నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ తెలుగు డెస్క్
- హోదా, ...
జీతాలను పెంచాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో (బుధ, గురువారాలు) రెండు రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు.
దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డి.టి.ఫ్రాంకో సోమవారం ముంబైలో మీడియాకు తెలిపారు.
ఐబీఏ గత వేతన సవరణలో 15 శాతం వేతన పెంపు ఇచ్చింది. అది 2012 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకూ అమలులో ఉంది. కొత్త వేతన సవరణ 2017 నవంబర్ 1వ తేదీ నాటికే పూర్తి కావాల్సి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జీతాల పెంపుపై బ్యాంకు ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపిన బ్యాంకుల యాజమాన్యాల సంఘం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ).. చివరికి రెండు శాతం వేతనం మాత్రమే పెంచుతామని ప్రతిపాదించాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేవలం రెండు శాతం జీతాల పెంపును ప్రతిపాదించటం అన్యాయమని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ''పెరిగిన జీవన వ్యయాన్నిబట్టి చూస్తే ఈ పెంపు ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని స్పష్టంచేశారు.
ఈ ప్రతిష్టంభనపై తాజాగా జరిగిన చర్చలు కూడా ఫలించలేదు. ''ప్రతిపాదిత రెండు శాతం పెంపును పున:పరిశీలిస్తామని బ్యాంకులు ఐబీఏ ప్రతినిధుల ద్వారా చెప్పినప్పటికీ.. నిర్దిష్టమైన ప్రతిపాదన ఏదీ ముందుకు తేలేదు. కాబట్టి సమ్మె జరుగుతుంది'' అని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి ఉద్ఘాటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే 20 రోజుల ముందు నోటీసు ఇచ్చాం..
బ్యాంకుల సమ్మె గురించి అఖల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలంతో బీబీసీ మాట్లాడింది.
"ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే మేం 20 రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాం. అయినా మా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదు" అని వెంకటాచలం చెప్పారు.
సమ్మె నిర్ణయానికి కారణాల గురించి మాట్లాడుతూ, "వేతన సవరణల విషయంలో ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఇందులో పురోగతి లేదు. మే 5న ఐబీఏ (ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్) మమ్మల్ని చర్చలకు పిలిచింది. వేతనం 2 శాతం పెంచడానికి సిద్ధమని అన్నారు. గతంలో సవరణలు జరిగినప్పుడు వేతనాలు 15 శాతం, 17 శాతం పెంచారు. ఇప్పుడేమో 2 శాతం పెంచుతామంటున్నారు" అని ఆయన వివరించారు.
"బ్యాంకుల లాభాలు పడిపోయాయని, నష్టాలు వస్తున్నాయని అని కారణాలు చెబుతున్నారు. వాస్తవానికి బ్యాంకుల లాభాలు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. మొండి బకాయిల వల్లనే లాభాలు హరించుకుపోతున్నాయి. 2016-17, 2017-18 సంవత్సరాల్లో లాభాలన్నీ మొండి బకాయిలకు ప్రకటించిన మాఫీ (రైట్ ఆఫ్) కిందకే పోయాయి. దాంతో లాభాలు లేవు. కానీ దీనికి బాధ్యులెవరు? ఉద్యోగులు కారు కదా? అది యాజమాన్యాల బాధ్యత. దీన్ని సాకుగా చెబితే ఎలా ఒప్పుకుంటాం? ఇదే మా పోరాటం" అని వెంకటాచలం తెలిపారు.
"వేతన పెంపు ఎంత శాతం కావాలని కోరుకుంటున్నారని ఆయనను అడగగా, "ఇంత అని మేం చెప్పడం లేదు. సహేతుకంగా, సరిపడేంత సవరణ జరగాలి. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకోవాలి. పని భారాన్ని గమనించాలి."

ఫొటో సోర్స్, Facebook/AIBEA
వేతన పెంపు అన్ని స్థాయిలకూ వర్తించాలి...
అలాగే.. వేతన చర్చలను స్కేల్-3 అధికారుల వరకే.. అంటే సీనియర్ మేనేజర్ల స్థాయి వరకే పరిమితం చేస్తామని బ్యాంకు యాజమాన్యాలు అంటున్నాయంటూ, దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి.
గతంలో అనుసరించిన విధంగానే స్కేల్-7 అధికారులు - అంటే జనరల్ మేనేజర్లు మొదలుకుని డివిజనల్ మేనేజర్ల వరకూ వేతనాల పెంపును బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బ్యాంకులు నష్టాల్లో నడవటం, నిరర్థక ఆస్తులు పెరగటం వంటి కారణాల వల్ల వేతనాలను 2 శాతం కన్నా పెంచలేమనటం సహేతుకం కాదని.. యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ తన సమ్మె నోటీసులో పేర్కొంది.
పదేళ్లుగా బ్యాంకుల నిర్వహణా లాభాలు ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయని.. కానీ ఈ కష్టార్జిత లాభాల్లో 70 శాతం మేర మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల వల్ల ఆవిరవుతున్నాయని ఆ నోటీసులో చెప్పింది. లాభాలు తరిగిపోతుండటానికి.. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు కారణం కాదని వాదించింది.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకు సిబ్బంది, అధికారుల మీద పని భారం విపరీతంగా పెరిగిందని.. బ్యాంకింగ్ లావేదీవీలతో సంబంధం లేని ఇతర పనులు, ప్రభుత్వ పథకాలను అమలు చేసే భారం కూడా బ్యాంకు సిబ్బంది భుజాలపై పడిందనీ.. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాల సమాఖ్య యూఎఫ్‌బీయూ పేర్కొంది.
బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కూడా ఈ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని సత్వరమే మెరుగైన వేతన పెంపుపై బ్యాంకర్ల సంఘం నిర్ణయం తీసుకునేలా చేయకపోతే బుధ, గురువారాల్లో 48 గంటల పాటు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








