కాసిం సులేమానీ: ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, నరేంద్ర తనేజా
- హోదా, బీబీసీ కోసం
అమెరికా సైన్యం దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలతో చమురు ప్రపంచం కూడా ఆందోళనగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 30 శాతం చమురు పశ్చిమాసియా నుంచే వస్తుంది. కానీ చమురు మార్కెట్ డిమాండ్, సరఫరా అనేది చాలా బలంగా ఉంది. అంటే ప్రపంచంలో చమురుకు ఎంత డిమాండ్ ఉందో, మార్కెట్లో అంతకంటే ఎక్కువ చమురు అందుబాటులో ఉంది.
నాన్ ఒపెక్ దేశాలతోపాటు మిగతా దేశాల్లో కూడా చమురు ఉంది. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది.
అమెరికా దాడుల తర్వాత పరిస్థితిని గమనిస్తే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఈ పరిస్థితి యుద్ధంగా మారాలని కోరుకుంటూ ఉండరు. ఎందుకంటే అమెరికాలో ఇది ఎన్నికల సంవత్సరం. ఆ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, చమురు ధరలు నియంత్రణలో ఉండేలా చూసుకుంటారు.
అమెరికాలో చమురు ధరలు పెరిగితే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవచ్చు. ఆయన దాన్ని అసలు కోరుకోరు.

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ ఏం చేయవచ్చు
ఇరాన్ ఆర్థిక స్థితి ఎలా ఉందంటే అది కూడా ఇప్పుడు అమెరికాతో యుద్ధం జరగాలని కోరుకోదు. కానీ, ముఖ్యంగా చమురు క్షేత్రాలపై ఏదో ఒక చర్యకు దిగడానికి ఇరాన్ కచ్చితంగా ప్రయత్నిస్తుంది.
కానీ, అమెరికా చుట్టుపక్కల ఎలాంటి చమురు క్షేత్రాలూ లేవు. దాంతో, ఇరాన్ సౌదీ అరేబియాపై దాడి చేస్తుందేమో అని ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.
పశ్చిమాసియాలోని మూడు పెద్ద ఎగుమతి దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైత్ నుంచి చమురు హార్మూజ్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇక్కడ ఇరాన్ ప్రాబల్యం ఎక్కువ. కానీ ఇరాన్ ఈ చమురు సరఫరాను అడ్డుకుంటుందని, అక్కడ మందుపాతరలు ఏర్పాటు చేసేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతం విదేశీ కరెన్సీ కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడింది. చైనా నుంచి ఎక్కువ విదేశీ కరెన్సీ దానికి చమురు విక్రయాల ద్వారానే వస్తుంది.
ఇరాన్ మిగతా దేశాల చమురు సరఫరాలను అడ్డుకుంటే, అమెరికా కూడా ఆ దేశం చమురు చైనాకు చేరకుండా అడ్డుకుంటుంది. అందుకే, ఇరాన్ దగ్గర వేరే ప్రత్యామ్నాయం లేదు. వీలైనంతవరకూ ఇరాన్ మిసైళ్లు లేదా డ్రోన్లతో దాడులు చేయవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు పెద్ద ఆటంకం కలుగుతుందని అనిపించడం లేదు.
ఇరాన్ ఏదైనా చేయచ్చు అనే ఆందోళన ప్రపంచమంతా ఉంది. కానీ పరిస్థితి అదుపు తప్పేలా ఆ దేశంలో ఏం కనిపించడం లేదు. చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని కూడా అనిపించడం లేదు.

ఫొటో సోర్స్, AFP
అతిపెద్ద కష్టం భారత్‌కే
అమెరికా, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. కానీ భారత్ ఎక్కువ చమురు పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిలో ఇరాక్ మొదటి స్థానంలో ఉంటుంది. అది కాకుండా, సౌదీ అరేబియా, ఒమన్, కువైత్ నుంచి కూడా చమురు భారత్ చేరుతుంది.
ఇప్పుడు చమురు సరఫరాలో ఏదైనా అడ్డంకి వస్తుందేమో అని భారత్ కంగారు పడడం లేదు. భారత్ ఆందోళనంతా ధరల గురించే. ఇప్పుడు చమురు ధర ఒక బ్యారెల్‌కు మూడు డాలర్లు పెరిగింది.
భారత్ లాంటి ఆర్థికవ్యవస్థకు ఒక బ్యారెల్ ధర మూడు డాలర్లు పెరగడం అనేది చాలా పెద్ద విషయం. దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ కొనుగోలు చేసే ఒక సామాన్యుడు లేదా వాటిపై ఆధారడిన కంపెనీలకు ఇది మంచి వార్త కాదు.

