ఎందుకు ముస్లింలు తమ వాళ్ల మధ్య తప్ప ఎక్కడా ఉండడానికి ఇష్టపడరు?

    దళితులు, ముస్లింలపై బీబీసీ ప్రత్యేక సిరీస్‌లో, ఎందుకు ముస్లింలంతా ఒకే చోట
    ఉండేందుకు ఇష్టపడతారో కనుగొనేందుకు ప్రయత్నించడం జరిగింది?

    News imageNews imageNews image

    దిల్లీలో ముస్లింలు ఉన్న ప్రదేశాలను పిలిచే పదంపై కొంతమందికికొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. అలాంటి ప్రదేశాలకు ఇంగ్లిష్‌లో ‘ghetto’ అనే పదాన్నేవాడతారు.

    News image

    ‘ఘెట్టో’

    ఘెట్టో పదం ఇటాలియన్ భాష నుంచి పుట్టింది. వెనీస్‌లోఓ ఇనుప ఫ్యాక్టరీకి చుట్టూ ఉండే యూదులు ఉండే ప్రాంతాన్ని ఘెట్టో అనేవారు. ఆ తర్వాత 16, 17వ శతాబ్దాలలలో యూరప్‌లో యూదులు స్థిరపడిన అన్ని ప్రదేశాలను ఘెట్టోలు అనిపిలవడం ప్రారంభమైంది. ప్రస్తుతం ‘ఘెట్టో’ అనే పదాన్ని జనసాంద్రత ఎక్కువగా ఉన్న, కనీస ప్రాథమిక అవసరాలు కరువైన, ఒక ప్రత్యేకమైన మతానికి చెందిన ప్రజలు నివసించే ప్రదేశాన్నిసూచించడానికి వాడుతున్నారు.

    ఇక దిల్లీకి వద్దాం. పృథ్వీరాజ్ చౌహాన్, మొఘలుల కాలం, ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలన.. ఇలా కాలానుగుణంగా దిల్లీ రూపురేఖలు మారిపోయాయి. అదే సమయంలో దిల్లీలో అనేక కొత్త ప్రదేశాలలో ప్రజలు స్థిరపడ్డారు.

    అలాగే నేడు దిల్లీలో జనసాంద్రత ఎక్కువగా ఉండే అనేకచోట్ల ముస్లింలు స్థిరపడ్డారు.

    ముస్లింలు ప్రత్యేకించి ఎందుకు ఇలాంటి చోటే నివసిస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది?

    ఎందుకు వారు ఇతర వర్గాల వారితో కలవరు? గిరిజనుల్లా వాళ్లకు కేవలం తమ మతానికి చెందిన వారితో మాత్రమే కలిసే అలవాటుందా?

    ఈ బీబీసీ ప్రత్యేక సిరీస్‌లో మేం ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేశాము.

    ఇందుకోసం మేం ‘జమునా పార్’ అని పిలిచే ఈశాన్య దిల్లీకి వెళ్లాం.

    ఈ ప్రాంతంలో ముస్లింలు భారీ సంఖ్యలో ఉన్నారు. మరీ ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ స్థిరపడ్డారు. అనేక ప్రదేశాలలో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని ప్రాంతాలలో ముస్లింలు ఇతర వర్గాల వారితో కలిసి ఉంటున్నారు.

    అలాంటి ఒక సెటిల్మెంట్ జఫరాబాద్. ఇది సీలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇక్కడ సుమారు ఒకటిన్నర లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ నివసించే వారిలో చాలా మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడమో లేదో రోజువారీ కూలీలుగానో పని చేస్తున్నారు.

    ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి కానీ డిస్పెన్సరీ కానీ లేదు. కేవలం రెండు ప్రాథమిక, ఒక సెకెండరీ పాఠశాల మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సందులు ఎంత ఇరుకు అంటే కారు కూడా పట్టదు.

    ‘వేరే గ్రహం నుంచి వచ్చిన వారిలా చూస్తారు’

    ఎందుకు ముస్లింలు జఫరాబాద్ కాలనీలో నివసిస్తున్నారు?ఎందుకు పక్కనే ఇతర వర్గాలు కూడా ఉన్న ప్రదేశంలో నివసించరు?

    మమ్మల్ని భారతపౌరులుగా కాకుండా ముస్లింలుగా మాత్రమే గుర్తిస్తారు. బురఖా ధరించే మమ్మల్ని ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారిలా చూస్తారు.

