కాసిం సులేమానీని అమెరికా ఇప్పుడే ఎందుకు చంపింది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జొనాథన్ మార్కస్
- హోదా, బీబీసీ రక్షణ, దౌత్య కరెస్పాండెంట్
అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఒక చిన్న వివాదం నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ - కడ్స్ దళ కమాండర్ కాసిం సులేమానీ మరణానికి దారి తీసింది. దీని పరిణామాలు గణనీయంగా ఉండబోతున్నాయి.
ప్రతీకార దాడులు జరగొచ్చు. తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావొచ్చు. ఈ క్రమంలో చోటు చేసుకునే అనేక రకాల చర్యలు-ప్రతిచర్యలు నేరుగా తలపడేలా రెండు దేశాలను క్రమంగా మరింత దగ్గర చేయవచ్చు. ఇరాక్‌లో అమెరికా భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానం గతంలో ఎన్నడూ లేనంతగా విషమ పరీక్ష ఎదుర్కొంటుంది.
సులేమానీని చంపేయడం అంటే 'ఇరాన్‌పై అమెరికా ఒక రకంగా చిన్నపాటి యుద్ధం ప్రకటించడమే' అని ఒబామా హయాంలో పశ్చిమాసియా, పర్షియన్ గల్ఫ్ వ్యవహారాల సమన్వయకర్తగా పనిచేసిన ఫిలిప్ గోర్డన్ అభిప్రాయపడ్డారు.
ఇరాన్ భద్రతా దళాల్లో కడ్స్ దళం ఒక భాగం. ఇది విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది.
లెబనాన్, ఇరాక్, సిరియా లేదా ప్రపంచంలో మరెక్కడైనాగానీ ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు. ఇరాన్ ప్రాబల్యాన్ని విస్తరించడానికి దాడులకు వ్యూహ రచన చేయడం, లేదా స్థానికంగా ఉన్న టెహ్రాన్ మిత్రులకు సాయం చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేశారు. ఈ పనిలో సులేమానీని అందరికంటే ముందు ఉంటారు.

ఫొటో సోర్స్, Reuters
సులేమానీ నేతృత్వంలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం
వాషింగ్టన్ దృష్టిలో 'సులేమానీ అమెరికన్ల రక్తం కళ్లజూసిన వ్యక్తి'. కానీ ఇరాన్‌లో ఆయన చాలా ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా టెహ్రాన్ ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహించారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సులేమానీపై ఓ కన్నేసి ఉంచడంలో ఆశ్చర్యం లేదు. కానీ అమెరికా సేనలు ఆయన్ను ఇప్పుడే ఎందుకు చంపేశాయి? అన్నదే చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై వరసగా జరిగిన అనేక చిన్నపాటి రాకెట్ దాడులు ఇరానే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో ఒక అమెరికన్ కాంట్రాక్టర్ చనిపోయారు. కానీ అంతకుముందు గల్ఫ్‌లో ట్యాంకర్లకు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన ఆపరేషన్లు, మానవ రహిత ఏరియల్ వెహికిల్‌ను కూల్చేయడం, సౌదీలోని కీలక చమురు కేంద్రంపై దాడి.. ఇవన్నీ అమెరికా ఎలాంటి ప్రతిస్పందన లేకుండానే జరిగిపోయాయి.
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడుల వెనుక ఇరాన్ అనుకూల దళాలు ఉన్నాయని పెంటగాన్ అనుమానిస్తోంది. ఇప్పటికే వాటిని తిప్పికొట్టింది. అది బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ కాంపౌండ్‌పై దాడికి దారి తీసింది.
సులేమానీని చంపేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనక గతంలో జరిగిన సంఘటనలను మాత్రమే పెంటగాన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ దాడితో ఒకరకంగా హెచ్చరిక పంపించింది. 'ఇరాక్‌తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారులపై దాడి చేసేందుకు చాలా చురుకుగా ప్రణాళికలు రచిస్తున్నారు' అని పెంటగాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇకపై ఏం జరుగుతుంది
ఇకపై ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక రకంగా ఇరాన్‌ను భయపెట్టి, తన చేతలకు వాడి తగ్గలేదని- ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటిచోట పెరుగుతున్న అమెరికా వ్యతిరేక శక్తులకు హెచ్చరిక పంపించామని ట్రంప్ భావిస్తూ ఉండొచ్చు. కానీ అమెరికా చర్యకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇరాన్ నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండదని ఎట్టిపరిస్థితుల్లో అనుకోవడానికి వీలు లేదు.
ఇరాక్‌లో ఉన్న 5000 మంది అమెరికా సైనికులే కచ్చితంగా లక్ష్యంగా మారుతారు. ఇరాన్, దాని ప్రతినిధులు గతంలో చేసిన దాడులు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఈ ఉద్రిక్త వాతావరణంతో మొదటగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
అమెరికా, దాని మిత్ర పక్షాలు తమ రక్షణపై దృష్టిపెడతాయి. బాగ్దాద్‌లోని తన రాయబార కార్యాలయానికి వాషింగ్టన్ ఇప్పటికే కొన్ని అదనపు బలగాలను పంపించింది. అవసరమైతే ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా తమ బలగాల సంఖ్యను పెంచుకోవాలనే ప్రణాళికల్లో అమెరికా ఉంది.
కానీ ఇరాన్ స్పందన అసమానంగా ఉండేందుకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే.. దాడికి ప్రతిదాడి చేయకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఇరాన్‌కున్న అనూహ్య మద్దతుతో అది వ్యూహాత్మకంగా ప్రవర్తించొచ్చు. ఈ ప్రాంతంలో సులేమానీ పెంచి పోషించిన ఎన్నో శక్తులు ఇరాన్‌కు అండగా నిలవొచ్చు.
ఉదాహారణకి బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇరాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, అక్కడ అమెరికా బలగాల మోహరింపును ప్రశ్నించడం.. ఇతర దాడుల కోసం ఎక్కడైనా నిరసన ప్రదర్శనలను ప్రోత్సహించడం చేయవచ్చు.
ఇరాన్ కడ్స్ దళ కమాండర్ కాసిం సులేమానీపై దాడి అమెరికా సైన్యం ఇంటెలిజెన్స్, శక్తి, సామార్థ్యాలకు నిదర్శనం. ఆయన మరణించినందుకు ఈ ప్రాంతంలో చాలా మంది బాధపడరు. కానీ ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తెలివైన పనేనా?
ఈ దాడి తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు పెంటగాన్ సిద్ధంగా ఉందా? ఈ ప్రాంతంపై ట్రంప్ వ్యూహం గురించి ఈ దాడి ఏం చెబుతోంది? ఇదేమైనా మారిందా? తమ ఇరాన్ ఆపరేషన్లలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించేది లేదనే సంకేతం ఈ దాడిలో దాగి ఉందా? లేదంటే ఈ దాడి 'చాలా చెడ్డ వ్యక్తి' అని భావిస్తున్న ఒక ఇరాన్ కమాండర్‌ను అమెరికా అధ్యక్షుడు లేపేయడం మాత్రమేనా?
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








