జీ-7 దేశాల సదస్సులో ఏకాకైన ట్రంప్.. వాణిజ్య పోరు, రష్యా విషయంలో మిగతా దేశాల నుంచి వ్యతిరేకత

రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

కెనడాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు తొలి రోజున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర సభ్య దేశాల నేతల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ-7 దేశాల జట్టులో రష్యా మళ్లీ చేరొచ్చంటూ ట్రంప్ ఆహ్వానించారు. క్రిమియాను ఆక్రమించిన తరువాత రష్యాను జీ-7 దేశాల కూటమి నుంచి బహిష్కరించారు. అలాంటిది మళ్లీ ఇప్పుడు రష్యా విషయంలో ట్రంప్ కొత్త స్వరం ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ దీనిపై స్పందిస్తూ జీ-7 సదస్సుకు హాజరైన ఐరోపా సమాఖ్య దేశాలేవీ ఇందుకు అంగీకరించబోవని తేల్చి చెప్పారు.

కెనడా కూడా ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా ట్రంప్ వాణిజ్య వ్యవహారాలు అక్రమమని ఆ దేశం అభిప్రాయపడింది.

జర్మనీ చాన్సలర్ మెర్కెల్, కెనడా ప్రధాని ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

మరో రెండు వారాల్లో వాణిజ్య చర్చలు

వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ తదితర అంశాల్లో ట్రంప్ వైఖరి ప్రమాదాలను కొనితెస్తోందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు.

అయితే, కొంతలోకొంత నయంగా ఫ్రాన్స్ నుంచి మాత్రం ట్రంప్‌పై ఆగ్రహమేమీ వ్యక్తం కాలేదు. ఆయన ఆశావహంగా మాట్లాడారు.

ట్రంప్‌తో సమావేశమైన తరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మాట్లాడుతూ.. పరిస్థితులు సర్దుకుంటున్నాయని, వాణిజ్య పోరు విషయంలో సానుకూల మార్పులు రావడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

మరో రెండువారాల్లో యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలిపారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

సదస్సు ముగింపు వరకు ట్రంప్ ఉండడం లేదు

ట్రంప్, మిగతా ఆరుగురు నేతల మధ్య విభేదాలకు వాణిజ్య పోరు ఒక్కటే కాకుండా వాతావరణ మార్పులు, ఇరాన్ అణు ఒప్పందం, ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం వంటివన్నీ కారణమైనట్లు బీబీసీ డిప్లొమాటిక్ కరస్పాండెంట్ జేమ్స్ రాబిన్స్ తెలిపారు.

జీ-7 దేశాలు ఒకేమాటపై ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేసుకునే కంటే ఈ భేదాభిప్రాయాలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని జర్మనీ ఛాన్స్‌లర్ మెర్కెల్ అభిప్రాయపడ్డారు.

అయితే, సదస్సు ముగియడానికి ముందే ట్రంప్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్తుండడంతో ఇవన్నీ కొలిక్కి వస్తాయని చెప్పలేమని రాబిన్స్ అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

జీ-7లో రష్యాపై రగడ ఎందుకు?

ప్రస్తుతం జీ-7గా పిలుస్తున్న కూటమిలో ఏడు దేశాలున్నాయి. ఇవి ప్రపంచ వాణిజ్యంలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అన్నీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినవే. ఈ దేశాలన్నీ ఏటా సమావేశమవుతాయి.

ఒకప్పుడు రష్యా కూడా ఈ దేశాల కూటమిలో ఉండేది. అప్పుడు దీన్ని జీ-8గా పిలిచేవారు. క్రిమియాను ఆక్రమించుకుందన్న కారణంతో 2014లో రష్యాను జీ7 నుంచి బహిష్కరించారు.

కానీ ఇప్పుడు ట్రంప్ రష్యాను తిరిగి జీ7లో చేర్చుకోవాలని సూచించారు. 'మనం ప్రపంచాన్ని నడిపించాలి.. రష్యాను కూడా కలుపుకొనిపోవాలి' అని ఆయన అన్నారు.

ఈ ప్రతిపాదనకు ఇటలీ మినహా మిగతా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇటీవల విదేశీ వాణిజ్య లావాదేవీలపై ట్రంప్ పన్నులను భారీగా పెంచడంతో అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య అంతరాలు పెరిగాయి.

అంతకుముందు పారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణుఒప్పందాల విషయంలోనూ ట్రంప్ వైఖరి మార్చుకోవడంతో పలు దేశాల నుంచి అభ్యంతరాలున్నాయి.

తాజాగా రష్యా విషయంలోనూ ఆయన పునరాలోచనకు రావాలని సూచించడంతో జీ-7లో ఇతర కొన్ని దేశాలు ట్రంప్‌తో విభేదిస్తున్నాయి.

వీ చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)