    ఇరామ్

    ఎందుకు ముస్లింలు జఫరాబాద్ కాలనీలో నివసిస్తున్నారు? ఎందుకు పక్కనే ఇతర వర్గాలు కూడా ఉన్న ప్రదేశంలో నివసించరు?

    26 ఏళ్ల ఇరామ్ అరీఫ్‌కు ఈ ప్రశ్న వేసినపుడు ఆమె చాలా వ్యంగ్యంగా స్పందించింది. గ్రాడ్యుయేట్ అయిన ఇరామ్, ముస్లిమేతర ప్రాంతాలలోముస్లింలను ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారిలా చూస్తారంది.

    ‘‘ఇలాంటి చోట మమ్మల్ని మమ్మల్నిగా చూస్తారు, అందుకే మేం ఇక్కడ ఉంటాం. ఇక్కడ నేరాలు జరిగితే జరగొచ్చు కానీ ఇతర ప్రాంతాలలో మా పట్లద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తారు. మమ్మల్ని భారత పౌరులుగా కాకుండా ముస్లింలుగా మాత్రమే గుర్తిస్తారు. బురఖా ధరించే మమ్మల్ని ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారిలా చూస్తారు.’’ అంది ఆమె.

    తాము ఉండే ప్రదేశంలో తమ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చని, నచ్చింది తినవచ్చని, ఇష్టం వచ్చిన రీతిలో పండుగలను జరుపుకోవచ్చని ఇరామ్ తెలిపింది. తమను కూడా భారతీయుల్లాగే చూస్తే, ఇతర ప్రాంతాలలో కూడా నివసించడానికి తమకు అభ్యంతరం లేదని ఇరామ్ చెప్పింది.

    అయితే, చార్టర్డ్ అకౌంటెంట్ హ్యూమా ఖాన్ (26 ఏళ్లు) కొంచెం భిన్నం. ముస్లింలు ఇతర వర్గాల వారు కూడా ఉండే ప్రాంతంలో ఉండాలని హ్యూమా అంది. అయితే ఈ విషయంలో పెద్దల అభిప్రాయం కూడా తీసుకోవాలనేది ఆమె అభిప్రాయం.

    ఆ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, కొనాలన్నా మాకు చాలా కష్టం.

    హ్యూమా

    ‘అల్లర్లు’ అనే పదం ఉపయోగించకుండా ఆమె, ‘’20-25 ఏళ్ల క్రితం జరిగిన అన్యాయం కారణంగా, ముస్లింలు ఇతర ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడడంలేదు. రెండోది – ఇతర ధనిక సమాజం లేదా ముస్లిమేతర ప్రాంతాల్లో మమ్మల్నిఅంగీకరించరు. ఆ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, కొనాలన్నా మాకు చాలా కష్టం’’ అని హ్యూమా తెలిపింది.

    తనకు అవకాశం లభిస్తే మాత్రం ముస్లిమేతరులు ఉండే ప్రాంతంలో నివసిస్తానన్న హ్యూమా.. ముస్లింలు ఎక్కువగా ఉండే జఫరాబాద్ లాంటి ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచి, అక్కడ శాంతిభద్రతలను నెలకొల్పితే, అదే తన మొదటి ప్రాధాన్యత అని అంది.

    దిల్లీలో ముస్లింలు ఉండే ప్రాంతాలు
    News image
    News image

    జాకెట్లు, కూలర్లు, ఎంబ్రాయిడరీ పనికి జఫరాబాద్ చాలా ప్రసిద్ధి. జఫరాబాద్ వ్యాపారుల సంస్థ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ తమది దేశంలోనే అతి పెద్ద జాకెట్ మార్కెట్ అని తెలిపారు. ఇక్కడ నుంచి జాకెట్లు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.

    అమానుల్లా ఖాన్ 

    అమానుల్లా ఖాన్ 

    52 ఏళ్ల అమానుల్లా ఖాన్ జాకెట్ల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఆయన తల్చుకుంటే ధనికులు ఉండే ప్రాంతాలలో నివసించగలరు. కానీ ఆయన జఫరాబాద్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

    ఎందుకని ప్రశ్నిస్తే - తాను గత 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, ఇక్కడ ఉండడం వల్ల చాలా లాభలు ఉన్నాయని అన్నారు.

