#IndiaAt75: భారతదేశ ప్రవాస ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రి మౌలానా బర్కతుల్లా భోపాలీ

ఫొటో సోర్స్, SUREH NIAZI/BBC
- రచయిత, షురైహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
మౌలానా బర్కతుల్లా భోపాలీ భారతదేశ ప్రవాస ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రి. 1915 డిసెంబర్ 1న అఫ్గానిస్తాన్‌లో భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంలో మౌలానా బర్కతుల్లా ప్రధానమంత్రి కాగా, రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఉబైదుల్లా సింధీ హోంమంత్రిగా ఉన్నారు.
మౌలానా బర్కతుల్లా, ఉబైదుల్లా సింధీ మధ్య స్నేహం హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణ. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్ 1 తేదీని ఎంచుకున్నారు.
భోపాల్ నుంచి వచ్చిన విప్లవ నాయకుడు మౌలానా బర్కతుల్లాను ప్రభుత్వాలు దాదాపు మరిచిపోయాయి. భోపాల్‌లోని విశ్వవిద్యాలయానికి బర్కతుల్లా భోపాలీ పేరు పెట్టారు కానీ, దాన్ని మార్చాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది.
భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో మౌలానా బర్కతుల్లాను మరచిపోవడమంటే, స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చరిత్రను తుడుచిపెట్టేయడమేనని చరిత్రకారులు, భోపాల్ ప్రజలు అంటున్నారు.

- ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ప్రవాస తాత్కాలిక ప్రభుత్వం అని పిలిచే ఈ ప్రభుత్వాన్ని 1915, డిసెంబర్ 1న ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ ఏర్పాటు చేసింది.
- అఫ్గానిస్తాన్, రష్యా, చైనా, జపాన్ దేశాల నుంచి భారత స్వతంత్ర పోరాటానికి మద్దతు తీసుకు రావడమే దీని ఉద్దేశం.
- 1919లో బ్రిటిషర్లు అఫ్గానిస్తాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి ఈ ప్రభుత్వాన్ని తొలగించారు.
- మౌలానా బర్కతుల్లా భోపాలీ 1927 సెప్టెంబర్ 20న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచారు.

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, తమ వర్గానికి చెందినవారి గురించే ప్రచారం చేశాయిగానీ, వాస్తవంలో ప్రాణాలకు సైతం లెక్కచేయక పోరాడినవారిని మరచిపోయాయని చరిత్రకారుడు అశర్ కిద్వాయ్ అన్నారు.
"అలాంటివారిలో మౌలానా బర్కతుల్లా భోపాలీ కూడా ఒకరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌తో కలిసి విప్లవోద్యమాన్ని నడిపినవారినే ప్రోత్సహించింది. ప్రస్తుత ప్రభుత్వం బర్కతుల్లాను చూస్తున్న దృక్కోణమే వేరుగా ఉంది. అందుకే, ఒక యూనివర్సిటీకి పేరు పెట్టి వదిలేశారు. అది తప్ప, బర్కతుల్లా గురించి తెలియజెప్పే మరేదీ మీకు ఈ నగరంలో కనిపించదు" అని కిద్వాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI/BBC
దేశం వెలుపల నుంచి స్వతంత్రం కోసం పోరాటం
మౌలానా బర్కతుల్లా భోపాలీపై రచించిన పుస్తకాన్ని అనువదించిన సయ్యద్ ఇఫ్తీకార్ ఆయన గురించి అనేక విషయాలు చెప్పారు.
"బర్కతుల్లా భోపాలీ దేశం వెలుపల ఉంటూ దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడ్డారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విదేశాల్లో భారతీయుల గొంతును వినిపించారు. ఆయనకు భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం లేదు. అందుకే బయటకు వెళ్లారు" అని ఆయన చెప్పారు.
ఇప్పుడున్న ప్రభుత్వం నిజమైన విప్లవకారులందరినీ మరిచిపోయేలా చేస్తోందని సయ్యద్ ఇఫ్తికార్ అభిప్రాయపడ్డారు.
బర్కతుల్లా యూత్ ఫోరం భోపాల్ కోఆర్డినేటర్ అనస్ అలీ మాట్లాడుతూ, బీజేపీ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా బర్కతుల్లా భోపాలీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని అన్నారు.
అనస్ అలీ భోపాల్‌లోని బర్కతుల్లా యూత్ ఫోరమ్ ద్వారా మౌలానా బర్కతుల్లా గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
"భోపాల్‌లో బర్కతుల్లా భోపాలీ పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉంది. 1980లో అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, భోపాల్ విశ్వవిద్యాలయం పేరును బర్కతుల్లా విశ్వవిద్యాలయంగా మార్చారు. అది తప్ప ఆయన గురించి చెప్పే మరో ఆనవాలు లేదు. ఏ రోడ్డు, కూడలి, వంతెన లేదా స్టేషన్‌కు ఆయన పేరు పెట్టలేదు. ఆయన కోసం ఈ నగరం ఆ మాత్రం కూడా చేయలేదు. జయంతి లేదా వర్ధంతి రోజున ప్రభుత్వ కార్యక్రమాలు సరే, కనీసం నివాళులు కూడా అర్పించదు. ప్రతిపక్షం వైఖరి కూడా ఇలాగే ఉంటుంది" అని అనస్ అలీ అన్నారు.

