‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check

ఐలయ్య

ఫొటో సోర్స్, UGC

జనవరి 5న జేఎన్‌యూలో హింస జరిగినప్పటి నుంచి ఆ ముసుగుల్లో ఉన్న వ్యక్తులు ఎవరనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫొటో కూడా వైరల్ అవుతోంది.

''ఈ వ్యక్తి జేఎన్‌యూలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, లోపల హింస జరుగుతోందని, తల్లిదండ్రులెవరూ లోపలికి వెళ్లకూడదని పోలీసులు చెప్పారు. దానికి ఈ వ్యక్తి.. 'నేను జేఎన్‌యూ విద్యార్థిని' అని చెప్పాడు''. - ఇవి ఆ ఫొటో కింద రాసిన వాక్యాలు.

ఐలయ్య

ఫొటో సోర్స్, SM VIRAL GRAB

కానీ, మీలో చాలామందికి ఈ ఫొటోలో ఉన్నది ఎవరో ఇప్పటికే తెలిసుంటుంది. ఇది రచయిత, దళిత కార్యకర్త, ప్రొఫెసర్ అయిన కంచ ఐలయ్య ఫొటో.

ఇదే ఫొటో కింద సోషల్ మీడియాలో మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

''జేఎన్‌యూలో చదవడం అనేది జీవితాంతం సాగే ప్రక్రియ. ఇతని పేరు మొయినుద్దీన్. ఇతడిది కేరళ. వయసు 47ఏళ్లు. 1989 నుంచి ఇతడు దిల్లీలో జేఎన్‌యూ విద్యార్థిగా ఉంటున్నాడు.

ఇతనికి ఉద్యోగం లేదని, జేఎన్‌యూలో చదువుకుంటున్నానని చెబుతున్నాడు.

ప్రతి సంవత్సరం రూ.10 హాస్టల్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకుంటున్నాడు. అలా 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు.

ఇలాంటి వందలాది మోయినుద్దీన్‌లు జేఎన్‌లో చదువుతూనే ఉన్నారు. వీళ్లంతా కూడా 300 హాస్టల్ ఫీజు కోసం జేఎన్‌యూ యాజమాన్యంతో గొడవ పడుతున్నారు''... కంచ ఐలయ్య ఫొటో కింద సోషల్ మీడియాలో కనిపిస్తున్న మరో కథ ఇది.

ఐలయ్య

ఫొటో సోర్స్, SM VIRAL GRAB

కంచ ఐలయ్యకు జేఎన్‌యూకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన 38 ఏళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐదేళ్ల పాటు మౌలానా ఆజాద్ యూనివర్సిటీలోనూ పనిచేశారు.

''సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో పాటు ప్రచారమవుతున్నదంతా ఫేక్ న్యూసే. నా వయసు 68 ఏళ్లు. నేనెప్పుడూ జేఎన్‌యూలో చదువుకోలేదు. 1976లో నేను జేఎన్‌యూలో ఎంఫిల్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాను. కానీ నాకు అడ్మిషన్ దొరకలేదు. నేను చదువుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో. 38ఏళ్ల పాటు అక్కడే పాఠాలు బోధించాను. రిటైరవ్వడానికి ముందు ఐదేళ్లపాటు మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో పనిచేశాను'' అని ఐలయ్య బీబీసీకి తెలిపారు.

''నా ఫొటోను ఉపయోగించుకొని ఇలా జేఎన్‌యూపై దుష్ప్రచారం చేస్తున్నారని నాకు తెలియదు'' అని ఆయన అన్నారు.

2019 మేలో ఈ ఫొటోను విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో జేఎన్‌యూ విద్యార్థులు పెరిగిన యూనివర్సిటీ ఫీజులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అప్పుడు కూడా 'కేరళకు చెందిన మోయినుద్దీన్ 1989 నుంచి జేఎన్‌యూలో చదువుతున్నారు' అని ప్రచారం చేశారు.

కంచె ఐలయ్య

ఫొటో సోర్స్, SM VIRAL GRAB

గత కొంతకాలంగా జేఎన్‌యూలో నిరసనలు జరిగినప్పుడల్లా దళిత కార్యకర్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఫొటోతో దుష్ప్రచారం జరిగిందని బీబీసీ పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)