    ‘‘ఇక్కడ ఉండడం వల్ల మేం స్వేచ్ఛగా నమాజు చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మసీదులు ఉన్నాయి. రెండోది ఒక వ్యక్తి తన కుటుంబం లేదా తనకు తెలిసిన వాళ్లు ఉండే దగ్గరే నివసించాలనుకుంటాడు’’ అని వివరించారు.

    మీ వర్గానికి చెందిన వారి మధ్య ఉండడం వల్ల భద్రతాభావం ఏర్పడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన, తన వ్యాపారం కారణంగా తనకు హిందువులతోనూ మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అందువల్ల ఆయనకు భద్రత గురించిన సమస్య లేదు.

    జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, దిల్లీలో ముస్లింలు ఉండే ప్రాంతాలపై‘అక్యుములేషన్ బై సెగ్రిగేషన్’ అన్న పుస్తక రచయిత అయిన ఘజాలా జమీల్ - భద్రతా కారణాల వల్లనే ముస్లింల సెటిల్మెంట్ ప్రాంతాలు పెరుగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా, కొన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వాళ్లంతా కలిసి ఉంటే, వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

    ఇలాంటి ప్రదేశాలకు ‘ఘెట్టో’ అనే పదం ఉపయోగించడం తప్పని ఆమె అంటారు. ఆ పదం వెనుక చాలా చరిత్ర ఉందని, దాన్ని ఇక్కడ ఉపయోగించడం తప్పనేది ఆమె అభిప్రాయం. ‘‘చాలా కాలంగా మన సమాజంలో ప్రజలు వేర్వేరుగా నివసించడం జరుగుతోంది. గ్రామాలలో వివిధ కులాల వారు వేర్వేరుగా నివసించడం చూడవచ్చు, ఉదాహరణకు దళితులు. కానీ అక్కడ ‘ఘెట్టో’ అనే పదం వాడరు’’ అని ఆమె వివరించారు.

    జఫరాబాద్‌లో సొంత క్లినిక్ ఉన్న డాక్టర్ ఫహీమ్ బేగ్, నేడు ముస్లింలలో అభద్రతా భావం ఎక్కువగా ఉందని అంటారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ముస్లింలలో ఇది ఎక్కువ అయిందని ఆయన తెలిపారు. అందుకే ముస్లింలు తమ వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడతారని వివరించారు.

    భారతదేశంలో తరచుగా జరిగే అల్లర్లలో ముస్లింలు మరణిస్తుంటారు. దీనిని నివారించడానికే ముస్లింలు ఒక బృందంగా నివసించడానికి ఇష్టపడతారు.

    ఫహీమ్ బేగ్

    ముస్లింలు ఎందుకు ముస్లిమేతరులు ఉండే ప్రాంతాల్లో నివసించడానికి ప్రయత్నించరు?

    ఈ ప్రశ్నకు సమాధానంగా, భద్రత కొరకే అనేక వర్గాలు ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాయని తెలిపారు.

    ‘‘1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల తర్వాత, సిక్కులు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. అందుకే పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ లాంటి ప్రాంతాలలో మీరు సిక్కుల సెటిల్మెంట్‌లను ఎక్కువగా చూడొచ్చు. అక్కడ వాళ్లు విలాసవంతమైన గురుద్వారాలను కూడా నిర్మించుకున్నారు. అక్కడ వాళ్లు తమకు ఇష్టం వచ్చినవి తింటారు, తాగుతారు.’’ అని తెలిపారు.

    News image
    News image

    అఖ్లాక్, అఫ్రాజుల్, జునైద్

    News image

    దిల్లీలోని తిలక్‌నగర్‌కు వెళితే మీకు అన్ని మాంసం దుకాణాల ముందు ‘ఝట్కా’ అని, జఫరాబాద్‌కు వెళితే ‘హలాల్’ అని రాసి ఉండడం కనిపిస్తుంది.

    ముస్లింలు కలిసి ఉండడానికి ఇది మొదటి కారణమైతే, రెండోది సంస్కృతి అని ఘజాలా తెలిపారు.

    ‘‘నా పుస్తకం పరిశోధన కోసం నేను చాలా మందితో మాట్లాడాను. తమ జీవిత విధానాన్ని మిగతా వర్గాలు వింతగా చూస్తాయని వాళ్లు చెప్పారు. ఇక్కడైతే వాళ్ల ఇష్టం వచ్చినట్లు వాళ్లు జీవించొచ్చు. అందుకే ఇలాంటి ప్రాంతాలలోనే ఉండడానికి వాళ్లు ఇష్టపడతారు’’ అని ఆమె అన్నారు.

