ఇరాన్ సైనిక కమాండర్ కాసిం సులేమానీ హత్య... ట్రంప్ మళ్లీ గెలిచేందుకు ఉపయోగపడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోనీ జర్చర్
- హోదా, ఉత్తర అమెరికా ప్రతినిధి
అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ కీలక సైనిక కమాండర్ కాసిం సులేమానీని హతమార్చడం... అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? ఈ రోజుల్లో ప్రతి అంశమూ అధ్యక్ష ఎన్నికల రాజకీయాల్లో చేరిపోతోంది. ఇది కూడా ఒక కీలకమైన అంశం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో... ఇరాన్ చేపడుతున్న ప్రతిచర్యల తర్వాత పరిస్థితులు ఏటు దారితీస్తాయన్న దానిపై దీర్ఘకాలిక పరిణామాలు ఆధారపడి ఉంటాయి.
స్వల్పకాలికంగా చూస్తే, త్వరలో జరగబోయే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ఎంపికపై, నవంబర్‌లో జరగనున్న సాధారణ ఎన్నికలపై తాజా పరిణామాల ప్రభావం ఉంటుంది.
గతాన్ని పరిశీలిస్తే, విదేశాంగ విధానంలో సంక్షోభాలను ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షులు స్వల్పకాలికంగా ప్రజల మద్దతుతో లబ్ధి పొందారు. అలా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ప్రజల నుంచి తాత్కాలికంగా మద్దతు పెరగడాన్ని అమెరికాలో 'ర్యాలీ ఎరౌండ్ ద ఫ్లాగ్ ఎఫెక్ట్' అంటారు.
అలాంటి ప్రజా మద్దతు 1971 గల్ఫ్ యుద్ధం సమయంలో జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌కు ఉపయోగపడింది. 2001లో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అఫ్గానిస్థాన్‌లో అమెరికా బాంబు దాడి చేయడంతో జార్జ్ డబ్ల్యూ బుష్‌కు ప్రజల నుంచి మద్దతు పెరిగింది.
అయితే, అవి భారీ సైనిక చర్యలు. ఇక తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కనీసం ఓట్ల రూపంలోనైనా తప్పకుండా కొంత ప్రయోజనం చేకూరుతుంది.
2011లో లిబియాలో వైమానిక దాడి చేసినప్పుడు బరాక్ ఒబామాకు ఉన్న ప్రజాదరణ (రేటింగ్)లో ఎలాంటి మార్పు రాలేదు. రసాయన ఆయుధాలను ప్రయోగించిన సిరియాపై డోనల్డ్ ట్రంప్ హయాంలోని అమెరికా క్షిపణులతో దాడులు చేసింది. అప్పుడు ట్రంప్ రేటింగ్ స్వల్పంగా పెరిగింది.
తాజా పరిస్థితిని ట్రంప్ ఎలా ఎదుర్కొంటారన్నదాన్ని బట్టి ప్రజల అభిప్రాయాలు ఉంటాయని సులేమానీ హత్య తర్వాత మొదటి సర్వే పేర్కొంది. ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని కొంతమంది అమెరికన్లు సమర్థిస్తున్నారు. అదే సమయంలో ఆయన 'పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లలేదు' అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హఫ్‌పోస్ట్ సర్వే తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
రిపబ్లికన్ల మద్దతు ట్రంప్‌కే
అదే హఫ్‌పోస్ట్ సర్వేలో... 83 శాతం మంది రిపబ్లికన్లు అమెరికా జరిపిన వైమానిక దాడిని సమర్థిస్తున్నామని చెప్పారు. సులేమానీ హత్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నవారిపై అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు 'గురిపెట్టే' సరికొత్త మార్గాన్ని ట్రంప్ ఎంచుకున్నారని వారు అంటున్నారు.
"మీకు జరిగిన నష్టానికి క్షమించండి" అంటూ సులేమానీ హత్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నవారికి... ట్రంప్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. బేబీలోన్‌బీ అనే ఒక పేరడీ వెబ్‌సైట్ అయితే సులేమానీ మృతికి సంతాపంగా అమెరికా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని డెమోక్రాట్లు కోరుకుంటున్నారని రాసింది.
తనపై అభిశంసన తీర్మానం, సెనేట్‌లో విచారణల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు అధ్యక్షుడు ట్రంప్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. సోమవారం ఆయన చేసిన ట్వీట్లు చూస్తే ఆయన మెదడులో అలాంటి ఆలోచన ఉన్నట్లు అనిపిస్తోంది.
"నేను విరామం లేకుండా బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి రాజకీయ పరిహాసాల కోసం నా సమయాన్ని వెచ్చించాల్సి రావడం బాధాకరం" అని ట్రంప్ రాశారు.

