పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మాయాజాలం ఫలించిందా?

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Lyca Productions

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి'తో కొత్త మార్గం చూపారు. ఒక కథ‌ను రెండు భాగాలుగా తీసి ఘన విజయం సాధించారు. కథను రెండు భాగాలుగా తీసినా ప్రేక్షకులకు చూస్తారనే నమ్మకాన్ని కలిగించారు.

ఈ నమ్మకంతోనే ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' 1, 2 భాగాలుగా ఒక కాల్పనిక చరిత్రను తెరకెక్కించారు.

గత ఏడాది పొన్నియిన్ సెల్వన్ భాగం1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ భాగం2ను విడుదల చేశారు.

మొదటి భాగంలో చాలా పాత్రలు ప్రశ్నలను వదిలేశాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానం రెండో భాగంలో దొరికిందా? చోళ సామ్రాజ్యం కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది?

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Lyca Productions

తొలి భాగంలో ఏం జరిగింది?

చోళ చ‌క్రవ‌ర్తి సుంద‌ర చోళుడు(ప్రకాశ్‌రాజ్‌)కు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్‌), అరుణ్‌మొళి వ‌ర్మన్ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జ‌యం ర‌వి), ఒక కుమార్తె కుంద‌వై (త్రిష‌).

వందియ‌దేవ‌న్(కార్తి)ను తంజావూరులో ఉన్న త‌న తండ్రి వద్దకు పంపించి అక్కడ జరుగుతున్న కుట్రను గ్రహించాలని చెప్తాడు కరికాలన్.

అక్కడికి వెళ్లిన వందియ‌దేవ‌న్.. ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌ (శ‌ర‌త్‌ కుమార్‌), ఇత‌ర సామంతులు క‌లసి సుంద‌ర చోళుడిని త‌ప్పించి మ‌ధురాంత‌కుడి(రెహమాన్‌)ని చ‌క్రవ‌ర్తిని చేయాల‌నేదే ఆ కుట్రని పసిగడతాడు.

మరోవైపు, నందిని(ఐశ్వర్యా రాయ్‌) పాండ్యులతో కలసి చోళ రాజ్యాన్ని అంతం చేయాలని కుట్ర చేస్తుంది. ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వన్ పయనిస్తున్న ఓడ మునిగిపోవడంతో తొలి భాగం ముగుస్తుంది.

రెండో భాగంపై ఆసక్తి పెరగడానికి కారణమదే

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2పై ఆసక్తిని పెంచింది. పొన్నియిన్ సెల్వన్‌లో ఇలాంటి ఒక ఆసక్తికరమైన అంశం వుంది.

నందిని పోలికలతో వున్న ఒక వృద్ధ మహిళ సముద్రంలో పొన్నియిన్ సెల్వన్‌ను కాపాడుతున్నట్లుగా చూపించి ఆమె ఎవరు అనే కుతూహలాన్నిమణిరత్నం కలిగించారు.

మొదటి భాగం వదిలిన అన్ని ప్రశ్నలకు ఈ రెండో భాగంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, MADRASTALKIES

చోళ రాజ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాలు

రెండో భాగాన్ని నందిని, ఆదిత్య కరికాలన్ యవ్వనంలో చోటు చేసుకున్న సంఘటనలతో మొదలుపెట్టారు దర్శకుడు. ఈ కథకు ప్రధాన బలమైన ఆ రెండు పాత్రలలోని భావోద్వేగాలను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు.

వాళ్ల ప్రేమ, పగ, ప్రతీకారాలు ఈ కథకు ఆయువు పట్టు. ఆ సన్నివేశాలను లోతైన సంఘర్షణతో తెరకెక్కించడంలో మణిరత్నం విజయవంతమయ్యారు.

ఇందులో కనిపించే మరో ప్రేమకథ కుంద‌వై, వందియ‌దేవ‌న్‌లది. తొలి భాగంలో వారి ప్రేమకు బీజం వేసిన దర్శకుడు.. రెండో భాగంలో పరిమితమైన దృశ్యాలతో అత్యంత ప్రభావవంతంగా చూపించడం మణిరత్నం ప్రతిభను చాటుతుంది.

కథను ముందుకు నడిపిన మూడు స్త్రీ పాత్రలు

అరుణ్‌మొళి స‌ముద్రంలో మునిగిపోయిన త‌ర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా చూపించారు. చోళులని అంతం చేయడానికి పాండ్యులు చేసే కుట్ర కథపై ఆసక్తిని పెంచుతుంది.

ఈ కథను మూడు స్త్రీ పాత్రలు ముందుకు తీసుకువెళ్ళడం మరింత ఆసక్తికంగా వుంటుంది.

త‌మిళ‌నాట అత్యంత పాఠ‌కాద‌ర‌ణ పొందిన న‌వ‌ల ‘పొన్నియిన్ సెల్వన్‌’. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన ఈ న‌వ‌ల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు మణిరత్నం.

తన చిత్రాలలో స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే మణిరత్నం ఈ మూడు స్త్రీ పాత్రలను చాలా బలంగా తీర్చిదిద్దారు.

నందిని పాత్ర రూపంలో చోళులకు ఎలాంటి ఆపద వస్తుందో అనే ఆసక్తిని పెంచితే.. మందాకిని( ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం ) పాత్ర రూపంలో కథను ఇంకా లోతుకు తీసుకువెళ్లారు.

రాజులకు దీటుగా కుంద‌వై చూపే రాజనీతి మరింత మెప్పిస్తుంది.

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Lyca Productions

మణిరత్నం చేసిన మాయ ఏమిటి ?

