బిల్కిస్ బానో కేసు: సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది నేరస్థులను జైలు నుంచి ఎలా వదిలేశారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్ర రావ్, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆగస్టు 15న భారతదేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజు, గుజరాత్‌లో 11 మంది నేరస్థులను క్షమించి జైలు నుంచి విడుదల చేశారు. ఈ 11 మంది 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసి గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు.
ఖైదీలకు శిక్ష తగ్గించడంపై కేంద్రం జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాసింది. అందులో, యావజ్జీవ కారాగార శిక్ష పడినవారిని, అత్యాచారానికి పాల్పడినవారి నేరాలను క్షమించకూడదని పేర్కొంది. రెండు నెలలు తిరగకుండానే గుజరాత్ ప్రభుత్వం జీవిత ఖైదు పడిన 11 మందిని విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంది.
75 ఏళ్ల స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని, కొంతమంది ఖైదీల శిక్షను రద్దు చేసి లేదా తగ్గించి, మూడు విడతలలో వారిని విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర హోంశాఖ జూన్ 10న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. మొదటి విడత 2022 ఆగస్టు 15, రెండవ విడత 2023 జనవరి 26, మూడవ విడత 2023 ఆగస్టు 15.
అదే లేఖలో, ఎటువంటి ఖైదీలను ఎప్పటికీ క్షమించకూడదో కూడా పేర్కొంది. జీవిత ఖైదు పడినవారిని, అత్యాచారాలకు పాల్పడినవారి నేరాలకు క్షమాపణ ఉండదని పేర్కొంది.
అయితే విషయం ఇక్కడితో ఆగిపోలేదు.

ఫొటో సోర్స్, CHIRANTANA BHATT
గుజరాత్ 2014 క్షమాభిక్ష పాలసీ
2014 జనవరి 23న గుజరాత్ హోం శాఖ, ఖైదీలకు క్షమాభిక్ష, శిక్షాకాలానికి ముందే విడుదల మొదలైన అంశాలలో మార్గదర్శకాలను, పాలసీలను జారీ చేసింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను సామూహికంగా హత్య చేసినవారికి, అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి పాల్పడినవారికి క్షమాభిక్ష ఉండదని స్పష్టంగా పేర్కొంది.
అలాగే, దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 కింద నేరం రుజువైన ఖైదీలను క్షమించలేమని, శిక్షాకాలానికి ముందే విడుదల చేయలేమని కూడా పేర్కొంది.
దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 కింద కేసులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి వెళతాయి. బిల్కిస్ బానో కేసును సీబీఐ విచారించింది. నేరానికి పాల్పడిన ఆ 11 మందిని దోషులుగా నిర్థారించింది.
'2014 కాదు, 1992 పాలసీ ప్రకారం శిక్షను రద్దు చేశారు'
ఈ విషయమై గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోం) రాజ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
"ఇది శిక్షాకాలానికి ముందే విడుదలైన కేసు కాదు. శిక్ష మాఫీ కేసు. వీరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే, జీవిత ఖైదు పడిన నేరస్థులు 14 ఏళ్ల శిక్ష పూర్తిచేసుకున్నాక, క్షమాభిక్ష కోరవచ్చు. ఈ 11 మందీ క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, 2014 పాలసీ ప్రకారం వీళ్లు క్షమాభిక్షకు అర్హులు కారు. అందుకని, ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. వీళ్లను దోషులుగా నిర్ణయించి, శిక్ష విధించిన సమయంలో ఏ విధానం అమలులో ఉందో, దాని ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
"వీళ్లకు శిక్ష పడిన సమయంలో 1992 పాలసీ అమలులో ఉంది. ఆ విధానంలో ఎలాంటి వర్గీకరణ లేదు. ఏ సెక్షన్ కింద కన్విక్షన్ జరిగిందో తెలిపే వర్గీకరణ లేదు. శిక్షపడి 14 సంవత్సరాలు పూర్తయితే, ఆ కేసులను పరిగణించవచ్చని మాత్రమే ఉంది. 2014 విధానం ఈ కేసులో వర్తించదని సుప్రీంకోర్టు గుర్తించింది" అని రాజ్ కుమార్ చెప్పారు.
అయితే, ఈ కేసును సీబీఐ విచారించినందున, ఇందులో నేరస్థులకు క్షమాభిక్ష పెట్టే అవకాశం కేంద్రానికి ఉంటుందా, రాష్ట్రానికి ఉంటుందా అనే విషయమై గుజరాత్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందని ఆయన చెప్పారు.
ఈ కేసు మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని రాజ్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, CHIRANTANA BHATT
2014 నాటి క్షమాభిక్ష విధానాన్ని విస్మరించవచ్చా?
ఈ సందర్భంలో, గుజరాత్ ప్రభుత్వం 1992 నాటి విధానాన్ని ఆధారంగా చేసుకుని దోషులకు క్షమాభిక్ష పెట్టడం, 2014 విధానాన్ని విస్మరించడం సరైనదేనా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మేం న్యాయవాది మెహమూద్ ప్రాచాతో మాట్లాడాం. దిల్లీ అల్లర్ల వంటి ముఖ్యమైన కేసులలో ఆయన న్యాయవాదిగా ఉన్నారు.