    ‘‘ఇలాంటి విభజనకు మరో కారణం మార్కెట్. నగరాలు లాభాలను తెచ్చే యంత్రాలు. ముస్లిం సెటిల్మెంట్‌లలో కొన్ని చిన్న చిన్న ఉత్పత్తి ఉపాధులు ఉంటాయి. ఇక్కడ తక్కువ వేతనానికే కూలీలు లభిస్తారు. ఆ పరిస్థితి కారణంగా కొన్ని ముస్లింల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు పశ్చిమ నిజాముద్దీన్ ప్రాంతంలో ధనిక ముస్లింలు.’’

    ‘కుర్తా-పైజామాలు చూశాక మారిన ధోరణి’

    ముస్లింలతో వచ్చిన అతి పెద్ద సమస్య ఏంటంటే, వాళ్లు ఇతరులతో కలిసిపోరు. అదే సమయంలో హిందువులు,ఇతరులు కూడా ముస్లింలను తమలో కలుపుకోరు.

    షద్మాన్

    28 ఏళ్ల షద్మాన్ (పేరు మార్చడం జరిగింది) గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అతను జాకెట్ల వ్యాపారంలో ఉన్నాడు. ముస్లిం ప్రాంతాలలో నేరాల రేటు చాలా ఎక్కువగా ఉందని షద్మాన్ తెలిపాడు.

    పేదరికం, నిరక్షరాస్యత కారణంగానే నేరాలు రేటు ఎక్కువగా ఉందని, ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టడం లేదని అతను తెలిపాడు. తనకు అవకాశం లభిస్తే తప్పకుండా ముస్లిమేతరులు ఉంటున్న ప్రాంతంలోనే నివసిస్తానని తెలిపాడు.

    ‘‘ముస్లింలతో వచ్చిన అతి పెద్ద సమస్య ఏంటంటే, వాళ్లు ఇతరులతో కలిసిపోరు. అదే సమయంలో హిందువులు, ఇతరులు కూడా ముస్లింలను తమలో కలుపుకోరు. ముస్లింలు వాళ్లతో కలిసి ఉంటూ, వాళ్లు మాతో కలిసి ఉండడానికి ముందుకు వస్తేనే ఈ సమస్యకు ముగింపు’’ అన్నాడు.

    నువ్వు ముస్లింవా అని వాళ్లు పదేపదే ప్రశ్నించారు.

    జఫరాబాద్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న 35 ఏళ్ల నదీమ్ అరీన్ కూడా ముస్లిమేతరులు ముస్లింలతో కలవడానికి ఇష్టపడరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    ‘‘హిందువులు మమ్మల్ని అంగీకరిస్తే మేమెందుకు వాళ్లతో కలిసి ఉండము? హిందువుల పిల్లలు నా వద్దకు వచ్చినపుడు, నేను వాళ్లకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తాను’’ అని అతను తెలిపాడు.

    గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ‘‘2010లో గ్వాలియర్‌లో నాకు పరీక్ష ఉండింది. పరీక్ష నిర్వాహకులు రెండ్రోజులు నా పట్ల బాగానే ప్రవర్తించారు. కానీ మూడో రోజు నేను కుర్తా-పైజామా వేసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లగానే వాళ్లు తీరు మారిపోయింది. నేను ముస్లింనా? అని వాళ్లు పదేపదే ప్రశ్నించారు.’’ అని వివరించాడు.

    News image

    నేను ఈ ముస్లిం ప్రాంతాలకు తప్ప వేరే ఎక్కడికీ వెళ్లను..

    ఇళ్లలో పని చేసే సుభానా ఇస్లాం ‘‘మామూలుగా అయితే నా పిల్లలు ముస్లిమేతరులతో కలిసినా నాకు అభ్యంతరం లేదు. కానీ చదువు విషయంలో మాత్రం నా పిల్లలు ముస్లిమేతర ప్రాంతాలలో చదవడానికి అంగీకరించను. నా పిల్లలు ఇస్లామ్ సంస్కృతిలోనే పెరగాలని నేను కోరుకుంటాను’’ అన్నారు.

