదా వదిలేసిన చాలా కాలం తర్వాత కూడా ఇది అదే పనిచేయగలదని గ్లోబల్ ఘోస్ట్ గేర్ ఇనిషియేటివ్(జీజీజీఐ)కి చెందిన జోయల్ బాజియుక్ చెప్పారు.
ఇలా కోల్పోయిన సామగ్రి తన కాలం చెల్లిన తర్వాత కూడా చేపలను పట్టుకొంటూ ఉంటే దీనిని 'ఘోస్ట్ ఫిషింగ్' అంటారని ఆయన తెలిపారు.
ఇది సముద్రజీవులకు అత్యంత ప్రమాదకరమైన సామగ్రి అని, ఎందుకంటే వాటికి ఈ చెత్తలో చిక్కుకుపోయే ముప్పుంటుందని జోయల్ ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Karen Munro
ఏటా సముద్రాల్లో కోల్పోయే లేదా వదిలేసే సామగ్రి 6.4 లక్షల టన్నులు ఉంటుందని జీజీజీఐ అంచనా వేస్తోంది.
ఆస్ట్రేలియాలోని గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా, పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి లాంటి ప్రాంతాల్లో ఈ చెత్త పెద్దయెత్తున పేరుకుపోతోంది. ఇది సముద్ర కాలుష్యం కిందకు వస్తుంది.
స్కాట్లాండ్ సహా చేపలవేట సాగే ప్రతీ చోట ఘోస్ట్ గేర్ సమస్య ఉందని జోయల్ చెప్పారు.
చేపలవేట సామగ్రిలో చిక్కుకొని 2019లో స్కాట్లాండ్‌లో 12 ప్రాణులు చనిపోయినట్లు సముద్రజీవుల మరణాలపై పరిశోధన జరిపే 'స్కాటిష్ మారిటైమ్ యానిమల్ స్ట్రాండిగ్స్ స్కీమ్(స్మాస్)' తెలిపింది.
గర్భంతో ఉన్న తిమింగలం వీటిలో ఒకటి. ఇది అక్టోబర్లో ఓర్క్నీ దీవుల సముదాయంలోని సముద్ర జలాల్లో చేపలవల నోటిలో చిక్కుకుపోవడం వల్ల చనిపోయింది.
ఏప్రిల్, మే నెలల్లో టైనింగ్‌గామ్, స్క్రాబ్‌స్టర్ ప్రాంతాలకు సమీపాన రెండు తిమింగలాలు చేపలవేట సామగ్రిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి.

ఫొటో సోర్స్, David Yardley
వలలు లాంటివి చుట్టుకుపోవడమే కాదు, ఇతర రూపాల్లోనూ తిమింగలాల ప్రాణాలకు ముప్పు ఎదురవుతోంది.
నవంబరులో ఐజిల్ ఆఫ్ హ్యారిస్‌లో చనిపోయిన ఒక స్పెర్మ్ వేల్ కడుపులో వంద కేజీల చెత్త బయటపడింది. చేపలవేటలో వాడే వలలు, తాళ్లు, ప్యాకింగ్ స్ట్రాప్‌లు, సంచులు, ప్లాస్టిక్ కప్పులు, ఇతర వస్తువులు ఇందులో ఉన్నాయి.
వలలు, తాళ్లలో సీల్స్ కూడా ఇరుక్కుపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని కాపాడగలుగుతున్నారు. ఇలా లూయిస్‌లో ఒక ప్లాస్టిక్ వలలో చిక్కుకుపోయిన ఐదు వారాల వయసున్న సీల్ పిల్లను రక్షించారు.
బ్రిటన్లో సీల్స్ ఇలా చిక్కుకుపోవడంపై బ్రిటిష్ డైవర్స్ మరీన్ లైఫ్ రెస్క్యూ(బీడీఎంఎల్‌ఆర్) ఆధ్వర్యంలోని ఒక హాట్‌లైన్‌కు ఏడాది కాలంలో 47 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో కొన్నింటిని సహాయ సిబ్బంది కాపాడారు. కొన్ని వాటంతటవే తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాయి.

ఫొటో సోర్స్, SMASS
తీరంలో ఆహారం కోసం వెతికే జంతువులు కూడా ఘోస్ట్ గేర్ బారిన పడుతున్నాయి. 2017లో ఐజిల్ ఆఫ్ రమ్‌లో జింకల కొమ్ములకు ఈ సామగ్రి చిక్కుకుపోయింది. వీటిలో రెండు జింకలు తర్వాత చనిపోయాయి.
ఘోస్ట్ గేర్‌లోని చిన్న చిన్న భాగాలు కూడా ప్రమాదకరమేనని పర్యావరణ ఉద్యమకారులు చెబుతున్నారు.
ఇలాంటి భాగాలను చేపలగుడ్లో, ఇతర ఆహారమో అనుకొని సముద్రపక్షులు ఆహారమనుకొని మింగుతాయని, ఇవి గొంతులో ఇరుక్కుపోయి ప్రాణం మీదకు తెస్తాయని స్కాటిష్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని లివింగ్ సీస్ ప్రాజెక్ట్‌కు చెందిన నోయల్ హాకిన్స్ తెలిపారు.
కొన్ని పక్షలు ఈ సామగ్రిని గూళ్లు పెట్టుకోవడానికి వాడుకుంటాయని, దీనివల్ల పక్షుల పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుందని నోయల్ చెప్పారు.

