నిక్సన్ మావో చర్చలు గుర్తుకొస్తున్నాయి

నిక్సన్ చైనా పర్యటన

ఫొటో సోర్స్, CORBIS HISTORICAL/GETTY IMAGES

అనేక ఊగిసలాటల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్- ఉన్‌ల మధ్య భేటీ ఎట్టకేలకు ఖరారైంది.

వారిద్దరు జూన్ 12న సింగపూర్‌లో కలవనున్నారు. మాజీ శత్రువులైన వీరిద్దరి మధ్య భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి భేటీ 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చైనా పర్యటనను గుర్తుకు తెస్తోంది.

ఈ రెండు భేటీల్లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అప్పట్లో సాంస్కృతిక విప్లవం పేరుతో చైనా ముందుకెళ్లింది. ప్రపంచ దేశాల నుంచి ఏకాకిగా మిగిలింది. దాదాపు 20 ఏళ్లపాటు అమెరికాతో ఆ దేశానికి సరైన సంబంధాలు లేవు.

అమెరికాతో శాంతియుతంగా కొనసాగాల్సిన అవసరం ఉందని ఉత్తరకొరియా ప్రజలకు ఇప్పుడు కిమ్ చెబుతున్నట్లే అప్పట్లో చైనా ప్రభుత్వం కూడా అక్కడి వారికి సూచించింది. మూడో ప్రపంచ విప్లవం కోసం మనం అమెరికాను స్వాగతించాలని చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపునిచ్చింది.

బీబీసీ ప్రతినిధి యువెన్ వు 1972లో యువ విద్యార్థి. అప్పట్లో నిక్సన్ పర్యటనకు చైనా ఎలా సిద్ధమైందో.. నిక్సన్ వారం రోజుల పర్యటన ప్రపంచాన్ని ఎలా మార్చిందో ఆయన గుర్తుచేసుకున్నారు.

1971 జులై 15 రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలిఫోర్నియాలో ఉన్న ఎన్‌బీసీ టెలివిజన్ స్టూడియోకి వచ్చారు. చైనా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు చైనా పర్యటనకు వెళ్తున్నానని తెలిపారు.

సరిగ్గా అదే సమయానికి జులై 16న బీజింగ్‌లో ఉన్న చైనా జాతీయ ప్రసార సంస్థ అదే విషయాన్ని ప్రకటించింది.

ఇవి ఇరుదేశాలు పక్కా ప్రణాళికతో రూపొందించుకున్న ప్రకటనలే. అయితే, నిక్సన్ చైనా పర్యటన వార్త ప్రపంచాన్ని కుదిపేసింది.

నిక్సన్ చైనా పర్యటన

ఫొటో సోర్స్, BETTMANN/GETTY IMAGES

మావో వ్యూహాత్మక ఎత్తుగడ

అమెరికా అధ్యక్షుడిని తమ దేశానికి ఆహ్వానించాలని చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా రష్యాతో దానికి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. తన శత్రువుల కంటే తన కూటమి దేశాల నుంచి దానికి ప్రమాదం ఎదురైంది.

1979లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో నెలకొనడానికంటే ముందు అనేక చర్చలు, కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య కొనసాగాయి.

వాషింగ్టన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని 1970లో మావో జెడాంగ్ అమెరికా జర్నలిస్ట్ ఎడ్గర్ స్నోవ్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపారు.

1971లో అమెరికా టేబుల్ టెన్నిస్ టీంను చైనా తమ దేశానికి ఆహ్వానించింది.

ఆ తర్వాత కొన్ని నెలలకే నిక్సన్ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్ రహస్యంగా చైనాలో పర్యటించి వచ్చారు.

నిక్సన్ పర్యటనే కాదు, ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే.. చైనా అనేక యంత్రాంగాలతో సమాయత్తం అవుతుంది. పర్యటనలు విజయవంతం అయ్యేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటుంది. ప్రచార వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. భారీగా జనాన్ని సమీకరిస్తుంది.

అప్పుడు నాకు 15 ఏళ్లు. బీజింగ్‌లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నా. నిక్సన్ పర్యటన గురించి పూర్తి స్థాయిలో గుర్తుకు రావడం లేదు. అప్పుడు నాతో పాటు చదువుకున్న చాలా మంది స్నేహితులతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాత్రం గుర్తుకొచ్చాయి.

''అమెరికా నుంచి వచ్చే పర్యటకులతో అంత వినయంగా ఉండొద్దు, మరీ కోపంతోనూ ఉండొద్దు'' అని అప్పుడు విద్యార్థులుగా ఉన్న మాకు ప్రభుత్వం నిర్దేశించింది.

ఆ తర్వాత చైనా ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి నిబంధనలపై ఇంకా చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నా.

అమెరికా అతిథుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఫొటో క్యాప్షన్, అమెరికా అతిథుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మీడియాలో అమెరికా పేరు మారింది

నిక్సన్ చైనా పర్యటన సందర్భంలో మీడియా అనుసరించాల్సిన మార్గనిర్దేశకాలు ఎలా ఉండేవో అప్పటి చైనా సెంట్రల్ బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్ ముఖ్య అధికారి యాంగ్ జెంగ్వాన్ గుర్తుచేసుకున్నారు.

'అమెరికాపై చైనా దృక్పథంలో ఏలాంటి మార్పు ఉండదు. దీనర్థం ఏంటంటే, మేం ఇప్పటికీ అమెరికాకు వ్యతిరేకమే. కానీ, ఆ దేశ అధ్యక్షుడు నిక్సన్ ఇప్పుడు మా అతిథి. అందుకే మేం అతన్ని తక్కువగా చూడం'' అని అర్థమని జెంగ్వాన్ పేర్కొన్నారు.

