‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’

ఫొటో సోర్స్, STRDEL
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒత్తిడి కారణంగా సంతాన సమస్యలు తలెత్తడం మనుషులకే కాదు, అడవి ఏనుగులకూ ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఏనుగుల విసర్జితాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు.
తేయాకు తోటల్లోకి, నివాస ప్రాంతాల్లోకి అడవి ఏనుగులు వచ్చినప్పుడు జనాలు వాటిని భయపెట్టి తరిమేస్తుంటారు. అలాంటప్పుడు భయంతో పరుగెత్తుకుంటూ ఆ ఏనుగులు వేసే తాజా పేడను పరిశోధకులు సేకరించారు.
అలా తమిళనాడులోని వాల్పరాయి కొండ ప్రాంతాల్లో ఆరు నెలల వ్యవధిలో 69 ఏనుగుల పేడను ప్రయోగశాలకు తీసుకెళ్లారు.
మొత్తం 294 శాంపిళ్లను పరిశోధకులు శ్రీధర్ విజయ్ కృష్ణన్, ఉమాపతి, వినోద్ కుమార్ ల్యాబ్‌లో పరీక్షించించారు. భయంతో పరుగెత్తిన ఏనుగుల పేడలో గ్లూకోకోర్టికోయిడ్ మెటబోలిక్ స్థాయి చాలా అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
"తేయాకు తోటల్లోకి, పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి ఏనుగులు రాగానే వాటిని తరిమేసేందుకు ప్రజలు కేకలు వేస్తారు. భారీగా శబ్దాలు చేసే టపాసులు కాలుస్తారు, డప్పులు కొడతారు, డ్రమ్ములు వాయిస్తారు. అలా చేయడం వల్ల ఆ మూగజీవాలు ఉక్కిరిబిక్కిరి అవుతాయి. అప్పుడు ఏం చేయాలో కూడా వాటికి తెలియదు. గున్న ఏనుగులపై ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఒత్తిడి స్థాయి 100 శాతం దాకా ఉంటుంది. పెద్ద మగ ఏనుగుల్లో ఒత్తిడి స్థాయి 40శాతం దాకా ఉంటుంది. ఆ భయం నుంచి తేరుకునేందుకు చాలా కాలం పడుతుంది. అది వాటిలో సంతాన సమస్యలకు దారితీస్తుంది" అని ఈ అధ్యయన బృందం సభ్యుడు శ్రీధర్ బీబీసీకి వివరించారు.

ఆ ఒత్తిడి ప్రభావం ఏనుగుల పునరుత్పత్తితో పాటు, వ్యాధి నిరోధక శక్తిపై కూడా పడుతుందని పరిశోధకులు అంటున్నారు.
టపాసులు కాల్చి ఏనుగులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం మంచిది కాదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అలాంటి చర్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని 'ఊసాయి' పర్యావరణ సంస్థకు చెందిన కాళిదాస్ కోరుతున్నారు.
అడవుల నుంచి పంట పొలాల్లోకి, తేయాకు తోటల్లోకి ఏనుగులు రాకుండా అడ్డుకునేందుకు అటవీ శాఖ లోతైన కాలువలు తవ్వించాలని ఆయన సూచిస్తున్నారు.

"తేయాకు తోటల యజమానులు, గ్రామస్థులు ఏదో విధంగా ఏనుగులను తరిమేయాలని చూస్తారు. తమపై దాడి చేస్తాయన్న భయంతో వాళ్లు అలా చేస్తుంటారు. కానీ, ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. గున్న ఏనుగులు భయంతో తల్లిని వీడి చెల్లాచెదురుగా వెళ్లిపోతుంటాయి. వాటి గోస చూస్తే చాలా బాధేస్తుంది" అని కాళిదాస్ అన్నారు.
ఏనుగులకు, మనుషులకు మధ్య సంఘర్షణ జరిగే ప్రాంతాల్లోని 40 గ్రామాలకు కాళిదాస్ వెళ్లారు. కొన్ని ఏనుగుల్లో మనుషుల పట్ల కోపం తీవ్రంగా పెరుగుతోందని, దాంతో ఆహారం కోసం వెళ్లే క్రమంలో మనుషులపై దాడి చేస్తున్నాయని ఆయన అంటున్నారు.

అధికారులు మాత్రం వాల్పరాయి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఏనుగులను తరిమేందుకు టపాసులు కాల్చడంపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు.
"అడవి ఏనుగులను తరిమేందుకు మా వద్ద శిక్షణ పొందిన ఏనుగులు ఉన్నాయి. వాటి వల్ల కాకపోతే, డ్రమ్ములు వాయిస్తాం. టపాసులు కాల్చినప్పుడు ఏనుగులు ఎంత కలవరపాటుకు గురవుతాయో మాకు తెలుసు. అందుకే అలాంటి చర్యలను అడ్డుకుంటున్నాం" అని అటవీ శాఖ అధికారులు అన్నారు.
మనుషులు తిరిగే ప్రాంతాలకు ఏనుగులు ఏడాది పొడవునా రావని, అడవిలో ఆహారం దొరకనప్పుడు, అప్పుడప్పుడు చలికాలంలో వస్తుంటాయని వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