చారిత్రక నేపథ్యమున్న కల్పిత కథ చాలా మందికి బోర్ కొట్టొచ్చు. అందులో పక్క రాష్ట్రం కథ అంటే ఇంకా బోర్ కొట్టొచ్చు. కల్కి రాసిన ఈ కాల్పనిక రచన కూడా చరిత్రను ఆధారంగా చేసుకున్నదే.

అయితే మణిరత్నం టేకింగ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది.

నవల ఎంత నిదానంగా సాగుతుందో సినిమా కూడా అంతే నిదానంగా ఉంటుంది. కానీ మణిరత్నం ఫ్రేమింగ్, సన్నివేశాల్ని చిత్రీకరించిన విధానం కళ్ళు తిప్పుకోనివ్వవు. ముఖ్యంగా క్లోజప్స్‌లో వింటేజ్ మణిరత్నం మార్క్ కనిపిస్తుంది.

కొన్ని పాత్రలకు కొరవడిన వివరణ

పీఎస్‌2లో మందాకిని పాత్ర చాలా కీలకం. ఆ పాత్రతోనే కథపై ఆసక్తి పెరుగుతుంది.

అయితే ఆ పాత్రను రివీల్ చేసిన తీరు బావుంటుంది కానీ సుంద‌ర చోళుడికి మందాకినికి మధ్య ఉన్న బంధం, వీరి మధ్య పాండ్య రాజు రావడం.. నందిని జననం.. అలాగే ఆదిత్య , నందిని మధ్య ఎడబాటుకి కారణాన్ని లోతుగా చూపించలేదు. దీంతో వారి పాత్రల చుట్టూ కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి.

అలాగే ఆదిత్య పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిల్చారు. ఆ పాత్ర చుట్టూ ఒక అంతుచిక్కని రహస్యం ఉంటుంది. బహుశా మణిరత్నం కూడా నవలలో ఉన్నట్లుగా దాన్ని అలా వదిలేశారని అనుకోవాలి.

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Lyca Productions

ఒకరిని మించి ఒకరు మెప్పించారు

ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులు. ప్రతి పాత్ర ఒక ముద్ర వేస్తుంది.

విక్రమ్‌, ఐశ్వర్యా రాయ్ పాత్రలు, వారు అభినంయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఆదిత్య తన మనసులోని ప్రేమ, పశ్చాత్తాపం వెల్లడించుకునే సన్నివేశం చాలా కాలం గుర్తుండిపోతుంది.

నందిని పాత్రకు ప్రాణం పోశారు ఐశ్వర్య. చాలా అందంగా, హుందాగా కనిపించారు.

పాండ్యుల పక్షాన పగ తీర్చుకున్నప్పుడు ఎంత కఠినంగా కనిపిస్తుందో తన గతానికి సంబంధించిన నిజం తెలుసుకున్నపుడు బాధతో కుమిలిపోయే సన్నివేశంలో ఆమె పశ్చాత్తాపం సహజంగా కనిపిస్తుంది.

జయం రవి రాజసం ఒలికించారు. ఆ పాత్రకు తగ్గట్టు హుందాగా కనిపించారు. మొదటి సగంతో పోల్చుకుంటే కార్తి పాత్రలో హుషారు తగ్గింది. కానీ కథకు తగ్గట్టు ఆ పాత్ర ప్రయాణించింది.

కుంద‌వై పాత్రలో త్రిష అందం, అభినయం ఆకట్టుకుంటాయి.

ఐశ్వర్యల‌క్ష్మి, శోభితా ధూళిపాళ్ల, రెహ‌మాన్, శ‌ర‌త్‌కుమార్‌, పార్తీబ‌న్‌, విక్రమ్ ప్రభు, ప్రభు అందరూ తమ పాత్రకు సరైన న్యాయం చేశారు.

పొన్నియిన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Lyca Productions

సాంకేతిక వర్గం పని తీరు ఎలా ఉంది?

మణిరత్నంకు సంపూర్ణ సహకారం అందించింది సాంకేతిక వర్గం. ప్రతి విభాగం చక్కని పనితీరును కనబరిచింది.

ర‌వివ‌ర్మన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చోళ కాలంలోకి తీసుకువెళ్ళిపోయారు. ముఖ్యంగా క్లోజప్స్‌తో మతి పోగొట్టారు.

తోట త‌ర‌ణి ఆర్ట్ వర్క్ చక్కగా కుదిరింది.

ఏఆర్ రెహ‌మాన్ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. అసాధారణమైన నేపథ్య సంగీతం సమకూర్చారు.

తెలుగు డబ్బింగ్ చాలా శ్రద్ధతో చేశారు. ఐశ్వర్యకు సునీత చెప్పిన డబ్బింగ్ మరింత సొగసును తీసుకొచ్చింది.

తనికెళ్ళ భరణి రాసిన మాటలు కొన్ని గుర్తుపెట్టుకునేలా వున్నాయి.

‘’నందిని కన్నీళ్లు చూసిన ఒకే ఒక్క మగాడివి నువ్వే’’.

"ఇద్దరు చోళ యువరాజుల మధ్య పెరిగిన అమ్మాయినైన నేను ఏడవకూడదు. నవ్వించు’’ అనే మాటలు కథలో చక్కగా కుదిరాయి.

పొన్నియిన్ సెల్వన్ నవలను ఎందరో సినిమాగా తీయాలని కలగన్నారు. అయితే మణిరత్నం ఆ కలను విజయవంతంగా సాకారం చేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మాయాజాలం ఫలించిందా?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)