'ఏజెంట్' రివ్యూ: అఖిల్‌కు సురేందర్ రెడ్డి మాస్ విజయాన్ని ఇచ్చారా?

ఏజెంట్ సినిమాలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య

ఫొటో సోర్స్, AK Entertainments/Facebook

ఫొటో క్యాప్షన్, ఏజెంట్ సినిమాలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

అఖిల్ అక్కినేని ఆరంభం నుంచే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

తొలి సినిమా ‘అఖిల్’తో సూపర్ హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. అప్పుడు లవర్ బాయ్ పాత్రలకు మారిపోయారు. ఇప్పుడు మరోసారి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ ‘ఏజెంట్’‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ ప్రచార చిత్రాలు ఇది భారీ యాక్షన్ చిత్రమని చెప్పాయి. మరి ఇది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? అఖిల్ కోరుకునే విజయం దక్కిందా?

ఏజెంట్ కర్తవ్యం ఏమిటి ?

భారతదేశాన్ని నాశనం చేయడానికి గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియో) శత్రు దేశాలతో చేతులు కలుపుతాడు.

ఆ కుట్రను ఛేదించడానికి రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ అయిన మహదేవన్ అలియాస్ డెవిల్ (మమ్ముట్టి), రామకృష్ణ అలియాస్ ఏజెంట్ వైల్డ్ (అఖిల్)ను మిషన్‌లోకి తీసుకొస్తాడు.

గాడ్ కుట్రను రామకృష్ణ ఎలా అడ్డుకున్నాడనేది మిగతా కథ.

ఏజెంట్

ఫొటో సోర్స్, AK Entertainments/Facebook

కథనంలో కొత్తదనం ఏదీ?

ఇలాంటి కథలన్నీ దాదాపు ఒకే దారిలో వెళ్తాయి. దేశానికి ఒక ఆపద రావడం, దాని నుంచి కథానాయకుడు దేశాన్ని కాపాడటం. మొన్న వచ్చిన ‘పఠాన్’ కథ కూడా ఇదే.

ఇలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించాలంటే కథనం రొటీన్‌గా ఉండకూడదు. కానీ ఏజెంట్‌లో కొత్తదనమే కొరవడింది. కథ ఆరంభం నుంచి దారి తప్పుతూనే సాగింది.

కథానాయకుడు ఒక లక్ష్యాన్ని చేధించాలనేది నిర్ణయమైపోయినప్పుడు, ఆ పనిలోకి త్వరగా వచ్చేయాలి. కానీ ఇందులో కథానాయకుడు అసలు మిషన్‌లోకి రావడానికే చాలా కాలయాపన చేశారు.

విరామం ముందు ఘట్టం వరకూ హీరో పాత్రను కథలోకి తీసుకురాకుండా సాగదీయడం ప్రధాన లోపం.

నేల విడిచి సాము

దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ పాత్రను రొటీన్‌కు భిన్నంగా రాసుకునే ప్రయత్నంలో నేల విడిచి సాము చేశారనిపిస్తుంది.

ఏజెంట్ పాత్రను వైల్డ్‌గా మార్చే క్రమంలో కథలోని తీవ్రతను తగ్గించేసే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దారు.

పాత్రను ఊహతీతంగా మలిచే క్రమంలో కథలో నిజాయితీ లోపించినట్లు అనిపిస్తుంది. ఆ పాత్రను అంత వైల్డ్‌గా మార్చడానికి కూడా ఎలాంటి కారణమూ లేకపోవడం మరో లోపం.

ఏజెంట్

ఫొటో సోర్స్, AK Entertainments/Facebook

బలహీనమైన ప్రేమకథ

ఏజెంట్ లాంటి కథల్లోకి ప్రేమకథను చొప్పించడం అంత తేలిక కాదు. తేడా కొట్టే రిస్క్ ఎక్కువ. ఈ సినిమాలో అదే జరిగింది.

ఇందులోని ప్రేమకథలో బలం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆ ట్రాక్‌ను మలిచిన దర్శకుడు దానిని కథకు అనుసంధానించాలని చూశారు.

అయితే ఈ క్రమంలో వచ్చిన మంత్రి గారి ఎపిసోడ్‌లో లాజిక్ లేదు. ఒక మంత్రిగారి ఇంటికి వెళ్లి కథానాయకుడు వార్నింగ్ ఇచ్చే తీరు అసహజంగా వుంటుంది.

ద్వితీయార్ధంలో కథానాయిక అసలు కనిపించదంటే ఆ ప్రేమకథ తెరపై కనిపించిన తీరును అర్థం చేసుకోవచ్చు.

