ఐటీ ఉద్యోగిని జాబ్ నుంచి తీసేస్తే ఏం చేయాలి?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
కార్మిక సంఘాలు అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఫాక్టరీలు, పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు, సిబ్బంది, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడటానికి ఏర్పాటు చేసుకునే సంఘాలని మనకు తెలుసు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఉద్యోగ భద్రత కోసం ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఫోరమ్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ (4 ఐటీ) అనే సంస్థ.. నిష్కారణంగా ఉద్యోగుల నుంచి ఉద్వాసనకు గురైన వారికి చట్టపరమైన సహకారం అందిస్తోంది. ఈ సంస్థే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మే 26న ప్రకటించింది.

"ఉద్యోగ భద్రత కోసం ఈ సంఘాన్ని పెడుతున్నాం. ఐటీ సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాయి. యాజమాన్యాలకు సంఘాలున్నాయి. ప్రభుత్వాలు వారితో మాట్లాడతాయి. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇప్పటివరకూ వేదిక లేదు’’ 4 ఐటీ ప్రతినిధి కిరణ్ చంద్ర బీబీసీతో చెప్పారు.
‘‘రెండేళ్లుగా కోర్టులు, లేబర్ కమిషనరేట్ దగ్గర పోరాటాలు చేస్తున్న వారు ఉన్నారు. గత పదేళ్లుగా దీని గురించి కృషి చేస్తున్నాం. ఇప్పుడు సమయం వచ్చిందని భావించి యూనియన్ రూపంలో పెడుతున్నాం. సమస్యలపై సంఘటితంగా పోరాడటానికి సంఘం పెడుతున్నాం’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన డిమాండ్లు ఇవీ...
రీస్కిల్లింగ్ పేరుతో ఉద్యోగుల తొలగింపు, బీమా సౌకర్యం లేకపోవడం, మెటర్నిటీ, పెటర్నిటీ లీవులు, మహిళా ఉద్యోగులకు క్రష్ వంటి సౌకర్యాలు.. తదితర డిమాండ్లు ప్రధానంగా ఈ సంఘం ప్రారంభమయింది.
ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాలు పెట్టడం ఇదే మొదలు కాదు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంఘాలున్నాయి. 2017 నవంబరులో బెంగళూరులో మొదలైన ఒక ఐటీ సంఘానికి అక్కడి కార్మిక శాఖ గుర్తింపునిచ్చింది కూడా.
భారతదేశంలో దాదాపు 40 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ రంగానికి 1,500 కోట్ల డాలర్ల ఆదాయం ఉంది.
నాస్కామ్-ఫిక్కీ డిసెంబర్ 2017 లో విడుదల చేసిన 'ఫ్యూచర్ అఫ్ జాబ్స్' నివేదిక ప్రకారం.. ’’2022 నాటికీ ఐటీ రంగం లో 60-65 శాతం ఉద్యోగులు త్వరితగతిన మారుతున్న టెక్నాలజీ స్కిల్ సెట్స్‌తో పని చేయవలసి ఉంటుంది. అంతేకాక 10-20 శాతం ఉద్యోగులు ప్రస్తుతం అందుబాటులో లేని ఆధునిక టెక్నాలజీలపై పని చేయాల్సి ఉంటుంది’’.

ఫొటో సోర్స్, Getty Images
రీస్కిల్లింగ్ ఎంతో అవసరం...
అలాగే.. 20-35 శాతం ఉద్యోగులు 2017 నాటికి ఐటీ రంగంలో ఉనికి కోల్పోయే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే 2017 మే నెలలో నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ ఆ సంస్థ న్యూస్ లెటర్ ‘న్యూస్ లైన్’లో 'రిస్కిల్లింగ్ టు రివైవ్' అనే అంశం మీద ఒక వ్యాసం రాశారు. "వచ్చే నాలుగైదు సంవత్సరాలలో 20 లక్షల మందికి స్కిల్లింగ్-రీస్కిల్లింగ్ అవసరం. ఇది ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికీ వర్తిస్తుంది" అని పేర్కొన్నారు.
రీస్కిల్లింగ్ (ఉద్యోగానికి అవసరమైన కొత్త నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం) పేరుతో చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోయారని 4 ఐటీ ప్రతినిధులు తెలిపారు.