ఫొటో సోర్స్, AFP/GETTY
అమెరికా దాడుల వల్ల భారతీయుల జేబుపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఎందుకంటే, రాబోవు రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు కచ్చితంగా పెరుగుతాయి. భారత్‌లో చమురు దిగుమతులకు ఏ ఆటంకం ఉండదు. కానీ ధరలు మాత్రం పెరుగుతాయి.
భారత ప్రభుత్వానికి కూడా ఇది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, ప్రభుత్వం ఆర్థిక లోటు సవాలు ఎదుర్కుంటున్న సమయంలో చమురు ధరలు పెరగబోతున్నాయి. రూపాయిపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇది రూపాయికి మంచిది కాదు.
వచ్చే వారం రోజుల్లో భారత వినియోగదారులకు ఇది ఆందోళన కలిగించే విషయమే. అంతే కాదు, ఇది భారత ఆర్థికవ్యవస్థకు కూడా ఆందోళనకరమైన అంశం.
అమెరికా ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌లో ఈ దాడులు చేసింది. కానీ దీనికి అత్యంత ప్రతికూల ప్రభావం భారత్‌పై పడబోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఈ సవాలు కోసం ఎంత సిద్ధంగా ఉంది
భారత్ దగ్గర ఈ సవాలును ఎదుర్కోడానికి అమెరికాలా ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు.
అమెరికా ప్రస్తుతం ఒక రోజుకు తమ దేశంలో 12 మిలియన్ బారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. అది కాకుండా ప్రపంచంలో అతిపెద్ద చమురు కంపెనీలన్నీ అమెరికా దగ్గరే ఉన్నాయి. అది ప్రపంచమంతా చమురు తవ్వకాలు జరుపుతోంది. చమురు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంది. చమురును ఉత్పత్తి చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అమెరికా డాలర్లలోనే జరుగుతుంది. అమెరికా దాన్నుంచి చాలా సంపాదిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక భారత్ విషయానికి వస్తే, దేశ అవసరాల కోసం 85 శాతం చమురు దిగుమతి చేసుకుంటున్నారు. భారత్‌లో చమురు డిమాండ్ కూడా క్రమేణా పెరుగుతోంది. చమురు డిమాండ్ ప్రతి ఏటా 4 నుంచి 5 శాతం పెరుగుతోంది. వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
85 శాతం చమురుతోపాటు భారత్ 50 శాతం గ్యాస్ కూడా దిగుమతి చేసుకుంటుంది. గ్రామాల్లో ఉజ్వల పథకం తరఫున ఇస్తున్న ఎల్పీజీ కూడా దిగుమతి చేసుకుంటున్నదే.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన బారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు, గ్యాస్‌పై చాలా ఎక్కువగా ఆధారపడుతోంది.
అందుకే పశ్చిమాసియాలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా, భారత్‌ను కష్టాల మేఘాలు కమ్మేస్తాయి. భారత్ ప్రత్యామ్నాయ ఇంధన శక్తిని ఉపయోగించుకునేలా ఉండాలి. కానీ అలా జరగడంలేదు. మనం ఇప్పుడు బొగ్గు, యురేనియం, సోలార్ పవర్‌కు అవసరమైన పరికరాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం.

ఫొటో సోర్స్, Reuters
ఏయే దేశాలపై ప్రభావం
చమురు ధరలు ఎప్పుడు పెరిగినా, ఆ ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలపై తీవ్రంగా పడుతుంది.
రష్యా విషయానికి వస్తే, ఆ దేశం దగ్గర చాలా చమురు ఉంది. బ్రెజిల్ దగ్గర సొంత చమురు వనరులు ఉన్నాయి. చైనా 50 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. ఆ దేశంలో పెద్దగా చమురు లేకపోయినా, అది ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు కొనుగోలు చేసింది.
జపాన్ దాదాపు మొత్తం చమురు దిగుమతి చేసుకుంటుంది. కానీ అది కూడా ప్రపంచంవ్యాప్తంగా చమురు నిల్వలను కొనుగోలు చేసింది. జపాన్ ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ.
నిజానికి ఇలాంటి స్థితి ఎప్పుడు వచ్చినా, మొట్టమొదటి ముప్పు భారత్‌కే వస్తుంది. భారత్ ఇంధన విధానం కూడా దేశం చమురుపై ఆధారపడడాన్ని తగ్గించేలా లేదు.

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్‌పై ప్రభావం
పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ లోలోపల ఇప్పటికే ఛిద్రమైంది. దాని ఆర్థికవ్యవస్థ చాలా చిన్నది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 280 బిలియన్ డాలర్లే ఉంటుంది. మనం రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్ టర్నోవర్లు కలిపితే, అది దాదాపు పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు సమానంగా ఉంటుంది.
పాకిస్తాన్ కూడా భారత్ లాగే చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కాబట్టి, చమురు ఉత్పత్తి చేసే ముస్లిం దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, మిగతా దేశాలన్నీ పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు ఇస్తాయి.
ఆ దేశాలు పాకిస్తాన్ చమురు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటాయి. అందుకే పాకిస్తాన్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. పాకిస్తాన్‌కు దానికి చెల్లింపులు చేయడం కష్టమే. కానీ, అక్కడ కూడా ఆ దేశానికి రాయితీలు లభిస్తాయి.
ఇరాక్ ఏం చేయవచ్చు
ఇరాక్ అమెరికాను కాదని ముందుకు వెళ్లలేదు. ఇరాక్ మొత్తం ఆర్థికవ్యవస్థ చమురుపై ఆధారపడింది. అందుకే ఇరాక్ చమురు ఉత్పత్తి పెంచాలనే అనుకున్నా, దానికి ఆ దేశానికి అమెరికా అండ అవసరం.
ఇరాక్ ఫిర్యాదు చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. కానీ అమెరికా ముందు ఆ దేశం నిలబడలేదు.
అమెరికా ఏం చేసినా, ఇరాక్‌ను అడిగి చేయాలని అనుకోదు. అది తనకు నచ్చినట్టు చేస్తుంది. పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ విషయంలో కూడా అది అలాగే చేసింది.
అందుకే ఈ విషయంలో ఇరాక్ పెద్దగా చేసేదేమీ ఉండదు. దాని దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి. కానీ అది ఒక బలహీన దేశం.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- బ్రిటన్, అమెరికాల్లో క్రైస్తవులే క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది?
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










