సులేమానీ హత్య, ఇరాన్ క్షిపణులతో గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు?

ఇరాన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, NURPHOTO

    • రచయిత, డాక్టర్ సనమ్ వకీల్
    • హోదా, చాథం హౌస్

ఇరాన్ సైనిక జనరల్ కాశిం సులేమానీని అమెరికా హత్య చేయటం - దానికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో దాడి చేయటం.. ఈ పరిణామాలు తీవ్ర పర్యవసానాలు గల సంఘర్షణకు దారితీస్తాయన్న భయాందోళనలను పెంచేశాయి.

ఈ సంక్షోభంలో ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? అనేది అమెరికా, ఇరాన్‌లు తర్వాత ఏం చేస్తాయనే దానిని బట్టి వేగంగా మారిపోతుంటుంది.

మరైతే విజేతలెవరు? పరాజితులెవరు?

ఇరాన్

ఒక శక్తివంతమైన సైనిక నేతను కోల్పోయినప్పటికీ.. కాశిం సులేమానీ హత్య వల్ల ఇరాన్ స్వల్పకాలిక ప్రయోజనం పొందవచ్చు.

సైనిక జనరల్ మరణం, ఆయన అంత్యక్రియల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనటం.. నవంబర్‌లో పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా తలెత్తిన ఆందోళనల మీద ప్రభుత్వం హింసాత్మకంగా విరుచుకుపడటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి ఇరాన్‌కు ఉపయోగపడింది.

నిలువుగా విభజితమై ఉన్న రాజకీయ నాయకత్వం.. సంక్షోభ సమయంలో ఏకీకృతం కాగల సామర్థ్యాన్ని ప్రదర్శించటానికి సులేమానీ మరణం వీలు కల్పించింది.

అరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2018లో వైదొలగటంతో పాటు ఆంక్షలను పునరుద్ధరించటంతో ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇరాన్ గత ఏడాది ఒక అమెరికా డ్రోన్‌ను కూల్చివేయటంతో పాటు, పలు ట్యాంకర్ ఓడలను నిర్బంధించటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల మీద జరిగిన క్షిపణి దాడుల వంటి వాటికి ఇరాన్ ప్రోద్బలం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరించింది.

ఇరాక్‌లోని అమెరికా బలగాలు లక్ష్యంగా క్షిపణి దాడులు చేసిన ఇరాన్ ఇప్పటికే అమెరికా మీద ఎదురు దెబ్బ కొట్టింది. ఇంకా ప్రతీకార దాడులు చేయటం వాయిదావేసి.. ప్రజా సానుభూతిని కూడగట్టుకోవటం, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించటం ద్వారా ఇరాన్ మరింత ప్రయోజనం పొందవచ్చు.

అయితే.. ఆ దేశం మరో చర్యకు దిగినట్లయితే.. దానిని విజేతగా పరిగణించబోరు.

అమెరికా కన్నా సైనికపరంగా తక్కువ బలమున్న ఇరాన్.. సులేమానీ మరణానికి ప్రతీకారంగా ఇంకా ఎక్కడ, ఎటువంటి చర్యకు దిగుతుందనే దానిని బట్టి.. అమెరికాతో సైనిక చర్యలు, ప్రతి చర్యల వలయంలో చిక్కుకుని దెబ్బతినవచ్చు.

ఇప్పటికే భారీ ఆంక్షలు ఎదుర్కొంటూ.. అణు ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న ఒత్తిడిని తట్టుకుంటూ ఉన్న ఇరాన్‌.. సంక్షోభం ఇంకా పెరుగుతూ పోతే మరింత ఏకాకిగా మారవచ్చు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా

ఇరాన్ సైనిక బలాన్ని దెబ్బకొట్టటంలో ట్రంప్ ప్రభుత్వం సఫలమై ఉండొచ్చు. అది నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాన్ని మెరుగుపరచి ఉండొచ్చు.

ఇప్పటికే తన శక్తి ఏమిటనే సందేశాన్ని.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి మిత్రపక్షాలకు సంఘీభావ సందేశాన్ని అమెరికా చాటింది.

అయితే.. దెబ్బకు దెబ్బ అనే తరహా సైనిక చర్యల్లోకి అమెరికా దిగినట్లయితే చమురు ధరలు పెరిగే అవకాశముంది. మరికొంతమంది అమెరికన్ల ప్రాణాలు పోవటంతో పాటు.. సుదీర్ఘకాలం సాగే ప్రాంతీయ యుద్ధాన్ని రగిలించవచ్చు.

ఇది.. మధ్య ప్రాచ్యంలోను, దానికి ఆవలా చాలా దేశాల మీద ప్రభావం చూపగలదు.

ఇరాక్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఇరాక్‌లోని షియాలు

ఇరాక్‌లో ఇరాన్ మద్దతున్న షియా మిలీషియాలు.. ప్రస్తుత సంక్షోభం నుంచి స్వల్పకాలిక లాభం పొందే అవకాశముంది.

ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం అంశంపై ఇరాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా తీవ్ర నిరసనలను ఎదుర్కొంటోంది. మరోవైపు పరిపాలన అధమంగా ఉందని, అవినీతి పెరిగిపోతోందని ఫిర్యాదులూ ఉన్నాయి.

ఈ మిలీషియాలు, ఇరాక్‌లోని మిగతా రాజకీయ వర్గం.. ఇరాక్‌లో తాము కోల్పోయిన పట్టును మళ్లీ సంపాదించుకోవటానికి, తాము దేశంలో ఉండాల్సిన అవసరం ఉందనే వాదనను బలోపేతం చేసుకోవటానికి సులేమానీ మరణాన్ని వాడుకుంటున్నాయి.

