ఫొని తుపాను: ఒడిశాలో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే దళితులు.. కారణమేంటి?

- రచయిత, విజయ్
- హోదా, బీబీసీ కోసం
ఫొని తుపాను తీరం దాటి నెల రోజులు గడుస్తున్నా, ఒడిశాలోని గ్రామాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. సర్వం కొల్పోయిన పేదలు, ముఖ్యంగా దళితులు ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు.
త్వరలో ఆ షెల్టర్ హోమ్స్‌ను కూడా మూసివేసే అలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఇప్పుడు వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
మే 3న ఒడిశా తీరాన్ని ఫొని తుఫాను వణికించింది. దీని ప్రభావానికి పూరీ జిల్లా పూర్తిగా అస్తవ్యస్తమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయితీ కార్యాలయాలు, కళాశాలల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించింది.

ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. పూరీ జిల్లాలోని నిమ్మపడా బ్లాక్‌లోని సైన్ సా ససన్, బగబగతీపూర్, కూనార్ పూర్ గ్రామాల్లో పర్యటించింది.
ఒక్క నిమ్మపడా పరిధిలోనే 32 గ్రామాలు తుపాను ప్రభావానికి పూర్తిగా నాశనం అయ్యాయి. దాదాపు 47 వేల కుటుంబాలకు నష్టం కలిగినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. సుమారు 28 వేల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొంటున్నాయి,.
ఇల్లు పూర్తిగా నాశనమైతే రూ.98,300, తీవ్రంగా దెబ్బతింటే రూ.95,100, పాక్షికంగా దెబ్బతింటే రూ.5,200, పూరిళ్లకు రూ.3,100 చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చింది.
నిమ్మపడాలో 211 పాఠశాలలు ఉండగా, తుపాను వల్ల వాటిలో 108 ధ్వంసమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. తమ పిల్లల చదువు ఎలా సాగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లో దళితులే ఎక్కువ
ప్రభుత్వం ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. నిమ్మపడా బ్లాక్‌లోని సైన్ సో ససన్, బగబగతీపూర్, కూనార్ పూర్ గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది.
చాలా మంది తమ ఇళ్లను బాగుచేయించుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వం వీరికి రూ.2,000 నగదుతోపాటు 50 కేజీల బియ్యం అందిస్తోంది. పాడైయిన ఇళ్లకు టార్పాలిన్ షీట్స్‌ను కూడా ఇచ్చింది.
ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సగం, సగం మరమ్మతులు సాధ్యమవడంతో, చాలా మంది తిరిగి ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. సైన్ సో ససన్ గ్రామంలో ఇలాంటివారు కనిపించారు.
సైన్ సో ససన్ గ్రామ పంచాయితీ కార్యాలయంలోనే 21 మంది ఆశ్రయం పొందుతున్నారు.
అక్కడే ఉంటున్న మిథాలీ బెహ్రా అనే యువతి బీబీసీ బృందంతో మాట్లాడారు.

ఇళ్ల మరమ్మతులకు అప్పులు పుట్టకే చాలా దళిత కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉంటున్నాయని ఆమె వివరించారు.
తాము కూలిపోయిన ఇళ్లలోనే నివసిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చాలడం లేదని ఆమె అన్నారు.
ప్రస్తుతం మిథాలీ పాలిటెక్నిక్ డిగ్రీ మూడో సంవత్సరంలో ఉన్నారు.
''కొన్ని రోజుల్లో కళాశాల తిరిగి ప్రారంభం అవుతుంది. ఇలాంటి ఇల్లును వదిలి, కళాశాలకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు'' అని ఆమె అన్నారు.
షెల్టర్స్ హోమ్స్‌లో ఉన్నవారికి ఇప్పుడు మరో కొత్త సమస్య మొదలైంది.
మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఒడిశాలో ప్రవేశిస్తాయి. ఆ వర్షాల నడుమ వీటిలో ఉండటం అంటే ఇబ్బందే.
బాధితులకు పూర్తి పరిహారం ఇప్పించేందుకు ఆక్స్ ఫాం, వికాస్ సదన్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
చెరువుల పూడిక తీత లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధితులకు ఉపాధి దొరికేలా చేస్తున్నాయి.

ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
ప్రభుత్వం తరఫున బాధితులను పూర్తిగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని నిమ్మపడా బ్లాక్ డెవెలప్‌మెంట్ అఫీసర్ శ్రీధర్ బిస్వాల్ అన్నారు. గ్రామల్లో ఎంత మేరకు నష్టం జరిగిందో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చామని తెలిపారు.
విద్యుత్ పునరుద్ధీకరణ పనులు 70 శాతం జరిగాయని, ఈ నెలాఖరుకు పూర్తవుతాయని చెప్పారు. పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారని వివరించారు.
ఇళ్లు పూర్తిగా నాశనమైనవారికి ప్రధానమంత్రి అవాస్ యోజన క్రింద పక్కా ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









