కర్నూలు: ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’

దళితులు ఆలయం
    • రచయిత, హృదయ విహారి బండి
    • హోదా, బీబీసీ కోసం

''మాకు ఇప్పుడే స్వతంత్రం వచ్చింది సార్! జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం. అంతవరకూ గుళ్లో దేవుడు ఎట్లుంటాడో మాకు తెలీదు. ఈయప్ప మా దేవుడే కాదు... అనుకుంటాంటిమి! కానీ ఇప్పుడు బలే సంతోసంగా ఉంది సార్. ఇప్పుడు గుడిలోకి వస్తున్నాం, టెంకాయ కొడుతున్నాం, దేవుణ్ని మొక్కుతున్నాం'' అని సురేంద్ర అనే దళితుడు బీబీసీతో అన్నారు.

కర్నూలు జిల్లా హోసూరు గ్రామంలో 2019 డిసెంబర్ 14న దళితులు ఆలయ ప్రవేశం చేశారు. 'జై భీం', 'జై అంబేడ్కర్' నినాదాలతో వందలాదిమంది దళితులు ర్యాలీగా వచ్చి గ్రామంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో తొలిసారి అడుగు పెట్టారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం, దళితవాడకు ఇలా పరిచయమైంది. కానీ ఈ కలయిక వెనుక ఒక ఉద్యమమే నడిచింది.

దళితుల ఆలయ ప్రవేశం వార్త తెలుసుకున్న 'బీబీసీ తెలుగు' హోసూరు గ్రామానికి వెళ్లింది. హోసూరు గ్రామ జనాభా 7 వేలకు పైనే. అందులో దాదాపు 400 దళిత కుటుంబాలు నివాసముంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ దళిత ఉద్యమానికి మొహర్రం పండుగ బీజం వేసిందని రంగస్వామి అనే దళిత యువకుడు బీబీసీతో అన్నారు. రంగస్వామి ఎమ్మెస్సీ, బీఈడీ, డీఈడీ చదివి, బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

దళితులు ఆలయం

'సావుసేన్ నుంచి జై భీమ్'

మొహర్రం పండుగరోజు అన్ని కులాలవాళ్లు 'పీర్ల గుండం' చుట్టూ చేరి ఉత్సాహంగా 'సావుసేన్' ఆడతారు. కానీ అలా 'సావుసేన్ ఆట ఆడేందుకు అప్పటిదాకా ఆ గ్రామంలోని దళితులకు అనుమతి లేదు' అని డీఎస్పీ నరసింహారెడ్డి బీబీసీకి వివరించారు.

''అందరితోపాటే గుండం చుట్టూచేరి ఉత్సాహంగా ఎగరల్లని మాకూ ఉంటుంది కదా. ఇంకా ఎన్ని తరాలు, ఎన్ని దశాబ్దాలు మమ్మల్ని వెలి వేస్తారు సార్? అందుకే, మేము కూడా సావుసేన్ ఆడతామని సంవత్సరం నుంచి గ్రామపెద్దల్ని అడుగుతూనే ఉన్నాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఈసారి కూడా వద్దు అన్నారు. అక్కడే మా ఉద్యమం మొదలైంది'' అని రంగస్వామి అన్నారు.

2019 సెప్టెంబర్ 10న మొహర్రం పండుగ జరిగింది. ఈ పండుగ సందర్భంగా సావుసేన్ ఆడాలని, అందరితో సమానంగా ఉత్సవంలో పాల్గొనే హక్కు కోసం దళితులు ఆగస్టు నెల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయమై గ్రామపెద్దలను, పోలీసులను పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో, ఆగస్టు 19, 2019న 'స్పందన' కార్యక్రమంలో సావుసేన్ ఆడటం, ఆలయ ప్రవేశం గురించి కర్నూలు అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చామని రంగస్వామి అన్నారు.

