చరిత్ర: ‘అంకెల్లో చెప్పలేనంత సంపద కలిగిన’ 10 మంది కుబేరులు

మాన్సా మూసా 1

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎమిలీ బ్రాండ్, రచయిత
    • హోదా, బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా

ప్రపంచ చరిత్రలో అత్యంత సంపన్నులెవరు? ఈ జాబితాలో ఎంతో మంచి వారు, ఉదార స్వభావం ఉన్నవారితో పాటు దారుణమైన పనులు చేసినవారు కూడా కూడా ఉన్నారు. వారెవరు? వారి కథేంటి?

మాన్సా మూసా (మాలి), (సుమారు 1280-1337)

అది అత్యంత సంపన్న రాజ్యం. ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు, ఉప్పు గనులు ఆ రాజ్యంలో ఉండేవి. అది అట్లాంటిక్ మహా సముద్రం నుంచి నేటి నైజర్ ప్రాంతం వరకు సుమారు 2000 మైళ్ళ పరిధిలో విస్తరించి ఉండేది. కానీ, అది నేటి మాలి దేశం కాదు.

ఈ రాజ్యాన్ని మాన్సా మూసా పరిపాలించారు.

ప్రపంచంలో కీలకమైన వాణిజ్య మార్గాలు ఈ రాజ్యం నియంత్రణలో ఉండేవి. ఆయన పరిపాలనా కాలంలో ప్రపంచంలో ఉన్న సగం బంగారం మాలి రాజ్యంలోనే ఉండేదని బ్రిటిష్ మ్యూజియం పేర్కొంది.

మాన్సా మూసా మక్కా సందర్శనకు వెళ్ళినప్పుడు తనతో పాటు అధికారులు, సైనికులు, వినోద కళాకారులు, ఒంటెలను నడిపేవాళ్లు, 12000 మంది బానిసలు, గొర్రెలను కూడా వెంట పట్టుకుని వెళ్లారు. వారలా ప్రయాణిస్తున్న సమయంలో ఎడారిలో నగరం ఉన్నట్లుగా ఉండేది. బానిసలు కూడా బంగారు జరీ వస్త్రాలు ధరించేవారు.

కానీ, పశ్చిమ ఆఫ్రికాలో విద్యా వ్యవస్థను స్థాపించి చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు చెబుతారు.

అమెరికాకు చెందిన సెలెబ్రిటీ నెట్ వర్త్ వెబ్‌సైట్ మాన్సా మూసా సంపద 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31 లక్షల కోట్లు) అని 2012లో అంచనా వేసింది. కానీ కొందరు చరిత్రకారులు మాత్రం మాన్సా మూసా సంపదను అంకెల్లో అంచనా వేయడం అసాధ్యం అని అంటుంటారు.

కేటలాన్ అట్లాస్ మ్యాప్ 1375

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాన్సా మూసా మక్కా పర్యటన మాలిని ప్రపంచ చిత్రపటం పై నిలబెట్టింది.

ఈయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిపోయారా?

ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. కానీ, చారిత్రక ఆధారాలను బట్టి ఆయన మాలి సామ్రాజ్యాన్ని 1324లో పాలించారు.

ఆయన మక్కా పర్యటన మధ్యలో కైరోలో ఆగారు. ఆ దేశంలో వారు ప్రవేశపెట్టిన బంగారంతో కైరోలో బంగారం విలువ పడిపోయిందని చెబుతారు. ఇది ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.

ఈ ప్రాంతంలో ఆయన పర్యటన తర్వాత ప్రతిష్ట పెరగడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడనే పేరు కూడా వచ్చింది.

ఈ పర్యటన పశ్చిమ ఆఫ్రికా రాజ్యం శక్తి సామర్ధ్యాల గురించి ప్రపంచానికి ఒక సంకేతాన్నిచ్చింది. ఈ రాజ్యాధినేత ఆశయాలను తెలియచేసింది.

ఈయన పర్యటన సమయంలో టింబుక్తు, మాలిలోని జెన్నీ నగరాలు వాణిజ్య కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో లభించే సహజ వనరులు, పుస్తకాలు, బానిసలకు వ్యాపార కేంద్రాలుగా పేరు పొందాయి. ఇస్లామిక్ ప్రపంచంలో అధ్యయనకారులు, ప్రతిభావంతులకు ఆహ్వానం పలకడం మొదలుపెట్టాయి.

