‘ఒకే కుటుంబంలో 11 మంది మరణం’.. ఇలాంటి మర్డర్ స్టోరీలు సమాజంపై ఎలాంటి మానసిక ప్రభావం చూపుతున్నాయి

ఫొటో సోర్స్, COURTESY NETFLIX
- రచయిత, చెరీలాన్ మొలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబై
రాఖీ వయసు 22 ఏళ్లు. ఆమె రాత్రి పూట నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తనను వెంటాడుతున్నట్లు ఫీలైంది.
మెడ పక్కకు తిప్పి వెనక్కు చూసిన ఆమెకు అక్కడ ఎవరూ కనిపించలేదు.
ముంబయిలో నివసించే ఈ సైకాలజీ విద్యార్థి తనకు రియల్ క్రైమ్ షోలు చూడటమంటే ఇష్టమని తెలిపారు.
నేరస్థుల మైండ్ ఎలా పనిచేస్తుందో చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నారు.
కానీ, ఆ నేర కథల సినిమాలు, షోలు చూసిన తర్వాత తన భద్రతపై తనకి భయం కలుగుతోందని ఆమె అన్నారు.
భారత్‌లో నిజంగా జరిగిన సెన్సేషనల్ నేరాలకు సంబంధించిన షోలను, పాడ్‌కాస్ట్‌లను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాపులర్ చేసిన లక్షల మంది భారతీయ వీక్షకులలో ఈమె ఒకరు.
ఈ షోలలో ఎక్కువగా భారతీయ నేరగాళ్లు, వారి దుర్మార్గపు ఆలోచనలు, దేశంలో నేరాల చరిత్ర వంటి వాటిపై ఫోకస్ చేస్తున్నాయి.
‘ది ఇండియన్ ప్రిడేటర్’ వంటి డాక్యుమెంటరీ సిరీస్‌లో సీరియల్ కిల్లర్స్ నేరాలను చూపించారు.
హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారి డెత్స్ సిరీస్‌లో.. దిల్లీలో ఒకే కుటుంబంలో 11 మంది మరణిస్తారు, వారి మరణాల వెనుక ఉన్న వివాదాస్పద అంశాలను విశ్లేషిస్తారు.
ఎమ్మీ అవార్డు గెలిచిన డ్రామా సిరీస్ దిల్లీ క్రైమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2012లో దిల్లీలో ఒక మహిళపై జరిగిన భయానక గ్యాంగ్ రేప్ ఆధారితంగా ఈ క్రైమ్ సిరీస్ తీశారు.
అయితే, ఈ క్రైమ్ షోలు ఇంతకుమునుపెన్నడూ పెద్దగా ప్రజలు తెలియని నేరాలను, నేరగాళ్లను పరిచయం చేస్తున్నాయని వీటి అభిమానులు చెబుతున్నారు.
జెఫ్రే డెహ్మర్, టెడ్ బండీ వంటి అమెరికన్ సీరియల్ కిల్లర్స్ గురించి తెలుసుకుంటూ పెరిగిన రాఖీ ప్రస్తుతం ఇప్పుడు ఛార్లెస్ శోభ్‌రాజ్, జాలీ జోసెఫ్ గురించి మాట్లాడుతున్నారు.

ఫొటో సోర్స్, COURTESY NETFLIX
అయితే, భారత్‌లో ఈ రియల్ క్రైమ్ షోలు కొత్తేమీ కాదు.
రియల్ క్రైమ్ నేరాలను ఆధారంగా 2000 సంవత్సరం నుంచి డిటెక్టివ్ మ్యాగజీన్స్ విడుదలయ్యాయి.
ఈ మ్యాగజీన్‌లోని కథల ఆధారితంగా క్రైమ్ పెట్రోల్, సీఐడీ వంటి పలు టీవీ షోలు రూపొందాయి.
కానీ, ఈ షోలలో భయాన్ని కలిగించడం కంటే మనుషులను మేల్కొపేలా గ్రాఫిక్స్‌ను, మాటలను మాత్రమే వాడేవారు.
కానీ ప్రస్తుత వెబ్ సిరీస్‌లు మరింత సమాచారాన్ని అందిస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.