దళితులు ఆలయం

''పీర్లపండుగ రోజు సావుసేన్ అడేందుకు అనుమతించాలని దళితులు సంవత్సర కాలంగా గ్రామపెద్దలను అడుగుతున్నారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. సెప్టెంబర్ 8న చిన్నసరిగెత్తు పండుగ రోజు, మేం గ్రామపెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. దళితులు సావుసేన్ ఆడకపోతే, మీరు కూడా ఆడొద్దని, మొహర్రం పండుగను జరగనివ్వం అని చెప్పినాం. కానీ పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తూ కొందరు ఇతర కులాల యువకులు ఆరోజు రాత్రి, పీర్లచావిడి సమీపంలో సావుసేన్ ఆడారు. విషయం తెలుసుకుని సీఐ, కొందరు కానిస్టేబుల్స్‌ గ్రామానికి చేరుకున్నారు. మందిని చెదరగొట్టే క్రమంలో పోలీసులపై దళితేతరులు దాడి చేశారు. ఆ ఘటనలో ఒక సీఐ, ఒక ఎస్సై, ఒక హోంగార్డు గాయపడ్డారు. పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడినవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశాం'' అని డీఎస్పీ నరసింహారెడ్డి చెప్పారు.

పోలీసులపై దాడి, అరెస్టులు, జైలుకు వెళ్లడం... లాంటి సంఘటనలతో హోసూరు ఊరి వాతావరణం మారిపోయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు దళిత చట్టాలవైపు నిలబడ్డారు. పరిస్థితి గాడి తప్పుతోందనుకున్న సమయంలో, మొహర్రం పండుగరోజు ఎవరూ సావుసేన్ ఆడకూడదని, దళితులు యథేచ్ఛగా ఆలయ ప్రవేశం చేయొచ్చని గ్రామపెద్దలు ప్రకటించారు.

''ఈ సందర్భంలోనే దళితులపై వివక్ష చూపుతున్న రెండు గ్లాసుల పద్దతి (స్టీలు గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు), హోటళ్లలో వేరుగా కూర్చోబెట్టడం, ఆటోల్లో ఎక్కించుకోకపోవడం లాంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. గ్రామస్తులతో మాట్లాడి, ఈ వివక్ష లేకుండా చేశాం. డిసెంబర్ 14న గ్రామ దళితులు ఆలయ ప్రవేశం చేశారు. ఇప్పుడు గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది'' అని డీఎస్పీ అన్నారు.

దళితులు ఆలయం

'ఉద్యమం కోసం ఉద్యోగాలు మాని...'

బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో రంగస్వామి లెక్చరర్‌గా చేస్తున్నారు. ఆయనకు ఏప్రిల్‌లో పెళ్లైంది. ఆగస్టులో దళిత యుకులందరూ మొహర్రం నాడు సావుసేన్ ఆడాలని, ఆలయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమం కోసం రంగస్వామితోపాటు మరికొందరు యువకులు తమ ఉద్యోగాలను కూడా వదులుకున్నారు. వీరంతా పెద్ద జీతాల ఉద్యోగస్తులు కాదు.

''నాకు ఏప్రిల్‌లో పెళ్లయింది. బెంగళూరులోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తాంటి. రూ. 25 వేలు జీతం వచ్చేది. ఉద్యోగం ఉండటం వల్లే నాకు పెళ్లి జరిగింది సార్. కానీ పెళ్లయిన మూడు నెలలకే ఉద్యోగం వదిలేసినాను. భార్య, అత్తమామల నుంచి టెన్షన్. ఒకసారి గొడవ కూడా జరిగింది. మాకు భూమి లేదు. అమ్మానాన్న కూలి పనులు చేస్తూ నన్ను ఎమ్మెస్సీ, బీఈడీ, డీఈడీ చదివించినారు. ఇప్పుడు నేనేమో ఉద్యోగం మానేసి ఊర్లో ఉద్యమం చేస్తున్నా. అయినా పర్వాలేదు, ఏదో ఒకరోజు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది. కానీ చదువుకున్న మాలాంటివాళ్లం కూడా ముందడుగు వెయ్యకపోతే, ఉద్యమం మధ్యలో వదిలేస్తే, మా హక్కులు గాల్లో కలిసిపోయినట్లే. అందుకే ఉద్యమం వైపే నిలబడినాము మేమంతా'' అని రంగస్వామి తెలిపారు.

