'అగ్రకులం' అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న దళిత యువకుడి హత్య

ఫొటో సోర్స్, SOLANKI FAMILY
- రచయిత, తేజాస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి, అహ్మదాబాద్ నుంచి
రాజ్‌పూత్ వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో పోలీసుల సమక్షంలోనే ఓ దళిత యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ గ్రామంలో ఈనెల 8న (సోమవారం) జరిగింది.
25 ఏళ్ల హరేశ్ సోలంకి రెండు నెలల గర్భవతి అయిన తన భార్య ఊర్మిళను ఇంటికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మహిళా సహాయకేంద్రం కౌన్సెలర్‌తో పాటు, ఓ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని తన అత్తగారి ఇంటికి వెళ్లారు.
వారిమీద ఎనిమిది మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో దాడి చేయడంతో హరేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు.
ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.
హరేశ్ సోలంకి స్వగ్రామం కచ్ ప్రాంతంలోని వర్సమోడీ. ఊర్మిళది అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ గ్రామం. ఆరు నెలల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, SCREEN GRAB
రెండు నెలలుగా ఊర్మిళ పుట్టింట్లో ఉంటున్నారు. భార్యను తనతో తీసుకెళ్లాలని హరేశ్ అనుకున్నారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులు తనను ఇబ్బందులు పెడతారేమోనన్న భయంతో ఆయన మహిళా సహాయకేంద్రాన్ని సంప్రదించారు.
మహిళలకు సహాయం అందించేందుకు గుజరాత్ ప్రభుత్వం 'అభయం' పేరుతో 181 హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1091 పోలీసు హెల్ప్‌లైన్ కేంద్రంతో సమన్వయం చేసుకుని అభయం బృందం పనిచేస్తుంది.
మహిళలకు కౌన్సెలింగ్, సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైతే పోలీసు భద్రత కూడా కల్పిస్తారు.
"అమ్మాయి ఇంటి వద్ద గొడవ జరుగుతుందేమో.. మీరు రావద్దు, మేము వెళ్తాం అని హరేశ్‌కు ముందే చెప్పాను. కానీ, అతను వినలేదు’’ అని అభయం కౌన్సెలర్ భవిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
"ఏమీ కాదు, నేను రాకపోతే వారి ఇళ్లు ఎక్కడుందో కూడా ఆ ఊర్లో మీకెవరూ చెప్పరు. ఊర్మిళ తన ఇష్టం మేరకే పుట్టింటికి వెళ్లింది. మమ్మల్ని ఆదరిస్తానని వాళ్ల నాన్న దశరథ్ సిన్హా హామీ ఇచ్చారు" అని హరేశ్ చెప్పినట్లు భవిక తెలిపారు.
హరేశ్ వెంట భవికతో పాటు, నిరాయుధురాలైన మహిళా కానిస్టేబుల్ అర్పితా లీలాభాయి, డ్రైవర్ సునీల్ సోలంకి కలిసి వార్మోర్ గ్రామానికి వెళ్లారు. అర్పితా, భవిక... దశరథ్ సిన్హా ఇంట్లోకి వెళ్లారు. హరేశ్ మాత్రం అభయం వాహనంలోనే కూర్చుని ఉన్నారు.
ఊర్మిళతో పాటు, ఆమె తండ్రి దశరథ్ సిన్హా, సోదరుడు ఇంద్రజిత్ సిన్హా, మరికొందరు కుటుంబ సభ్యులతో 15-20 నిమిషాలు భవిక మాట్లాడారు.
ఆ సందర్భంగా ఊర్మిళను పంపేందుకు తమకు ఒక నెల గడువు ఇవ్వాలని అమ్మాయి కుటుంబ సభ్యులు కోరారు. ఆ తర్వాత భవిక, కానిస్టేబుల్ అర్పిత ఇద్దరూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారి వెంటే ఊర్మిళ తండ్రి దశరథ్ సిన్హా కూడా బయటకు వెళ్లారు. అప్పుడే అతనికి 'అభయం' వాహనంలో కూర్చుని ఉన్న హరేశ్ కనిపించారు.

ఫొటో సోర్స్, Pravin Barot
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం... హరేశ్‌ను చూడగానే "నా బిడ్డను తీసుకెళ్లింది ఒక హరిజనుడు. అతడు డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. అతన్ని బయటకు లాగి చంపేయండి" అని దశరథ్ గట్టిగా కేకలు వేశాడు.
ఆ వెంటనే ఎనిమిది మంది వ్యక్తులు ట్రాక్టర్లు, బైకులతో అభయం వాహనాన్ని చుట్టుముట్టారు. కత్తులు, కొడవళ్లతో హరేశ్‌తో పాటు అధికారుల మీద కూడా దాడి చేశారు.
ఆ దాడిలో గాయపడ్డ మహిళా కానిస్టేబుల్ అర్పితా లీలాభాయి పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి బలగాలను పంపించాలని కోరారు.
15 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే హరేశ్ చనిపోయారు. అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
"అతని కుటుంబం మొత్తం హరేశ్ సంపాదన మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు అతన్ని చంపేశారు" అని హరేశ్ దగ్గరి బంధువు శాంతీలాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
హరేశ్ తండ్రి యశ్వంత్ సోలంకి గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు, కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నారు.
హరేశ్ ఒక ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తుండేవారు.
ఏడాది క్రితం వీరి కుటుంబానికి ప్రభుత్వ పథకం కింద ఒక ఇల్లు వచ్చింది.
"ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశాం. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేశాం" అని అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఆర్.వీ. అసారీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మామిడిపండు కోస్తే మనిషిని చంపేస్తారా.. అసలేం జరిగింది
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- ఫొని తుపాను: ఒడిశాలో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే దళితులు.. కారణమేంటి
- డాక్టర్ పాయల్ తాడావీ: కులం పేరుతో వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- 'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








