‘ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర కొరియాను సందర్శిస్తారా?’

- రచయిత, ఆరతీ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియాలో భారత రాయబారిగా అతుల్ గోత్‌సుర్వే నియమితులయ్యారు. ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన సీనియర్ ఆఫీసర్. గత ఆరేళ్లుగా ఉత్తర కొరియాకు భారత రాయబారిని ఎవరినీ నియమించలేదు. ఉత్తర కొరియాలో చాలా తక్కువ మంది భారతీయులు ఉన్నారని ఆయన బీబీసీ ప్రతినిధికి తెలిపారు. అతుల్ గోత్‌సుర్వేతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న: మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్‌కు మీ ప్రయాణం ఎలా జరిగింది?
జవాబు: నాది దక్షిణ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా చపల్‌గావ్. నేను పుణెలో బీఈ, ఎంఈ పూర్తి చేశాను. భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది నా కోరిక. నేను 2004లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరాను. మెక్సికో, క్యూబాలాంటి దేశాలలో పని చేశాను. అందువల్ల నాకు తూర్పు దేశమైన ఉత్తర కొరియాలో పని చేసే అవకాశం వచ్చినపుడు నేను వెంటనే దానికి అంగీకరించాను.
ప్రశ్న: ఉత్తరకొరియాలో పని చేయడం సవాలులాంటిది. నియంతృత్వానికి, అణు పరీక్షలకు ఆ దేశం పెట్టింది పేరు. ఆ దేశంలో పని చేయాల్సి రావడం మీకు కష్టంగా అనిపించడం లేదా?
జవాబు: లేదు. మీరు భారతదేశ రాయబారిగా ఏ దేశానికి వెళ్లినా, 125 కోట్ల భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా వెళుతున్నారు. నా దృష్టిలో దౌత్యవేత్తలు కూడా సైనికుల్లాంటివారే. అతను తనపై పెట్టిన బాధ్యతలను నిర్వర్తించాలి. భారతదేశం ఆ బాధ్యతను నాకు అప్పగించినందుకు నాకు గర్వంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: మీరు ఇప్పటికే ఒక నెల రోజుల పాటు ప్యాంగ్‌యాంగ్‌లో పని చేశారు. ఆ నగరంలో మీరు ఏం గమనించారు?
జవాబు: ప్రతి దేశానికీ దానిదైన ఒక లక్షణం, ఒక సంస్కృతి ఉంటాయి. మొట్టమొదటగా ప్యాంగ్‌యాంగ్‌లో నేను గమనించింది - శుభ్రత. ఆ నగరం డెడాంగ్ నది ఒడ్డున ఉంది. ఆ నగరంలో ట్రామ్‌ల ద్వారా ప్రయాణించొచ్చు. అక్కడి ప్రజలు చాలా కష్టపడేతత్వం, క్రమశిక్షణ కలిగిన వారు. అక్కడ మహిళలు కూడా పురుషులతో సమానంగా కష్టపడతారు. ప్రజలు ఎప్పుడూ పని చేస్తూనే కనిపిస్తారు. తూర్పు దేశం కావడం చేత అక్కడ సూర్యుడు చాలా తొందరగా ఉదయించి, ఆలస్యంగా అస్తమిస్తాడు. ప్రస్తుతం అక్కడ వసంత కాలం. అక్కడ శీతాకాలం చాలా కఠినంగా ఉంటుందని విన్నాను.
ప్రశ్న: మీరు కిమ్ జోంగ్ ఉన్‌ను కలిశారా?
జవాబు: ఇంకా లేదు. కానీ ఆయనతో సమావేశమయ్యే అవకాశం ఉంది. నేను సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ప్రిసీడియం అధ్యక్షుడు కిమ్ యోంగ్ నామ్‌ను కలిశాను. భారత విదేశాంగ మంత్రి వీకే సింగ్ అక్కడికి వచ్చినపుడు నేను ఆయనను కలిశాను. భౌగోళికంగా భారతదేశం, ఉత్తరకొరియాలు రెండూ దగ్గరగా ఉన్న దేశాలు. ఈ రెండు దేశాల మధ్య 1973లో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ బంధానికి ఈ ఏడాదితో 45 ఏళ్లు పూర్తి అవుతాయి. దానిని పురస్కరించుకొని మేం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ప్రశ్న: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర కొరియాను సందర్శిస్తారా?
జవాబు: లేదు. ఆయన ఇప్పుడప్పుడే ఉత్తర కొరియాను సందర్శించే అవకాశం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: ట్రంప్- కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరుగుతున్న సమావేశాన్ని భారతదేశం ఏ విధంగా చూస్తోంది?
జవాబు: మొత్తం ప్రపంచమే దాని గురించి ఆసక్తి కనబరుస్తోంది. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడానికి ఉన్న అన్ని అవకాశాలకూ భారత్ మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి ఈ సమావేశం చాలా అవసరం.
ప్రశ్న: ఉత్తర కొరియా, భారతదేశం మధ్య ఉన్న సారూప్యత ఏంటి?
జవాబు: భారతదేశం మాదిరే ఉత్తర కొరియా కూడా వ్యవసాయ ఆధారిత దేశం. అక్కడ వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తాయి. అందువల్ల అక్కడ వరిని ఎక్కువగా పండిస్తారు. ఉత్తర కొరియా మన దేశం నుంచి వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశిస్తోంది. అదే విధంగా విత్తనోత్పత్తిలో కూడా వాళ్లు సాయాన్ని ఆశిస్తున్నారు.
ప్రశ్న: భారతదేశం గురించి ఉత్తర కొరియా అభిప్రాయం ఏమిటి?
జవాబు: భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశమనేది వాళ్ల అభిప్రాయం. భారతీయుల జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతి, బాలీవుడ్ అంటే వాళ్లకు చాలా ఆసక్తి. ఉత్తర కొరియాలో కూడా మన దేశంలాంటి కుటుంబ వ్యవస్థ ఉంది. అక్కడ చాలా మంది అమితాబ్ బచ్చన్ బాగ్‌బన్ సినిమా గురించి అడుగుతారు. బాహుబలి, దంగల్ అక్కడ చాలా పాపులర్ సినిమాలు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: ఉత్తర కొరియాలో ఎంత మంది భారతీయులు నివసిస్తున్నారు?
జవాబు: దక్షిణ కొరియాలో చాలా మంది భారతీయులే నివసిస్తున్నారు కానీ, ఉత్తర కొరియా విషయంలో అలా కాదు. అక్కడున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల్లో కొంత మంది భారతీయులు ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అక్కడ మరాఠీ ప్రజలెవరూ లేరు. ఉత్తర కొరియాలో మరాఠీ వ్యక్తిని నేను ఒక్కణ్నే.
ప్రశ్న: ఉత్తర కొరియా ప్రజలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు ఎలా ఉన్నాయి?
జవాబు: రష్యా, చైనాలు ఆ దేశానికి సరిహద్దుల్లో ఉన్నాయి. అందువల్ల ఆ మూడు దేశాల మధ్య వాణిజ్యపరమైన లావాదేవీల ద్వారా సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర కొరియాపై ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఈ దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు జరగడం లేదు.
ప్రశ్న: భారతదేశ రాయబారిగా మీ లక్ష్యం ఏమిటి?
జవాబు: ఉత్తర కొరియాతో భారతదేశానికి దౌత్య సంబంధాలు ఏర్పడి 45 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. అందువల్ల మేం రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. రెండు దేశాల మధ్య వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం విషయాలలో ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