''ఈ ఉద్యమం చేస్తున్నపుడు మా చేతుల్లో చిల్లిగవ్వ కూడా లేదు. కానీ అధికారులను కలిసేకి జనాన్ని తీసుకుని పోవాలంటే ఒక వెహికల్ బాడుగ, పైఖర్చులు, ఆలయ ప్రవేశం చేసినపుడు దాదాపు 500మందితో సహపంక్తి భోజనాలు... అట్ల మా అందరికీ రూ.1.50లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. బెంగళూరులో మా కాలేజీ వాళ్లు నా స్థానంలో ఇంకొకరిని తీసుకున్నారు. మళ్లీ ఉద్యోగం వెతుక్కోవల్ల. నాతోపాటు ఇంకా ఐదారుమంది యువకులు ఉద్యోగాలు వదులుకున్నారు'' అన్నాడు రంగస్వామి.

దళితులు ఆలయం

'ఆలయంలో అడుగుపెట్టిన దళితవాడ'

కొన్ని శతాబ్దాలుగా ఈ గంటలు దళితుల స్పర్శకు నోచుకోలేదు. కొన్ని శతాబ్దాలుగా ఈ మూర్తిని దళితుల చూపులు తాకలేదు. కొన్ని శతాబ్దాలుగా దళితుల అరచేతులు ఈ హారతిపై వాలలేదు.

డిసెంబర్ 14 శనివారంనాడు దళిత సంఘాల నేతలు, గ్రామంలోని దళితులు అందరూ పత్తికొండ మండల కేంద్రం నుంచి 'జై భీమ్' నినాదాలు చేస్తూ 4 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి హోసూరు గ్రామం చేరారు. పిల్లాపెద్ద, ఆడమగ అన్నివయసుల దళితులు గ్రామంలోని పురాతన వీరభద్రస్వామి దేవాలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు.

పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆరోజే దేవాలయం అనుభవమైంది. ఆలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన అనుభవం గురించి, కొందరు దళిత భక్తులతో బీబీసీ మాట్లాడింది.

''ఒకప్పుడు గుడికి రావాలంటే భయం. ఒకవేళ వచ్చినా, లోపలకు అనుమతి లేదు. దేవుడి ముఖం కానరాదు, ఆయన కాళ్లు కానరావు. ఇంకెందుకు రావల్ల? పైగా, 'మీరు మాదిగోల్లు కదా, ఎందుకొస్తారు గుడికి' ఇట్లాంటి మాటలు వింటాంటిమి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చదువుకున్న దళిత యువకుల పోరాటంతో ఇప్పుడు మేము హాయిగా గుళ్లలోకి వస్తున్నాం. నా 39ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా మా ఊర్లోని గుళ్లలోకి అడుగు పెట్టలేదు. అసలు జీవితంలో వస్తానని అనుకోలేదు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు చూస్తాంటే భలే ఆనందంగా ఉంది. తండ్రిగా వాళ్లకు నేను ఇవ్వలేనిది, చదువుకున్న దళిత యువకులు ఇచ్చినారు. సంతోషం'' అని రమేశ్ అన్నారు.

హోసూరు దళితవాడలో రమేశ్ కుటుంబం నివసిస్తోంది. ముంబయిలో పుట్టిపెరిగిన తన మేనత్త కూతురు రాణిని పెళ్లిచేసుకుని హోసూరు తీసుకువచ్చారు రమేశ్. పెళ్లైన కొత్తలో ముంబయి నుంచి వచ్చిన రాణికి ఊరి కట్టుబాట్లపై అవగాహన లేదు. ఓ పండుగ రోజున పూజ కోసం ఆమె సరాసరి గుడిలోకి వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటన గురించి ఆమె వివరిస్తూ...