ఫొటో సోర్స్, AFP
డెమోక్రాట్ల విరుద్ధ ప్రకటనలు
డెమోక్రాట్ల విషయానికి వస్తే... సులేమానీ మరణంపై ఒకే పార్టీలో విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న డెమోక్రటిక్ నేత బెర్నీ సాండర్స్ స్పందించారు.
"వియత్నాం విషయంలో నిజం చెప్పాను. ఇరాక్ విషయంలో అలాగే చెప్పాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్‌తో యుద్ధం రాకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తా. నేను ఎవరికీ క్షమాపణలు చెప్పను" అంటూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఒక వీడియోను ఆయన ఆ ట్వీట్‌లో జతచేశారు.
సులేమానీని హతమార్చడం 'యుద్ధ చర్యే' అవుతుందని, అది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని మరో డెమోక్రటిక్ పార్టీ నేత తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా కుట్రలకు సులేమానీ పరోక్షంగా మద్దతిచ్చారంటూ ఇతర డెమోక్రటిక్ నాయకులు ఆరోపించగా, వీళ్ల ప్రకటనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? దానివల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే దానిపై బలమైన ప్రశ్నలు ఉన్నాయి" అని మరో డెమోక్రటిక్ పార్టీ నేత పీట్ బుట్టిగీగ్ అన్నారు.
"సులేమానీ ఒక హంతకుడు" అని అదే పార్టీకి చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా దళాల భద్రత పట్ల అమీ క్లోబుచార్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు, సులేమానీని అమెరికా చంపడాన్ని తప్పుబట్టిన బెర్నీ సాండర్స్‌పై సొంత పార్టీ నేత, న్యూయార్క్ మాజీ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ విమర్శలు చేశారు. సులేమానీది "హత్య" అని సాండర్స్ అనడం "దారుణం" అని బ్లూమ్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ('హత్య' అనే పదాన్ని చాలామంది డెమోక్రటిక్ పార్టీ నేతలు వాడారు)
"అతని (సులేమానీ) చేతులకు అమెరికన్ల రక్తం ఉంది. అతన్ని చంపడం తప్పు అని నాకు తెలిసినవారెవరూ భావించరు" అని బ్లూమ్‌బర్గ్ అన్నారు.
ఇలా పార్టీలోనే అంతర్గతంగా విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇరాన్‌తో ఉద్రిక్తలు మరింత పెరిగితే రాజకీయంగా పరిణామాలు ఇంకెలాంటి మలుపులు తీసుకుంటాయో చెప్పలేం.

ఫొటో సోర్స్, Getty Images
సులేమానీని హతమార్చడం తర్వాత హఫ్‌పోస్ట్ నిర్వహించిన సర్వే ఫలితాలు... డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల్లో ముందు వరుసలో ఉన్న జో బిడెన్‌కు సానుకూలంగా వచ్చాయి.
డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులతో పాటు, ఆ పార్టీవైపు మొగ్గుచూపుతున్న ఓటర్లలో 62 శాతం మంది ఇరాన్ విషయంలో బిడెన్ వైఖరిని "విశ్వసిస్తున్నాం" అని చెప్పారు. సాండర్స్, వారెన్‌ల కంటే ఆయన చాలా ముందున్నారు. వారికి 47 శాతం ఓట్లు వచ్చాయి.
ఎనిమిదేళ్లు ఉపాధ్యక్షుడిగా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు బిడెన్. కాబట్టి, విదేశాంగ విధానాల గురించి ఆయన అనుభవానికి ప్రజల నుంచి ఇలాంటి ప్రతిస్పందన రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే, ఆ సానుకూలత ఆయనకు అన్నిసార్లూ ఆశీర్వాదంగా మారడంలేదు.
డిసెంబర్‌లో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం విషయంలో వరుస బ్రేకింగ్ న్యూస్ మధ్య ప్రజల దృష్టిని ఆకర్షించడం డెమోక్రాట్లకు కష్టమైంది. ఇప్పుడు అధ్యక్షుడి మీద అభిశంసనపై సెనేట్‌లో విచారణ ఉండగా, దానితో ఇరాన్ అంశం పోటీ పడుతోంది.
ఇప్పటికే సర్వేలలో వెనకబడి ఉన్న కోరీ బూకర్, డేవల్ పాట్రిక్, టామ్ స్టెయర్‌తో పాటు మరికొందరు అభ్యర్థులకు ఇది చేదు వార్తే అని చెప్పొచ్చు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, ఎవరైతే ఆట చివర్లో కీలకంగా మారతారో వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం ముదురుతుండటం కూడా అలా ఉపయోగపడుతుండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా...
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
- కాసిం సులేమానీ: ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా?
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా?
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