ఫొటో సోర్స్, ARRANGED
’బర్కతుల్లా గురించి ఏ పాఠ్య పుస్తకంలోనూ ఉండదు’
మౌలానా బర్కతుల్లా గురించి ఏ పాఠ్య పుస్తకంలోనూ ఉండదని అశర్ కిద్వాయ్ అన్నారు.
"పాఠ్య పుస్తకాల్లో బర్కతుల్లా మీద పాఠం ఉండదు. ఉర్దూలో ఒక పాఠ్య పుస్తకంలో ఆయన గురించి ఉంది. కానీ, ఉర్దూ చదివే పిల్లలెంతమంది? రాజ మహేంద్ర సింగ్, లాలా హర్దయాల్ వంటి వారితో కలిసి పనిచేశారు బర్కతుల్లా. స్వతంత్రం గురించి కలలు కన్నారు" అని ఆయన అన్నారు.
మౌలానా బర్కతుల్లా భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతంలో 1854 జూలై 7న జన్మించారు. ఆయన తండ్రి షుజాత్ ఉల్లా ఖాన్ భోపాల్ ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేసేవారు. బర్కతుల్లా భోపాల్‌లోని రెట్‌ఘాట్‌లో సులేమానియా పాఠశాలలో చదివారు. అది నేటికీ ఉంది.
బర్కతుల్లాకు కాలిగ్రఫీ తెలుసు. అలాగే, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, జపనీస్ సహా ఎనిమిది భాషలలో నిష్ణాతుడు.
విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, తాను చదువుకున్న పాఠశాలలోనే అధ్యాపకుడిగా చేరారు. తరువాత బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ భోపాల్ విడిపెట్టారు. ఆ పై ముంబై వెళ్లారు. అక్కడ ఆంగ్ల విధ్యను అభ్యసించారు.
1887లో ఆయన లండన్ వెళ్లారు. అక్కడ ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషలను బోధించడం మొదలుపెట్టారు. అదే సమయంలో, ఆయన జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ నేర్చుకున్నారు. ఆ తరువాత లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ కాలేజీలో బోధన ప్రారంభించారు. ఆ సమయంలో బర్కతుల్లాకు ఇండియా హౌస్‌లోని భారతీయ విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి అక్కడి నుంచే బ్రిటిష్ పాలనపై ధ్వజమెత్తారు.
ఇంగ్లండ్ తరువాత బర్కతుల్లా అమెరికా (1903), జపాన్ (1909), జర్మనీ (1914), టర్కీ, అఫ్గానిస్తాన్ (1915), సోవియట్ యూనియన్ (1919), ఫ్రాన్స్, రోమ్ (1924) వెళ్ళారు. జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయంలో అరబిక్ బోధించారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI/BBC
గోఖలే, శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో..
బర్కతుల్లాపై గోపాల్ కృష్ణ గోఖలే, శ్యామ ప్రసాద్ ముఖర్జీల ప్రభావం బాగా ఉంది. దేశం వెలుపల ఉంటూ విదేశాలలో బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలను నడిపిస్తున్న వ్యక్తిగా బర్కతుల్లాను అందరూ గౌరవించేవారు.
మౌలానా బర్కతుల్లా బ్రిటిష్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణిస్తూ, ఆయా దేశాల నేతలను కలిశారు. రష్యాకు వెళ్లి లెనిన్‌ను కలిశారు.
గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో బర్కతుల్లా ఒకరు. గదర్ పార్టీ నడిపిన వార్తాపత్రికకు ఆయన సంపాదకుడు కూడా. ఆ పత్రికలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కథనాలు రాసేవారు.
మౌలానా బర్కతుల్లా భోపాలీ 1927 సెప్టెంబర్ 20న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆయన మృతదేహాన్ని స్వదేశంలో ఖననం చేస్తారని ఆశించారు. కానీ, అలా జరుగలేదు.
"నా మాతృభూమి స్వాతంత్ర్యం కోసం నేను నిజాయితీగా పోరాడాను. కానీ, ఈ రోజు ఈ ప్రపంచన్ని విడివెళ్లిపోతున్నందుకు చింతిస్తున్నాను. నా దేశాన్ని స్వతంత్ర దేశంగా చూడలేకపోయాను. కానీ, లక్షలాది దేశభక్తులు, ధైర్యవంతులైన యువకులు ముందుకు వచ్చి పోరాడి, నా దేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను. నా దేశ భవిష్యత్తును ఆ వీరులకు అప్పగిస్తున్నాను".. ఇవీ ప్రొఫెసర్ మౌలానా బర్కతుల్లా భోపాలీ చివరి మాటలు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తన కమాండర్ మాట కాదని తాలిబాన్లకు హెలికాప్టర్ అప్పగించిన పైలట్
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
- ‘నువ్వొక బాంబర్వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...
- సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













