బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు బీజేపీలో చేరారా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించారు?

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘గ్యాంగ్ రేప్, హత్య వంటి తీవ్రమైన అభియోగాల్లో దోషులుగా ఉన్న వ్యక్తులు, అధికార పార్టీ అగ్రనేతలతో ఒకే వేదికపై కూర్చొని ఉండటాన్ని చూడటం చాలా భయంకరంగా ఉంటుంది.’’

ఈ మాటలు అన్నది 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో. పై వ్యాఖ్యల ద్వారా ఆమె తన నిరాశ, భయాన్ని వ్యక్తం చేశారు.

దాహోద్ ఎంపీ జస్వంత్‌సింగ్ భాభోర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లోని ఫొటోలను చూసి బిల్కిస్ బానో షాక్ అయ్యారు.

రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాహోద్ జిల్లా లిమ్‌ఖోడా తహసీల్‌లోని సింగ్‌వాడ్ గ్రామంలో మార్చి 25వ తేదీన నిర్వహించిన ఒక కార్యక్రమం గురించి ఫేస్‌బుక్‌లో జస్వంత్ సింగ్ ఒక పోస్ట్ పెట్టారు.

ఫేస్‌బుక్‌లో ఆయన పంచుకున్న ఫొటోల్లో వేదికపైన ముందు వరుస కుర్చీల్లో దాహోద్ ఎంపీ జస్వంత్ సింగ్ భాబోర్‌, లిమ్‌ఖోడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌లతో పాటు బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ దోషుల్లో ఒకరైన శైలేష్ భట్ కూర్చొని ఉండటం కనిపిస్తుంది.

వేదికపైన కూర్చొన్న ఎంపీ జస్వంత్ సింగ్, ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌లు ఇద్దరూ వరుసకు సోదరులు. వారిద్దరూ బీజేపీ నాయకులు.

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులను హత్య చేసిన నేరంలో శైలేష్ భట్‌తో సహా 11 మందిని దోషులుగా నిర్ధారించారు. 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది వీరికి క్షమాభిక్ష పెట్టింది. ఆ తర్వాత, వీరంతా జైలు నుంచి విడుదల అయ్యారు.

ఈ కేసులోని దోషులంతా ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే, తాజా ఫొటోలను చూసి బిల్కిస్ బానో‌తో పాటు ఆమె కుటుంబం మొత్తం భయపడుతున్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత వీరంతా, బీజేపీ ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలు, ర్యాలీల్లో కనిపిస్తున్నారని పలువురు స్థానికులు చెప్పారు.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, DAHOD DISTRICT INFORMATION DEPARTMENT

ఫొటో క్యాప్షన్, వేదికపై ముందు వరుసలో బీజేపీ నేతలతో కలసి కూర్చున్న శైలేంద్ర భట్

ఇది మొదటిసారి కాదు

ఈ ఘటన తర్వాత బిల్కిస్ బానో భర్త యాకూబ్ పటేల్‌తో బీబీసీ మాట్లాడింది. ప్రస్తుతం వారు దాహోద్‌లో నివసిస్తున్నారు. వారిది ఉమ్మడి కుటుంబం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అతను బీబీసీతో మాట్లాడుతూ, “మేం మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, ఈ నేరస్థులకు మద్దతుగా ఉందని చెప్పడానికి ఈ ఫొటోలే నిదర్శనం.

రంజాన్ మాసం కావడంతో బిల్కిస్ బానో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాసం ఉంటున్నారు. ఈ ఫొటోలను చూసిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఆమె భర్త అన్నారు.

‘‘ఈ ఫొటోలను చూసినప్పటి నుంచి బిల్కిస్ ఆరోగ్యం బాలేదు. రాత్రి పగలు భయంతో ఎలా జీవిస్తున్నామో కేవలం మాకు మాత్రమే తెలుసు. మాకు ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చనే భయం పట్టుకుంది” అని యాకూబ్ అన్నారు.

బిల్కిస్ బానో కేసులో దోషులను గతేడాది ఆగస్టులో ఏ విధంగా విడుదల చేశారో వివరించాలంటూ సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

“మా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’’ అని యాకూబ్ అన్నారు.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, TWITTER/JASVANTSINH BHABHOR

ఫొటో క్యాప్షన్, జస్వంత్ సింగ్ భాభోర్ ట్వీట్

ఈ దోషులు, బీజేపీలో చేరారా?