''నాపేరు రాణి, మా ఊరు ముంబయి. ఇక్కడి ఆచారాలు నాకు తెలీదు. పెళ్లైన కొత్తలో ఒకరోజు సర్రని గుడిలోకి పోయినాను. గుడిలో ఒకామె, మీది ఏ కులం అని అడిగింది. ఇక్కడ మా కులమేంటో నాకు తెలీదు. ముంబయిలో ఉన్నపుడు గుడికి పోతూంటి, ఉపవాసాలు చేస్తూంటి. అక్కడ ఎవరూ నన్ను ఏ కులమని అడగలేదు. కానీ ఇక్కడ మమ్మల్ని గుడిలోకి రానీయరు. బయటినుంచి టెంకాయ కొట్టుకుని పోవల్ల. ఇంకెందుకు రావల్ల గుడికి? అప్పటినుంచి గుడికి వచ్చేదే ఇడిసిపెట్టినా. కానీ ఇప్పుడు లోనికి రానిస్తున్నారు. సంతోషంగా ఉంది'' అన్నారు.

దళితుల ఆలయ ప్రవేశం గురించి గ్రామపెద్దలతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు ముఖాముఖి కలవడానికి ఇష్టపడలేదు. 'మేం ఊళ్లో లేం' అని కొందరు చెబితే, 'మీకేమైనా సమాచారం కావాలంటే ఫోన్‌లో చెబుతాం కానీ, మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవలేం' అని మరొకరు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’

'మమ్మల్ని కాదన్నారు...'

''ఊర్లో ఎవరైనా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారా? లేదు కదా, అందుకే నేను కూడా మిమ్మల్ని కలవలేను. దళితులు ఆలయంలోకి రావడం మాకేమీ ఇబ్బంది లేదు కానీ, ఊర్లోవాళ్లను కాదని, బయటివాళ్లతో వారు ఆలయ ప్రవేశం చేసినారు. వాళ్లకు మాకంటే బయటివాళ్లే ఎక్కువైనారు. ఆలయ ప్రవేశం గురించి ఊర్లోవాళ్లతో మాట్లాడల్ల కానీ, ఎస్పీకి ఫిర్యాదు చేయడం, దళిత సంఘాలను సంప్రదించడం మాకు నచ్చలేదు. చివరికి ఊర్లో ఉండాల్సింది దళితులు, మేమేకదా'' అని సురేంద్రనాథ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

సురేంద్రనాథ రెడ్డి తన స్వగ్రామం హోసూరులో వీఆర్ఓగా పనిచేసి, కొన్నేళ్ల కిందట రిటైర్ అయ్యారు. ఈయన గ్రామపెద్దల్లో ప్రముఖుడు.

''కుల వివక్ష మాఊర్లో ఎప్పుడూ లేదు. కానీ, గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతోనే దళితులను సావుసేన్ ఆడొద్దని చెప్పినాం. చిన్నసరిగెత్తు పండుగ రాత్రి పోలీసులు అనవసరంగా లాఠీచార్జ్ చేసినారు. మావాళ్లు 17మందిని అరెస్టు చేసినారు. 45 రోజులు జైలులో ఉండి, బెయిల్‌పై విడుదలైనారు. దళితులు మాదగ్గరకు వచ్చుంటే బాగుండేది. కానీ దళిత సంఘాల నాయకులను, పోలీసులను ఆశ్రయించినారు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మాక్కూడా సంతోషమే'' అని బీబీసీని ప్రత్యక్షంగా కలవడానికి ఇష్టపడని హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అన్నారు.

అయితే, దళితుల వాదన మరోలావుంది. సావుసేన్ ఆడటానికి, ఆలయ ప్రవేశానికి గ్రామస్తులు అంగీకరించకపోవడం వల్లనే తాము అధికారులను, దళిత సంఘాలను ఆశ్రయించామని రంగస్వామి చెబుతున్నారు.