ద్వితీయార్ధం అయోమయం

ఏజెంట్ ద్వితీయార్ధం అంతా అయోమయంగా వుంటుంది. ప్రతినాయకుడి మానసిక స్థితిని పక్కదారి పట్టించే క్రమంలో కథ పక్కదారి పడుతుంది.

ద్వితీయార్ధంలో మిషన్ రాబిట్ చాలా కీలకం. దాని తీవ్రత గురించి ప్రేక్షకులకు వివరించి చెబితే బావుండేది. పాత్రలకు ఆ మిషన్ గురించి స్పష్టత ఉంటుందిగానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అదేమిటో చివరి వరకూ అంతు చిక్కదు.

దీనివల్ల దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలా సాగుతూ ఉంటాయి తప్పితే అందులో గంభీరత అర్థం కాదు. క్లైమాక్స్ తెలిపోవడానికి ఇది ప్రధాన కారణం.

ద్వితీయార్ధంలో కుదించాల్సిన సన్నివేశాలు వున్నాయి.

సురేందర్ రెడ్డి

ఫొటో సోర్స్, AK Entertainments/Facebook

సురేందర్ రెడ్డి ముద్ర ఏదీ?

దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్. పాత్రలతో మ్యాజిక్ చేయడం ఆయనకు బాగా తెలుసు.

‘అతనొక్కడే’ సినిమాలో కథనం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ‘కిక్’లో ఆయన చేసిన మ్యాజిక్ ఎవర్ గ్రీన్.

అయితే, అటు కథనంలో కానీ ఇటు పాత్రలలో కానీ సురేందర్ రెడ్డి మార్క్ ఏజెంట్‌లో కనిపించలేదు. కథనం అంతా ఊహకు అందిపోతుంది.

ఏజెంట్ పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడి లెక్క తప్పినట్లు అనిపిస్తుంది. అన్నట్టు, ఇందులో ఓ కాపీ సన్నివేశం కూడా వుంది.

ప్రతినాయకుడు హ్యాకర్స్ మెడలో పేలుడు బెల్ట్ బిగించి గడువు దాటిపోతే ఆటోమేటిక్‌గా పేలిపోయేలా ఏర్పాటు చేస్తాడు. ఈ సన్నివేశం జపనీస్ సినిమా ‘బ్యాటిల్ రాయల్’ నుంచి కాపీ చేసుకున్నారని ఆ సినిమా చూసిన వారికి తెలుస్తుంది.

అఖిల్ కష్టపడ్డాడు, కానీ...

ఏజెంట్ లాంటి సినిమాలు చేయాలంటే మాస్ ఇమేజ్ కావాలి. అఖిల్ విషయంలో అది ఇంకా రాలేదు.

కెరీర్ తొలి దశలోనే ‘లార్జర్ దాన్ లైఫ్’ పాత్రలు చేసేయాలనుకోవడం సాహసమే. ఇప్పుడు కూడా అఖిల్‌కు మళ్లీ నిరాశ ఎదురయ్యింది.

ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. తన శరీర సౌష్టవాన్నిమార్చుకున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా శ్రమించారు.

అయినా, ఈ పాత్ర అఖిల్‌ ఇమేజ్‌కు సరిపోలేదు. తన శక్తి మేరకు ప్రత్నించారుగానీ పాత్ర బరువును అఖిల్ మోయలేకపోయారు.

ఏజెంట్ పాత్రకు భావోద్వేగాలు లేకపోవడం మరో ప్రధాన సమస్య.

మమ్ముట్టి

ఫొటో సోర్స్, AK Entertainments/Facebook

అనుభవం చూపించిన మమ్ముట్టి

మహదేవన్ పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు మమ్ముట్టి మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించారు. ఆ పాత్రను హుందాగా చేశారు.

'విక్రమ్‌'లో కమల్ హాసన్ తరహాలో ఓ మిషన్ గన్‌తో తూటాల వర్షం కురిపించే సన్నివేశం బాగుంది. కానీ అది ఇదివరకే చూసేయడంతో ఎగ్జైట్‌మెంట్ ఇవ్వదు.

గాడ్‌గా చేసిన డినో మోరియో ఆహార్యం బాగుంది.

హీరోయిన్ సాక్షి వైద్య అందంగా కనిపించారు. అయితే ఆమె పాత్రనూ బలంగా మలచలేకపోయాడు దర్శకుడు.

వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, సంపత్, మిగతా నటులు పరిధి మేర కనిపించారు.

సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. రామకృష్ణ పాటల్లో అఖిల్ డ్యాన్సులు బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. కెమెరా పనితనం మాత్రం ఉన్నతంగా ఉంది.

వీడియో క్యాప్షన్, 'ఏజెంట్' రివ్యూ: అఖిల్‌కు సురేందర్ రెడ్డి మాస్ విజయాన్ని ఇచ్చారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)