గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం

రెండు వారాల క్రితం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన ఒక పెద్ద మిడతల దండు గుజరాత్ రైతులను కన్నీళ్లు పెట్టించింది.
ఈ మిడతల దండు ఉత్తర గుజరాత్ బనాస్‌కాంఠా జిల్లాలో ఆవాలు, ఆముదం, మెంతులు, గోధుమ, జీలకర్ర పంటలను నాశనం చేసింది.
ఈ మిడతల దండు 8 వేల హెక్టార్లకు పైగా పొలాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం కలిగించిందని, బనాస్‌కాంఠా జిల్లాలో సుయీగామ్, డాంటా, థరాడ్, వావ్ తాలూకాల్లో రైతులపై ఈ ప్రభావం చాలా ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి.
అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెబుతోంది. 5 వేల హెక్టార్లకు పైగా భూముల్లో సుమారు 4,900 లీటర్ల కీటకనాశిని పిచికారీ చేశామని, చాలా మిడతలను చంపేశామని, లేదా తరిమికొట్టామని అంటోంది.
గుజరాత్ వ్యవసాయ శాఖా మంత్రి కూడా పంట నష్టానికి పరిహారం ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
కానీ, ఈ మిడతల దండు దాడులను ఉత్తర గుజరాత్ రైతులు ఎలా ఎదుర్కోగలిగారు. పంటనష్టం ఎంత, ప్రస్తుతం రైతులు పంటను కాపాడుకోడానికి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు మా బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య బనాస్‌కాంఠా వెళ్లారు.

రైతుల వ్యథ
బనాస్‌కాంటా జిల్లాలోని నిరోలీ గ్రామంలో ఆయన కొంతమంది రైతులను కలిశారు. వారంతా మిడతలను తరిమికొట్టడానికి పొలాల్లో ఉన్నారు.
వారందరూ చేతుల్లో స్టీలు పళ్లాలు, గిన్నెలు, రేకు డబ్బాలు పట్టుకుని ఉన్నారు. వాటిని వాయించడానికి ప్రత్యేకంగా మహిళలను పనిలో పెట్టుకున్నారు.
పళ్లాలు, డబ్బాలు కొడితే కొడితే వచ్చే శబ్దం ఆ పొలాల నుంచి చాలా దూరం వరకూ వినిపిస్తోంది. గట్టిగా వచ్చే శబ్దాలు వినగానే మిడతలు అక్కడనుంచి పారిపోతాయని స్థానికులు అనుభవంతో చెబుతున్నారు.
కానీ అలా మిడతలను తరమడానికి వారికి చాలా సమయం పడుతోంది. పంటను కాపాడుకోడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు ఎక్కువగా పొలాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది.
"మా కుటుంబంలో ఉన్న అందరికీ ఆ మిడతల దండును తరమడానికే సరిపోతోంది, మాకు తినడానికి కూడా సమయం దొరకడంలేదు. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇంట్లో పశువులను కూడా చూసుకోలేకపోతున్నాం. ఉదయం లేవగానే పళ్లాలు, డబ్బాలు తీసుకుని పొలాల్లోకి వచ్చేస్తాం. పంటకు కూడా చాలా నష్టం జరిగిపోయింది" అని నారోలీ గ్రామంలో ఉంటున్న కమలా పటేల్ అన్నారు.

ఇదే గ్రామంలో ఉంటున్న పార్వతీ పటేల్ జీలకర్ర, మెంతుల పంటకు కూడా చాలా నష్టం జరిగింది.
"పంట నాటు తర్వాత మేం రెండు నెలలు దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం. కానీ, ఈ మిడతలు రెండు గంటల్లో సగానికి పైగా పంటను నమిలేశాయి" అని ఆమె చెప్పారు.
"మా ప్రాంతంలో ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటి సున్నితమైన పంటలు ఉంటాయి. ఈ పంటలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, మిడతల దాడుల వల్ల ఆ పంటలు తట్టుకోలేకపోతున్నాయి" అని పార్వతి బాధపడ్డారు.
నారోలీలోనే ఉంటున్న లక్ష్మణ్ పటేల్ తన పంట నష్టాన్ని అంచనా వేశారు. "నేను కొంత భూమిలో జీలకర్ర, ఆవాలు, మిగతా భూమిలో ఆముదం, మెంతులు వేశాను. పంట బాగా పండుంటే, ఐదు లక్షల వరకూ వచ్చుండేది. కానీ మిడతలు పంటలో పెద్ద భాగాన్ని తినేశాయి" అన్నారు.
మిగిలిన పంటకు కూడా సరైన ధర వస్తుందో, లేదో అని లక్ష్మణ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్ 14న తమ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి మిడతలు వచ్చాయనే వార్తలు వ్యాపించాయని గ్రామస్థులు చెప్పారు.