''మొహర్రం రోజు గుండం చుట్టు సావుసేన్ ఆడతామన్నాం, ఒప్పుకోలేదు. కనీసం మీరంతా ఇండ్లకు పోయినంకైనా ఆడచ్చా అని అడిగినా, దానికీ ఒప్పుకోలేదు. పైగా ఆ పంచాయతీలో ఇద్దరు మమ్మల్ని కులం పేరుతో తిట్టినారు. వాళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినారు. ఇంతజరిగినా కూడా, 'మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని సంప్రదించలేదు' అంటే మేమేం చేయల్ల సార్? పోయిన సంవత్సరం ఒప్పుకోలేదు, ఈసారి కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఎన్ని తరాలు ఇట్ల?'' అని రంగస్వామి ప్రశ్నించారు.

దళితులు ఆలయం

'తిండి కాడా వివక్షే, చావు కాడా వివక్షే'

''ఈ ఉద్యమంతో మేం సాధించుకున్నది చాలామందికి అర్థంకాదు సార్. తినడానికి హోటల్‌కు పోతే మమ్మల్ని వేరుగా కూర్చోబెట్టేవాళ్లు. ఇప్పుడు అందరితో సమానంగా కూర్చుంటున్నాం. మాలో ఎవరైనా చనిపోతే శవాన్ని పొలంగట్ల వెంబడి తీసుకుపోయేవాళ్లం, ఇప్పుడు అందరిలా ఊర్లో నుంచే తీసుకుపోతున్నాం. ఊర్లోని ఒక ప్రైవేటు స్కూల్లో దళిత పిల్లలను చేర్పించుకునేవారు కాదు. మా అన్న కొడుకును ఆ స్కూల్లో చేర్పించడానికి పోతే, 'మిమ్మల్ని చేర్చుకుంటే, మాకు వేరే అడ్మిషన్లు రావు' అని ముఖం మీదనే చెప్పినారు. కానీ ఇప్పుడు వాళ్లే దళితవాడకు వచ్చి, మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించండి అని అడుగుతున్నారు. తిండి కాడా వివక్షే, చావు కాడ కూడా వివక్షే... అందుకే నలుగురితోపాటు సమానంగా జీవించే హక్కును సాధించుకున్నాం'' అని సురేంద్ర చెప్పారు.

దళితులు ఆలయం

'ఇది ప్రశాంతతా? లేక నిశ్శబ్దమా??'

ప్రస్తుతం హోసూరు గ్రామం ప్రశాంతంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఊరు నిశ్శబ్దంగా ఉందని దళితులు చెబుతున్నారు.

''ఆలయ ప్రవేశం కార్యక్రమానికి మేళగాళ్లు రాలేదు, పురోహితులూ రాలేదు. ఆలయ ప్రవేశం అయ్యాక 500 మందితో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాం. ఇతర కులాలను ఆహ్వానించినా, ఒక్కరు కూడా భోజనానికి రాలేదు. మా పక్కనే, తుగ్గలి మండలంలోని పెరవలి, ఎద్దులదొడ్డి గ్రామాల్లో దళితులు ఆలయ ప్రవేశం చేశాక, 'మావైపు నుంచి దళితులకు ఎలాంటి హాని ఉండదు' అంటూ, ఇతర కులస్తులతో పోలీసులు, ఒక లీగల్ ప్రొసీజర్‌ చేయించారు. ఆ ఒప్పంద పత్రంపై దళితేతరులు సంతకాలు చేశారు. అలాంటి ఒక అగ్రిమెంట్ చేయాలని మేము కూడా పోలీసులను కోరాము. ఆ అగ్రిమెంట్ కోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాం. అది పూర్తయినంక, మళ్లీ మేము ఉద్యోగాలు వెతుక్కోవల్ల'' అని ముగించారు రంగస్వామి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)