నారీనారీ నడుమ మురారి మూవీ రివ్యూ: పాత టైటిల్.. కొత్త కథతో వచ్చిన శర్వానంద్ సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, BA Raju's Team/X
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
చాలా కాలంగా శర్వానంద్‌కి హిట్ లేదు.
"సామజవరగమన" లాంటి హిట్ తీసిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు, శర్వానంద్ కాంబినేషన్‌లో నారీనారీ నడుమ మురారి సంక్రాంతి ఆఖరి సినిమాగా వచ్చింది.
ఎలాంటి బజ్ లేదు. అంచనాలు లేవు. పైగా పాత టైటిల్. మరి సినిమా ఎలా వుంది?
ఈ సినిమా పేరు పాతదే కానీ, కథ కొత్తది. తెల్లారితే పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి హీరో గౌతమ్ (శర్వానంద్) ఆమె లవర్‌తో పెళ్లి చేస్తాడు.
ఆమె లవర్ ఎవరో కాదు అతని తండ్రి కార్తీక్ (నరేశ్), వయసు 60. ఈ బిగినింగ్‌తోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది.

‘పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరగాలన్న కండీషన్’
గౌతమ్ ఒక ఆర్కిటెక్. నిత్య(సాక్షి వైద్య) అతని గర్ల్‌ఫ్రెండ్. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. నిత్య తండ్రి రామలింగయ్య (సంపత్) ఒక విడాకుల లాయర్.
అయితే, పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరగాలని కండీషన్. కథకు ఇదే కీలకం.
గౌతమ్‌కి ఆల్రెడీ రిజిస్టర్ పెళ్లి జరిగి ఉంటుంది. ఇది రిజిస్ట్రార్‌కి (సునీల్) తెలుసు. డైవర్స్ సర్టిఫికెట్ తెస్తేనే పెళ్లి అంటాడు.
గౌతమ్ ఎక్స్ (సంయుక్త మీనన్) ఎక్కడుందో తెలియదు. ఈ విషయం నిత్యకి తెలుస్తుందా? చివరికి హీరోకి ఏం జరిగింది? ఇది మిగతా కథ.
టైటిల్ చూడగానే కథలోని కీలక పాయింట్ ముందే తెలిసిపోతుంది. ఇద్దరు పెళ్లాలు, లేదా ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య హీరో చిక్కుకుంటాడని.
ఈ సినిమా కూడా అదే. అయితే పాత సీసాలో కొత్త వైన్. ఇది ఈ కాలం యువతరం కథ.
వేగంగా లవ్, బ్రేకప్, పెళ్లి చేసుకున్న ఏడాది రెండేళ్లకే విడాకులు.
హీరోయిన్ తండ్రి విడాకుల లాయర్ కావడంతో ఈ విషయం అందరికంటే అతనికే బాగా తెలుసు. అందుకే ఈ పెళ్లి ఇష్టం లేదు. కూతురిని కాదనుకోలేడు.
మొదటి 15 నిమిషాలు స్లోగా ఉన్నా, అసలు పాయింట్ ఇదే కాబట్టి ఓపిక చేసుకుంటే , తర్వాత నవ్వులు స్టార్ట్ అవుతాయి.