ఫొటో సోర్స్, SMASS Orkney
పరిష్కారానికి ఏం చేస్తున్నారు?
ఘోస్ట్ గేర్ సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో స్కాట్లాండ్ తన వంతు పాత్ర పోషిస్తోంది.
జీజీజీఐ చేపట్టిన ఓ ప్రాజెక్ట్ కింద ఘోస్ట్ ఫిషింగ్ యూకే సంస్థకు చెందిన డైవర్లు ఓర్క్నీలో సముద్రం లోపల చెత్త తొలగిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ గ్రూపులు, సహాయ బృందాలు, జాలర్ల కూటమి అయిన 'స్కాటిష్ ఎంటాంగిల్‌మెంట్ అలయెన్స్(సీ)'లో బ్రిటిష్ డ్రైవర్స్ మరీన్ లైఫ్ రెస్క్యూ(బీడీఎంఎల్‌ఆర్) భాగంగా ఉంది.
ఘోస్ట్ గేర్‌లో సముద్ర ప్రాణులు చిక్కుకుపోయే పరిస్థితులను నివారించేందుకు, అలాంటి ఘటనల్లో బాధిత జీవులను కాపాడేందుకు అనుసరించాల్సిన విధానాలను గుర్తించేందుకు ఈ కూటమి ప్రయత్నిస్తోంది.
ఇలాంటి జీవులను ఎలా కాపాడాలనేదానిపై స్కాట్లాండ్‌లో మత్స్య పరిశ్రమలోని 20 మందికి ఈ కూటమి 2019లో శిక్షణ ఇచ్చింది.

ఫొటో సోర్స్, BDMLR
ఈ కూటమి ప్రయత్నాల్లో సత్ఫలితాలూ వస్తున్నాయి. అక్టోబర్లో ఓర్క్నీలో చేపలవేటలో వాడే తాళ్లలో చిక్కుకుపోయిన ఒక తిమింగలాన్ని బీడీఎంఎల్‌ఆర్ తోడ్పాటుతో కాపాడారు.
ఘోస్ట్ గేర్ సమస్య పరిష్కారానికి ఐరోపా వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ చురుగ్గా ప్రయత్నిస్తోందని స్కాట్లాండ్ మత్స్యకారుల సమాఖ్య చెబుతోంది.
స్కాట్లాండ్ తీరానికి కొట్టుకొచ్చే ఘోస్ట్ గేర్‌ను తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, SWT
వాయువ్య హైలాండ్స్‌లో మారుమూల ప్రాంతాల్లో స్కాటిష్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని లివింగ్ సీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా తీరాన్ని శుభ్రపరిచేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
కొన్ని పెద్ద బాక్సులను అందుబాటులో ఉంచి, తమ దృష్టికి వచ్చిన చెత్తను వీటిలో వేయండని బీచ్‌ల వెంబడి నడిచే ప్రజలకు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, SWT
డన్ కన్నా బీచ్‌లో ఇలాంటి ఒక కేంద్రంలో ఒక టన్నుకు పైగా చెత్త వచ్చి పడిందని లివింగ్ సీస్ ప్రాజెక్ట్‌కు చెందిన నోయల్ హాకిన్స్ తెలిపారు.
ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన శుద్ధి కార్యక్రమంలో వాయువ్య హైలాండ్స్‌లోని సమ్మర్ ఐజిల్స్ నుంచి జులైలో టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు.
సముద్రంలో పేరుకుపోయే ఇలాంటి వ్యర్థాల్లో కేవలం మూడు నుంచి ఐదు శాతం వరకే ఒడ్డుకు వస్తుందనే అంచనాలున్నాయని, దీనిని గుర్తుంచుకోవాల్సి ఉందని, సముద్రంలోపలే అత్యధిక చెత్త ఉండిపోతోందని నోయల్ హాకిన్స్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసగిస్తున్నారా?
- ఇరాన్ దాడి: ఈ సంక్షోభంలో గెలిచిందెవరు? ఓడిందెవరు?
- డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ట్రాయ్: ట్రోజన్ యుద్ధం నిజంగా జరిగిందా లేక కట్టు కథా?
- ఎవరెస్టు సహా హిమాలయాలపై పెరుగుతున్న మొక్కలు.. మంచు తగ్గడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
- గాలి నుంచి ప్రొటీన్ తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