చైనా మీడియా అమెరికాను సామ్రాజ్యవాద దేశమని పిలిచేది. అయితే, నిక్సన్ పర్యటన కాలంలో యూఎస్‌ఏ అని చైనా రేడియో, టీవీ బులెటిన్లలో ప్రసారాలు వచ్చాయి.

నిక్సన్ పర్యటనను అమెరికాలో ఎలా చూపిస్తారో? లైవ్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థను నిక్సన్ ఎలా ఉపయోగించుకుంటారోనని చైనా అనుకుంది. అందుకే అది లైవ్ ప్రసారాలకు అమెరికా టెక్నికల్ టీంకు మొదట అనుమతి ఇవ్వలేదు.

అయితే, చైనా అధినేత ఆమోదంతో తర్వాత లైవ్ ప్రసారాలకు అనుమతి వచ్చింది. కానీ, అది కూడా చైనా సాంకేతిక పరికరాలతోనే..

అడుగడుగునా భద్రత..

అతిథులకు భద్రత కల్పించడం నిజంగా పెద్ద సవాలే. అనుకోని సంఘటనలు ఏవీ జరగకుండా చర్చలు కొనసాగేలా చూసేందుకు ఆతిథ్య దేశం చాలా చర్యలు తీసుకుంటుంది.

పర్యటన మొదలుకాగానే, దేశ రాజధానిలో పెద్ద సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. గృహనిర్బంధాలు చేస్తారు.

మళ్లీ నా స్కూల్ డేస్‌కు వస్తే, నిక్సన్ పర్యటన సమయంలో మా స్కూల్ విద్యార్థి కత్తితో స్కూల్‌కి వచ్చాడని అతన్ని అరెస్టు చేశారు.

మీకు తిండికి, బట్టలకు ఇబ్బంది లేదా? మీకు అమెరికా అంటే ఇష్టమేనా అని ఎవరైనా అమెరికా జర్నలిస్టులు చైనాలో పిల్లలను అడిగితే వాళ్లు అర్థం కానట్లు నటిస్తారు, లేదా అక్కడి నుంచి పారిపోతారు.

నిక్సన్ చైనా పర్యటన

ఫొటో సోర్స్, CORBIS/GETTY IMAGES

చైనా వాల్‌పై పర్యాటకులుగా నటన

స్నేహపూర్వక వాతావరణం సృష్టించేందుకు చైనా చాలా పనులు చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. గోడలపై ఉండే వివాదాస్పద నినాదాలు, సూక్తులను తొలగిస్తుంది.

నిక్సన్ పర్యటనలో భాగంగా అక్కడ పర్యటించిన అమెరికా జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత మాక్స్ ఫ్రాంకెల్ నాటి అనుభవాలను వివరించారు. ''వ్యూహాత్మకంగా గ్రేట్ వాల్ మీద నిక్సన్ పర్యటన ఉండేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ పర్యాటకులు చాలా చక్కటి దుస్తులు ధరించి ఉన్నారు. మాకు సాదర స్వాగతం పలికారు. ఇలా చేయడానికే ప్రత్యేకంగా వాళ్లను అక్కడికి తీసుకొచ్చారు'' అని పేర్కొన్నారు.

2008లో ఓ వ్యక్తి ఫొనిక్స్ వెబ్‌సైట్‌కు రాసిన కథనం ప్రకారం.. ''నిక్సన్ పర్యటన కాలంలో నేను ఒక చిన్న కంపెనీలో పనిచేసేవాడ్ని. ఆ పర్యటన సందర్భంలో ఓ 10 మంది నమ్మకమైన వ్యక్తులు కావాలని అడిగారు. చక్కటి డ్రెస్‌ వేసుకోవాలని, యూనిఫాంలను అనుమతించమని చెప్పారు. గ్రేట్ వాల్ దగ్గర పర్యాటకులుగా నటించాలని అన్నారు. అలాగే, అమెరికా ప్రతినిధులకు కాస్త దూరంగా మెలగాలని చెప్పారు. వాళ్లు ఏమైనా ప్రశ్నలు వేస్తే అర్థంకానట్లు నటించాలన్నారు'' అని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

గొప్ప పురోగతి

చైనాలో భారీగా మంచుకురుస్తున్న కాలమది. నిక్సన్ గ్రేట్ వాల్ పర్యటనకు ముందు రోజు రాత్రి వరకు వేలాది మంది బీజింగ్‌ వాసులు, ఆర్మీ అధికారులు రోడ్డుపై ఉన్న మంచును తొలగించేందుకు కష్టపడ్డారు.

ఇది చూసి పర్యటకులు వారిని అభినందించారు. అయితే, గ్రేట్ వాల్‌ మాత్రం నిక్సన్‌ను బాగా ఆకట్టుకుంది.

''ఈ గోడను చూస్తుంటే, ప్రజల మధ్య ఎలాంటి గోడలు ఉండొద్దని అనిపిస్తుంది'' అని జర్నలిస్టులు, చైనా అతిథులతో నిక్సన్ చెప్పారు.

1972 వరకు అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పడుతూ, లేస్తూ వచ్చాయి. అయితే, నిక్సన్ పర్యటన కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి సాధ్యపడింది.

ఇప్పుడు అందరి కళ్లు ట్రంప్, కిమ్‌ల భేటీపైనే ఉన్నాయి. 6 దశాబ్దాల విరోధానికి ముగింపు పలికేందుకు వీరి భేటీ తొలి అడుగుకావాలి. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరత నెలకొనాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)