"ఇంతకుముందు సామూహిక అత్యాచారానికి శిక్షగా మరణశిక్ష ఉండేది కాదు. ఇలాంటి కేసులో ఎవరికైనా శిక్ష పడి, అ తరువాత చట్టాలు, విధానాలు మారితే శిక్ష విషయంలో పునరాలోచన ఉండదు. ఇంకా సులువుగా చెప్పాలంటే, ఇప్పుడు చట్టం మారిందని, అంతకుముందు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నేరస్థుడికి మరణశిక్ష విధించలేం. నేరం చేసే సమయంలో అమలులో ఉన్న చట్టం ప్రకారమే శిక్ష కొనసాగుతుంది.
కానీ, శిక్ష మాఫీ విషయం వేరని ప్రాచా చెప్పారు.
"శిక్ష మాఫీ అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను మార్చవచ్చు. శిక్షలో మాఫీ అనేది ఒక భాగం. ఇది శిక్ష మూలరూపాన్ని మార్చదు. అందువల్ల ఒక నిర్దిష్టమైన శిక్షాకాలం పూర్తయిన తరువాతే క్షమాభిక్ష ప్రస్తావన తీసుకురావచ్చు.
మొదట, మీరు క్షమాపణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైనప్పుడే క్షమాభిక్ష ప్రశ్న తలెత్తుతుంది. ఆ రోజు అమలులో ఉన్న చట్టం ఆధారంగా క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
బిల్కిస్ బానో కేసులో, 2014 విధానం అమలులోకి వచ్చిన తరువాత క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే 2014 విధానమే మార్గదర్శకంగా ఉండాలి" అని ప్రాచా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కేసు ఏంటి?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ గ్రామంలో అయిదు నెలల గర్భంతో ఉన్న బిల్కిస్ బానోపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఆమె మూడేళ్ల కూతురు సాలేహాను కూడా దారుణంగా హత్య చేశారు.
2008 జనవరి 21న ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. తరువాత ఆ శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది.
దోషులలో ఒకరైన రాధే శ్యామ్ షా, 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తరువాత క్షమాభిక్ష కోసం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయన క్షమాభిక్ష అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీని తరువాత, గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మొత్తం 11 మంది దోషుల శిక్షను రద్దు చేయాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వారిని విడుదల చేయాలని సిఫారసు చేసింది. చివరకు, ఆగస్టు 15న జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ 11 మంది దోషులు జైలు నుంచి విడుదలయ్యారు.
దోషులకు శిక్షను రద్దు చేసి, వారిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వ కమిటీ ఎలా నిర్ణయించిందో తనకు అర్థం కాలేదని సుప్రీంకోర్టు న్యాయవాది ప్యోలీ స్వతీజా అంటున్నారు.
"క్షమాభిక్ష నిర్ణయం గుజరాత్ ప్రభుత్వమే తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాధికారాలు ఇచ్చింది. అయితే, ఆ కమిటీ వాటిని గుడ్డిగా ఉపయోగించకూడదు. నేర స్వభావం ఏమిటో చూడాలి. ఖైదీ ప్రవర్తన ఎలా ఉందో పరిగణించాలి కానీ, నేర స్వభావం ఏమిటో చూడడం కూడా ముఖ్యం. అలా చూస్తే, మనస్సాక్షి ఉన్న ఏ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోదు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రిపై ప్రతిపక్షాల విమర్శలు
ఈ కేసులో 11 మంది దోషులను విడుదల చేయడం అనూహ్యమని కాంగ్రెస్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ, "నిన్న ఎర్రకోట నుంచి ప్రధాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.. మహిళలకు రక్షణ, గౌరవం, స్త్రీ శక్తి అంటూ మంచి మంది పదాలు ఉపయోగించారు. కొన్ని గంటల తరువాత గుజరాత్ ప్రభుత్వం ఊహించని రీతిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు" అని అన్నారు.
ఈ కేసులో దోషులు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారని, వారి సత్ప్రవర్తన కారణంగా విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం చెప్పిన కారణాలను కూడా ఖేరా విమర్శించారు.
"నేర స్వభావాన్ని బట్టి చూస్తే, అత్యాచారానికి అత్యంత కఠిన శిక్ష పడాలి కదా. ఎంత కఠిన శిక్ష పడితే, క్షమాభిక్షకు అంత తక్కువ పరిగణించాలి" అని అన్నారు.
11 మంది విడుదలైన తరువాత, వారికి లభించిన స్వాగత సత్కారాలపై కాంగ్రెస్ విరుచుకుపడింది.
"విడుదలైన వారికి హారతి ఇచ్చి తిలకం దిద్దారు, సత్కారాలు చేశారు. ఇదేనా అమృత్ మహోత్సవం? ప్రధాని మాటలకు, చేతలకు తేడా ఇదేనా? లేదా ఆయన ప్రజలు, ప్రభుత్వాలు ఆయన మాట వినడం మానేశాయా? లేకపోతే ప్రధాని దేశానికి ఒకటి చెప్పి, తరువాత ఫోన్ చేసి తమ రాష్ట్ర ప్రభుత్వాలకు వేరొకటి చెప్తారా?" అని పవన్ ఖేరా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటిపైన జాతీయ జెండా ఎగరేశారా.. ఇప్పుడు దానిని ఏం చేస్తారు? ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఇలా చేయొచ్చు..
- ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ సాయిప్రణీత్ ఇంటర్వ్యూ: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
- భారతదేశ ప్రవాస ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రి మౌలానా బర్కతుల్లా భోపాలీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












