జల్లికట్టు: ఈ పోటీలో ఎద్దును అదుపు చేసి గెలిచినోళ్లకు పిల్లనిచ్చి పెళ్లి కూడా చేసేవారు, అసలు ఈ ఆటకు ఎందుకింత క్రేజ్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివకుమార్ రజకులం
- హోదా, బీబీసీ ప్రతినిధి
జల్లికట్టు నిర్వహణకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతోపాటు దీనికి సంబంధించిన నిబంధనలను సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది.
ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (తమిళనాడు అమెండ్‌మెంట్) యాక్ట్ ఆఫ్ 2017తోపాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (కండక్ట్ ఆఫ్ జల్లికట్టు) రూల్స్ 2017లను జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా సమర్థించింది.
అయితే, ‘‘జల్లికట్టు నిర్వహణ అనేది తమిళనాడు సంస్కృతిలో భాగమా?’’ అనే ప్రశ్న జోలికి తాజా తీర్పు వెళ్లలేదు. ఈ ప్రశ్నకు కోర్టు విచారణలతో సమాధానం లభించదని, దీనికి అధ్యయనం చేపట్టాల్సి ఉంటుందని ధర్మాసనంలో భాగమైన జస్టిస్ బోస్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా, జల్లికట్టు అంటే ఏమిటి, ఇది ఎలా జరుగుతుంది, ఇందులో పాల్గొనడానికి కావాల్సిందేమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ జల్లికట్టు?
తమిళనాడులో పేరుగాంచిన సాహస క్రీడగా జల్లికట్టును చెబుతుంటారు. పోటీలో ఎద్దులను లొంగదీసుకునే వారికి కార్లు, బైక్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహుమతిగా ఇస్తుంటారు.
ప్రాచీన కాలం నుంచి రాష్ట్రంలో జల్లికట్టును నిర్వహిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వెయ్యి ఏళ్లనాటి రచనల్లోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. మరోవైపు మదురైకు 35 కి.మీ. దూరంలోని కల్లుట్టు మేట్టుపట్టిలో ప్రాచీన కాలంలోనూ జల్లికట్లు నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి.
చాలా ప్రాంతాల్లో అప్పట్లో ఎద్దుల కొమ్ములకు వస్త్రంలో నాణేలు వేసి కట్టేవారు. ఎద్దును లొంగదీసుకునేవారికే ఆ నాణేలను ఇచ్చేవారు. జల్లికట్టు అనే పదం కల్లి (నాణేలు), కట్టు అనే రెండు పదాల నుంచి వచ్చింది.
మొదట్లో దీన్ని కల్లికట్టుగా పిలిచేవారని, ఆ తర్వాత కాలంలో ఇదే జల్లికట్టుగా మారిందని తమిళ పరిశోధకులు చెబుతున్నారు.
స్వాతంత్ర్యం తర్వాత కూడా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో జల్లికట్టు సమయంలో ఎద్దుల కొమ్ములకు నాణేలు కట్టేవారు. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా నాణేల స్థానంలో బహుమతులను ప్రకటించడం మొదలైంది.
ఖరీదైన బహుమతులను ఇచ్చే సంప్రదాయం ఎలా మొదలైందనే విషయంపై జల్లికట్టు వ్యాఖ్యాత మైక్ శరవణన్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘40 ఏళ్ల క్రితం జల్లికట్టులో ఎద్దులను లొంగదీసుకునేవారికి పంచెలు, చొక్కాలు ఇచ్చేవారు. 1990ల్లో అయితే, టిఫిన్ బాక్సులు, వెండి గిన్నెలు ఇచ్చేవారు’’ అని ఆయన చెప్పారు.
‘‘ఆ తర్వాత క్రమంగా బంగారు నాణేలు, బైక్‌లు, మొబైల్ ఫోన్లు, మంచాలు, డబ్బులు ఇలా చాలా ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల జల్లికట్టులో గెలిచేవారికి తమ కుమార్తెలను ఇచ్చి వివాహాలు కూడా జరిపిస్తారు’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిషేధంతో పెల్లుబికిన నిరసనలు
జల్లికట్టు వల్ల ఎద్దులు చాలా హింసను అనుభవించాల్సి వస్తోందని, దాన్ని నిషేధించాలని ‘పెటా’తోపాటు కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జల్లికట్టుపై 2014లో కోర్టు నిషేధం విధించింది.