    బక్రీద్, ఇతర పండుగల సందర్భంగా ముస్లింలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

    35 ఏళ్ల అంజుమ్ ఇర్షాద్ సామాజిక కార్యకర్త. ముస్లిమేతర ప్రాంతాల్లో నివసించే తమ బంధువులలో అనేక మందికి తమ పొరుగువారితో చాలా తక్కువ సంబంధాలు ఉంటాయని ఆమె తెలిపారు. బక్రీద్, ఇతర పండుగల సందర్భంగా వాళ్లు అనేక సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడించారు.

    అలాంటి సమస్యలు ఉన్నాయని చెబుతూనే ఆమె, తాను ముస్లిమేతర ప్రాంతాలలో ఉండేందుకే ఇష్టపడతాననని తెలిపారు. అక్కడ ఉండే పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలే దీనికి కారణమని వివరించారు.

    ప్రభుత్వం ఒక అజెండా ప్రకారం వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందా?
    News image

    ముస్లింలు ఉండే ప్రదేశాలను ఓటు బ్యాంకులుగా భావిస్తారు. అనేక మంది నాయకులు కూడా తాము ఓటు బ్యాంకు కారణంగా అక్కడ ఉంటున్నామని తెలిపారు.

    ఈ ప్రదేశాలను కేవలం అలాంటి ప్రత్యేక దృష్టితోనే నెలకొల్పారా? సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ దీనికి అంగీకరించరు.

    ‘‘ఏ ప్రభుత్వం కూడా ముస్లిం ప్రాంతాలను ప్రత్యేక దృష్టితో నెలకొల్పలేదు. అయితే ప్రభుత్వాల వివక్ష వల్లే అలాంటి ప్రాంతాలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాలు అనేక గృహ నిర్మాణ పథకాలను చేపట్టాయి. కానీ ఎక్కడా కూడా వాటిల్లో ఫలానా వర్గాల వారు మాత్రమే ఉండాలనే నిబంధన పెట్టలేదు’’ అని ఆయన తెలిపారు.

    ‘‘ఆలయాలకు, కొన్నిసార్లు గురుద్వారాలకు మాన్యాలు ఉండేవి. కానీ మసీదులకు అలాంటివి లేవు. అందువల్ల ముస్లింలు తమ సంస్కృతి ప్రకారం మసీదులు ఉండే ప్రాంతాలకు తరలి వెళ్లారు’’ అని ఆయన విశ్లేషించారు.

    కానీ ముస్లిం నివాస ప్రాంతాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేదెలా? ముస్లిం ప్రజల కృషి వల్లనే అది మారుతుందని ఘజాలా అంటారు. తమ పరిసరాలు మారడానికి ముస్లింలు తమ హక్కులను ఉపయోగించుకున్నపుడే ‘మినీ పాకిస్తాన్’ అనే భావన తొలగిపోతుందని ఆమె తెలిపారు.

    ఇలాంటి ప్రాంతాలపై రెండు రకాల దురభిప్రాయాలు ఉన్నాయని ఇంతియాజ్ అంటారు.
    ‘‘ముస్లింలు ఉండే ప్రాంతాలకువెళ్లకుండానే దురభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఒకటైతే, వారితో సంబంధాలు ఉండి కూడా దురభిప్రాయాన్ని కలిగి ఉండడం మరొకటి’’ అని ఆయన అన్నారు.

    హిందూ ముస్లింలు ఇద్దరూ ఒకరి పండుగలు, వేడుకలలో మరొకరు పాల్గొన్నపుడు మాత్రమే ఆ దురభిప్రాయం తొలగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఎందుకు ముస్లింలు ఇలాంటి
    ప్రాంతాలలోనే నివసిస్తున్నారు?

    News image

    ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ఆందోళనలు జరిగాయి. కానీ ప్రజల మానసిక పరిస్థితి మాత్రం మారలేదు.

    అర్షలన్ గౌహర్

    మీరు జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) నోయిడాలో ప్రవేశించినపుడు, మీకు అత్యంత ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. వాటిలో కొన్నిఆఫీసులు ఉండగా, ఎక్కువ మంది వాటిల్లో నివాసం ఉంటున్నారు. నేను గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఒక సొసైటీలోకి ప్రవేశించినపుడు, నా గురించి అన్ని వివరాలు - నేను ఎవరు?ఎవరింటికి వెళ్తున్నాను? ఏం పని? మొదలైన వివరాలు చెప్పాల్సి వచ్చింది.

