బుల్లెట్, బిల్లా, ఖైదీ.. జల్లికట్టు బరిలో ఆటగాళ్లను భయపెట్టే 6 బుల్స్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐ.శివ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంక్రాంతి వస్తోందంటే సంప్రదాయ క్రీడలు జోరందుకుంటాయి. తమిళనాడులో జల్లికట్టు పోటీలు బాగా ప్రసిద్ది చెందాయి. అవనియాపురం, పాలమేడు, అలాంగనల్లూరు లాంటి ప్రసిద్ద జల్లికట్టు ప్రాంతాలు పోటీలకు సిద్ధమయ్యాయి.
బరిలోకి దిగిన ఎద్దులతో నువ్వా నేనా అన్నట్టుగా కలబడతారు. జల్లికట్టులో తమకు ఆశ్చర్యం కలిగించిన ఎద్దుల విశేషాలు కొంతమంది ఆటగాళ్లు బీబీసీతో పంచుకున్నారు.

‘బుల్లెట్’ను చూడొచ్చు... కానీ తాకలేరు
తిరుపరకుండ్రం మాజీ ఎమ్మెల్యే దివంగత సీనివేల్‌కు చెందిన ఎద్దు ఇది. ఈ ఎద్దు మైదానంలోకి దిగిందంటే మైదానమంతా భయాందోళన నెలకొంటుందని మాజీ జల్లికట్టు క్రీడాకారుడు, తమిళనాడు జల్లికట్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముక్తాత్తన్ మణి అంటున్నారు.
"బుల్లెట్ మైదానంలోకి దిగిన తరువాత ఆపడం కష్టం. మైదానంలో ముఖాముఖిగా నిలబడి ఉన్నవారిని 'వాడా(రారమ్మని)...' అని పిలుస్తున్నట్టుగా అది ఉంటుంది. బుల్లెట్ మైదానంలోకి దిగితే, అక్కడంతా కాసేపు దిగ్భ్రాంతి నెలకొని నిశ్శబ్దమవుతుంది" అని తెలిపారు.
"ఈ ఎద్దు ఇప్పటివరకు 40సార్లు మైదానంలో దిగి ఉంటుంది" అని సీనివేలు కుమారుడు సెల్వకుమార్ అన్నారు. "లక్ష రూపాయల బహుమతి, గెలిచినవారికే ఎద్దు చెందుతుందని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకూ ఈ ఎద్దును ఎవరూ పట్టుకోలేకపోయారు" అన్నారు సెల్వకుమార్.