నిషేధానికి వ్యతిరేకంగా భారీగా నిరసనలు పెల్లుబికాయి. దీంతో నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత పాలమేడు, అవనియపురం లాంటి ప్రాంతాల్లో జల్లికట్టు ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా దీనికి మద్దతు ప్రకటించేవారు.
2021లో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
అదే ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతోపాటు డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అవనియపురం జల్లికట్టును చూసేందుకు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం అవనియపురం, పాలమేడు మాత్రమే కాదు, తమిళనాడులోని భిన్న ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు వేడుకల్లో స్థానిక మంత్రులు, రాజకీయ నాయకులు పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
విదేశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల దృష్టి జల్లికట్టుపై పడటంతో నిర్వహకులకు స్పాన్సర్ల నుంచి నిధులు రావడం కూడా పెరిగింది. దీంతో ఖరీదైన బహుమతులు ఇచ్చే సంప్రదాయం కూడా మొదలైంది.
‘‘నేడు కార్లు లాంటి ఖరీదైన చాలా బహుమతులను ఇస్తున్నారు. కానీ, దీనిలో పాల్గొనేవారు కేవలం వాటి కోసమే పోటీపడతారని అనుకోకూడదు’’ అని జల్లికట్టు వ్యాఖ్యాత మైక్ శరవణన్ అన్నారు.
‘‘తమిళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతోపాటు మైదానంలో తమ ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు చాలా మంది జల్లికట్టులో పాల్గొంటారు. ఎద్దులను పెంచేవారు కూడా తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తారు. దీనికి అనుగుణంగా వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు’’ అని ఆయన చెప్పారు.
‘‘వారికి చొక్కాలు, కార్లు.. రెండూ ఒకటే. ఎలాగైనా జల్లికట్టులో పాల్గొని తమ ప్రతిభను ప్రపంచానికి చూపించాలని వారు కోరుకుంటారు’’ అని శరవణన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
శారీరక దృఢత్వం ముఖ్యం
‘‘జల్లికట్టు అనేది యువత చెడు వ్యసనాల బాట పట్టకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఎద్దులను లొంగదీసుకోవాలంటే వారు శారీరకంగా దృఢంగా ఉండాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం కూడా చేయాలి. మరోవైపు దేశీయ పశువుల పెంపకాన్ని జల్లికట్టు ప్రోత్సహిస్తుంది. జల్లికట్టుకు పంపించే పశువులను వాటి యజమానులు ఇంట్లో సభ్యుల్లా పెంచుకుంటారు’’ అని శరవణన్ చెప్పారు.
అవనియపురం జల్లికట్టులో నిరుడు ప్రథమ బహుమతి అందుకున్న కార్తీక్ కూడా శరవణన్ మాటలతో ఏకీభవించారు. ఆయన డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన సెలవుల్లో తాపీ పనికి వెళ్తుంటారు.
పోటీలో గెలిచిన కారును ఆయన తన వద్ద ఎక్కువ కాలం ఉంచుకోలేదు. కుటుంబ అవసరాల కోసం షోరూమ్‌లోనే అమ్మేశారు.
వచ్చే సంవత్సరం జల్లికట్టులో పాల్గొనేందుకు కూడా కార్తీక్ సిద్ధం అవుతున్నారు. ఆయన మాత్రమే కాదు, చాలా మంది ఇలానే జల్లికట్టులో పాల్గొనేందుకు ప్రత్యేకంగా సన్నద్ధం అవుతారు.
‘‘జల్లికట్టులో పాల్గొనేవారు నెల రోజుల ముందు నుంచి భక్తితో ఉపవాస దినాలు పాటిస్తారు. ఎందుకంటే వారికి ఇది కేవలం సాహస క్రీడ మాత్రమే కాదు. ఇది వారి ప్రతిభ, పరాక్రమాలను అందరికీ చూపించే వేదిక’’ అని శరవణన్ చెప్పారు.
‘‘కాబట్టి బహుమతులు ఇచ్చినా ఇవ్వకున్నా జల్లికట్టు హీరోగా గుర్తింపు పొందేందుకు వారు ఈ సాహస క్రీడలో పాల్గొంటూనే ఉంటారు’’ అని శరవణన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