రంధిక్‌పూర్ స్థానిక ప్రజలు చెప్పినదాని ప్రకారం, బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది చాలా ఏళ్లుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు ఏ అధికారి కూడా వారు పార్టీ సభ్యులనే విషయాన్ని ధ్రువీకరించలేదు.

దాహోద్ బీజేపీ అధ్యక్షుడు శంకర్ అమలియార్ మాట్లాడుతూ, "భట్ అధికారికంగా బీజేపీలో చేరలేదు. అలాగే ఆ కేసులోని ఇతర దోషులు కూడా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపలేదు’’ అని అన్నారు.

ఈ కార్యక్రమానికి శైలేష్ భట్‌ను పార్టీ ఆహ్వానించలేదని ఆయన అన్నారు. కాకపోతే ఒక సాధారణ వ్యక్తిగా ఆయన ఆ కార్యక్రమానికి వచ్చి ఉంటారని, అది తమ నియంత్రణలో లేని అంశమని ఆయన వ్యాఖ్యానించారు.

దాహోద్ జిల్లాలోని మరో బీజేపీ అగ్రనేత నరేంద్ర సోనీ మాట్లాడుతూ, ‘‘అది ప్రజల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమం. దానికి భట్‌తో సహా అనేక మంది ప్రజలు హాజరయ్యారు’’ అని అన్నారు.

వేదికపై ముందు వరుసలో భట్‌కు సీటు ఎలా వచ్చింది? అని ప్రశ్నించగా, ‘‘ ఆ విషయం నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు’’ అని నరేంద్ర చెప్పారు.

ఈ విషయం గురించి బీజేపీ ఎంపీ జస్వంత్‌సింగ్ భాభోర్, ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌తో మాట్లాడటానికి బీబీసీ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే, మా ప్రయత్నాలకు వారిద్దరూ స్పందించలేదు.

కేసులో దోషులుగా ఉన్నవారు బీజేపీ నేతలతో కనిపించడం ఇదే మొదటిసారి కాదు.

శైలేష్ భట్, బీజేపీ నేతలతో కలసి కనిపించడం ఇదే తొలిసారి కాదని బిల్కిస్ బానో భర్త యాకూబ్ అన్నారు.

జస్వంత్ సింగ్ భాభోర్ ఫేస్‌బుక్ అకౌంట్ స్క్రీన్ షాట్‌ను చూపిస్తూ, 2020లో శైలేష్ పెరోల్‌ మీద ఉన్న సమయంలో కూడా ఒక కార్యక్రమంలో భాభోర్‌తో కలిసి శైలేష్ కనిపించారని యాకూబ్ చెప్పారు.

ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయని, ఈ మొత్తం 11 మంది దోషులు, నేటికి కూడా బీజేపీ కార్యక్రమాల్లో కనిపిస్తుంటారని యాకూబ్ అన్నారు.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, DAXESH SHAH

ఫొటో క్యాప్షన్, బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న 11 మంది గత ఏడాది గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు

శైలేష్ భట్‌ని ఎవరు ఆహ్వానించారు?

భట్‌ను ఎవరు ఆహ్వానించారో తెలుసుకోవడానికి బీజేపీ నేతలు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు ఈవెంట్ నిర్వాహకులతో బీబీసీ మాట్లాడింది.

ప్రభుత్వ కార్యక్రమానికి శైలేష్ భట్ ఎలా వచ్చారు? ఆయనను ఎవరు ఆహ్వానించారు? అనే విషయాలను తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. దీనికి తమకు ఎలాంటి బాధ్యత లేదని పార్టీ, ప్రభుత్వం తప్పించుకున్నాయి.

భట్‌కు ఎలాంటి ఆహ్వానం పంపలేదని బీజేపీ, ప్రభుత్వం చెప్పాయి.

దాహోద్ జల వనరుల శాఖ డిప్యూటీ ఇంజనీర్ పీఎం పర్మార్, బీబీసీతో మాట్లాడుతూ, "ఈ కార్యక్రమాన్ని మేం నిర్వహించిన మాట నిజమే. అయితే, ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారి గురించి మాకు సమాచారం లేదు’’ అని అన్నారు.

దాహోద్ జిల్లాలోని సింగ్‌వాడ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగ్‌వాడ్ గ్రామ సర్పంచ్ లఖీ వహోరియాతో కూడా మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయనకు బదులుగా, ఆయన కుమారుడు జీవన్‌లాల్ వహోరియా బీబీసీతో మాట్లాడుతూ, తాము ఆహ్వానించలేదని అన్నారు.

రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి పైప్‌లైన్‌ ఏర్పాటు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలసి శైలేష్ భట్ హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)