    ఆ 900 ఫ్లాట్ల సొసైటీలో సుమారు 100ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో వీరంతా ముస్లిం సెటిల్మెంట్లలో నివసించేవారు. ఇక్కడ నివసించే అర్షలన్ గౌహర్ (28) ఒక ఈకామర్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న గౌహర్, ఆరేళ్లపాటు దిల్లీలోముస్లింలు ఎక్కువగా ఉండే జకీర్‌నగర్‌లో ఉన్నాడు. అతను ఐదు నెలల క్రితమే ఈ సొసైటీకి మారాడు.

    గౌహర్ ఇక్కడకు రావడానికి కారణమేంటి? తానుండే ప్రాంతంలో ఆరేళ్ల కాలంలో ఎలాంటి మౌలిక సదుపాయాలూ పెరగలేదని గౌహర్ తెలిపాడు.

    ‘‘ప్రభుత్వాలు మారాయి, ఎన్నోఆందోళనలు జరిగాయి. కానీ అక్కడున్న ప్రజల మానసిక పరిస్థితి మాత్రం మారలేదు. నేను ఒక మంచి ముస్లింగా ఉండాలనుకోవడం లేదు, నేను మారిన ముస్లింలను కావాలనుకుంటున్నాను. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను’’ అని గౌహర్ అన్నాడు.

    మొహమ్మద్ హసనైన్ 

    మొహమ్మద్ హసనైన్ 

    నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో నివసిస్తున్న మొహమ్మద్ హసనైన్ (41) కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. వేలాది ఫ్లాట్‌ల మధ్య అతని అపార్ట్‌మెంట్ ఒక చిన్న ప్రపంచం. అతని లాంటి కుటుంబాలు అక్కడ 150 వరకు ఉన్నాయి.

    సొసైటీలలో ఇస్లామిక్ వాతావరణం కనిపిస్తుందా?

    ఒక ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పని చేసే హసనైన్ సుమారు 20 ఏళ్ల పాటు ముస్లింల కాలనీలలో నివసించారు.

    తానుండే ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవడానికి మంచి సదుపాయాలు ఉండేవి కావని, తన పిల్లలు బాగా పెరగాలనే తాను తన నివాసాన్ని మార్చానని తెలిపారు.

    ముస్లింలు ఎందుకు సొసైటీలలో మసీదుల కోసం పట్టుబట్టడం లేదు?

    మసీదులులాంటి మతపరమైన సదుపాయాలు ఉండడమే తాము ముస్లిం సెటిల్మెంట్‌లలో ఉండడానికి కారణమని కొందరు అంటారు. మరి ఇలాంటి సొసైటీలలోని ముస్లిం కుటుంబాలు ఆ విషయంలో ఏం చేస్తున్నాయి.?

    దీనిని సమాధానంగా నిగారిష్ అన్వర్(38) ఇక్కడ కూడా ముస్లిం వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు వేరే లోకం నుంచి రాలేదుగా అంటారాయన. ముస్లిం వాతావరణం అనేది ఇళ్లలో ఉంటుంది, సొసైటీలో కాదు.

    ఎందుకు సొసైటీలలో మసీదులను నిర్మించమని అడగరు? దీనికి సమాధానంగా నిగారిష్, సొసైటీలలో ముస్లింలు చాలా తక్కువగా ఉంటారని, అలాంటప్పుడు వారి కోసం ప్రత్యేకంగా మసీదు నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తారు.

    అదే సమయంలో మసీదు లేదా మొగలాయి వంటకాలు లభించే హోటళ్లు లేకపోవడం వెలితిగా ఉంటుందని హసనైన్ అన్నారు.

    మరి ముస్లింలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని సొసైటీలలో ఎలా ఉండగలుగుతున్నారు?

    ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్

    ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్

    దీనికి సమాధానంగా సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్, జీవితం కుర్మా-బిర్యానీ కన్నా ఎక్కువే అంటారు.
    ‘‘ప్రజలు నేడు తమ సదుపాయాల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్లకు విశాలమైన రోడ్లు, పరిశుభ్రత, తమ కారుకు పార్కింగ్ ప్రదేశం కావాలి. అలాంటివన్నీ ఈ సొసైటీలలో ఉన్నాయి’’ అని వివరించారాయన.

    ముస్లింలు అల్లర్లంటే ఎంత భయపడతారు?