"చారిత్రక, ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా కూడా మాన్సా మూసా దగ్గరున్న ఆస్తి చాలా భారీ మొత్తం అని చెప్పవచ్చు. కానీ, ఈ సామ్రాజ్యం సంపన్నత గురించి నేటి డాలర్లలో వెల కట్టడం పూర్తిగా ఊహాజనితం. నిపుణులకు అప్పటి ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలు, సామ్రాజ్యం గురించి పూర్తిగా అవగాహన లేదనిపిస్తుంది" అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాలీ, సాహెల్ ప్రాంతాల పై అధ్యయనం చేసిన మదీనా థియాం అన్నారు.

జాన్ డి రాక్ ఫెల్లర్

ఫొటో సోర్స్, Getty Images

జాన్ డి రాక్ ఫెల్లర్ (1839 - 1937)

రాక్ ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ సంస్థ వ్యవస్థాపకులు. ఒకప్పుడు అమెరికాలో ఉత్పత్తి అయ్యే 90 - 95 శాతం చమురును ఈ సంస్థ ఉత్పత్తి చేసేది.

ఒహియో లో ఈయన స్థాపించిన తొలి రిఫైనరీ విజయం సాధించిన తర్వాత అమెరికాకు తొలి కోటీశ్వరుడు అయ్యారు.

ఆయన సుమారు 540 మిలియన్ డాలర్లు (ప్రస్తుత విలువ రూ.4300 కోట్లకు పైగా) విరాళంగా ఇచ్చారు.

ఆండ్రూ కార్నెజీ

ఫొటో సోర్స్, GALEFORMS FIMS/BBC

ఫొటో క్యాప్షన్, ఆండ్రూ కార్నెజీ

ఆండ్రూ కార్నెజీ (1835 - 1919)

ఆండ్రూ కార్నెజీ తన సొంత స్టీల్ సరఫరా సంస్థను ప్రారంభించడానికి ముందు పెన్సిల్వేనియా రైల్ రోడ్ సంస్థలో అనేక పదవులు నిర్వహించారు.

ఆయన స్కాటిష్ అమెరికన్. ఆయన జేపీ మోర్గన్‌కు 1901లో 480 మిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ.3830 కోట్లకు పైగా) తన సంస్థను అమ్మేశారు.

ఆయన వ్యక్తిగత షేర్ కింద 250 మిలియన్ డాలర్లను (ప్రస్తుత విలువ సుమారు 2 వేల కోట్లు) పొందారు.

కానీ, ఆయన మరణించే సమయానికి ఆయన చేసిన విస్తృతమైన దాతృత్వ కార్యక్రమాల వల్ల ఆయన ఆస్తులు బాగా తగ్గిపోయాయి.

వీడియో క్యాప్షన్, అనంత పద్మనాభస్వామి ఆలయంలోని ఆరో గదిని తెరుస్తారా?

మార్కస్ లిసీనియస్ క్రాసస్ (సుమారు 115 - 53 బీసీ)

ఈ రోమన్ నాయకుడు చాలా రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

విపత్తుల సమయంలో ధ్వంసమైపోయిన లేదా జప్తు చేసిన ఆస్తులను కొనుగోలు చేసి అందులోంచి లాభాన్ని పొందేవారు.

ఆయన ఆస్తుల విలువ సుమారు 200 మిలియన్ సెస్టర్ సెస్ (ప్రాచీన రోమన్ కరెన్సీ )ఉండేదని అంచనా.

యుద్ధంలో మరణించిన తర్వాత నోట్లో కరిగించిన బంగారాన్ని వేసి అతని ప్రత్యర్థి మార్కస్‌ను శిక్షించారు.

కుటుంబంతో నికోలస్ II

ఫొటో సోర్స్, Press Association

రష్యా - నికోలస్ II (1868 - 1918)

నికోలస్ II రష్యా ఆఖరు చక్రవర్తి. ఆయన 1894లో కొన్ని శతాబ్దాల పురాతనమైన రోమానోవ్ వంశపు ఆస్తులను వారసత్వంగా పొందారు.

వీరు ధనాన్ని విలాసవంతమైన రాజ భవనాలు, నగలు, కళాత్మక వస్తువుల్లో పెట్టారు.

1918లో నికోలస్ తో పాటు ఆయన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన తర్వాత చాలా వరకు ఆస్తులను బోల్షెవిక్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1886 - 1967)

మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిరోహించారు. ఆ కాలంలో ఆయన ప్రప్రంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధికెక్కారు.

హైదరాబాద్ సంస్థానం వైశాల్యం 80,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది. ఇది ఇంగ్లండ్, స్కాట్లండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువ.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వజ్రాల గనులు, ముత్యాల పరిశ్రమ ఆయనకు వారసత్వంగా సంక్రమించింది.