నేరగాళ్ల నేపథ్యాన్ని తాము తెలుసుకోగలుతున్నామని, వారి ఆలోచన విధానం, ఒక కేసులో బహుముఖ కోణాలను ఎలా చూడాలన్నది తెలుసుకుంటున్నామని వీక్షకులు చెప్పారు.
రియల్ క్రైమ్ షోలు చూడ్డానికి మనం చాలా బానిసలుగా మారతామని, ఎందుకంటే మన మెదడులో థ్రిల్ కలిగించే కెమికల్స్‌ను ఇవి విడుదల చేస్తుంటాయని థెరపిస్ట్ సీమా హింగోర్రానీ చెప్పారు.
అంతేకాక, ఈ క్రైమ్ షోలు థ్రిల్లింగ్ కలిగించే సన్నివేశాల్లో మిమ్మల్ని మీరు బాధించుకోకుండానే.. ఊహాత్మక అనుభవాన్ని అందిస్తుంటాయని అన్నారు.
ప్రేక్షకులని కట్టిపడేసేందుకు ఈ క్రైమ్ షోలలో భావోద్వేగ చిత్రాలను వాడుతుంటారు.
‘ది బుచర్ ఆఫ్ దిల్లీ’లో హంతకుడు క్రూరంగా మనుషులను చంపే సన్నివేశాలు కనిపిస్తాయి. నరికిన తలల ఫోటోలు, బాధితులను బంధించడం, రక్తపు మరకలు వంటివి ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో కనిపిస్తాయి.
ఈ షోలో ఒక వలస కార్మికుడు చంద్రకాంత్ ఝా స్టోరీని చూపించారు.
ఇతను కొందరిని చంపుతాడు. హత్యకు గురైనవారంతా 1990ల్లో, 2000 తొలినాళ్లలో దిల్లీ వచ్చిన పేద వలస కార్మికులు.
వారి మృతదేహాలను జైలు ముందే వదిలి పెడతాడు. వాటితో పాటు పోలీసులకు ఒక నోట్‌ను ఇస్తుంటాడు.
ఈ నేరాలు చాలా క్రూరంగా ఉన్నాయని, మీడియా, పోలీసులు, పబ్లిక్ ఎన్నో ఏళ్లుగా ఈ కేసును పక్కనపెట్టినట్లు డైరెక్టర్ అయేషా సూద్ తెలిపారు.
‘కొన్నిసార్లు మేం మాలాంటి వారి మాటలు వినాలనుకుంటాం. క్రూరత్వం అంతటా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఇది జరిగితే దానిపై మనం దృష్టిసారించాల్సి ఉంది’’ అని సూద్ చెప్పారు.

ఫొటో సోర్స్, COURTESY NETFLIX
నేరగాళ్ల ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు ఏం చేయగలగాలన్నది తెలుసుకోవచ్చని అయేషా సూద్ అన్నారు.
పాడ్‌కాస్ట్‌లు తన జీవితాన్ని మరింత జాగ్రత్తగా ఉంచుకునేందుకు సాయపడ్డాయని, ప్రమాదకర పరిస్థితిలో బాధితులు ఎలా తప్పించుకోవాలో కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చని సుకూన్ త్యాగి చెప్పారు.
భారత్‌లో, ఇతర దక్షిణాసియా దేశాల్లో నేరాలను హైలైట్ చేస్తూ విడుదల చేసిన దేశీ క్రైమ్ పాడ్‌క్యాస్ట్‌కు ఆమె గొప్ప అభిమాని.
తనకు తెలిసిన కొన్ని వాస్తవాలను ఈ పాడ్‌కాస్ట్ ప్రతిబింబిస్తోందని త్యాగి చెప్పారు.
దేశంలో అత్యధిక నేరాల రేటు ఉన్న దిల్లీలో త్యాగి నివసిస్తున్నారు.
దిల్లీలో 2021లో సగటున రోజుకు ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురైనట్లు జాతీయ నేరాల గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజా రిపోర్ట్ వెల్లడించింది.
