భేటీకి రెండు రోజుల ముందే సింగపూర్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్

ట్రంప్, కిమ్‌ల వేషధారులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ట్రంప్, కిమ్‌లను పోలిన వీరిరువురూ కలిసి గతంలో ఇలా ఫొటోలకు ఫోజులిచ్చి సందడి సృష్టించారు

చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్‌లు రెండు రోజుల ముందుగానే ఆదివారం సింగపూర్ చేరుకున్నారు.

ట్రంప్, కిమ్‌లు జూన్ 12వ తేదీ మంగళవారం నాడు సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో సమావేశం కాబోతున్నారు. ఉత్తర కొరియా నాయకుడు, అమెరికా అధ్యక్షుడి మధ్య జరగబోయే మొట్టమొదటి భేటీ ఇదే.

కిమ్ తన నాయకగణంతో సింగపూర్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత.. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వచ్చారు.

ఇది శాంతి కోసం ఒకేసారి వచ్చే అవకాశమని ట్రంప్ అభివర్ణించారు. కిమ్, తాను ఇద్దరం ‘‘తెలియని ప్రాంతం’’లో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియాను అణ్వాయుధాలు త్యజించేలా చేయడానికి ఈ సమావేశం తొలి మెట్టు కావాలని అమెరికా కోరుకుంటోంది.

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కెనడాలో వివాదాస్పద జీ7 సదస్సు తర్వాత ట్రంప్ సింగపూర్ వచ్చారు

గత 18 నెలలుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు కొద్దికాలం సామరస్యంగా, మరికొద్ది కాలం ఉద్రిక్తంగా ఉంటూ సాగాయి. ట్రంప్, కిమ్‌లు ఒకరినొకరు హెచ్చరికోవడంతో పలుమార్లు యుద్ధ వాతావరణం ఏర్పడింది కూడా.

ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు, విద్వేషాలను చల్లార్చేందుకు చేతులు కలపబోతున్నారు.

కిమ్ సింగపూర్‌కు చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి లీ లూంగ్‌ను కలిశారు. ట్రంప్ కూడా లీని కలుస్తారు.

line
కిమ్ జోంగ్-ఉన్

ఫొటో సోర్స్, SINGAPORE/MOCI

ఫొటో క్యాప్షన్, ట్రంప్ కన్నా కొన్ని గంటల ముందుగా కిమ్ సింగపూర్ వచ్చారు

కిమ్ కోసం నిరీక్షణ

రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేస్, బీబీసీ న్యూస్ - సింగపూర్

‘‘ఆ విమానం ఏమిటో ఊహించండి’’ అంటూ రోజు చాలాసేపు సరదాగా ఆడుకున్నాం. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి మూడు విమానాలు సింగపూర్‌కి బయలుదేరాయి.

మొదటిది ఇల్యూషిన్ రవాణా విమానం. అదేమిటో ఊహించటం సులువే. కిమ్ కోసం పటిష్ట భద్రత గల లిమోసీన్‌ను అందులో తెస్తున్నారు. ఆ తర్వాత ఎయిర్ చైనా 747 వచ్చింది. అందులో మామూలుగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రయాణిస్తుంటారు. అంటే.. ఇప్పుడు అందులో కిమ్ వస్తున్నారా?

అంతలోనే ఓ ఆశ్చర్యం. కిమ్ జోంగ్-ఉన్ వ్యక్తిగత జెట్ బయలుదేరింది. అది సోవియట్ శకానికి చెందిన ఇల్యూషిన్ 62 విమానం. కిమ్ నిజంగా అందులో వస్తున్నారా? లేకపోతే అయోమయం సృష్టించటానికా? అది ఉత్తర కొరియా.. కాబట్టి ఎవరూ మాకు వివరాలు చెప్పట్లేదు.

చివరికి సింగపూర్ విదేశాంగ మంత్రి ఆ ఆటకు ముగింపు పలికారు. కిమ్‌కు తను స్వాగతం పలుకుతున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర కొరియా పాలకుడు ఎయిర్ చైనా 747‌లో వచ్చారని దాంతో తేలిపోయింది.

కిమ్ హోటల్ వ్యవహారం కూడా ఇలాగే సాగింది. అది ఇంకా చాలా రహస్యం. కానీ.. ఉత్తర కొరియా కెమెరామెన్ సెయింట్ రెగీస్ హోటల్ బయట నిలుచుని ఉండటం మాకు కనిపించింది. అది మంచి క్లూ. అక్కడికి కిమ్ కాన్వాయ్ చేరుకున్నపుడు మరొక ఆశ్చర్యం. ఆయన తను ఎప్పుడూ వాడే మెర్సిడెస్‌లో లేరు.

అంతకంటే ఫాన్సీ వాహనమైన మేబాక్‌లో వచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా తెలీదు. కానీ.. విమానాలు, లిమోసీన్‌ల విషయానికి వచ్చేసరికి.. ట్రంప్ కన్నా తగ్గటానికి కిమ్ ఇష్టపడటం లేదన్నది స్పష్టమైంది.

line
కిమ్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

మాటల యుద్ధం నుంచి.. శాంతి చర్చల వరకు

2016, 2017లో తన అణు, క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూ, మాటల దాడికి దిగిన ఉత్తర కొరియా.. ఇప్పుడు ఇంత దూరం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

కానీ దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమని జనవరిలో కిమ్ సూచించగానే, సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తర్వాత నెలలోనే దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ సంబరాలలో రెండు దేశాలూ కలిసి ఒకే పతాకం కింద కవాతు చేశాయి.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-యిన్‌ మార్చి 27వ తేదీ సమావేశమయ్యారు. దీంతో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోవడానికి మార్గం సుగమమైంది.

ఏప్రిల్‌లో.. తమతో చర్చలకు రావాలన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించి సంచలనం సృష్టించారు.

అయితే.. అమెరికా, కొరియాల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలటంతో ఈ భేటీ జరుగుతుందా అన్న సందేహాలు తలెత్తాయి.

మళ్లీ కిమ్, ట్రంప్ ఇరువురూ భేటీ జరుగుతుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)