బ్రిటిష్ పాలకులకు విధేయులుగా ఉండటంతో ఆయనకు "హిజ్ ఎక్సాల్టెడ్ హైనెస్" అనే బిరుదును కూడా సంపాదించి పెట్టింది.

ఆయన రాజ్యంలో విద్య, రవాణా కోసం నిధులు వెచ్చించారు. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా 35 సంవత్సరాల పాటు ఒకే రకమైన ఫేజ్ టోపీని ధరించారని అంటారు.

విలియం ది కాంక్వెరర్

ఫొటో సోర్స్, JONATHAN CULVERHOUSE

ఫొటో క్యాప్షన్, విలియం ది కాంక్వెరర్

విలియం ది కాంక్వెరర్ (సుమారు 1028 - 87)

ఈయన ఇంగ్లాండ్ ను పాలించిన తొలి నార్మన్ చక్రవర్తి.

11వ శతాబ్ధికి చెందిన విలియం యుద్ధంలో గెలిచి సింహాసనాన్ని అధిరోహించడానికి ముందు వారసత్వంగా వచ్చిన భూములు, పెళ్లి ద్వారా ఫ్రాన్స్ లో పేరు సంపాదించారు.

ఆయన 1066 - 87 వరకు పరిపాలించారు. ఆయన భూములను, బిరుదులను స్నేహితుల కోసం చాలా ఉదారంగా దానం చేసి వారు విలాసవంతమైన జీవితం గడిపేలా చూసేవారని చెబుతారు.

జాకబ్ ఫగ్గర్ (1459 - 1525)

ఈయన జర్మన్ వ్యాపారి, బ్యాంకర్.

30 ఏళ్ల వయసులో కుటుంబ వ్యాపార సంస్థను అభివృద్ధి చేశారు.

వెండి గనుల తవ్వకం, బ్యాంకింగ్, ఇతర వాణిజ్య వ్యాపారాల ద్వారా తన ఆస్తులను పెంచుకున్నారు.

దీంతో, ఈయన యూరోప్ లో వ్యాపార పరిధిని విస్తృతం చేసుకున్నారు.

ఆయన హ్యాబ్స్‌బర్గ్ రాచరిక సంపదను పెంచేందుకు కూడా ధనాన్ని వెచ్చించారు. దీంతో, ఆయన రాజకీయ పలుకుబడి కూడా సంపాదించుకున్నారు.

హెన్రీ ఫోర్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెన్రీ ఫోర్డ్

హెన్రీ ఫోర్డ్ (1863 - 1947)

ఈయన ఒక రైతు కొడుకు. కానీ, డెట్రాయిట్ లో ఇంజనీర్ గా గుర్రాలు లేకుండా నడిచే వాహనాలపై ప్రయోగాలు చేయడానికి ముందు యంత్రాలంటే మక్కువతో రైల్ రోడ్ కార్లు, స్టీమ్ ఇంజన్లతో పని చేశారు.

రెండు సార్లు వైఫల్యాలను చవి చూసిన తర్వాత 1903లో ఫోర్డ్ మోటార్ కంపెనీని స్థాపించారు.

ఆయన తయారు చేసిన ఫోర్డ్ మోడల్ టీ కారు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు ఆయనకు కూడా వ్యక్తిగతంగా బోలెడంత సంపదను తెచ్చిపెట్టింది.

వీడియో క్యాప్షన్, భార‌త్ నుంచి దోచుకెళ్లిన సంప‌ద‌తో ఇంగ్లండ్‌లో ఈ భ‌వ‌నాలు నిర్మించారు

కార్నీలియస్ వాండర్‌బిల్ట్ (1794 - 1877)

వాండెర్‌బిల్ట్ స్టేటెన్ ఐలాండ్ లోని పోర్ట్ రిచ్మండ్‌లో జన్మించారు.

ఆయన టీనేజర్‌గా ఉన్నప్పుడే ఫెర్రీ సేవలు మొదలుపెట్టేందుకు డబ్బు అప్పు తీసుకున్నారు.

ఆయన సంకల్పం, అదృష్టం కలిసి రావడంతో వివిధ స్టీమ్ బోట్ వెంచర్స్‌కి యజమాని అవ్వడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత రైల్ రోడ్ల స్టాక్స్‌లో వెచ్చించారు. ఈయనను 'రాబర్ బేరన్' (నైతికత లేని వ్యాపార విధానాల ద్వారా విజయం సాధించిన వ్యక్తి ) అని అంటారు.

కానీ, ఆయన టెన్నెస్సీలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు.

ఈ వ్యాసం బీబీసీ హిస్టరీలో 2015లో ప్రచురితమయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)