    News image

    భారతదేశంలో అల్లర్లకు చాలా చరిత్రే ఉంది. భారతీయ ముస్లింలు దీనికి మినహాయింపు కాదు. అపార్ట్‌మెంట్లలో నివసించే ముస్లింలు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు?

    ఒక కన్సల్టెంట్ కంపెనీలో పని చేసే నదీమ్ అఖ్తర్ ఖాన్ (42) అల్లర్లు ఎక్కడైనా జరగవచ్చని, అల్లర్లు సృష్టించేవాళ్లు ఎక్కడైనా ఉండవచ్చని అన్నారు.

    ‘‘నేను నోయిడాలో నివసించే సొసైటీలో ఇతర వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అల్లర్ల వల్ల జరిగే హాని గురించి వారికి కూడా తెలుసు.’’ అన్నారు.

    పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జెహ్రా (పేరు మార్చాము) ఒక రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తోంది. భద్రత అన్నది అల్లా చేతుల్లో ఉంటుంది అని జెహ్రా అంది.

    తన జీవితంలో ఎక్కువ భాగం ముస్లిం సెటిల్మెంట్‌లలో నివసించిన నిహా ఇంతియాజ్ (32) ఏడాదిన్నరగా సొసైటీలో ఉంటున్నా, ఇతర మతాల వారి నుంచి తనకు ఎలాంటి సమస్యా రాలేదన్నారు.

    ‘‘అయితే ముస్లిం పనివాళ్ల విషయంలో వివక్ష తప్పకుండా కనిపిస్తుంది. చాలా మంది వాళ్లను తీసుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ అందరం కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటాం’’ అని ఆమె తెలిపారు.

    భద్రత విషయానికి వస్తే, ముస్లిం కాలనీలలో కూడా దొంగతనాలు జరుగుతాయని నిగారిష్ అన్నారు.

    ఈ ప్రాంతాలలో నివసిస్తే అపోహలు తొలగిపోతాయా?

    News image

    ఇదే సొసైటీలో నివసిస్తున్న మరో మహిళ రుబీనా (పేరు మార్చాము) మంచివాళ్లు అన్నిచోట్లా ఉన్నారని అన్నారు.

    కేవలం 10 శాతం మంది మాత్రమే వివక్ష పదర్శిస్తారని ఆమె తెలిపారు.

    ముస్లింలకు ఇల్లు దొరకడం కష్టమని చాలాసార్లు అంటుంటారు. అయితే ఇది నిజం కాదని, అది మీడియా ప్రచారం అని హస్నైన్ అంటారు.

    అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఘజాలా జమీల్ కూడా మాత్రం అది వాస్తవం అన్నారు.

    ‘‘ఇప్పుడు మాకు ఆ హిందువుల ప్రాంతాలలో ఉండడం ఇష్టం లేదు’’
    News image

    పలు వర్గాల వారు ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసించిన ఖైరున్నిసా జీవితం పూర్తిగా మారిపోయింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా అన్నారు, ‘’16 ఏళ్ల పాటు నివసించిన ఆ ప్రాంతానికి మేం మళ్లీ వెళ్లం అనుకుంటే చాలా బాధ కలుగుతుంది. అక్కడ చాలా భిన్నమైన సంస్కృతి ఉండేది. అక్కడ మేం అన్ని రకాల పండగలను కలిసి జరుపుకునే వాళ్లం’’ అని ఆమె తెలిపారు.

    అపార్ట్‌మెంట్ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఆమె, ‘‘బాల్యం నుంచి మాకు జ్ఞానం వచ్చేంత వరకు, మా ఇరుగుపొరుగు ఎన్నడూ కూడా మేం వేరే వర్గానికి చెందిన వాళ్లం అని గుర్తొచ్చేలా ప్రవర్తించలేదు. దేవుడు అవకాశం ఇస్తే, మా పొరుగున ఎప్పుడూ అలాంటి వాళ్లే ఉండాలని కోరుకుంటా’’ అన్నారు.

    2002, ఫిబ్రవరి 28న కొంతమంది అల్లరిమూకలు ఆమె ఇంటిపై దాడి చేశారు. అలాంటి భయానక పరిస్థితిని తన కుటుంబం రెండుసార్లు ఎదుర్కొందని ఆమె తెలిపారు. ఆమె కుటుంబం గగన్ విహార్ సొసైటీలోని చాంద్‌ఖేడాలోని ఓ ఫ్లాట్‌లో నివసించేది. అల్లరిమూకల దాడి నుంచి ఆమె కుటుంబాన్ని పొరుగున ఉండే హిందువులే రక్షించారు.