ఫొటో సోర్స్, satish
సౌమి... చిక్కదు, దొరకదు
ఈ ఎద్దు పుదుక్కోట్టై జిల్లా కైకురిచ్చి తమిళ్‌సెల్వన్‌కు చెందినది. జల్లికట్టులో ఈ ఎద్దు స్టార్ బుల్ అని అథ్లెట్ భారతి అన్నారు.
"ఎద్దు బయటకు వచ్చినప్పుడు, మైదానంలో తలపడేవారు భద్రత కోసం స్తంభాలపైకి ఎక్కుతారు. ఎద్దు అక్కడే నిలబడి, నేరుగా ముందుకు చూస్తుంది. వారు కిందకు దిగి దాన్ని పట్టుకోవాలనుకుంటారు. చాలా మంది దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు వారు దానిని పట్టుకోలేకపోయారు" అని భారతి చెప్పారు.
"సౌమి 30కి పైగా మైదానాల్లో పోటీచేసింది. ఎక్కడా ఎవరికీ చిక్కలేదు. సౌమి ప్రత్యేకత దూకడం. ఒకసారి మైదానం నుంచి బయటకు వస్తే తన వైపు ఎవరు ఉన్నా, ఏ వైపైనా దూకుతుంది" అని ఎద్దు యజమాని బంధువు సతీశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, shyam
ఈ దూకుడు... ‘బిల్లా’కు సాటెవ్వరు?
ఇది మధురై జిల్లాలోని కె.పుధూర్‌కు చెందిన కె.ఆర్. ఆనంద్ అనే వ్యక్తి కి చెందిన ఎద్దు బిల్లా. ఈ ఎద్దు నిలబడేతీరు చాలా బావుంటుందని జల్లికట్టు క్రీడాకారుడు పొదుంబు ప్రభ అంటున్నారు.
"నేను ఈ ఎద్దును పట్టుకోవాలనుకున్నాను. కానీ నేను చివరిసారి పాలమేడు వద్ద ప్రయత్నించినప్పుడు అది నన్ను విసిరికొట్టింది. అది తన కాళ్లను గుర్రంలా కదిలిస్తుంది’’ అని పోతుంబు ప్రభ చెప్పారు.
"ఇప్పటివరకు 150 సార్లకు పైగా అది మైదానంలో దిగింది. ఈ ఎద్దును ఒక్కసారే పట్టుకున్నారు. మైదానం నుంచి అది స్టైల్‌గా బయటకు వస్తుంది. మైదానంలో దూకుడుగా ఉన్నా, బయట ప్రశాంతంగా ఉంటుంది" అని ఎద్దు యజమాని సోదరుడు శ్యామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Karuppasamy
టెంపుల్ బుల్... ఆడేస్తుంది ఫుట్‌బాల్
ఈ ఎద్దు మధురై జిల్లాలోని వెల్లియంగుండ్రం నుంచి వచ్చిన కరుప్పసామికి చెందినది. ఇది నాణ్యమైన ఎద్దు అని మణి చెప్పారు.
"ఒక వ్యక్తిని పట్టుకున్న వెంటనే, అది అతన్ని ఎగరేస్తుంది. టాప్ బ్యాట్స్‌మన్ తనకు వచ్చే అన్ని బంతులను ఎదుర్కొనే తరహాలో ఈ ఎద్దు పోరాడటానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఎగరేస్తుంది. తనను పట్టుకున్న వారిని ఎద్దులు కిందకు తోయడం, తన్నడం సహజంగా చూస్తుంటాం. కానీ ఆండిచ్చామి టెంపుల్ ఎద్దు ఆ వ్యక్తిని గాలిలోకి ఎగరేస్తుంది" అని ఆశ్చర్యంతో మణి చెప్పారు.
మరో జల్లికట్టు అథ్లెట్ తిరుపరంకుండ్రం కార్తీ కూడా ఈ ఎద్దును చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.
"ఇది ఒకరిని పట్టుకుని ఒక్క సెకను కంటే ఎక్కువసేపు ఉంచదు. ఎంతమంది దానిని పట్టుకున్నా వారందరినీ అవతలికి తోసేస్తుంది. ఈ ఎద్దు అన్ని జల్లికట్టు పోటీల్లో పాల్గొంటుంది. అది విశ్రాంతి లేకుండా ఆడుతున్నప్పుడు కూడా అలసిపోయినట్టు కనిపించదు" అని తిరుపరకుండ్రం కార్తీ చెప్పారు.
ఈ ఎద్దు తొమ్మిది సంవత్సరాలకు పైగా జల్లికట్టులో పోటీ పడుతోందని యజమాని కరుప్పసామి చెబుతున్నారు. ప్రారంభంలో దీనిని ఒక్కసారే పట్టుకున్నామని, అప్పటి నుంచి మళ్లీ దొరకలేదని కరుప్పసామి తెలిపారు.

ఫొటో సోర్స్, PCN Kannan
ఖైదీ: బరీ నాదే... బహుమతీ నాదే
ఈ ఎద్దు పుదుక్కోట్టై జిల్లా తాయినిపట్టికి చెందిన పిసిఎన్ కన్నన్‌కు చెందినది. మైదానంలో ఆటగాళ్ళు దగ్గరకు రాలేని ఎద్దు ఇది అని భారతి చెప్పారు.
"ఇది ఎవరినీ మైదానంలోకి రానివ్వదు. ఎవరైనా లోపలికి వచ్చినా, కంచె దగ్గరలోకి వచ్చినా అది వారిని తరిమివేస్తుంది. ఆ ఎద్దు మైదానంలోకి దిగితే దానికి బహుమతి వచ్చినట్టే" అని భారతి చెప్పారు.
"మైదానంలో ఎవరైనా దాన్ని తాకితే దానికి కోపం వస్తుంది. కానీ అది మైదానం వదిలి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మారుతుంది. మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా, దాని మెడకు కట్టిన తాడు ఎంతవరకు వస్తే అంత చివరకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తంది. అది ఎంతో తెలివైనది" అని యజమాని కన్నన్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Parthasarathy
పవి.. అందం నా సొంతం
ఈ ఎద్దు తేని జిల్లాలోని ఎరుమనాయక్కన్‌పట్టికి చెందిన న్యాయవాది పార్థసారథికి చెందినది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ ఎద్దు ఆటతీరు ఉంటుందని భారతి చెప్పారు.
"ఈ ఎద్దు కొమ్ములు, శరీరం అందంగా ఉంటాయి. ఇది మైదానంలో ఆటగాళ్లను ఉత్సాహపరచగల బయట అభిమానులను ఆకర్షించగల ఎద్దు" అని భారతి చెప్పారు.
ఈ ఎద్దులకు మించినవి తమిళనాడులో లెక్కలేనన్ని అద్భుతమైన జల్లికట్టు ఎద్దులు ఉన్నాయని ఆటగాళ్ళు అన్నారు. ప్రతి ఎద్దు దానికదే ప్రత్యేకమైనదని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