మిడతలను ఎలా చంపుతున్నారు
గుజరాత్ వ్యవసాయ మంత్రి ఆర్సీ ఫలదూ బీబీసీతో మాట్లాడుతూ "మిడతల సంఖ్యను బట్టి అవి ఎంత పంటకు నష్టం కలిగించాయో తెలుస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు అదే పనిపై ఉన్నాయి" అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం "మిడతల దండు ఒక పెద్ద భాగానికి నష్టం కలిగించాయి. వాటి కోసం వందల లీటర్ల కీటకనాశినిని ఆయా ప్రాంతాల్లో పిచికారీ చేయాల్సి వచ్చంది. జనం కూడా తమ స్థాయిలో రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మిగతా మిడతలు గుజరాత్ హద్దుల నుంచి జాలోర్ జిల్లా(రాజస్థాన్) వైపు వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం బృందాలు వాటిని వెంటాడుతున్నాయి" అన్నారు.
"ఈ మిడతలు 'డెజర్ట్ హాపర్' జాతికి చెందినవి. ఇవి చాలా దూరాల వరకూ ఎగరగలవు. గుంపులుగా ఉండే ఈ మిడతలు చాలా దూకుడుగా ఉంటాయి. కొంత కాలం క్రితం ఇవి ఆఫ్రికా దేశాల్లో తమ ప్రతాపం చూపించడం గురించి చాలా చర్చ జరిగింది" అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు.

2017లో బొలీవియాలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఒక పెద్ద భాగంపై ఇలాంటి మిడతలు దాడి చేయడం వల్ల అక్కడి ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించింది.
మిడతల ఈ జాతి భారత్, పాకిస్తాన్ లాంటి దక్షిణాసియా దేశాల్లో తమ మొత్తం దండుతో పంటలను నాశనం చేస్తుంటాయని చెబుతున్నారు.
బ్రిటన్ ఆహార, పర్యావరణ సంస్థ అంటే ఫెరా ఈ కీటకాలపై ఒకసారి ప్రయోగాలు చేసింది. ఆ పరీక్షల్లో ఈ మిడతలు ఆహారం తీసుకునే సామర్థ్యం పశువుల కంటే చాలా వేగంగా ఉంటుందని తేలింది. ఒక సాధారణ పశువులతో పోలిస్తే, ఈ మిడతలు 8 రెట్లు వేగంగా పంటలను చప్పరించేస్తాయని తేలింది.

పీటీఐతో మాట్లాడిన వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి పూనమ్ చంద్ పర్మార్ "గుజరాత్‌లో ఇప్పుడు మిడతలు దాదాపు లేవనే చెప్పచ్చు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఆపరేషన్లలో వాటిని చాలావరకూ చంపేశాం. కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 బృందాలు దానికి సహకరిస్తున్నాయి" అన్నారు.
"గుజరాత్ ప్రభుత్వం మొత్తం పది వేల హెక్టార్ల భూముల్లో సర్వే చేయించింది. వీటిలో ఏడు వేల హెక్టార్ల పొలాల్లో మిడతలు పడినట్లు తెలిసింది. ఈ మిడతల దండు పాకిస్తాన్ థార్ ఎడారి దాటి వచ్చాయి. ఉత్తర గుజరాత్‌లోని ఈ ప్రాంతం ఆ మిడతలు వలస వెళ్లే దారిలో ఉంటుంది" అని పూనమ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆందోళనకారుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయొచ్చా
- 'జన్యు-సవరణ శిశువులు' సృష్టించిన శాస్త్రవేత్తకు జైలు శిక్ష
- చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్.. వ్యవసాయాన్ని ఇది ఆదుకొంటుందా?
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- 2019లో అంతరిక్ష అందాలను కళ్లకు కట్టిన అత్యద్భుత ఛాయా చిత్రాలు ఇవి
- ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- మరణ శిక్షల్లో భారతదేశ రికార్డు ఏమిటి? - రియాలిటీ చెక్
- ‘జోలా చాప్స్’: దేశంలో లక్షల మంది రోగులకు వీరే ఆధారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