ఐటీ రంగం ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరమని.. అయితే ఈ నైపుణ్యాలు నేర్పడం యాజమాన్యం బాధ్యత అని ఉద్యోగులు అంటున్నారు. కానీ యాజమాన్యాలు ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
"రీస్కిల్లింగ్ ట్రైనింగ్‌కి యాజమాన్యం బాధ్యత లేదు అనడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లు ఉండటం హర్షించదగ్గ విషయం. కానీ సాఫ్ట్‌వేర్ చూడగానే రాదు. దానికి ట్రైనింగ్ ఇవ్వడం కంపెనీ బాధ్యత. తప్పించుకోవడానికి వంకలు పెడుతున్నారు. 8-10 పదేళ్ల పాటు వివిధ జనరేషన్ల టెక్నాలజీలపై పనిచేశాం" అన్నారు ప్రవీణ్ అనే ఉద్యోగి. ఆయన ఈ యూనియన్‌కి మద్దతిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగం నుంచి తీసేస్తే ఏం చేయాలి?
ఐటీ రంగంలో ట్రేడ్ యూనియన్ ఏర్పాటుపై ఉన్న భిన్న వాదనలను ఫర్ ఐటి ప్రతినిధి ప్రవీణ్ చంద్రహాస్, కిరణ్ చంద్రల వద్ద ప్రస్తావించగా.. వారు చెప్పిన వివరాలు.
- 'ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, 1926 ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది.
- ఐటీ లేబర్ చట్టాలు కూడా వర్తిస్తాయి. కర్మాగారాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్, వేతన చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం, ఈపీఎఫ్, గ్రాట్యుటీ వంటి చట్టాలు కూడా వర్తిస్తాయి.
- ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా లేబర్ కమీషనర్ వద్ద కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చు.
- సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద లేబర్ కమిషన్‌ను ఆశ్రయించవచ్చు.
- ఇప్పటికే తెలంగాణలో 2000 పైగా పిటిషన్స్ వేశారు. చాలా మందికి పరిహారం కూడా లభించింది.

ఐటీలో 40 శాతం మహిళలు...
ఏ పరిశ్రమలోనూ లేనట్టుగా ఐటీ రంగంలో 40 శాతం మంది మహిళలున్నారని 4 ఐటీ చెప్తోంది. కానీ మహిళలకు సౌకర్యాల కల్పన, అప్రైజల్స్ విషయంలో చాలా వివక్ష ఉందని వారు అంటున్నారు.
"మహిళా ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారనో, గర్భవతులయ్యారనో, పిల్లల్ని కన్నారనో వారిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు. రేటింగులు తగ్గిస్తున్నారు. ఉద్యోగిని పెళ్లి చేసుకోబోతుందంటే లేదా ప్రెగ్నెంట్ అయిందంటే ఏదో వ్యాధి సోకినట్టుగా చూస్తున్నారు. ఆ పరిస్థితి పోవాలి" అన్నారు కిరణ్ చంద్ర.
తండ్రులైన మగవారికి ఏడాదిలోపు పెటర్నిటీ లీవును ఎగ్జిగ్యూట్ చేయడం ద్వారా స్త్రీ పురుష సమానత్వానికి దారి తీస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఫోరమ్ ఫర్ ఐటీ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. కానీ ఈ సంఘంలో చేరే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. సంఘం ప్రారంభకులు మాత్రం సమస్యలపై అవగాహన పెరుగుతోందని చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అవగాహన పెరుగుతోంది...
"ఐటీ ఉద్యోగుల జీవితాల్లో స్థిరత్వం ప్రధానం. అదిలేకుండా పరిశ్రమలో స్థిరత్వం రాదు. రీస్కిల్లింగ్ అనేది సాకు మాత్రమే. నిజానికి వారు రీ స్ట్రక్చరింగ్ చేస్తున్నారు. దీనిపై ఐటి ఉద్యోగుల్లో అవగాహన పెరుగుతోంది. ఇప్పుడు హైకోర్టులో 70 వరకూ కేసులున్నాయి. లేబర్ కమిషనరేట్లో 2,000 వరకూ పిటిషన్లు నడుస్తున్నాయి. స్ట్రీట్ కార్నర్ మీటింగులు, గేట్ మీటింగులు జరుగుతున్నాయి" అన్నారు కిరణ్ చంద్ర.