ఇరాక్ నుంచి అమెరికా బలగాలను తరిమివేయాలనే ప్రతిజ్ఞ.. చాలా కాలంగా ఈ గ్రూపులను ఏకం చేసే నినాదంగా ఉపయోగపడుతోంది. వారి నాయకులు దీనిని ఉపయోగించుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో తలెత్తిన భద్రతా లోపాన్ని ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునే అవకాశముంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్

మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాల విషయమై ఇరాన్ - ఇజ్రాయెల్‌ల మధ్య సుదీర్ఘ కాలంగా సంఘర్షణ కొనసాగుతోంది. ఈ యూదు దేశాన్ని తొలగించాలన్నది ఇరాన్ ప్రగాఢ వాంఛ.

ఇజ్రాయెల్ కోణంలో చూస్తే.. చాలా ప్రమాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రత్యర్థులైన లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌లకు ఇరాన్ మద్దతు ఇస్తుండటం అందులో ఒకటి.

అయితే.. ఇరాన్‌ను కట్టడిచేయాలని అమెరికాలో పెరుగుతున్న పట్టుదలను సులేమానీ మరణం చాటుతోంది.

ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్‌లో.. ఇరాన్, అది మద్దతు ఇచ్చే గ్రూపులకు వ్యతిరేకంగా తమ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒక సానుకూల చర్యగా పరిగణించే అవకాశముంది.

''ఇజ్రాయెల్ శాంతి, భద్రత, ఆత్మ రక్షణ కోసం తన న్యాయమైన పోరాటంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తుంది'' అని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడి అనంతరం పేర్కొన్నారు.

లెబనాన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

మధ్య ప్రాచ్యంలో నిరసనలు

యుద్ధం జరిగే అవకాశం ఉండటం.. మధ్య ప్రాచ్య దేశాల ప్రభుత్వాలు ఈ ప్రాంతమంతటా నిరసనలను అణచివేయటానికి ఒక సాకుగా ఉపయోగపడుతుంది.

ప్రత్యేకించి.. ఇరాక్‌, లెబనాన్, ఇరాన్‌లలో నిరుద్యోగం, అవినీతి వంటి అంశాల మీద ఇటీవలి నిరసనలను అణచివేయటం.. దేశ భద్రత పేరుతో కొనసాగుతుంది.

రాజకీయ కార్యకర్తల మీద విరుచుకుపడటానికి, రాజకీయ సంస్కరణల కోసం ఎటువంటి ప్రయత్నాలనైనా నిలిపివేయటానికి ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుంటాయి.

హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడులు

ఫొటో సోర్స్, Reuters

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి.

గత ఏడాది హోర్ముజ్ జలసంధిలో ఓడల మీద జరిగిన దాడుల్లో, సౌదీలోని చమురు క్షేత్రాల మీద దాడుల్లో ఈ రెండు దేశాలూ ప్రత్యక్షంగా ప్రభావితమయ్యాయి. ఆ దాడులు ఇరాన్ లేదా ఇరాన్ మద్దతున్న శక్తుల పనిగా భావిస్తున్నారు. అయితే వాటిలో తన పాత్ర ఏదీ లేదని ఇరాన్ నిరాకరించింది.

యూఏఈ ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవటానికి ప్రయత్నించింది. అయితే.. అమెరికా నుంచి గరిష్ట ఒత్తిడికి సౌదీ అరేబియా మద్దతివ్వటం కొనసాగించింది.

సులేమానీ హత్య జరిగినప్పటి నుంచీ ఈ రెండు దేశాలూ సంయమనం, శాంతి పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చాయి. సౌదీ రక్షణ మంత్రి అమెరికా వెళ్లి ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

కానీ.. ఇరాన్‌తో వారి భౌగోళిక సామీప్యత, గతంలో ఉద్రిక్తతల చరిత్రను బట్టి.. ఇరాన్ దాడికి దిగేట్లయితే ఈ రెండు దేశాలూ లక్ష్యంగా మారే పరిస్థితులు ఉన్నాయి.

యూరప్

బీటలువారిన ఇరాన్ అణు ఒప్పందాన్ని నిలబెట్టటానికి ఇప్పటికే తిప్పలుపడుతున్న యూరప్.. అమెరికా - ఇరాన్‌ల మధ్య చిక్కకుంది.

అమెరికా డ్రోన్ దాడుల గురించి బ్రిటన్‌కు ముందస్తు హెచ్చరిక ఏదీ ఇవ్వలేదు. ఇది.. అట్లాంటిక్‌కి అటూ ఇటూ ఉద్రిక్తతలు కొనసాగుతుండటాన్ని లేదా కనీసం సమాచార లోపాన్ని సూచిస్తోంది.

అదే సమయంలో.. ఐసిస్ మీద పోరాటంలో సహకరించిన పలు యూరప్ దేశాల బలగాలు ఇంకా ఇరాక్‌లో ఉన్నాయి. ఇరాన్ గనుక సైనిక ప్రతిస్పందనను ఎంచుకున్నట్లయితే ఆ దేశాలు ఈ సంఘర్షణ మధ్యలో చిక్కకునే పరిస్థితి ఉంది.

మొత్తంమీద.. దాదాపు దశాబ్దం కిందట అరబ్ వసంతం ఆందోళనలను రగిల్చిన పరిపాలన, ప్రాంతీయ సుస్థిరత సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్న విషయాన్ని సులేమానీ హత్య మనకు గుర్తుచేస్తుంది.

డాక్టర్ సనమ్ వకీల్.. చాథం హౌస్‌ డిప్యూటీ ప్రెసిడెంట్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)