ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళలు

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే, దాని కోసం ఆయన తన ఆస్తులు కూడా పంచి ఇస్తారని అంచనా వేయడం అంత కష్టం కాదు.
కానీ ఇప్పుడు అలా అంచనాలు వేయాల్సిన అవసరమే లేదు. ఇటీవల అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకెంజీ విడాకులు తీసుకున్నప్పుడు అది నిరూపితమైంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.
ఈ విడాకులతో మెకెంజీకి ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లోని నాలుగు శాతం షేర్ లభించింది. ఈ నాలుగు శాతం షేర్ ధర సుమారు 35.6 బిలియన్ డాలర్లు
ఈ మొత్తంతో ఆమె ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.
మహిళల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆమె ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో 24వ స్థానంలో కూడా నిలిచారు.
కానీ ప్రపంచ సంపన్న మహిళల జాబితాలో మెకంజీతోపాటు ఉన్న మిగతా మహిళలు ఎవరు. వారికి అంత డబ్బు ఎలా వచ్చింది. చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1.ఫ్రాంకోయిజ్ బెట్టెన్‌కోర్ట్-మెయర్స్
ఫోర్బ్స్ మ్యాగజీన్ ఫ్రాంకోయిజ్ బెట్టెన్‌కోర్ట్ మెయర్స్‌ను ప్రపంచంలో 15వ అత్యంత సంపన్న వ్యక్తిగా పేర్కొంది. ఆమె మొత్తం సంపద 49.3 బిలియన్ డాలర్లు
ఆమె ఎవరు?
ఫ్రాన్స్‌కు చెందిన లారియల్ కాస్మటిక్స్ పేరు అందరికీ తెలిసినదే. ప్రపంచవ్యాప్తంగా కాస్మటిక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఈ కంపెనీ వారసురాలే ఫ్రాంకోయిజ్. కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో 33 శాతం వాటాకు ఆమే యజమాని.
65 ఏళ్ల ఫ్రాంకోయిజ్‌కు ఈ వారసత్వం తన తల్లి లిలియెన్ బెట్టెన్‌కోర్ట్ నుంచి లభించింది. 2017 సెప్టెంబర్‌లో 94 ఏళ్ల వయసులో లిలియెన్ మృతి చెందారు.
లిలియెన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు, తన తల్లిని వేధించారనే ఆరోపణలతో ఫ్రాంకోయిజ్ తన టీమ్ సభ్యులపై విచారణ కూడా చేయించారు. కానీ తల్లి మరణం తర్వాత ఆ కేసును రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు.
బెటెన్‌కోర్ట్-మెయర్స్‌కు పుస్తకాలు రాయడం, చదవడం చాలా ఇష్టం. గ్రీకు దేవతల ఆధారంగా ఆమె రాసిన ఎన్నో పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటితోపాటు యూదు-క్రైస్తవ సంబంధాలపై కూడా ఆమె చాలా పుస్తకాలు రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
2.ఎలిస్ వాల్టన్
ఎలిస్ వాల్టన్ మొత్తం సంపద 44 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలిస్ 17వ స్థానంలో ఉన్నారు.
ఆమె ఎవరు?
69 ఏళ్ల ఎలిస్, వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ ఏకైక కుమార్తె.
అయితే ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. కానీ కుటుంబ కంపెనీని విస్తరించాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది.
ఆర్ట్స్ అంటే మక్కువ చూపే ఎలిస్ క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్‌కు ఛైర్మన్ కూడా అయ్యారు.

ఫొటో సోర్స్, Reuters
3.మెకెంజీ బెజోస్
ఈమె సంపద 35 బిలియన్ డాలర్లు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు అమెజాన్‌లో షేర్ లభించింది. కానీ ఆమె మొత్తం సంపద కచ్చితంగా దీనికంటే ఎక్కువే ఉండచ్చు.
కానీ అది ఎంత అనేది మాత్రం ఫోర్బ్స్ మ్యాగజీన్ 2020లో ప్రపంచ సంపన్నుల జాబితాను ప్రకటించినప్పుడే తేలుతుంది.
ఆమె ఎవరు?
48 ఏళ్ల మెకెంజీకి, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భార్య. ఇద్దరికీ 1993లో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. మొదట్లో ఇద్దరూ కలిసి పనిచేసేవారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాలిఫోర్నియాలో నివసించే మెకెంజీ అమెజాన్ మొట్టమొదట ప్రారంభించినపుడు అందులో పనిచేసిన ఒక ఉద్యోగి. ఆమె అమెజాన్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు.
దానితోపాటు ఆమె రెండు ఫిక్షన్ పుస్తకాలు కూడా రాశారు. అవి ప్రచురితమయ్యాయి. ఆమె రచయిత టోనీ మెరిసన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మెరిసన్ తన సమర్థులైన శిష్యుల్లో ఆమె ఒకరని చెబుతారు.
మెకెంజీ ఒక యాంటీ-బులింగ్ ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు. ధైర్యంగా ఉండేలా ప్రోత్సహించడం దాని లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
4.జాక్వలీన్ మార్స్
జాక్వలీన్ మార్స్ మొత్తం సంపద సుమారు 23 బిలియన్ డాలర్లు. ఈమె ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 33వ స్థానంలో ఉన్నారు.
ఆమె ఎవరు?
79 ఏళ్ల జాక్వలీన్ గత 20 ఏళ్లుగా తన కుటుంబ వ్యాపారంలో చురుకుగా ఉన్నారు. 2016 వరకూ ఆమె బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు. గ్లోబల్ మానుఫాక్చర్ కంపెనీ మార్స్‌లో మూడో వంతు ఆమె దగ్గరే ఉంది.
పెట్ ఫుడ్ తయారు చేసే కంపెనీల్లో మార్స్ అమెరికాలోని అత్యంత పెద్ద కంపెనీ.
5.యాంగ్ హుయాన్
ఈమె మొత్తం సంపద 22.1 బిలియన్ డాలర్లు. యాంగ్ చైనాలో అత్యంత సంపన్న మహిళ. ప్రపంచ సంపన్న వ్యక్తుల్లో ఆమె 42వ స్థానంలో ఉన్నారు.
ఆమె ఎవరు?
37 ఏళ్ల యాంగ్‌కు చైనాలోని ప్రాపర్టీ కంపెనీల్లో అన్నిటి కంటే ముందున్న కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్‌లో ఒక పెద్ద వాటా ఉంది.
ఆమె వెబ్‌సైట్ ప్రకారం కంట్రీ గార్డెన్ 2016లో ప్రపంచవ్యాప్తంగా ప్రాపర్టీ డెవలప్ చేయడంలో మూడో స్థానంలో ఉంది.
ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన యాంగ్‌కు కంపెనీలో సుమారు 57 శాతం షేర్లు తండ్రి నుంచి లభించాయి.
ఇవి కూడా చదవండి:
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- రోజూ ఒక్క పెగ్గేసినా గుండెకు ముప్పే: ద లాన్సెట్
- పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది
- బెలారస్: భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ వెయ్యి అస్థి పంజరాలు
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలియదు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