ఫొటో సోర్స్, Sharwanand/X
‘థియేటర్ నుంచి బయటకు వచ్చినా గుర్తొచ్చే నరేశ్ కామెడీ’
కామెడీలో లాజిక్‌లో అడక్కూడదు కానీ, హీరో క్యారెక్టర్‌లోనే తికమక ఉంది. అతను సీరియస్సో, నాన్ సీరియస్సో అర్థం కాదు.
అమ్మాయిని తీసుకొచ్చి, ముసలి తండ్రికి ప్రేమ పెళ్లి చేసినవాడు, తన ప్రేమని , పెళ్లిని తండ్రికి ఎందుకు చెప్పలేదో అర్థం కాదు.
పెళ్లి చేసుకుని, భర్తతో ప్రశాంతంగా జీవిస్తున్న దియా.. గౌతమ్‌కి బాస్‌గా వస్తుంది. అంతటితో ఆగకుండా టీజ్ చేస్తుంటుంది.
ఈ లోపాల్ని పక్కన పెడితే , కాసేపు హాయిగా నవ్వించే సినిమా. అంత వరకూ కామెడీ.
ఫస్టాఫ్‌లో హీరో కేరళ పులిహోర ప్రేమ, రొటీన్ రౌడీల ఫైట్. సెకెండాఫ్‌లో హీరో ఆఫీస్ డ్రామా. తాగి రోడ్డు మీద పాట పాడే రొడ్డ కొట్టుడు సీన్స్ సినిమాకి మైనస్.
మంచిపాటలు లేకపోవడం అతిపెద్ద మైనస్.
అసలు కథ కంటే కొసరు కథే సినిమాని నిలబెట్టింది.
రెండో పెళ్లి చేసుకున్న నరేశ్ కామెడీ థియేటర్ బయటికి వచ్చినా చెప్పుకుని నవ్వుకోవచ్చు. తన ప్రమేయం లేకుండా విడాకుల్లో ఇరుక్కోవడం , అతని భార్య (సిరి హనుమంతు) అమ్మానాన్నలని వరుసలు పెట్టి పిలిస్తే వాళ్లు విసుక్కోవడం... ఈ సీన్‌లలో కామెడీ పండింది.
సరైన క్యారెక్టర్ దొరికితే నరేశ్ ఎలా చెలరేగిపోతాడో స్క్రీన్ మీద చూపించాడు. ఈ పెళ్లిళ్ల గొడవ ఆయన రియల్ లైఫ్‌లో కూడా ఉండడంతో ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయినట్టుంది.

ఫొటో సోర్స్, iamsamyuktha/insta
‘నవ్వించేలా, ఆలోచింపజేసేలా ఉన్న డైలాగులు’
ప్రేమ కోసం ఎంతకైనా తెగించే ఆటో డ్రైవర్‌గా సత్య, గురువు పాదాలని పాలతో కడిగి, విశ్వాసంతో ఇంట్లో ఉప్పుని తీసుకెళ్లే జూనియర్ లాయర్‌గా వెన్నెల కిషోర్, స్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా సునీల్, హీరో ఫ్రెండ్‌గా సుదర్శన్, సంపత్ అసిస్టెంట్‌గా గెటప్ శీను నవ్వించారు. ఈ క్యారెక్టర్లన్నీ ఎపిసోడ్ కామెడీ చేయకుండా, కథలోని కీలకపాత్రలుగా నడిపించడం విశేషం.
శర్వానంద్‌కి ఈ తరహా పాత్రలు టైలర్ మేడ్.
ఇద్దరు హీరోయిన్లు ఓకే. కేరళ అందాలని కెమెరా బాగానే చూపించింది.
145 నిముషాల నిడివిలో 20 నిముషాలు పక్కన పెడితే ఇంకా షార్ప్‌గా ఉండేది.
ప్రత్యేకంగా చెప్పాల్సింది కథ అందించిన భోగవరపు శీను. మాటలు రాసిన నందూ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రామ్ అబ్బరాజు గురించి. కథ ప్రజెంట్ ట్రెండ్. మాటలు చాలా చోట్ల పేలాయి.
"రాజాలా పెంచాను, బతుకు జట్కా బండిలో రోజా ముందు కూచుంటావా"
"మ్యారేజీ అంటే ఏ ఏజ్ వాళ్లయినా చేసుకోవచ్చని"
"పెళ్లంటే రెండు సంతకాలు కాదు"
ఇలా సినిమాలో చాలా చోట్ల డైలాగులు నవ్వించడమే కాదు, ఆలోచించేలా ఉన్నాయి. శ్రీ విష్ణు కాసేపు కనిపించడం స్పెషాల్టీ.

ఫొటో సోర్స్, vaidyasakshi/insta
సినిమా ఎలా ఉందంటే...
ప్లస్ పాయింట్స్
1.నరేశ్ కామెడీ
2.మాటలు
3.శర్వానంద్ నటన
మైనస్ పాయింట్స్
1.ఫస్టాఫ్ మొదటి 15 నిముషాలు
2.సెకెండాఫ్‌లో బిగినింగ్ సీన్స్
3.పాటలు
4.క్లైమాక్స్‌లో వర్కౌట్ కాని ఎమోషన్
ఫైనల్‌గా ఇది రైటర్, డైరెక్టర్ సినిమా.
నరేశ్ స్పెషల్ షో
శర్వానంద్‌కి గుడ్ కమ్ బ్యాక్.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