అయితే కార్మిక సంఘం ప్రతిపాదనపై భిన్న స్పందనలు వచ్చాయి.
"ఉద్యోగులు, యాజమాన్యం మధ్య ఒక వారధి ఉంటే మంచిదే. వాళ్లు ఉద్యోగులు సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తే మంచిదే, కానీ సరైన పద్ధతిని పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది" అన్నారు టి-హబ్ సీఓఓ శ్రీనివాస్.
"హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమకు 26 ఏళ్ల చరిత్ర ఉంది. కొన్ని కంపెనీల యాజమాన్యాల్లో సమస్య ఉంది. కానీ ఇలా కార్మిక సంఘాల వంటి అస్థిర అంశాలు ఉంటే, అంతర్జాతీయ క్లయింట్లు వెనక్కు తగ్గే ప్రమాదం ఉంది. యూనియన్లు, యాజమాన్యం సంబంధాలు పని వాతావారణానికి మేలు చేసేలా ఉంటే మంచిదే. ఉద్యోగి రక్షణ మంచిదే కానీ మిలిటెంట్ తరహా కార్మిక సంఘాలు వస్తే మాత్రం వ్యాపారానికి ఇబ్బంది. ఉద్యోగుల నైపుణ్య ప్రమాణాలు పెంచడంపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెడుతోంది" అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్.

ఫొటో సోర్స్, Getty Images
అప్‌గ్రేడ్ కాకుంటే కష్టం...
"ఐటీ పరిశ్రమలో కావాల్సింది లెర్న్.. అన్‌లెర్న్.. రీలెర్న్. అది లేనప్పుడు ఈ పరిశ్రమలో బతకడం కష్టం. టెక్నాలజీలో ఎప్పుడూ మార్పులు రావడం సహజం. ఇంటర్నెట్ ఉన్న ప్రతి వ్యక్తీ ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు కంట్రిబ్యూట్ చేస్తూ వారి స్కిల్ సెట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం చాలా ఉంది’’ అని ప్రశ్నించారు 15 సంవత్సరాలుగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి.
‘‘పనిచేయకుండా, టెక్నాలజీలో వస్తున్న మార్పులను తెలుసుకోకుండా ఉన్న ఉద్యోగీ.. నిరంతరం నేర్చుకుంటూ అప్‌డేట్ అవుతున్న ఉద్యోగితో సమానంగా జీతం, ఉద్యోగం పొందాలనుకోవడం అసంబద్ధం. దానివల్ల ఉద్యోగం చేస్తూనే, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటోన్న ఇంజినీర్లకు అన్యాయం చేసినట్టు కాదా?" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అది ఉద్యోగుల బాధ్యత కూడా...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంఘం ఏర్పాటుపై హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థల అసోసియేషన్ స్పందిస్తూ.. ‘‘ఐటీ రంగంలో అతివేగంగా వివిధ కోణాలలో మార్పులు వస్తుంటాయి. సాంకేతికంగా మార్పులు, వాణిజ్య నమూనాలో మార్పులు వంటివి సంస్థల మధ్య తీవ్ర పోటీకి దారితీస్తుంటాయి. మార్పు వేగంగా ఉంటుంది.. అందుకు అనుగుణంగా అడ్జెస్ట్ కావటానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ రీస్కిల్లింగ్ నిజంగా అవసరం’’ అని పేర్కొంది.
‘‘కంపెనీలు తమతో పనిచేసే వారికి నిరంతర శిక్షణ ఇవ్వటాన్ని ఒక క్రమశిక్షణగా అలవరుచుకోవాలి.. రీస్కిల్లింగ్, అభివృద్ధి వంటి అంశాల విషయంలో మానవీయ, న్యాయబద్ధ విధానాలను అనుసరించాలి అన్నది మా అభిప్రాయం’’ అని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కార్యదర్శి రవి రావు చెప్పారు.
ఐటీ ఉద్యోగులకి కూడా సమాన బాధ్యత ఉంటుంది. సరైన నైపుణ్యాలను నేర్చుకోవటానికి, మారుతుండే పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా మెరుగుపడటానికి తగిన సమయం, శక్తులను వెచ్చించటం మీద దృష్టి పెట్టాలి’’ అని ఆయన సూచించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








