జెఫ్ బెజోస్: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిని ‘బ్లాక్ మెయిల్ చేసిన మీడియా’

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని ఒక మీడియా సంస్థ యజమాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు సేకరించి వాటితో తనను బెదిరిస్తున్నారని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరోపించారు.
వదంతులను ప్రచురించే టాబ్లాయిడ్ 'నేషనల్ ఎంక్వైరర్' తన ప్రైవేటు సందేశాలను సంపాదించిందని ఆయన వెల్లడించారు. వీటిని ఎలా సేకరించారనే విచారణను నిలిపివేయాలని ఈ పత్రిక మాతృసంస్థ అయిన అమెరికన్ మీడియా ఇన్‌కార్పొరేషన్(ఏఎంఐ) తనను అడిగిందని చెప్పారు.
తాను, తన భార్య మెకంజీ విడిపోతున్నామని బెజోస్ గత నెల్లో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ది ఎంక్వైరర్ పత్రిక బెజోస్ వివాహేతర సంబంధ వివరాలు, ఇతర ప్రైవేటు సందేశాలను ప్రచురించింది.

ఫొటో సోర్స్, Reuters
బెజోస్ ఆరోపణలపై స్పందన కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తిపై ఏఎంఐ ఇంకా స్పందించలేదు.
తాను, తన ప్రేయసి, మాజీ టీవీ వ్యాఖ్యాత లారెన్ సాంచెజ్ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ప్రచురిస్తామని బెదిరిస్తూ ఏఎంఐ ప్రతినిధులు తన తరపు మధ్యవర్తులకు ఈమెయిల్ పంపారని బెజోస్ గురువారం రాసిన బ్లాగ్ పోస్ట్‌లో ఆరోపించారు. వివిధ ఈమెయిళ్లను ఆయన తన పోస్టులో ఉంచారు.
తనపై, తన ప్రేయసిపై నేషనల్ ఎంక్వైరర్ కవరేజీ రాజకీయ ప్రేరేపితం కాదని ఒక ''తప్పుడు ప్రకటన'' చేయాల్సిందిగా ఏఎంఐ తనను కోరిందని బెజోస్ బ్లాగులో రాశారు.
కవరేజీ రాజకీయ ప్రేరేపితమని అనుమానించేందుకు తగిన ప్రాతిపదిక లేదంటూ ఈ ప్రకటన చేస్తే సదరు ఫొటోలను ప్రచురించకుండా ఉంటామని ఏఎంఐ న్యాయవాది ఒకరు బుధవారం ప్రతిపాదించారని బెజోస్ పోస్ట్ చేసిన ఈమెయిళ్లు చెబుతున్నాయి.
''వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది కలిగిస్తామని ఏఎంఐ చెబుతున్నప్పటికీ, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల యత్నాలకు లొంగకుండా ఏఎంఐ నాకు పంపిన సమాచారాన్ని బయటపెడుతున్నా'' అని బెజోస్ వెల్లడించారు.
ఏఎంఐకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సంబంధాలున్నాయని బ్లాగు మొదట్లో బెజోస్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బెజోస్ అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్ట్ యజమాని కూడా.
ఈ పత్రికకు యజమానిగా ఉండటం వల్ల తనకు సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కొందరు శక్తిమంతమైన వ్యక్తులకు తాను శత్రువుగా మారానని చెప్పారు. వీరిలో ఏఎంఐ అధిపతి డేవిడ్ పెకర్ స్నేహితుడైన అధ్యక్షుడు ట్రంప్ ఒకరని ఆయన వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బృందానికి తాము సహకరించామని ఏఎంఐ ఇటీవలే తెలిపింది. ట్రంప్‌తో లైంగిక సంబంధం గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఒక ప్లేబాయ్ మోడల్‌కు లక్షన్నర డాలర్లు చెల్లించే విషయంలో తాము తోడ్పాటు అందించామని అంగీకరించింది.
తన వ్యాపార దక్షత పేలవమని అమెజాన్ వాటాదారులకు తెలియజేసేందుకు ఈ ఫొటోలను ప్రచురించాల్సిన అవసరముందని ఏఎంఐ వాదిస్తోందని, కానీ అమెజాన్ సాధించిన ఉత్తమ ఫలితాలే తన వ్యాపార దక్షతను చాటుతున్నాయని బెజోస్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
- మీకు ప్రభుత్వం నేరుగా డబ్బిస్తే మంచిదేనా, కాదా?
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- 'కల తీర్చుకుందామని అమెరికా వెళ్లా.. ఇలా జరుగుతుందనుకోలేదు.. అసలు కారణం తెలిస్తే అమ్మానాన్న తట్టుకోలేరు'
- ‘ఎయిర్ ఇండియా వన్’కు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ విక్రయానికి అమెరికా ఆమోదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