    దేవుడు అవకాశం ఇస్తే, మా పొరుగున ఎప్పుడూ అలాంటి వాళ్లే ఉండాలని కోరుకుంటా.

    ఖైరున్నిసా

    ‘‘మా నాన్న ఓఎన్‌జీసీ ఉద్యోగి. దాని వల్ల మేం అన్ని వర్గాలవారు ఉండే ప్రాంతంలో నివసించడానికి అవకాశం లభించింది. మేమందరం కలిసి అన్ని రకాల పండగలనూ జరుపుకునేవాళ్లం. అందుకే నాకు మతాల మధ్య తేడా తెలిసేది కాదు. కానీ నా పిల్లలు అలా కాదు. స్కూల్లో చేరిన మొదటి రోజే వాళ్లకు వివక్ష గురించి తెలిసింది.’’

    ఆమె తండ్రి రిటైరయ్యాక కూడా అదే ప్రాంతంలో ఉండాలనుకున్నారు కానీ, ముస్లింలు ఉండే ప్రాంతానికి వెళ్లాలనుకోలేదు.

    కానీ 2002లో జరిగిన సంఘటనలు ఆమె ఆలోచనలను మార్చేశాయి. దాంతో వారు ముస్లింలు ఉండే ప్రాంతానికి వెళ్లిపోయారు.

    ప్రస్తుతం ఆమె జహాపురా ప్రాంతంలో నివసిస్తున్నారు.

    ‘‘చాంద్‌ఖేడాలో మా ఇల్లు 10-12 లక్షల ఖరీదు చేసేది. కానీ మేం చివరికి దానిని 5 లక్షలకు అమ్మేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నా సోదరులకు ఉద్యోగాలు రావడంతో మేం మళ్లీ రెండు ఫ్లాట్లు కొనుక్కోగలిగాం’’ అని ఆమె తెలిపారు.

    అయితే ఇటీవలే ఆమెకు సోషల్ మీడియా ద్వారా తన పాత ఇరుగుపొరుగువారితో మళ్లీ సంబంధాలు ఏర్పడ్డాయి. ఆమె నాటి అందమైన అనుభూతులను పదిలంగా దాచుకోవాలనుకుంటున్నారు.

    అయితే అల్లర్లలో అందరికీ ఖైరున్నిసాలాంటి అనుభవాలే లేవు. గుల్బర్గా సొసైటీలో ఉంటన్న ఇంతియాజ్ సయీద్ పఠాన్‌ది వేరే కథ. ఫిబ్రవరి 28న జరిగిన అల్లర్లలో ఆయన కుటుంబంలోని 10 మంది మరణించారు. ఈ సొసైటీలోనే కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీతో పాటు 59 మంది మరణించారు.

    చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకుని, తనతో పాటు పండగలు చేసుకున్న వారే తన ఇంటిని తగలబెట్టి, లూటీ చేసి, తన బంధువులను హత్య చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఇంతియాజ్ ప్రశ్నించాడు.

    ‘‘దెయ్యాల్లాంటి ఆ బంగళాలు ఉన్న ప్రదేశానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. మాకు ఎంత దుస్థితి వచ్చిందంటే, ఒక పక్క మా బంగళాలు పాడు పడిపోతుంటే, మేం గోమ్‌తీపూర్‌లో మా బంధువుల దయతో ఒక వంటగదిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నాం’’ అని ఇంతియాజ్ అన్నాడు.

    ‘‘మా జీవితంలో ఇప్పటికీ భద్రత లేదు. మాకు ఇప్పటికీ హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించడానికి ధైర్యం లేదు. మేం మా మతానికి చెందిన సోదరుల మధ్యే మాకు సురక్షితంగా అనిపిస్తుంది.’’

    రచయిత : మొహమ్మద్ షాహిద్ ( ఢిల్లీ )
    హరీష్ ఝల (అహ్మదాబాద్)
    ఫోటో : ఆర్జూ ఆలమ్
    షార్ట్‌హ్యాండ్ ప్రొడక్షన్ : షాదాబ్ నజ్మీ
    ఇల్లస్ట్రేషన్స్ : నికితా దేశ్‌పాండే
    మ్యాప్ : గగన్ నార్హే