‘‘మీకు తెలిసిన లేదా తరచూ వెళ్లే ప్రాంతాల్లోనే నేరాలు కూడా జరుగుతున్నట్లు చర్చిస్తూ ఉంటారు. దీంతో భయం నుంచి మీకు మీరు దూరం కాలేరు’’ అని అన్నారు త్యాగి.
రియల్ క్రైమ్ కథనాలను మహిళలు ఎక్కువగా చూస్తుంటారని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
ఎందుకంటే, వారు తమను తాము బాధితురాలితో పోల్చుకుంటూ ఉంటారు.
ఎందుకు, ఎలా ఈ నేరం జరిగిందో ఈ షోలలో వివరణాత్మకం చెబుతారు. ఒకవేళ బాధితురాలి మాదిరి తాను కూడా అదే పరిస్థితిలో ఉంటే, తనకు తాను ఎలా రక్షించుకోవాలో కూడా వారు తెలుసుకునేందుకు సాయపడతాయి.
కొన్ని సార్లు పాడ్‌కాస్ట్‌లు, షోలు వాస్తవానికి విరుద్ధంగా ఉంటాయని కొందరు విమర్శకులంటున్నారు. సరిగ్గా అధ్యయనం చేసుకోకపోవడం వల్లే ఇది జరుగుతుందన్నారు.
‘‘ఈ షోలు నైతికంగా ఇబ్బందికరంగా మారతాయి’’ అని ముంబయికి చెందిన క్రైమ్ రిపోర్టర్ శ్రీనాథ్ రావు చెప్పారు.
బాధితుల లేదా నేరగాళ్ల కుటుంబంపై ఈ షో ఎంత ప్రభావం చూపుతుందో కూడా సరైన అవగాహన ఉండదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2021లో విడుదలైన బురారి డెత్స్ డాక్యుమెంటరీ తర్వాత, ఈ విషాద సంఘటనపై ఆన్‌లైన్‌లో పలు మీమ్స్ చక్కర్లు కొట్టాయి.
దేశంలో ప్రజల మానసిక ఆరోగ్యం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో తెలియజేస్తూ తీసిన ఈ డాక్యుమెంటరీపై ఆన్‌లైన్‌లో జోకులు పంచ్ లైన్స్‌గా పేలడంతో, ఈ సిరీస్ అనుకున్న గాడి తప్పింది.
అదే ఏడాది, సీరియల్ కిల్లర్ జెఫ్రే డెహ్మర్‌పై రూపొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కూడా వివాదాస్పదంగా మారింది.
ఆ షో తమను షాక్‌కి గురిచేసిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
రియల్ క్రైమ్ షోలు కొన్ని సార్లు ఆ వ్యక్తి ఆందోళనను, కోపాన్ని లేదా మొరటుదనాన్ని ప్రదర్శిస్తాయని థెరపిస్ట్ సీమా హింగోరానీ అన్నారు.
షోలలో చూపించే నేరగాళ్లు తరచుగా ఏదో ఒక సమస్య బారిన పడిన తర్వాత, వారు హింస, నేర కార్యకలపాలకు అలవాటుపడినట్లు చూపిస్తుంటారు.
ఈ షోలను చూసే వారు కూడా వారికి తెలియకుండానే ఆ మాయలో కూరుకుపోతారు.
ఈ షోలను బాగా రూపొందించినప్పుడు, మన చుట్టుపక్కలా లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేలా సాయపడతాయి.
‘‘భయం అనే శక్తివంతమైన భావోద్వేగం. ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది’’ అని సూద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘అందరిలా నాకు కన్నీళ్లు రావు.. ఏడవలేను కూడా’.. ఏమిటీ సమస్య
- ఏటీఎం జాక్‌పాటింగ్: సినిమాలో పాత్ర అంటూ ప్రజలను పంపించి రూ. 115 కోట్లు డ్రా చేయించారు, అయిదేళ్ల కిందట పుణె బ్యాంకును ఎలా కొల్లగొట్టారంటే..
- డోనల్డ్ ట్రంప్: అమెరికా మాజీ అధ్యక్షుడిపై కేసులో ఏడు ప్రశ్నలు, సమాధానాలు
- బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు బీజేపీలో చేరారా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించారు?
- రిలయన్స్, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?














